విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్సెస్ తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్!
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్సెస్ ఉప సభాపతి రఘురామ కృష్ణమరాజు!
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ అనంతపురం పోలీసులు!
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి ఈ పరిణామాలన్నీ టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వం అంతర్గత వ్యవహారాలుగా చూడలేము. ఈ రచ్చ పుణ్యమా అని అనేక అవినీతి, అక్రమ వ్యవహారాలు ప్రజల దృష్టికి వచ్చాయి. జూద శిబిరాలకు సంబంధించి ఒక డీఎస్పీపై చర్య తీసుకునే విషయమై పవన్, రఘురామ కృష్ణమరాజులు మాటమాటతో వీధికెక్కితే.. జేపీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై నోరు పారేసుకుని బజారుకెక్కారు. ఇవన్నీ ఒకవైపున ఉంటే.. నెల్లూరు జిల్లా నేత, టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర బ్రెయిన్ డెడ్ అయిన ఒక నేత ఆస్తులను తనవారి పేరుతో ఏకంగా రిజిస్టర్ చేయించుకున్నారట! కూటమి నేతల గుణగణాలకు, అధికారంలోకి వచ్చిన తరువాత వారు చేస్తున్న దందాలకు ఇవి మచ్చుతునకలు మాత్రమే. ఈ మకిలి ప్రభుత్వానికి అంటకుండా ఉండాలంటే అధికారులు తగిన చర్యలు తీసుకునేలా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఉంది. మరి.. ఆయన పట్టించుకుంటారా? లేక యధావిధిగా డైవర్షన్ పాలిటిక్స్ ఆడతారా? వేచి చూడాలి మరి.
2024లో అధికారంలోకి వచ్చింది మొదలు టీడీపీ సహా కూటమి నేతలు చాలామంది రకరకాల అక్రమాలు, అనైతిక కార్యక్రమాల్లో చిక్కుకుపోయిన దాఖలాలు బోలెడున్నాయి. పార్టీ, ప్రభుత్వం జనం దృష్టిలో పలచన అవుతుంది అనుకున్న ప్రతిసారి చంద్రబాబు ఏదో ఒకలా విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు. నకిలీ మద్యం కేసు నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను అరెస్ట్ చేయడం తాజా ఉదాహరణ. ఈ తంతు ఒకపక్క నడుస్తున్న సమయంలోనే టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అవినీతి అంటు కొన్ని ఆధారాలు బయటపెట్టారు. కానీ... చంద్రబాబు నిమ్మకు నీరెత్తలేదు! బహుశా అందరూ అనుకుంటున్నట్టు చంద్రబాబుకు ప్రభుత్వం, పార్టీ రెండింటిపై పట్టు నిజంగానే తగ్గిందేమో! నిజానికి కేశినేని చిన్ని గురించి ఆయన సోదరుడు మాజీ ఎంపీ నాని గతంలోనే చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలకు ముందే ఆయన అవినీతిని ప్రజల ముందు పెట్టారు. కానీ వేర్వేరు కారణాల వల్ల చిన్ని గెలవనైతే గెలిచారు. ఆయన గురించి ప్రజలకు మరింత తెలియడం ఆరంభమైంది. కొలికిపూడి శ్రీనివాసరావు తాజాగా చెప్పిన విషయాలు వాస్తవమైతే జనం మతిపోవల్సిందే. ఎదుటి పార్టీలో ఉన్న వారందరి వ్యక్తిత్వాలపై బురదచల్లే చంద్రబాబు, లోకేశ్‌లు ఇలాంటి వ్యక్తిని ఎలా ఏరికోరి ఎంపీగా చేసుకున్నారన్న ప్రశ్న వస్తుంది. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న చిన్ని అందులో అపార్ట్‌మెంట్లు నిర్మిస్తామని నమ్మబలికి వందకోట్ల రూపాయలకు పైగా వసూలు చేశారట. కబ్జాను గుర్తించిన ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకుందని కొలికపూడి చెబుతున్నారు. దీంతో డబ్బులు చెల్లించినవారు లబోదిబో అంటున్నారట.
చిన్ని అమెరికాలో ఉద్యోగాలిప్పిస్తానని ఒక కన్సల్టెన్సీ పేరుతో వందల మందిని మోసం చేశారని, ఇప్పుడు వారందరూ తాము చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని శ్రీనివాస్ ఆరోపించారు. ఎంపీ అయ్యాక చిన్ని సొంత వర్గం సాయంతో తిరువూరు తదితర చోట్ల ఇసుక, మద్యం, గంజాయి మాఫియాలు నడిపిస్తున్నారని కొలికపూడి ఆరోపిస్తున్నారు. ఆఖరికి తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించేందుకు కూడా చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారని కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలను విడుదల చేశారు. వైసీపీ నేతలు కొందరితోనూ చిన్నికి సంబంధాలు ఉన్నాయని అవినీతి డబ్బుతోనే తిరువూరులో వైసీపీ కౌన్సిలర్లను కొనుగోలు చేశామని కూడా ఎమ్మెల్యే వెల్లడించేశారు.
ఈ అంశాలన్నింటిపై ఇప్పటివరకూ టీడీపీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. కాకపోతే టీడీపీ సోషల్ మీడియాలో మాత్రం కొలికపూడిని విమర్శిస్తూ వ్యాఖ్యలు వచ్చాయి. ఒకప్పుడు అమరావతి ఉద్యమంలో ఉన్న సమయంలో కొలికపూడిని అమరావతి అంబేద్కర్ అని పోస్టు పెట్టిన ఒకాయన, ఇప్పుడు అసలు కొలికపూడికి కోట్ల డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కోచింగ్ సెంటర్ నడుపుకునే కొలికిపూడి 2019 వరకూ వైసీపీలోనే ఉన్నారని, టిక్కెట్ రాకపోయేసరికి అమరావతి ఉద్యమంలోకి వచ్చారని, ఈయన సంగతి తెలియక ఎన్నారైలు చాలామంది చమురు వదలించుకున్నారని ఆరోపించారు. 2019 ఎన్నికలకు ముందు కొలికపూడి వైసీపీలో లేరు కాని, ఒక విశ్లేషకుడిగా టివీ డిబేట్లలో పాల్గొని చంద్రబాబును తీవ్రంగా దుయ్యబట్టేవారు. 2014-19 టర్మ్‌లో టీడీపీ ప్రభుత్వ విదానాలపై ధ్వజమెత్తేవారు. ఆ తర్వాత ఎలా కుదిరిందో కాని చంద్రబాబు పక్కన ప్రత్యక్షమయ్యారు. అమరావతి పేరుతో సాగిన ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. తిరువూరు టీడీపీ టిక్కెట్ సంపాదించుకున్నారు. ఆ రోజుల్లో వైసీపీ అసమ్మతి ఎంపీగా ఉన్న వ్యక్తి ఈయనకు అండగా నిలబడ్డారని ప్రచారం.
చిన్నికి, ఈయనకు ఎక్కడ చెడిందో కాని అనేక విషయాలు బయటకు వచ్చాయి. కేశినేని చిన్ని కూడా కొలికపూడిపై తీవ్రమైన ఆరోపణలే చేశారు. లిక్కర్ స్కామ్ నిందితులు రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డిలతో చిన్నికి సంబంధాలు ఉన్నాయని ఎంపీపై కొలికపూడి ఆరోపణలు చేస్తే, అతడి ఆరోపణలను ఎవరూ నమ్మరని చిన్ని అంటున్నారు. కానీ డబ్బు వసూళ్లకు సంబంధించిన ఆరోపణలపై చిన్న ఏమీ వివరణ ఇచ్చినట్లు కనిపించలేదు. కొంతకాలం క్రితం కొలికపూడి వైసీపీ నేతకు చెందిన కట్టడాన్ని కూల్చివేసిన ఘట్టం పలు విమర్శలకు దారి తీసింది. ఆ తరువాతి కాలంలో చిన్ని వర్గం వారు తిరువూరులో అరాచకాలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తూండేవారు. ఇద్దరి మధ్య రాజీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రయత్నించినా చంద్రబాబు ఒప్పుకోలేదని తానే స్వయంగా హాండిల్ చేస్తానని చెప్పినట్లు సమాచారం.
