దేవరపల్లి: గుండుగొలను – కొవ్వూరు జాతీయ రహదారి– 16పై దేవరపల్లి మండలం కృష్ణంపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని గాంధీనగరానికి చెందిన వ్యవసాయ శాఖ విశ్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ ఆచంట జగన్నాథరావు (81) దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. గాంధీనగరం నుంచి స్కూటీపై జగన్నాథరావు దేవరపల్లి వచ్చి పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా కృష్ణంపాలెం వద్ద హైవేలో తాడిపూడి కాలువ వంతెనపై వెనుక నుంచి అతివేగంగా టిప్పర్ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో జగన్నాథరావు తీవ్రంగా గాయపడి అక్కడక్కడే మృతి చెందారు. జగన్నాథరావు సోదరుడు సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమారులు ఉండగా, పెద్ద కుమారుడు అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తుండగా, రెండో కుమారుడు సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడ్డారు. మూడో కుమారుడు ఒంగోలులో ఉంటున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఉత్తమ వ్యవసాయ అధికారి, వ్యవసాయ రంగంలో ఆదర్శ రైతుగా జగన్నాథరావు అవార్డులు అందుకున్నారు. ఈ ప్రాంత రైతులకు వ్యవసాయంలో పలు సూచనలు, సలహాలు ఇచ్చేవారు. జగన్నాథరావు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.


