
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా తీసుకొచ్చిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. ఈ చర్యలో అసలు హేతుబద్ధత అన్నదే లేదని, టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి సర్కారు ప్రైవేటీకరణ పేరుతో వైద్యకళాశాలలను తమ తాబేదార్లకు అప్పగిస్తోందన్న విమర్శలు అటు సామాన్య ప్రజానీకంతోపాటు ప్రతిపక్ష వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణలు వినిపిస్తున్నారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని బీరాలు పలికిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ప్రజల ఆస్తులు అమ్ముతూ ప్రైవేటువారికి సంపద సృష్టిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
ప్రభుత్వ వైద్యకళాశాలల్లో యాభై శాతం సీట్లను సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిని పెడతామన్న వైఎస్ జగన్ మాటలను అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించిన బాబు, లోకేశ్‌లు ఇప్పుడు మాటమార్చడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పైగా పీపీపీ విధానం ప్రైవేటేషన్ కాదని, జగన్‌కు ఆ విషయం తెలియదని బాబు అండ్ కో బుకాయిస్తున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తోంది.
చంద్రబాబు నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌లు అసెంబ్లీలోని ఇరు సభల్లో చేసిన వాదనలను పరిశీలిస్తే వీరు వైద్యకళాశాలల ప్రైవేటీకరించి కళ్లప్పగించి చూడబోతున్న వైనం స్పష్టమవుతోంది. పేదలకు వైద్యవిద్య అన్నది ఒట్టిమాటేనని, వ్యహారమంతా ధనికులకు అనకూలంగానే నడుస్తోందని విమర్శలు వస్తున్నాయి. పీపీపీ అంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధానమంటున్న చంద్రబాబు తద్వారా కాలేజీలు, ఆసుపత్రుల నిర్వహణలో తమ అసమర్థతను బయటపెట్టుకున్నట్లు అయ్యింది. జగన్ ప్రభుత్వం నాడు-నేడు కింద ఆస్పత్రులను బాగు చేయించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తే, సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వం కంటే ప్రైవేటు వారే బెటర్ అంటున్నారా? ఈ మాత్రం దానికి ప్రభుత్వం ఎందుకో? వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిర్మాణాల మాదిరి అయితే ఈ పది మెడికల్ కాలేజీలు పూర్తి కావడానికి 15 ఏళ్లు పడుతుందని చంద్రబాబు అనడం చూస్తే ఆయన తనను తాను అసమర్థుడిగా చెప్పుకుంటున్నట్లే కదా అని వైసీపీ వారు ప్రశ్నిస్తున్నారు.
అదే సమయంలో లక్ష కోట్లైనా ఖర్చు చేసి అమరావతి మొదటి దశ నిర్మాణం పూర్తి చేస్తామనడం మరీ విడ్డూరంగా ఉంది. జగన్ సీఎంగా రెండేళ్లలోనే ఐదు వైద్య కశాళాలలను అందుబాటులోకి తెచ్చారు. ఆ తరువాత ఇంకో రెండు దాదాపుగా పూరర్తయ్యాయి. మిగిలిన పదింటికీ అయ్యే రూ.ఐదారు వేల కోట్లు ప్రభుత్వం సమకూర్చుకోలేదా? లక్షల కోట్ల బడ్జెట్ కలిగిన ప్రభుత్వమే ఈ మాత్రం డబ్బు సమకూర్చు కోలేకపోతే ప్రైవేటు సంస్థలు ఎలా తెచ్చుకుంటాయి? ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా లేని విధంగా ఒక్కో వైద్యకళాశాలలకు కేటాయించిన దాదాపు యాభై ఎకరాల భూమిని ఎకరా రూ.వంద చొప్పున లీజుకు ఇవ్వడమంటే ఉత్తినే ఇచ్చినట్లు కదా? ప్రైవేట్ సంస్థలు ఈ భూములను తాకట్టు పెట్టి రుణం తెచ్చుకుంటే..
