ఆత్రేయపురం: కోనసీమ జిల్లాలో బొబ్బర్లంక – రావులపాలెం ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతం ఈ రహదారి అధ్వానంగా దర్శనమిస్తుంది. సింగిల్ రోడ్డు కావడం, గోతులు పడడం, వాహనాల రద్దీ పెరగడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వెలిచేరు నుంచి బొబ్బర్లంక వరకూ సుమారు ఏడు కిలోమీటర్ల రోడ్డు మరీ దారుణంగా ఉంది. ఇక్కడ ప్రయాణం ఉయ్యాల జంపాలను తలపిస్తోంది. తారు లేక, కంకర రాళ్లు తేలి ఇక్కడ కనిపిస్తోంది. ఈ రోడ్డు నిర్మించి దశాబ్దాలు కావొస్తుంది. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ రోడ్డు ఇటు రావులపాలెం జాతీయ రహదారిని, అటువైపు కాటన్ బ్యారేజీ అవతల నూతన జాతీయ రహదారులను కలుపుతోంది. అంతేకాకుండా ఆర్‌అండ్‌బీ శాఖలో రాష్ట్ర రహదారిగా గుర్తింపు పొందినా, అభివృద్ధికి దూరంగా ఉంది. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి లక్షల మంది భక్తులు వేలాది వాహనాల్లో ఇటుగా వస్తుంటారు. అలాగే కాలినడకన చాలామంది వాడపల్లి క్షేత్రానికి వెళ్తుంటారు. ఆ భక్తులకు రోడ్డుపై గోతులు, గొప్పులు, రాళ్లు గుచ్చుకుని రక్తపు గాయాల పాలవుతున్నారు. అయినా రహదారిని గతంలో బిట్లు బిట్లుగా వేయటంతో అతుకులుగా కనిపిస్తోంది. కాగా ఇటీవల చేసిన ప్యాచ్ వర్క్స్‌తో మరీ అధ్వానంగా ఉంది. గత సంవత్సరం జనవరిలో అతుకులు పూడ్చారు. తిరిగి ఇప్పుడు మళ్లీ చేస్తున్నారు. ఈ మరమ్మతులకు రూ.లక్షలు వృథా అవుతున్నాయి. కానీ రోడ్డు మాత్రం బాగుపడడం లేదు. పూర్తిస్థాయిలో రోడ్డును అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉంది.
ఆ దారిలోనే రైతుల పయనం
ఈ ప్రాంతంలో అరటి తోటలు విస్తారంగా ఉన్నాయి. ఇక్కడి రైతులు అరటి గెలలను సైకిళ్లపై పెట్టుకుని ఇటు రాజమహేంద్రవరం, అటు రావులపాలెంకు వెళ్తుంటారు. రోడ్డు అధ్వానంగా ఉండడంతో సైకిళ్లు మరమ్మతులకు గురవడంతోపాటు లోడు కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నామని రైతులు అంటున్నారు. మండలంలోని మరో జాతీయ రహదారి రాజవరం– పొదలాడ రోడ్డు 13 కిలోమీటర్ల మేర గుంతలతో దర్శనమిస్తుంది. చాలా గ్రామాల ప్రజలు ఈ రోడ్లపై ప్రయాణించాలంటే హడలెత్తిపోతున్నారు. ప్రధానంగా రోడ్లు భవనాల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. రోడ్డుకు పక్కనే మధ్య డెల్టా కాలువ ఉన్నా, మలుపులు, ప్రమాదభరిత ప్రాంతాల్లో ఎక్కడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ఈ రహదారిని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
ఎక్కడికక్కడే అతుకులు, గతుకులు.. తారు లేచి రాళ్లు తేలిన దారిలో ప్రయాణానికి అవస్థలు.. ఏళ్లకాలంగా చోద్యం చూస్తున్న పాలకులు.. వెలసి ఎంతో ప్రాధాన్యం ఉన్న బొబ్బర్లంక – రావులపాలెం రహదారిలో ప్రజలకు తప్పని పాట్లు.. కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి క్షేత్రానికి వెళ్లే ప్రధాన రహదారి అయినా ఎవరూ పట్టించుకోక ప్రజలు
నిత్యం నరకం చూస్తున్నారు.
ఫ అధ్వానంగా
బొబ్బర్లంక– రావులపాలెం రోడ్డు
ఫ అతుకుల బొంతలా మారిన వైనం
ఫ పట్టించుకోని కూటమి ప్రభుత్వం
గుంతలు పూడ్చుతాం
వెలిచేరు నుంచి బొబ్బర్లలంక వరకూ రోడ్డు అధ్వానంగా ఉన్నమాట వాస్తవమే. ఈ రోడ్డును చివరిసారిగా 2011–12లో నిర్మించారు. ప్రస్తుతం ఈ రోడ్డు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు రావాలి. ప్రస్తుతం గుంతలు పూడ్చేందుకు రూ. 70 లక్షల నిధులు మంజూరయ్యాయి.
– జి.రాజేంద్రప్రసాద్, రోడ్లు భవనాల శాఖ డీఈ, కొత్తపేట
తరచూ ప్రమాదాలు
బొబ్బర్లంక రోడ్డుపై ప్రయాణించాలంటే జనం భయపడిపోతున్నారు. తరచూ వాహన ప్రమాదాలు జరుగుతుండడమే అందుకు కారణం. ఎంతో ప్రాధాన్యం ఉన్న రహదారి అభివృద్ధికి నోచుకోకపోవడం దారుణం. ఈ రాష్ట్ర రహదారిని వెంటనే నాలుగు లైన్ల రహదారిగా నిర్మించాల్సిన ఆవశ్యకత ఉంది.
– కనుమూరి శ్రీనురాజు, వైఎస్సార్ సీపీ రైతు నాయకుడు
ఏళ్ల తరబడి ఇలానే..
బొబ్బర్లంక రోడ్డు ఏళ్ల తరబడి అధ్వానంగా ఉంది. ఈ ప్రాంత ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. అధికారులు కనీసం మరమ్మతులు కూడా సక్రమంగా చేయించడం లేదు. సుమారు 13 ఏళ్ల నుంచి ఈ రోడ్డు నిర్వహణను మరిచిపోయారు. కూటమి సర్కార్ మాటలు తప్ప చేతలు కానరావడం లేదు. వెంటనే ఈ రహదారి నిర్మించాలి.
– సఖినేటివాకుల రాజు, వైఎస్సార్ సీపీ రైతు నాయకుడు, రావులపాలెం


