నేడు ఇంటర్నేషనల్ యానిమేషన్ డే
యానిమేషన్ కంపెనీలు అక్కడొకటి, ఇక్కడొకటి అన్నట్లుగా ఉండే కాలంలో యానిమేషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది ప్రమిత ముఖర్జీ. మన దేశంలో యానిమేషన్ రంగం విస్తరణను దగ్గరి నుంచి చూసిన ముఖర్జీ మూడు ఖండాల్లో ప్రసిద్ధ కంపెనీలలో పనిచేసింది. ప్రపంచవ్యాప్తంగా 90 మంది యువతులను యానిమేషన్ రంగంలో తీర్చిదిద్దింది.
యానిమేషన్ ఆర్టిస్ట్ కావాలనుకునే ఎంతోమంది యువతులకు నిరంతర స్ఫూర్తినిస్తోంది. కోల్‌కతాలో పుట్టి పెరిగిన ప్రమిత ముఖర్జీకి చిన్నప్పటి నుంచి కార్టూన్లు, బొమ్మలు అంటే ఇష్టం. తనకు తోచినట్లు బొమ్మలు, కార్టూన్‌లు వేసేది. బొమ్మలపై ఇష్టమే ప్రమితను యానిమేషన్ ప్రపంచంలోకి తీసుకువచ్చింది. హైస్కూల్ చదువు పూర్తయిన తరువాత 3డీ యానిమేషన్ సర్టిఫికేషన్ కోర్సు చేసింది.
ఆ రోజుల్లో...
ఆ రోజుల్లో మన దేశంలో కొన్ని యానిమేషన్ స్టూడియోలు మాత్రమే ఉండేవి. అవి హాలీవుడ్ కోసం పనిచేస్తుండేవి. వాటిలో ముంబైలోని ‘క్రెస్ట్ యానిమేషన్’ ఒకటి. ఆ స్టూడియో నుంచే క్యారెక్టర్ రిగ్గింగ్ ఇంటర్న్‌గా కెరీర్ ప్రారంభించింది. ‘యానిమేషన్ ఫీల్డ్‌కు భవిష్యత్ ఉంటుందా? ఇది నీటిబుడగ కాదు కదా!’ ‘యానిమేషన్ ఫీల్డ్‌లో కెరీర్ వెదుక్కోవడం ఎంతవరకు క్షేమం?’ ‘యానిమేషన్ అనేది పురుషాధిపత్య రంగం. మహిళలకు సమాన అవకాశాలు ఉంటాయా?’...ఇలాంటి సందేహాలు ఎన్నో ఆరోజుల్లో ఉండేవి.
సందేహాలను వదిలి సత్తా చాటుతూ...
కోల్‌కత్తాలోని ‘డ్రీమ్‌వర్క్స్ యానిమేషన్’తో పాటు లండన్, లాస్ ఏంజెలెస్‌లోని ప్రసిద్ధ స్టూడియోలలో పని చేసింది ప్రమిత. ‘ఫీచర్, షార్ట్, ఎపిసోడిక్... ఏదైనా యానిమేటెడ్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నప్పుడు, సృజనాత్మక కోణంలో నేను చేసే మొదటి పని దర్శకుడి మనసును చదవడం. బొమ్మలకు ప్రాణం పోయడం. ప్రతి డైరెక్టర్‌కు తనదైన భిన్నమైన ఆలోచనా విధానం ఉంటుంది. ఒక ఆర్టిస్ట్‌గా వారి ఆలోచనను లోతుగా అర్థం చేసుకోవడంతో పాటు క్రియేటివ్ అవుట్‌పుట్ ఇవ్వడం ముఖ్యం’ అంటుంది ప్రమిత.
బాధ నుంచి బయట పడేలా...
అమెరికాలో ఒక యానిమేషన్ కంపెనీ లో ఉద్యోగంలో చేరిన రోజుల్లో కొత్త దేశంలో, కొత్త ఉద్యోగ జీవితానికి అలవాటుపడడం ప్రమితకు కష్టంగా ఉండేది. ఆ సమయంలో తండ్రి క్యాన్సర్‌తో చని పోవడంతో మానసికంగా బాగా కృంగి పోయింది. ఆ బాధ నుంచి బయట పడడానికి తనకు ఉమెన్ ఇన్ యానిమేషన్ (డబ్ల్యూఐఏ) ఎంతో ఉపయోగపడింది. లాస్ ఏంజెలెస్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్వచ్ఛంద సంస్థ యానిమేషన్ రంగంలో లింగ సమానత్వం, మహిళలకు సమాన అవకాశాలకు కృషి చేస్తోంది.
‘2020లో డబ్ల్యూఐఏ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో చేరాను. మెరుగైన సాఫ్ట్‌స్కిల్స్, నాయకత్వ సామర్థ్యాలు, మెరుగైన మాటతీరు... మొదలైన వాటిలో ఈ ప్రోగ్రామ్
ఎంతో ఉపకరించింది. సమాజానికి నా వంతుగా తిరిగి ఇవ్వాలి అనే ఆలోచన ఇచ్చింది’ అంటుంది ప్రమిత.
మూడు ఖండాలలో...
రెండు దశాబ్దాల తన కెరీర్‌లో మూడు ఖండాలలో, ఎన్నో ప్రసిద్ధ కంపెనీలలో, ఎన్నో స్థాయులలో, ఎన్నో ప్రాజెక్ట్‌లలో పనిచేసింది ప్రమిత. గత పది సంవత్సరాల కాలంలో విఎఫ్‌ఎక్స్, యానిమేషన్ రంగంలో సాంకేతికంగా ఎంతో మార్పు వచ్చింది. ఆ మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని, కాలంతో పాటు నడుస్తూ, తమను తాము నిరూపించుకుంటున్నారు ప్రమితలాంటి యానిమేషన్ ఆర్టిస్ట్‌లు.
మహిళల సంఖ్య పెరుగుతోంది...
లింగ అసమానతను తగ్గించడానికి చేసిన అనేక ప్రయత్నాల వల్ల యానిమేషన్ రంగంలో మహిళా ఆర్టిస్ట్‌ల సంఖ్య గతంతో పోల్చితే బాగా పెరిగింది. 2007లో నా బ్యాచ్‌లో వందమంది ఉంటే అందులో ఇద్దరు మాత్రమే మహిళలు. యానిమేషన్ ఆర్టిస్ట్‌గా రాణించడానికి జెండర్, బ్యాక్‌గ్రౌండ్‌తో పనిలేదు. మనం చేసే పనిపై మాత్రమే దృష్టి పెట్టాలి. ప్రతికూలంగా మాట్లాడే వారికి దూరంగా ఉండాలి. యానిమేషన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా 90 మంది యువతులకు మార్గదర్శిగా నిలవడం సంతోషంగా, గర్వంగా ఉంది.
యానిమేషన్‌లో ఆమె బహుముఖ ప్రజ్ఞ
యానిమేషన్ రంగంలో మహిళా ఆర్టిస్ట్‌లు, సాంకేతిక నిపుణులకు ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఎందుకు పెరుగుతోంది... అనే విషయానికి వస్తే విశ్లేషకులు ఇలా అంటున్నారు – ‘‘యానిమేషన్‌కు సంబంధించి సృజనాత్మక ప్రక్రియలో మహిళలు తమ జీవితానుభవాలను జోడిస్తున్నారు. యానిమేషన్ పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యం పెరగడం వల్ల పనిలో వైవిధ్యం, సృజనాత్మకత పెరుగుతుంది. యానిమేషన్ రంగంలో మహిళలు యానిమేటర్ ఆర్టిస్ట్‌లుగా మాత్రమే కాదు డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్టూడియో ఎగ్జిక్యూటివ్‌గా కూడా తమను తాము నిరూపించుకుంటున్నారు. వారు సృష్టించే కథలు అన్ని వర్గాల వారికి చేరువ అవుతున్నాయి.’’
– ప్రమిత ముఖర్జీ