ప్రభుత్వం తన సంపదను రాసిచ్చినట్లే అవుతుంది.ప్రస్తుతం 33 ఏళ్లు ఉన్న లీజు భవిష్యత్తులో పొడిగించరన్న గ్యారెంటీ ఏమీ లేదు కాబట్టి.. ఇవి శాశ్వతంగా ప్రైవేటు వారి పరమవుతాయి. పేద ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులకు అమరావతి మాదిరే ప్రభుత్వం రుణాలు తేలేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ చంద్రబాబు ప్రభుత్వం 54 ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసింది. కొనుగోలు చేసిన సంస్థలు తమకు దక్కిన భూమితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాయని ఒక రిటైర్డ్ అధికారి చెప్పారు. ఎవరి సంపద ఎవరి పరమైనట్లు? జగన్ ప్రభుత్వం ఏభై శాతం సీట్లు సెల్ప్ ఫైనాన్స్ పద్దతిలో కేటాయించి, వాటికి రూ.20 లక్షల చొప్పున ఫీజ్ వసూలు చేయాలని నిర్ణయిస్తే, చంద్రబాబు, లోకేశ్‌లు తప్పు పట్టారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విధానాన్ని రద్దు చేసి అంతా ఫ్రీ చేస్తామని లోకేశ్ విద్యార్ధుల సమావేశంలోనే ప్రకటించారు.
ఇప్పుడు మొత్తం ప్రైవేటుపరం చేయడమే కాకుండా, ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల ఖరీదు రూ.57 లక్షలు ప్రభుత్వ రంగంలో రూ.20 లక్షలు అంటే అంతే మొత్తం వసూలు చేస్తారు. అదే ప్రైవేటు వారు అయితే ఈ రూ.57 లక్షలే కాకుండా, అదనంగా రూ.కోటి పైనే వసూలు చేయవచ్చు అంటున్నారు. మొత్తం డబ్బు ప్రభుత్వ ఖాతాలోకి వచ్చేలా జగన్ చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు వేల కోట్ల రూపాయలు దక్కేలా చేస్తున్నారన్న విమర్శకు సమాధానం దొరకదు. ఇంతా చేసి ఆ వైద్య కళాశాలల ఆసుపత్రుల్లో ప్రజలందరికి ఉచిత వైద్య సేవలు అందుతాయన్న గ్యారంటీ కూడా లేదు. ప్రైవేటు సంస్థలు లాభాలు రాకపోతే మనలేవన్నది తెలిసిన సత్యమే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లక్ష రూపాయల విలువైన చికిత్స అయినా, ఆపరేషన్ అయినా ఉచితంగా చేస్తారు. మరి పీపీపీ మోడల్‌లో ఏర్పాటైన ప్రైవేట్ కళాశాలలు ఇలా చేస్తాయా? చేయవు. ఒకవేళ చేసినా ఆ మొత్తాలను ఎన్టీఆర్ వైద్య సేవ లేదా బీమా సదుపాయం పేరుతో ప్రభుత్వం నుంచే వసూలు చేసే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి పీపీపీ విధానంతో ప్రజలకు ఒరిగేదేమిటి? ప్రభుత్వానికి మిగిలేదేమిటి?
