కూటమి పాలనలో విద్య, వైద్య రంగాలు సర్వనాశనం అయ్యాయి
వైఎస్ జగన్ తీసుకొచ్చిన సంస్కరణలను పూర్తిగా పక్కనపెట్టేశారు
ప్రభుత్వ వైఫల్యాలతోనే ఆలయాల్లో అమాయక భక్తులు చనిపోతున్నారు
స్వార్థం, దోపిడీ ఆలోచనలున్న వ్యక్తి పాలన వల్లే ఈ వరుస దుర్ఘటనలు
2027లో మళ్లీ వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర జరుగుతుంది
సంచలన ప్రకటన చేసిన మాజీ మంత్రి పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడిందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలు పెట్టి ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యాలయ ఇన్‌చార్జి లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ 341 రోజులపాటు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి.. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలగుండా 134 నియోజకవర్గాల్లో అన్నివర్గాలకు చెందిన లక్షలాది మందిని పలకరించారని చెప్పారు. పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో తనకు ఎదురైన అనుభవాలను, ప్రజల ఆకాంక్షలను వివరిస్తూ వాటికి తాను ఏం చేయబోతున్నానో వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు వివరించడమే కాకుండా అధికారంలోకి రావడంతోనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజా పాలన అంటే ఇలా ఉండాలి అనే విధంగా ట్రెండ్ సెట్ చేశారని పార్టీ నాయకులు తెలియజేశారు.
సమాజంలో ఉన్న ఆర్థిక, సామాజిక అసనమానతలు తొలగించేలా నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించడమే మార్గంగా భావించి ఆ రంగాల్లో వినూత్న మార్పులు తీసుకొస్తే.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వాటిని పూర్తిగా సర్వనాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దురహంకార, ప్రజా వ్యతిరేక అవినీతి పాలనకు వ్యతిరేకంగా 2027నుంచి వైఎస్ జగన్ మరోసారి పాదయాత్ర చేస్తారని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పేర్ని నాని, సాకె శైలజానాథ్, మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, మురుగుడు హనుమంతరావు, వరుదు కళ్యాణి, రుహుల్లా, వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాదయాత్ర సాహసోపేత నిర్ణయం: మాజీ మంత్రి మేరుగు నాగార్జున
దేశ రాజకీయ చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు ఇది. వైయస్ జగన్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం రాష్ట్ర చరిత్రను మార్చేసింది. తన పాదయాత్ర ద్వారా అడుగడుగునా అన్ని వర్గాల వారిని కలిసి ఆప్యాయంగా పలకరిస్తూ నేనున్నానని హామీ ఇచ్చారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ తన ఐదేళ్ల పాలనలో అమలు చేసి పాలనలోనూ దిక్సూచిగా నిలిచారు.
మళ్లీ జగన్ ప్రజా పాలన వస్తుంది: మాజీ మంత్రి సాకె శైలజానాథ్
ప‌్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజల కష్టాలను, ఆకాంక్షలను దగ్గర్నుంచి చూసిన పార్టీ అర్టీ అధ్యక్షులు వైయస్ జగన్, వాటికి పరిష్కారాలను వెతుకుతూ ఆసాంతం ముందుకుసాగారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే లక్ష్యంగా హామీలు గుప్పించి తీరా అధికారంలోకి వచ్చాక ఓటేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వైయస్సార్సీపీ నాయకులను అక్రమ కేసులతో వేధిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైయస్ జగన్ నేతృత్వంలోని ప్రజా పాలన వస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నా.
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు: మాజీ మంత్రి పేర్ని నాని
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్, నిరంతరం ప్రజా శ్రేయస్సు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకుసాగారు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు, వేధింపులు, కేసులు, ఒత్తిళ్లు ఎదురైనా ఏనాడూ వెనకడుగు వేయలేదు. ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా ప్రజల ఆకాంక్షలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేశారు. తన 3,648 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా 2,516 గ్రామాల ప్రజలను పలకరించి వారి ఆకాంక్షలను స్వయంగా తెలుసుకున్నారు. ఆప్యాయమైన తన పలకరింపు, చిరునవ్వుతో ప్రతి గుండెను తాకారు.
