చీడపీడలు ముంచెట్టు | - | Sakshi
Sakshi News home page

చీడపీడలు ముంచెట్టు

Mar 13 2026 7:58 AM | Updated on Mar 13 2026 7:58 AM

పెరవలి: అంతా బాగుంటే ఆయిల్‌పామ్‌ సాగు సిరులు కురిపిస్తోంది.. సస్యరక్షణ చర్యలే ఈ పంటకు శ్రీరామరక్ష అవుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో వరి తరువాత అధిక మొత్తంలో పామాయిల్‌ సాగే జరుగుతోంది. జిల్లాలో మొత్తం 19,266 హెక్టార్లలో సాగవుతుండగా, 15 వేల హెక్టార్ల నుంచి పంట ఉత్పత్తి అవుతూ ఏడాదికి 76 వేల మెట్రిక్‌ టన్నుల పామాయిల్‌ దిగుబడి వస్తోంది. ఏటా ఈ పంటలపై వివిధ తెగుళ్లు, పురుగుల ప్రభావం అధికంగా ఉంటోంది. ఇది దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని నివారణకు వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కొవ్వూరు ఉద్యాన అధికారి డి.సుధీర్‌కుమార్‌ వివరించారు. తెగుళ్లు సోకినప్పుడు రైతులు తీసుకోవాల్సిన చర్యలు, ఎరువుల యాజమాన్యం గురించి ఆయన తెలిపారు. ఆ వివరాలు ఇలా..

కొమ్ము పురుగు

కొమ్ము పురుగు ఆయిల్‌పామ్‌ మొక్కలను ఆశిస్తే, మొక్కల ఆకులు వీ ఆకారంలో కత్తిరించబడినట్లు ఉంటాయి. ఈ పురుగులు భూమిలో ఏర్పడిన పగుళ్లలో ఉంటాయి. అంతేకాకుండా చెట్టు మొదలు ఉండే పీచులో కూడా ఇవి చేరి పంటకు హాని చేస్తాయి. ఇవి మొవ్వలోకి కూడా ప్రవేశించి మెత్తని పదార్థాన్ని తినేస్తాయి. దీని నివారణకు మొక్కల చుట్టూ చెత్తాచెదారం లేకుండా చూడాలి. ఒకవేళ ఉంటే వీటిపై కార్బరిల్‌ మందును 10 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొవ్వలో పురుగులు ఉన్నట్లు గుర్తిస్తే, వాటిని తీగతో తీసివేసి అది చేసిన రంధ్రానికి 25 గ్రాముల కార్బరిల్‌ మందును పది గ్రాముల తడి ఇసుకలో కలిపి మొవ్వలో పెట్టాలి.

సంచి పురుగు

ఈ పురుగులు శంఖు ఆకారంలో ఉండి ఆకు అడుగు భాగాన చేరతాయి. ఆకులకు రంధ్రాలు చేసి తినేస్తాయి. దీని నివారణకు ఈ పురుగులు సోకిన ఆకులను కత్తిరించి తగులబెట్టాలి. మిగిలిన ఆకుల మీద కార్బరిల్‌ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఎరువుల యాజమాన్యం

ఆయిల్‌పామ్‌ మొక్కలకు సంవత్సరానికి రెండు మోతాదుల్లో ఎరువులు అందించాలి. మొదటి మోతాదు జూన్‌, జూలై నెలల్లో, రెండో మోతాదు డిసెంబర్‌, జనవరి నెలల్లోనే మొక్కలకు వేయాలి. మూడేళ్ల వయసు దాటిన ఒక్కో మొక్కకు 2 కిలోల 600 గ్రాముల యూరియా, సింగిల్‌ పాస్ఫేట్‌ 3 కిలోల 750 గ్రాములు, పొటాష్‌ 2 కిలోలు, మెగ్నీషియం సల్ఫేట్‌ 500 గ్రాములు ఏడాదిలో రెండుసార్లు వేయాలి.

ఫ ఆయిల్‌పామ్‌ సాగులో

సస్యరక్షణ అవసరం

ఫ యాజమాన్య పద్ధతులతోనే

అధిక దిగుబడులు

మొవ్వుకుళ్లు తెగులు

ఈ తెగులు ఉధృతి తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఉంటుంది. మొక్క పసుపు రంగులోకి మారి మొవ్వు ఆకులను లాగితే తేలికగా వస్తాయి. మొవ్వ లాగిన మొక్క నుంచి తీవ్ర దుర్గంధం వస్తుంది. దీని నివారణకు ఈ తెగులు సోకిన భాగాన్ని శుభ్రం చేసి లీటరు నీటికి కార్బండిజమ్‌ ఒక గ్రాము మందు కలిపి తెగులు సోకిన ప్రాంతమంతా పూయాలి.

గానోడెర్మా కుళ్లు..

ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు కింద వరుసలో ఎండిపోతాయి. తెగులు ఉధృతి అధికంగా ఉంటే మొవ్వలోకి చేరి కాండం మొదలు వద్ద కణజాలాన్ని ఆశించడంతో అక్కడ కుళ్లిపోయి చెట్టు చనిపోతుంది. నివారణకు తెగులు సోకి చనిపోయిన చెట్లను వెంటనే చేను నుంచి తొలగించాలి. తెగులు సోకినట్లు గుర్తించిన వెంటనే ఆ చెట్టు వేరును తీసి ట్రై డీమార్ఫ్‌ మందును వంద మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి ఆ వేరు ద్వారా ఎక్కించాలి. సేంద్రియ ఎరువులను అధికంగా చెట్టుమొదలులో వేయాలి.

కాండం తడి తెగులు

ఈ తెగులు సోకిన చెట్ల మొవ్వ అకస్మాత్తుగా ఎండిపోతుంది. మిగిలిన ఆకులు త్వరితగతిన వడలిపోతాయి. మొవ్వ ఆకు వడలిన వెంటనే సస్యరక్షణ చర్యలు ప్రారంభిస్తే చెట్లు కోలుకుంటాయి. ఈ తెగు లు సోకిన చెట్టు మొవ్వను లాగి అందులో కుళ్లిన పదార్థాన్ని తీసి శుభ్రం చేసిన తరువాత కార్బండిజమ్‌, మోనోక్రోటోపాస్‌లను కుళ్లిన చోట పై పూతగా వేసి ఆ తరువాత తారును పూసి ఉంచాలి.

గెలకుళ్లు..

ఈ తెగులు సోకిన గెలలు కుళ్లిపోవడంతో తెల్లని శిలీంధ్రాలతో కనిపిస్తాయి. ఆ గెలలను వెంటనే నరికివేసి ఆ ప్రాంతంలో కుళ్లిన పదార్థాలను తీసి 0.1 శాతం కార్బండిజమ్‌ మందుతో శుద్ధిచేయాలి. ఇలా చేయడం వల్ల మిగిలిన గెలలకు ఈ తెగులు వ్యాపించకుండా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement