
న్యూస్‌మేకర్
సంధ్యా షెనాయ్ (Dr Sandhya Shenoy ) సైన్స్ రంగంలో రాణించాలనుకునే భారత యువతకు ఒక స్ఫూర్తిపతాకం. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ డచ్ అకడెమిక్ పబ్లిషర్ ఎల్స్వియర్‌తో కలిసిప్రతి ఏటా వెలువరించే అత్యంత ప్రతిభావంతులైన సైంటిస్ట్‌లజాబితాలో ఆమె వరుసగా మూడుసార్లు నిలిచింది. తాజాగా వెలువడిన 2025 జాబితాలో ఆమెకు మూడోసారి స్థానం దక్కడంతో భారత పరిశోధనా రంగంలో హర్షాతిరేకాలు వెలువెత్తుతున్నాయి. సంధ్యా షెనాయ్ పరిచయం.
సంధ్యా షెనాయ్‌కు విద్యా రంగంలో, పరిశోధన రంగంలో సంచలనాలు సృష్టించడం కొత్త కాదు. 2010లో మొదటిసారి ఆమె ఘనత వార్తపత్రికల ద్వారా లోకానికి తెలిసింది. దానికి కారణం బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎం.ఎస్సీ కెమిస్ట్రీలో ఆమె సెంట్ పర్సెంట్ సాధించడం. ఇలా ఎం.ఎస్సీ కెమిస్ట్రీలో నూరు శాతం మార్కులు సాధించడం అసాధ్యం. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అంతవరకూ ఆ ఘనత సాధించిన వారు ఒక్కరూ లేరు. మొదటిసారి సంధ్యా షెనాయ్ ఆ మార్కులు సాధించింది. ‘స్టూడెంట్ అంటే ఇలా ఉండాలి’ అని అందరి చేతా అనిపించుకుందామె.
హాజరు.. చదువు...
కొంకిణి మాతృభాష కలిగిన సంధ్యా షెనాయ్ సొంత ప్రాంతం ఉడిపి. అక్కడే బి.ఎస్సీ. వరకూ చదివి కాలేజీలో గోల్డ్ మెడల్ సాధించింది. ఆ తర్వాత కుటుంబం బెంగళూరులో స్థిరపడటంతో అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో నూరు శాతం మార్కులు సాధించి నానో కెమిస్ట్రీలో పీహెచ్‌డీ కొనసాగించింది. ‘నా చదువులో ఎప్పుడూ కాలేజీ ఎగ్గొట్టలేదు. నూరు శాతం అటెండెన్స్‌తో ఉంటాను. అలాగే క్లాసుల్లో రన్నింగ్ నోట్స్ మిస్ కాను. పరీక్షలకు అదే చదువుకుంటాను. అలాగే మార్కులు తెచ్చుకున్నాను’ అంటుందామె. కెమిస్ట్రీలో విశేషమైన అభిరుచి ఉన్న షెనాయ్ మొదట అధ్యాపక వృత్తిలో ఉంటూనే తన పరిశోధనను కొనసాగించి ఉత్తమ సైంటిస్ట్ అవ్వాలని నిశ్చయించుకుంది.
చదవండి: Shoaib Malik సానియా మాజీ భర్త మూడో పెళ్లి పెటాకులే..?! వీడియో వైరల్
వేస్ట్ హీట్‌ను విద్యుత్‌గా...
మంగళూరు శ్రీనివాస యూనివర్సిటీలో ప్రొఫెసర్, ప్రిన్సిపల్ రీసెర్చ్ సైంటిస్ట్‌గా పని చేస్తున్న సంధ్యా షెనాయ్ థెర్మో ఎలక్ట్రిక్ మెటీరియల్స్‌లో విశేషమైన పరిశోధన కొనసాగిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన పత్రాలు ప్రచురించడం ద్వారా గుర్తింపు పొందింది. లండన్‌లోని ‘రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ’ (ఆర్.ఎస్.సి.) ఆమెను లీడింగ్ ఫిమేల్ రీసెర్చర్‌గా గుర్తించింది. ఈ గుర్తింపు పొందడం అంత సులువు కాదు. పర్యావరణ రంగానికి చేటు చేస్తున్న వేస్ట్ హీట్ (కర్మాగారాలు, ఇతర యంత్ర పరికరాల వల్ల వెలువడే ఉష్ణం) వృథా అవడమే కాకుండా పర్యావరణానికి చేటు చేస్తుండటం వల్ల ఆ వేస్ట్ హీట్‌ను విద్యుత్తుగా ఎలా మార్చవచ్చో పరిశోధనలు చేస్తూ, వాటి ఫలితాలను ప్రతిపాదిస్తూ సంధ్యా షెనాయ్ ప్రపంచవ్యాప్తంగా సైంటిస్ట్‌ల దృష్టిని ఆకర్షించింది. అందుకే ఆమెకు 2021లో ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డ్, 2024లో ‘కెమిస్ట్రీ మెడల్’ లభించాయి.
చదవండి: Nita Amabni క్వీన్ ఆఫ్ దాండియాతో గార్బా స్టెప్పులు : ఉర్రూతలూగిన వేదిక
ప్రపంచ సైంటిస్టుల జాబితాలో...
ప్రపంచంలో అత్యుత్తమ సైంటిస్టుల 2 శాతం పట్టికను స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రతి ఏటా ప్రకటిస్తూ ఉంటుంది. ఆగస్టు 30 నాటికి ఆ సంవత్సరంలో వివిధ అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించిన పరిశోధన పత్రాల ఆధారంగా, వాటికి అందిన ఆదరణను బేరీజు వేసుకుని సెప్టెంబర్‌లో ఈ జాబితాను విడుదల చేస్తారు. 2023 నుంచి సంధ్యా షెనాయ్ ఈ పట్టికలో నిలుస్తోంది. తాజాగా సెప్టెంబర్ 19న విడుదల చేసిన 2025 జాబితాలో మూడవసారి కూడా సంధ్యా షెనాయ్‌కు చోటు దక్కింది. ప్రపంచవ్యాప్త సైంటిస్టులకు సమఉజ్జీగా మన దేశం నుంచి ఒక మహిళా పరిశోధకురాలు ఈ స్థాయి గుర్తింపు ΄పొందుతుండటం మన సైన్సు రంగానికి
గర్వకారణం. అందుకే ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి నేటి యువతరం.