వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి | - | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి

Mar 13 2026 7:58 AM | Updated on Mar 13 2026 7:58 AM

బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణ

రాజవొమ్మంగి: మండలంలోని గొబ్బిలమడుగు గ్రామానికి చెందిన మూడు నెలల చిన్నారి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కాగా ఆ చిన్నారి తల్లిదండ్రులు అనుపమ, నాగేంద్రలు తమ పాప వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మరణించిందని ఆరోపిస్తున్నారు. చిన్నారి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటే, ఈ నెల 5న మండలానికి దగ్గరలోని ఏలేశ్వరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించామన్నారు. అక్కడి నుంచి ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తరువాత కాకినాడ జీజీహెచ్‌కు తీసుకు వెళ్లామన్నారు. చిన్నారికి తల్లీ బిడ్డ వార్డులో వెంటిలేటర్‌పై చికిత్స అందించారని, ఆ తరువాత పాప బాగానే ఉన్నప్పటికీ రక్తం ఎక్కించారని వాపోయారు. మూడు నెలల చంటి బిడ్డకు రక్తం ఎక్కించడం వల్లనే చనిపోయిందని తల్లి అనుపమ కన్నీరు పెట్టుకొంది. మరోవైపు పాపకు శిక్షణ పొందుతున్న జూనియర్‌ వైద్యులు చికిత్స చేశారని, దీనితో అల్లారు ముద్దుగా చూసుకుంటున్న తమ మొదటి కాన్పు బిడ్డ తమకు కాకుండా తనువు చాలించిందని తల్లిదండ్రులు దుఃఖించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తమ వంటి ఆదివాసీలకు సకాలంలో, సరైన వైద్యం లభించడం లేదని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి కష్టం మరో తల్లికి రాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఆంధ్ర వాలీబాల్‌ టీం

కెప్టెన్‌గా లక్ష్మి

రంగంపేట: ఢిల్లీ రాష్ట్రంలోని పీఠంపూర్‌లో ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకూ జరిగే ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీసెస్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌కు ఆంధ్రప్రదేశ్‌ నుంచి కెప్టెన్‌గా రంగంపేట మండలం జి.దొంతమూరు హైస్కూల్‌ వ్యాయామ ఉపాధ్యాయురాలు ఇ.లక్ష్మి ఎంపికయ్యారని పాఠశాల హెచ్‌ఎం కేవీ రమణారావు చెప్పారు. గురువారం ఆయన ఆ హైస్కూల్‌లో మాట్లాడుతూ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అనేక టోర్నమెంట్లలో పాల్గొన్న లక్ష్మి ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీసెస్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం రావడం అభినందనీయమని అన్నారు. దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని, ఆంధ్రప్రదేశ్‌ నుంచి పాల్గొనే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వ సివిల్‌ సర్వీసెస్‌ అధికారులకు లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఆమెను గ్రామ సర్పంచ్‌ గోలి రమణ, ఎంపీటీసీ సభ్యుడు జి.వెంకటకృష్ణ, విద్యా కమిటీ చైర్మన్‌ ఎస్‌వీఎస్‌ నారాయణ, మండల విద్యాశాఖ అధికారులు కె.శ్రీనివాసరావు, పి.మధుసూదనరావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

భర్త వేధింపులపై

మహిళా కానిస్టేబుల్‌ ఫిర్యాదు

కాకినాడ రూరల్‌: భర్త వేధింపులపై ఓ కానిస్టేబుల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమణయ్యపేట బాపన్నదొర కాలనీలో నివాసం ఉంటున్న వివాహిత, ఎకై ్సజ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పోలవరపు దేవి ఫిర్యాదు మేరకు ఆమె భర్త సామర్లకోట మండలం పి.వేమవరం గ్రామానికి చెందిన శ్రీపతి మణికంఠపై సర్పవరం పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఎస్సై శ్రీనివాసకుమార్‌ కథనం ప్రకారం.. గతంలో వివాహమైన దేవి తన భర్త నుంచి విడాకులు తీసుకున్న తరువాత 2021లో మణికంఠను ద్రాక్షారామ ఆలయంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో భర్త తన మేనకోడలిని వివాహం చేసుకునే ప్రయత్నం చేయగా, అప్పట్లో బాధితురాలి ఫిర్యాదు మేరకు 2024 మార్చి 5న సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్‌ చేశారు. రిమాండ్‌ అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చాడు. కోర్టులో వాదోపవాదాల అనంతరం ఈ ఏడాది జనవరిలో కేసు కొట్టివేశారు. ఈ నేపథ్యంలో మేనకోడలిని మణికంఠ రెండో వివాహం చేసుకున్నాడని, అతని కుటుంబ సభ్యులు తనను దూషించి, కొట్టి బెదిరింపులకు గురిచేసినట్టు దేవి మరోసారి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు.

బాల్య వివాహం అడ్డగింపు

పిఠాపురం: స్థానిక కత్తులగూడెంలో నిర్వహించ తలపెట్టిన బాల్య వివాహాన్ని గురువారం అధికారులు అడ్డుకున్నారు. పట్టణానికి చెందిన బాలికకు (14) గుంటూరుకు చెందిన వ్యక్తితో అన్నవరంలో ఈ నెల 14న వివాహం చేసేందుకు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బాల్య వివాహం జరుగుతుందని సమాచారం అందుకున్న ఐసీడీఎస్‌, బాలల పరిరక్షణ విభాగం అధికారులు బాలిక ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరం బాలికను స్థానిక పోలీసుల సహాయంతో కాకినాడలోని బాలల సంరక్షణ గృహానికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement