
న్యూస్‌మేకర్
ఇది పెద్ద ఘనతే. ఇన్‌స్టాగ్రామ్ ఇక పై ప్రతి ఏటా ఇద్దామనుకుంటున్న‘గ్లోబల్ గోల్డెన్ రింగ్ అవార్డు’ను 2025 సంవత్సరానికి ఇన్‌ఫ్లూయెన్సర్ డాలీ సింగ్‌కు ప్రకటించారు.
ప్రపంచ వ్యాప్తంగా 25 మందితో తొలి జాబితా సిద్ధం చేయగా మన దేశం నుంచి డాలీ సింగ్ ఒక్కరికే చోటు దక్కింది. లక్షల ఫాలోయెర్లు ఉండటంతో పాటు స్థానిక సంస్కృతిని ప్రచారం చేయగలిగే కంటెంట్ క్రియేటర్లకే ఈ అవార్డు ఇస్తారు.
డాలీ సింగ్ పరిచయం
డాలీ సింగ్ (32).. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు మారుమోగుతోంది. ప్రతి ఏటా ఇన్‌స్టాగ్రామ్ అందించే ‘గ్లోబల్ గోల్డన్ రింగ్’ అవార్డును సొంతం చేసుకున్న తొలి భారతీయ వ్యక్తిగా డాలీసింగ్ రికార్డు సృష్టించింది. తమ కంటెంట్ ద్వారా స్థానిక సంస్కృతికి చాటే వారికి ఈ అవార్డు అందించాలని ఇన్‌స్టాగ్రామ్ ఈ అవార్డు ప్రారంభించింది. కంటెంట్ తయారీలో ఎటువంటి భయాలు, తేడాలు చూపని వారికి ఈ అవార్డును అందించనున్నట్లు ఇన్‌స్టా ప్రకటించింది. తొలి ఏడాదే డాలీ సింగ్ ఈ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 25 మందిని ఎంపిక చేయగా అందులో మన దేశం నుంచి ఆమె స్థానం పొందడం విశేషం. 1.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఆమె డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌తోపాటు నటిగానూ పేరు పొందింది.
ఇన్‌స్టాలో పాపులర్... ఆపై సినిమాల్లో...
ఇన్‌స్టాలో పాపులర్ అయిన డాలీసింగ్ బాలీవుడ్‌లో నటిగా తెరంగేట్రం చేసింది. ‘డబుల్ ఎక్సెల్’ ఆమె మొదటి సినిమా. కరణ్ బూలనీ దర్శకత్వంలో వచ్చిన ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ సినిమాలో కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం ‘బెస్ట్ వరస్ట్ డేట్’ పేరుతో తనే సొంతంగా మైక్రో డ్రామా సిరీస్ రూపొందించింది. ఇటీవల ఇన్‌స్టాలో ఆ సిరీస్ మూడో సీజన్ విడుదలైంది.
విజేతలకు ఇన్‌స్టాలో అదనపు సౌకర్యాలు
డాలీ సింగ్‌తోపాటు గ్లోబల్ రింగ్ అవార్డు అందుకున్నవారికి ఇన్‌స్టా సంస్థ బంగారు రింగ్‌ను అందించనుంది. దీంతోపాటు ఆమె ఇన్‌స్టా ప్రొఫైల్‌లో డిజిటల్ రింగ్ కనిపించే ఏర్పాటు చేస్తోంది. వారు ఇన్ స్టోరీలు పోస్ట్ చేసే క్రమంలో వారి ప్రొఫైల్ పిక్ చుట్టూ డిజిటల్ రింగ్ కనిపిస్తుంది. ఈ రింగును గోల్డ్ కలర్‌లో ఉంచుకోవచ్చు. లేదా రంగులు మార్చుకోవచ్చు. తనకు ఈ పురస్కారం ప్రకటించడం నమ్మశక్యం కాని విషయమని డాలీసింగ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాను నిజాయితీగా చేసిన కంటెంట్‌ని ఇన్‌స్టా ప్రతినిధులు చూసి మెచ్చుకోవడం, గుర్తించడం చాలా సంతోషంగా ఉందంటున్నారు. తను మరింత ఉత్సాహంగా ముందుకు సాగేందుకు ఈ అవార్డు దోహదపడుతుందని తెలిపారు.
‘రాజు కీ మమ్మీ’తో పాపులారిటీ
నైనిటాల్‌లో జన్మించిన డాలీసింగ్ ఢిల్లీలో ఫ్యాషన్ టెక్నాలజీ చదివి ముంబై చేరుకున్నాక డిజిటల్ క్రియేటర్‌గా మారింది. కాని మొదట ఆమె కుటుంబం ఇందుకు అంగీకరించలేదు. అయితే మెల్లగా వారే ఆమె కంటెంట్ చూసి తమ దృష్టి మార్చుకున్నారు. డాలీ సింగ్ మొదట ఫ్యాషన్ వీడియోలతో కెరీర్ ప్రారంభించి తర్వాత మెల్లగా స్కెచ్ వీడియోల వైపు దృష్టి సారించింది. నిత్యజీవితంలో జరిగే సరదా సంఘటనలు వీడియోల రూపంలో చూపితే ప్రేక్షకులకు నచ్చుతుందని గుర్తించింది. దీంతో వీడియోల ద్వారా కథ చెప్పే విధానాన్ని ప్రవేశపెట్టింది. అందుకు ‘రాజు కీ మమ్మీ’ పాత్ర ఆమెకు దోహదపడింది. ఆ పాత్ర ద్వారా అనేక అంశాలను సరదాగా చూపుతూ పాపులర్ అయ్యింది. ఇందులో కేవలం హాస్యమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు, పండగలు, కుటుంబ సంబంధాల గురించి వివరిస్తుంటుంది. ఇది ఆమె ఫాలోవర్స్‌ని విశేషంగా ఆకట్టుకుంది. దీంతోపాటు అమాయకత్వం, అయోమయం, హడావిడి కలగలిసిన దక్షిణ దిల్లీ అమ్మాయిగానూ ఆమె వీడియోలు పాపులర్ అయ్యాయి.