breaking news
Qualifying marks
-
నీట్–పీజీ అర్హత స్కోర్‌ను ఎందుకు తగ్గించారు?
న్యూఢిల్లీ: నీట్–పీజీ 2025–26కు క్వాలిఫయింగ్ కటాఫ్ పర్సంటైల్‌ను భారీగా తగ్గించడంపై వివరణ ఇవ్వాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్బీఈఎంఎస్)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరా«ధేల ధర్మాసనం ఎదుట శుక్రవారం పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపించారు. పీజీ స్థాయిలో ప్రమాణాలను నెలకొల్పేందుకు కఠినమైన నిబంధనలు అవసరమన్నారు. ప్రత్యేకమైన కారణాలుంటే తప్ప, పీజీ ప్రవేశాలకు అర్హత మార్కులను తగ్గించరాదన్నారు. స్పందించిన ధర్మాసనం..‘సీట్లను ఖాళీగా వృథా ఉంచరాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో, ప్రవేశాల కోసం ఎక్కువ మంది అభ్యర్థులు ముందుకు రావడం లేదు. అందుకే కటాఫ్‌ను తగ్గించాల్సి వస్తోంది. అయితే, సీట్లను ఖాళీగా ఉంచరాదనే నెపంతో ప్రమాణాల విషయంలో రాజీ పడటం తగదన్న వాదనలున్నాయి. ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారాన్ని మనం వెదకాలి’అని అభిప్రాయపడింది. ఈ అంశంపై సరైన పరిష్కారంతో ముందుకు రావాలని ఎన్బీఈఎంఎస్ను ఆదేశిస్తూ ధర్మాసనం తదుపరి విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. నీట్ పీజీ–2025 ప్రవేశాల్లో 18 వేలకు పైగా పీజీ మెడికల్ సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. దీంతో, బోర్డు రిజర్వుడు కేటగిరీల అభ్యర్థుల అర్హత పర్సంటైల్‌ను 40 నుంచి సున్నాకు తగ్గించింది. దీనర్థం 800కు గాను మైనస్ 40 స్కోరు సాధించిన అభ్యర్థులు సైతం మూడో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశమేర్పడింది. అదేవిధంగా, జనరల్ కేటగిరీ నీట్ పీజీ అభ్యర్థుల అర్హత స్కోరును 50 నుంచి 7కు తగ్గించారు. అయితే, ఈ నిర్ణయం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 14, 21లకు భంగం కలిగించడమేనంటూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 4వ తేదీన విచారణ చేపట్టిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, నేషనల్ మెడికల్ కమిషన్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. -
క్వాలిఫయింగ్ మార్కులు రావాల్సిందే
గ్రూప్1పై ఏపీపీఎస్సీ ప్రకటన సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 78 గ్రూప్–1 పోస్టుల భర్తీకోసం నిర్వహించే మెయిన్స్ పరీక్షలో అభ్యర్థుల క్వాలిఫయింగ్ మార్కులపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం ప్రకటన విడుదలచేసింది. జనరల్ ఇంగ్లీషుతో పాటు ఇతర పేపర్లలోనూ క్వాలిఫయింగ్ మార్కులను నిర్దేశించింది. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షను ఆగస్టు 17వ తేదీ నుంచి 28 వరకూ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. జనరల్ ఇంగ్లీషు మినహా ఇతర పేపర్లను ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో దేన్నయినా అభ్యర్థులు ఎంచుకోవచ్చు. ఓ పేపర్‌ను ఒక మాధ్యమంలో, మరో పేపర్‌ను మరో మాధ్యమంలోనూ రాసేందుకూ వీల్లేదు. జనరల్ ఇంగ్లీషు పేపర్ క్వాలిఫయింగ్ పేపర్ మాత్రమే. ఈ మార్కులను ర్యాంకింగ్‌కు పరిగణనలోకి తీసుకోరు. జనరల్ ఇంగ్లీషులో ఓసీలకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 శాతం మార్కులు రావాలి. ఇతర పేపర్లలో కూడా ఇదే రకంగా క్వాలిఫయింగ్ మార్కులు సాధించాలి. అయితే ఇతర పేపర్లన్నింటిలో వచ్చిన అన్ని మార్కులను (ఏగ్రిగేటింగ్) కలుపుకొని ఈ క్వాలిఫయింగ్ శాతం మార్కులు వచ్చాయో లేదో చూస్తారు. క్వాలిఫయింగ్ మార్కుల విషయంలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి కొన్ని మినహాయింపులిచ్చారు. జనరల్ ఇంగ్లీషులో నిర్ణీత శాతంలో క్వాలిఫై మార్కులు వారు సాధించాల్సి ఉంటుంది. ఇతర పేపర్లలో నిర్ణీత క్వాలిఫై మార్కులు సాధించిన వారు లేకపోతే ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న వారిని మెరిట్ ప్రాతిపదికన తీసుకుంటారు. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచారు.


