విద్యార్థులను చేర్పించేందుకు వల
అనధికారికంగా ఇంటర్ ప్రవేశాలు ప్రారంభం
చిరునామాలు సేకరిస్తున్న ప్రతినిధులు
ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం
మండపేట పట్టణానికి చెందిన ఓ విద్యార్థి గత విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేశాడు. రాజమహేంద్రవరంలోని కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ తీసుకున్నాడు. అయితే కళాశాల యాజమాన్యం ఆ ఫీజు.. ఈ ఫీజు అంటూ ఏడాదికి రూ.2.50 లక్షలు వసూలు చేసింది.
రామచంద్రపురానికి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు విజయవాడలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ కోసం సంప్రదిస్తే ఏసీ హాస్టల్ అయితే రూ. 1.80 లక్షలు, నాన్ ఏసీ అయితే రూ.1.40 లక్షలు ఫీజు కట్టాల్సి ఉంటుందని యాజమాన్యం తెలిపింది. విద్యార్థి కళాశాలలో చేరేవరకూ ఒక తీరు.. చేరిన తర్వాత మరో తీరు అన్నట్లుగా ఉందని తల్లిదండ్రుల ఆవేదన. వచ్చే విద్యా సంవత్సరానికి ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు ఇప్పటి నుంచే అడ్మిషన్ల ప్రక్రియ అనధికారికంగా ప్రారంభించేశారు.
రాయవరం: మావి చిగురు తినగానే కోయిల పాడేనా.. కోయిల పాట వినగానే మావి చిగురు తొడిగేనా.. అంటూ ఓ కవి వసంత రుతువు ఆగమనానికి కోయిల పాటకు ఉన్న సంబంధాన్ని తెలిపాడు. అయితే పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచుకోవడానికి మాత్రం అడ్మిషన్ల సమయం రాకుండానే కార్పొరేట్ కోయిలలు ముందుగానే కూస్తున్నాయి. ఆశల కలల సౌథాన్ని తల్లిదండ్రుల వద్ద ఉంచుతున్నాయి. తల్లిదండ్రుల ఆశలను పెట్టుబడిగా పెట్టి వారికి గాలం వేసేందుకు సిద్ధమవుతున్నాయి.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 70 వేల మంది విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుతున్నారు. ఈ ఏడాది మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంకా పరీక్షలు ప్రారంభం కాలేదు.. ఫలితాలు రాలేదు.. అప్పుడే ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం తాయిలాలు ప్రకటిస్తున్నాయి. విద్యార్థులను చేర్చించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
అధ్యాపకులు, సిబ్బందికి కమీషన్ల ఆశచూపి అడ్మిషన్ల ప్రక్రియను మొదలుపెట్టాయి. ఇందుకోసం పీఆర్‌ఓ వ్యవస్థను రూపొందించుకున్నాయి. ఆయా కళాశాలలకు పీఆర్‌ఓలుగా ఉన్నవారు విద్యార్థుల చిరునామాలు, ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారు. ముందుగా అడ్మిషన్లు తీసుకుంటే ఫీజుల్లో రాయితీ అంటూ ఆశ చూపిస్తున్నారు.
ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, నీట్ కోచింగ్, హాస్టల్ వసతి, విశాలమైన ప్రయోగశాలంటూ మాయమాటలు చెబుతున్నారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులతో చెప్పిస్తున్నారు. ఇప్పుడే అడ్మిషన్లు తీసుకోవాలని... లేదంటే ఫీజు మరింత పెరిగే అవకాశం ఉందంటూ భయపెడుతున్నారు.
డేటా సేకరణ
ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు ఆయా పాఠశాలల యజమానులకు డబ్బులిచ్చి విద్యార్థుల డేటా సేకరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల సంఖ్యను బట్టి ఏజెంట్లు, పీఆర్వోలకు కమీషన్లు చెల్లిస్తున్నాయి. దీంతో వారు డబ్బుపై ఆశతో చదువులెలా ఉ న్నా.. బోధ న సరిగ్గా లేకున్నా.. విద్యార్థులను ఇష్టమొచ్చిన కాలేజీల్లో చేరి్పస్తున్నారు. కోరిన కోర్సులో సీటు ఇప్పిస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. ముందుగానే సీటు రిజర్వ్ చేసుకోకుంటే కోరిన బ్రాంచిలో సీటు దొరకదని బెదరగొడుతున్నారు.
అప్రమత్తతే ముఖ్యం
తల్లిదండ్రులు తొందరపడి పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి కాలేజీల్లో చేరితే తర్వాత ఎవరూ పట్టించుకోరనే విషయం అనుభవమున్న తల్లిదండ్రులు చెబుతున్నారు. గత విద్యా సంవత్సరంలో ఈ విధంగానే ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు, పీఆర్‌ఓల మాటల గారడీలో పడి మోసపోయి చేతులు కాల్చు కున్న తల్లిదండ్రులున్నారు.
కార్పొరేట్ కళాశాలలో చేర్చించే ముందు విద్యా ర్థుల అభిప్రాయాలతో పాటు ఆ కళాశాలలో విద్యా నాణ్యత, బోధకుల అనుభవం, ఆ కళాశాలకు చెందిన సీనియర్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులను అడిగి తెలుసుకోవడంతో పాటు హాస్టల్‌లో ఉంచాలనుకుంటే, వసతిపై ఆరా తీసిన తర్వాతే అడ్మిషన్ కోసం మొగ్గు చూపాలి.
తమ విద్యా వ్యాపారం కోసం నిత్యం పుస్తకమే ప్రపంచంగా మార్చే కళాశాలలు కోకొల్లలుగా ఉన్నాయి. అలాంటి కళాశాలలో చేర్పిస్తే విద్యార్థి ఒత్తిడికి గురై మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎద్కురొనే పరిస్థితులు లేకపోలేదు. తొందర పాటు చర్యలతో కార్పొరేట్ కళాశాల మాయలో పడి ఇబ్బందులు పడకుండా తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.
అడ్మిషన్ల దందాపై పోరాటం
కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు పీఆర్వోలను నియమించుకుని ఇంటర్ ప్రవేశాల కోసం చేస్తున్న అసత్య ప్రచారాన్ని కట్టడి చేయాలి. పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాకుండానే తాయిలాలు ప్రకటిస్తూ అసత్య ప్రచారం చేసేవారిని అడ్డుకోవాలి. అడ్మిషన్ల దందాపై పోరాట కార్యక్రమాలు రూపొందిస్తాం. –బి.సిద్ధూ, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పీడీఎస్‌యూ, రామచంద్రపురం
విద్య వ్యాపారంగా..
ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల పీఆర్వోలు తల్లిదండ్రుల నంబర్లు సేకరించి మాట్లాడి మభ్యపెడుతున్నారు. ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రభుత్వం ప్రకటించే వరకూ చేపట్టరాదు. అయితే విద్యను వ్యాపారంగా మార్చేస్తున్నారు. టాలెంట్ టెస్ట్‌లు, అవగాహన సదస్సుల పేరుతో కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల అసత్య ప్రచారాన్ని నియంత్రించాలి. – సింహాద్రి కిరణ్‌కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీడీఎస్‌యూ, రాజమహేంద్రవరం