ప్రైవేటీకరణే విధానమని నిర్ణయించుకుని ఉంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వీటిపై రూ.700 కోట్లు ఎందుకు ఖర్చు చేసినట్లు? ఇప్పటివరకూ ఆయా కళాశాలల ఏర్పాటుకు అయిన ఖర్చు (భూమి + నిర్మాణాలు) తీసుకుని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి ఉంటే కనీసం ప్రభుత్వానికి కొంత డబ్బు మిగిలి ఉండేదేమో. ప్రస్తుతం ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కూడా ఏభై శాతం సీట్లు మెరిట్ ప్రకారం, రిజర్వేషన్లు పాటిస్తూ కేటాయించాల్సిందే. ఈ పరిస్థితిలో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటువారికి ఉత్తపుణ్యానికి ధారాదత్తం చేసి మెడికల్ కాలేజీలను నడపాలని చెప్పడం అర్ధరహితం. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి పొందిన సంస్థలు భూమిని స్వయంగా సమకూర్చుకుంటున్నాయి. భవనాలు సొంత ఖర్చుతో నిర్మించుకుంటున్నాయి. యంత్ర పరికరాలు ఇతర సదుపాయాలన్నీ సొంత ఖర్చుతోనే చేసుకుంటున్నాయి. కాని ఇప్పుడు ప్రభుత్వం భూమి, భవనాలు ఉచితంగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడంలో అర్ధం ఏమి ఉంటుంది? పైగా ఈ కాలేజీలకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులను కూడా అప్పగిస్తారట.
ఈ సంస్థలు ఉచితంగా సేవలు అందించనప్పుడు ,ప్రభుత్వం వారికి రకరకాల రూపాలలో ఫీజులు చెల్లిస్తున్నప్పుడు ప్రైవేటు పరం చేయవలసిన అవసరం ఏమిటో తెలియదు. ప్రస్తుతం నాలుగు కాలేజీలకు పీపీపీ విదానం అమలు చేస్తున్నా, భవిష్యత్తులో మిగిలిన కాలేజీలన్నిటిని అదే రకంగా అప్పచెప్పనున్నారు. బహుశా పూర్తి అయిన ఏడు కాలేజీలను కూడా అలాగే ఇచ్చేస్తే జగన్ ప్రభుత్వ రంగంలో తీసుకు వచ్చిన ఆశయాన్ని పూర్తిగా నీరుకార్చిన ఘనత కూటమి సర్కార్ కు దక్కుతుంది. ఝార్కండ్ రాజధాని రాంచీలో ఒక ప్రభుత్వ ఆస్పత్రిని ఇదే విధంగా పీపీపీ అంటూ ప్రైవేటీకరించబోగా ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
ఒడిశా లో గత బీజేడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మెడికల్ కాలేజీలను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేయలేదు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల్లో ప్రభుత్వాలే కొత్త కాలేజీలను నడుపుతున్నాయి. ఇవన్ని ఎందుకు! ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలలో ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేస్తోంది కదా! ఎందుకు వారు ప్రభుత్వరంగంలోనే నెలకొల్పుతున్నారు? కొత్తగా కేంద్రం ఇస్తున్న పదివేల మెడికల్ సీట్లను ప్రభుత్వ కాలేజీలకే ఎందుకు ఇస్తున్నారు? ఏపీ ప్రభుత్వం రోడ్లు, పోర్టులు ప్రైవేటైజ్ చేయడం లేదా అని పిచ్చి వాదన చేస్తోంది. రోడ్లకు, ఓడరేవులకు వైద్యరంగానికి పోలిక పెట్టడం అంటే ప్రజారోగ్యంపైన, పేదల వైద్యంపై చులకన భావం ఉన్నట్లు అనిపించడం లేదా?
ఏది ఏమైనా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకు రాలేకపోయిన చంద్రబాబు నాయుడు, తనకంటే చిన్నవాడైన వైఎస్ జగన్ తీసుకు వచ్చిన మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటైకీరణకు దిగుతుండడం శోచనీయం. ఈ నేపథ్యంలోనే జగన్... బుద్ది జ్ఞానం ఉన్నవారెవరైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ కింద ప్రైవేటు వారికి అప్పగిస్తారా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక వీటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ప్రజల కోసం జగన్ సంపద సృష్టిస్తే,, ఆ సందపను చంద్రబాబు ప్రైవేటువారికి ధారాదత్తం చేయడం సరైనదా? ఇదేనా చంద్రబాబు చెప్పే విజన్?
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత