‘సామాజిక అంశాలపై ప్రజలలో అవగాహన కలిగించేందుకు శాస్త్రీయ నృత్యం ద్వారా ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటాను’ అని చెప్పారు తెలంగాణ కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డి. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ కళాకారిణి ఐదున్నర దశాబ్దాలుగా నృత్య సేవ చేస్తున్నారు. దీపికారెడ్డి చేస్తున్న కృషికి ఈ యేడాది భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా దీపికారెడ్డి మాట్లాడుతూ కళా సేవ గురించి తమ జీవన విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు..
పాశ్చాత్య హోరులో మునిగిపోతున్న మన చిన్నారులకు, యువతకు మన దేశ నృత్య కళలు తెలియాలి. కళలకు గుర్తింపు లభించి, ఇలాంటి అవార్డులు రావడం ద్వారా రాబోయే తరాలకు ప్రేరణ కలిగిస్తుంది. శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటే ఏ రంగంలో అయినా రాణించవచ్చు. ఒక క్రమ శిక్షణ అలవడుతుంది. మెదడు చురుకుగా, శక్తిమంతం అవుతుంది. నృత్యం ద్వారా వచ్చే మనశ్శాంతి, సంతోషం మనల్ని ఆరోగ్యంగా, దీర్ఘకాలం యవ్వనంగా ఉంచుతుంది. మా విద్యార్థుల్లో కూడా ఇంజనీర్లు, డాక్టర్లు ఉన్నారు. మల్టిపుల్ వర్క్స్ చేస్తారు. నృత్య ప్రదర్శనల్లోనూ పాల్గొంటారు. ఇందులో ఒక టీమ్ వర్క్ ఉంటుంది.
అందరి ప్రోత్సాహంతో...
నాలో ఈ నాట్య తపనను వెలిగించింది మా అమ్మ రాధికారెడ్డి. తను భరతనాట్య నృత్యకారిణి. ఆమె 1961లో రవీంద్రభారతి ప్రారంభోత్సవానికి చిత్రాంగద బ్యాలె ద్వారా ప్రదర్శన ఇచ్చారు. అమ్మ సాధనను చూసి, నేనూ స్ఫూర్తి పొందేదాన్ని. నాట్యంపై నాకున్న ఆసక్తి గమనించిన అమ్మ నాచేత గజ్జె కట్టించారు. అలా అమ్మ మొదటి గురువు, ఆ తర్వాత నాట్యంలోని మెళకువలతో ముందుకు తీసుకెళ్లింది గురువు సుమిత్ర కౌశల్. అటు నుంచి ఎంతో మందిని నృత్యకారులుగా తీర్చిదిద్దిన వెంపటి చినసత్యంగారు గురువుగా లభించడం నాకు ఓ వరం. 1976లో రవీంద్రభారతిలో మొదటి ప్రదర్శన ఇచ్చాను. ఆ సమయంలో అక్కినేని నాగేశ్వర రావు వంటి ప్రముఖులు కూచిపూడి నృత్యానికి టార్చ్‌బేరర్ అని ప్రశంసించారు.
పదకొండేళ్ల వయసులో పెద్దవారి ఆశీస్సులు లభించడం కూడా అదృష్టమే. మా తాతగారు నూకల రామచంద్రారెడ్డి మాజీ మంత్రి. నాన్న వి.ఆర్ రెడ్డి సొలిసిటర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇంట్లో అందరికీ శాస్త్రీయ నృత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం. అలా వారి ప్రోత్సాహంతో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. పెళ్లి తర్వాత నా భర్త శ్యామ్‌గోపాల్ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. దేశ, విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ వచ్చాను. పిల్లలు అభినవ్, శ్లోక పుట్టిన తర్వాత కూడా నృత్యం చేస్తూనే ఉన్నాను. నేను మా అమ్మ నుంచి నృత్యంపట్ల ఆసక్తి పెంచుకుంటే నా కూతురు శ్లోక కూడా మా బాటలోనే నడిచింది. అలా మూడుతరాల శాస్త్రీయ నృత్యకారులు మా ఇంట్లో ఉన్నారు.
మూడు తరాల నృత్యం
మహాకుంభమేళాలో గణతంత్ర దినోత్సవం రోజునే గంగా పండాల్‌లోని పెద్ద స్టేజీపైన ప్రదర్శన ఇచ్చే అవకాశం లభించింది. శివ సతీయం, గంగావతరణం కథలను దాదాపు గంటసేపు నా కూతురు శ్లోకారెడ్డి, శిష్యబృందంతో కలిసి ప్రదర్శన ఇచ్చాను. మా అమ్మ, నేను, నా కూతురు.. మూడు తరాలుగా నృత్యసేవలో ఉండటం కూడా అదృష్టంగా భావిస్తున్నా. ‘దీపాంజలి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి నృత్య అకాడమీ’ ద్వారా ఎంతో మంది విద్యార్థులు శాస్త్రీయ నృత్యకారులుగా పేరు తెచ్చుకున్నారు. దేశ విదేశాలలో ఉన్న మా విద్యార్థులు మన భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకెళుతున్నారు.
నృత్యసేవ అంటే భగవంతుని ఆరాధనే. దేవాలయాల వద్ద, వేదికలపైన నృత్యప్రదర్శనలు ఇస్తున్నప్పుడు దివ్యానుభూతికి లోనవుతుంటాం. ఎంతో మంది ఆ ఆనందంలో మమేకం అవుతుంటారు. ప్రదర్శన తర్వాత కలిసి తమ అనుభూతిని తెలియజేసిన వారెందరో. మొదటి అరంగేట్రం నాటి నుంచి ఇప్పటి వరకు చూపిన ఎంతోమంది చూపిన ఆదరాభిమానాలు, ప్రోత్సాహం ఈ రోజున భారత ప్రభుత్వం నుంచి గౌరవం అందుకునేలా చేసింది’’అని ఆనందంగా వివరించారు ఈ నృత్యకళాకారిణి.
సామాజిక అంశాలపై సందేశం
అభినయం అనేది నాటి సినిమా నటీనటుల నుంచి కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు సినిమా రంగానికి సంబంధించిన వాళ్లు నృత్యం నేర్చుకోవడానికి నా దగ్గరకు వస్తుంటారు. కూచిపూడి నృత్యం అనగానే చాలామంది పౌరాణిక గాథలు అనే ఆలోచనల్లో ఉంటారు. కానీ, ప్రతి నెలా ఒక సామాజిక అంశంతో కొత్త కాన్సెప్ట్‌ని తీసుకుంటాం. అందులో యువతరపు ఆలోచనలనూ ముందుకు తీసుకువస్తున్నాను. దీంట్లో భాగంగా పర్యావరణం, పర్యాటకం, హ్యాండీక్రాఫ్ట్స్, మహిళల సమస్యలు, మన సంస్కృతికి వన్నెతెచ్చే అంశాలు తీసుకుంటూ సందేశాత్మకంగా ప్రేక్షకుల ముందుకు నృత్యరూపకంగా తీసుకువచ్చాం. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం ఎలా పొందవచ్చు అనేవి నృత్య రూపకం ద్వారా చూపించగలిగాను.
– నిర్మలారెడ్డి