ఈ వ్యవహారం మొత్తాన్ని క్రమశిక్షణ విషయమన్నట్లు డైవర్ట్ చేశారు. ఆ క్రమశిక్షణ కమిటీ కూడా కొలికిపూడి బహిరంగంగా ఎంపీపై ఆరోపణలు చేయడాన్ని తప్పు పట్టిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొలికిపూడిని సస్పెండ్ చేయవచ్చన్న ప్రచారం జరిగినా ప్రస్తుతం అది సాధ్యం కాకపోవచ్చునని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరి మద్య రాజీ చేసి తూచ్..అబ్బే ఏమీ లేదు.. అని సరిపుచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే కొలికపూడి, చిన్ని పరస్పర ఆరోపణలపై దర్యాప్తు చేయించి, చర్య తీసుకోవాలి. కాని అలా కూటమి ప్రభుత్వం చేస్తుందని ఆశించలేం. ఒక్కటైతే నిజం ఈ రచ్చ పుణ్యమా అని ఎవరు ఏమిటన్నది ప్రజలకు స్పష్టమవుతోంది.
ఇక పవన్, రఘురామ కృష్ణమరాజుల వ్యవహారం.. రాష్ట్రంలోని జూద కేంద్రాల గురించి నివేదిక కోరుతూ పవన్ ఏకంగా డీజీపికి లేఖ రాశారు. అధికారం ఉందా? లేదా? అన్నది పక్కనబెడితే పవన్ ఈ లేఖ రాయడం ద్వారా రాష్ట్రంలో జూదం ఎంత విచ్చలవిడిగా సాగుతోందో చెప్పకనే చెప్పారు. కానీ... డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణమరాజు పేకాట ఏదో సంప్రదాయ క్రీడ అన్నట్లుగా మాట్లాడారని వార్తలు వచ్చాయి.. చంద్రబాబు దీన్నీ సమర్థిస్తారా? మరో సంగతి చెప్పాలి. పవన్ కళ్యాణ్ కోరినట్లు డీఎస్పీపై చర్య తీసుకోలేదు. డీజీపీ కూడా నివేదిక ఇచ్చినట్లు లేరు. జూదశిబిరాల కథ కంచికే అన్నమాట.పోలీసు అమరవీరుల దినం రోజున చంద్రబాబు ఉపన్యసిస్తూ పోలీసులకు స్వేచ్చ ఇస్తున్నామని చెబుతున్న సమయంలోనే తాడిపత్రిలో జేసీ ప్రభాకరరెడ్డి అక్కడి ఎఎస్పీని ఏ రకంగా బెదిరించింది అంతా చూశారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని బింకాలు పోయే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఆయనపై కేసు పెట్టలేకపోయింది? ఇది బలహీనత కాదా?
ఇక నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్ర బ్రెయిన్ డెడ్ అయిన సుబ్బనాయుడు అనే వ్యక్తికి చెందిన సుమారు రూ.200 కోట్ల విలువైన ఆస్తులను రిజిస్టర్ చేయించారన్న కథనం వచ్చింది. ఇది అక్రమాలకు పరాకాష్ట. ఆ రిజిస్ట్రేషన్లు ఎలా చెల్లుతాయో అర్థం కాదు. ఇవి రవిచంద్రకు సంబంధించిన వారెవరివైనా బినామీ ఆస్తులే అయి ఉంటాయని, అందుకే సుబ్బనాయుడు చనిపోతే కష్టం అవుతుందని భావించి ఇలా చేసి ఉండవచ్చని కొందరి వాదనగా ఉంది. మొత్తంమీద చంద్రబాబు ఆద్వర్యంలో కూటమి ప్రభుత్వం మూడు అక్రమాలు, ఆరు అవినీతి దందాలుగా కళకళలాడుతోందా?
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


