అప్పుడే కార్పొరేట్ స్కూళ్లలో అడ్మిషన్ల జాతర షురూ
ముందే మొదలైన డిస్కౌంట్ ఆఫర్
పరీక్షలు ముగియక ముందేప్రవేశాల హడావుడి
‘వసంత పంచమి’ పేరిట రిబేట్
గ్రేటర్‌లో ఇదీ కార్పొరేట్ స్కూళ్ల తీరు
మహానగరంలో అడ్మిషన్ల జాతర మొదలైంది.. ఆఫర్లు..డిస్కౌంట్ల పేరుతో తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తూ కార్పొరేట్ పాఠశాలలు బుట్టలో వేసుకుంటున్నాయి. లక్షల రూపాయల ఫీజు చెప్పి.. ఆ తరువాత ఆఫర్ల పేరిట నామమాత్రం తగ్గిస్తూ ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కార్పొరేట్ మాయాజాలంలో పడ్డ అమాయక తల్లిదండ్రులు నిలువునా మోసపోతున్నారు. – సాక్షి, హైదరాబాద్
మహానగరంలో విద్యా వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. వార్షిక పరీక్షల సందడి మొదలవ్వకముందే వచ్చే విద్యా సంవత్సరానికి (2026–27) కార్పొరేట్ పాఠశాలలు అడ్మిషన్ల జాతరను ప్రారంభించాయి. ‘వసంత పంచమి’ని కూడా మార్కెటింగ్ అస్త్రంగా మార్చుకుంటూ తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. అప్పుడే విద్యా సంస్థల మధ్య పోటీ పతాక స్థాయికి చేరింది.
» సాధారణంగా వేసవి సెలవుల్లో మొదలవ్వాల్సిన అడ్మిషన్ల ప్రక్రియ ఈసారి జనవరి నుంచే ముమ్మరమైంది. సిలబస్ పూర్తి కాకముందే సీట్ల వేటలో పడి తల్లిదండ్రులను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. కొత్త విద్యా సంవత్సర ప్రారంభం కావడంతో ‘న్యూ ఇయర్ డ్రైవ్’ పేరుతో రంగంలోకి దిగిన కొన్ని విద్యా సంస్థలు, ఇప్పుడు ‘వసంత పంచమి స్పెషల్ డ్రైవ్’ అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నాయి.
‘నో డొనేషన్ – ఫ్రీ అడ్మిషన్‘ వంటి ఆకర్షణీయమైన స్లోగన్లతో హోరెత్తిస్తున్నాయి. ఇపుడే అడ్మిషన్ పొందితే ట్యూషన్ ఫీజులో 20 శాతం రాయితీ ఇస్తామంటూ బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇది విద్యాబోధనలా కాకుండా, ఏదో షాపింగ్ మాల్ సేల్‌ను తలపిస్తోందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.
గుర్తింపు లేకున్నా.. ఆగని ప్రచారం
విద్యాశాఖ నిబంధనలను బేఖాతరు చేస్తూ కొన్ని సంస్థలు చెలరేగిపోతున్నాయి. ఒక విద్యా సంస్థకు అనుమతి లేదని, అందులో ప్రవేశాలు తీసుకో వద్దని ఏకంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల విధ్యాశాఖాధికారులు అధికారికంగా ప్రకటించినప్పటికీ అడ్మిషన్ల ప్రచారంలో మాత్రం తగ్గేదేలే అంటున్నాయి.
» నగర కూడళ్లలో భారీ హోర్డింగ్‌లు , ఫ్లెక్సీలు, మెట్రోరైళ్లలో ప్రకటనలు. సోషల్ మీడియా, టీవీ ఛానళ్లలో అడ్మిషన్ల ప్రకటనల వెల్లువ మాత్రం ఆగడం లేదు. నిబంధనల ప్రకారం వార్షిక పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాతే (ఏప్రిల్,మే) అడ్మిషన్లు ప్రారంభించాల్సి ఉంటుంది.
» జనవరిలో అడ్మిషన్లు చట్టవిరుద్ధం. ప్రతి పాఠశాల తన రిజిస్ట్రేషన్ నంబర్, గుర్తింపు పత్రాన్ని నోటీసు బోర్డులో ప్రదర్శించాలి.’క్యాపిటేషన్ ఫీజు’ డొనేషన్లు వసూలు చేయవద్దు, పాఠశాల మేనేజ్‌మెంట్ ఏకపక్షంగా ఫీజులు పెంచకూడదు. పాఠశాల ప్రాంగణంలోనే పుస్తకాలు, యూనిఫాంలు కొనాలని తల్లిదండ్రులను బలవంతం చేయకూడదు. కానీ, ఇందుకు భిన్నంగానే ప్రక్రియ సాగుతోంది.
ప్రై’వేటు‘ వైపే మొగ్గు
» గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో ప్రైవేటు పాఠశాలల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 70 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లోనే విద్యనభ్యసిస్తున్నారు.
» 7,451 ప్రైవేటు పాఠశాలలుండగా అందులో 4,550 బడ్జెట్ పాఠశాలలు, 1,900 కార్పొరేట్, వాటి అనుబంద, 1,001 మిషనరీ పాఠశాలలున్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థల ప్రభావంతో సాధారణ, దిగువ మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే బడ్జెట్‌సూ్కళ్లు తగ్గు ముఖం పట్టాయి.
» ఇప్పటికే సుమారు 400 పైగా ప్రైవేటు (బడ్జెట్) పాఠశాలలు ఆర్థిక కారణాల వల్ల మూతపడగా, ఆ స్థానాలను కార్పొరేట్ స్కూళ్లు ఆక్రమిస్తున్నాయి.
తల్లిదండ్రుల్లో అయోమయం
» తమ పిల్లల బంగారు భవిష్యత్తు దృష్ట్యా మంచి స్కూల్‌లో సీటు దొరకదేమోనన్న భయంతో చాలామంది తల్లిదండ్రులు ‘ముందస్తు అడ్మిషన్ల’ ఉచ్చులో పడుతున్నారు.
» రాయితీల ఆశతో వేల రూపాయలు అడ్వాన్సు చెల్లిస్తున్నారు. విద్యా సంవ్సత్సరం ప్రారంభమయ్యాక అదనపు ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్స్ పేరుతో స్కూళ్లు అసలు రంగు బయటపెడుతున్నాయని బాధితులు వాపోతున్నారు.
పట్టని విద్యాశాఖాధికారులు
» అనుమతులు లేని పాఠశాలలు ప్రచారం చేసుకుంటున్నా, నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.
» కేవలం ప్రకటనలు జారీ చేసి చేతులు దులుపుకోకుండా, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి అక్రమ అడ్మిషన్లను అడ్డుకోవాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.