చిన్నారులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, రైతులు, ఆటో డ్రైవర్లు, లాయర్లు, వృత్తి పనులు చేసుకునే కార్మికులు, కౌలు రైతులు.. ఇలా అన్ని వర్గాలను పలకరించి అక్కున చేర్చుకున్నారు. వారి కష్టాలను విని తానొస్తే ఏం చేయబోయేది వివరించారు. 124 బహిరంగ సభల ద్వారా పాదయాత్రలో తాను చూసిన అంశాలను, తన అనుభవాలను వివరించడంతోపాటు ప్రజాభిలాషకు అనుగుణంగా అధికారంలోకి వస్తే ఏం చేయబోయేది కూడా ఎప్పటికప్పుడు స్పష్టంగా చెబుతూ వచ్చారు. 55 ఆత్మీయ సమ్మేళనాల ద్వారా కుల వృత్తులను బతికించడానికి ఏం చేయాలనే దానిపై కుల సంఘాలతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకున్నారు.
వైద్య విప్లవం తెచ్చిన ఘనత జగన్‌దే..
సింగిల్‌గా పోటీ చేసి 151 స్థానాల్లో భారీ విజయం నమోదు చేయడమే కాకుండా ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించారు. ప్రజా ప్రభుత్వం ఎలా ఉంటుందో తన పాలన ద్వారా చూపించారు. సమాజంలో వెనుకబాటుకు కారణం నిరక్ష్యరాస్యత అని గ్రహించి రాష్ట్రంలో విద్యావిప్లవం తీసుకొచ్చారు. ఖరీదైన కార్పొరేట్ వైద్యం చేయించుకునే క్రమంలో అప్పులపాలై కుటుంబాలు చితికిపోవడమో లేదా వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు మార్చాలని వైద్య విప్లవం తీసుకొచ్చారు. విద్య, వైద్య రంగాల్లో నాడు-నేడు కార్యక్రమం చేపట్టి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. పేదవాడికి వైద్యం మరింత చేరువ చేయాలని తపించి తన ఐదేళ్ల పాలనలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించి 7 కాలేజీలను పూర్తి చేసిన ఘనత జగన్‌కే దక్కుతుంది.
ఢిల్లీలో నాటి కేజ్రీవాల్ ప్రభుత్వం 800 స్కూల్స్‌ను పదేళ్లలో మార్చి చూపిస్తే, వైఎస్ జగన్ హయాంలో (కరోనాతో రెండేళ్లు పోయినా) మూడేళ్లలో 16 వేల పాఠశాలలను కార్పొరేట్‌కి దీటుగా తీర్చిదిద్దారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ బడుల్లో సీట్ల కోసం రికమండేషన్ చేయాల్సిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యేలను కోరారంటే ఎంతగొప్పగా తీర్చిదిద్దారో అర్థం చేసుకోవచ్చు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బడులను నాశనం చేశారు. ఇంగ్లిష్ మీడియం రద్దు చేశారు. వైఎస్ జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ధన దాహంతో ప్రైవేటుపరం చేస్తున్నాడు. వైద్య విద్య చదవాలన్న పేదవిద్యార్థుల ఆశలకు గండి కొట్టాడు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. పెత్తందారీ విధానాలతో పేదలకు విద్య, వైద్యం దూరం చేస్తున్నారు. ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు రాష్ట్ర ప్రజలంతా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలను బలితీసుకుంటున్నది చంద్రబాబే..
మోంథా తుపాన్‌తో దెబ్బతిన్న పొలాలను పరిశీలించి ప్రభుత్వాన్ని నిలదీసి రైతులకు అండగా నిలబడాలని వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటనకు వెళితే.. ఎవర్నీ చంపకుండా రావాలంటూ నారా లోకేశ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సభలు, పబ్లిసిటీ స్టంట్ల ద్వార అమాయకుల ప్రాణాలను బలి పెట్టే లక్షణం చంద్రబాబుదని మర్చిపోయినట్టున్నాడు. ఎన్నిలకు ముందు చంద్రబాబు నిర్వహించిన కందుకూరు సభలో ఏడుగురు, గుంటూరు సభలో ముగ్గుర్ని పొట్టనపెట్టుకున్నాడు. గుంటూరులో చీరల పంపిణీ పేరుతో పేదలను బలితీసుకున్నాడు.
కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాల్లో తొక్కిసలాటలు జరిగి దేవుడ్ని చూడ్డానికి వచ్చిన భక్తులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సింహాచలం గుడిలో గోడ కూలి ఏడుగురు, తిరుపతిలో 9 మంది చనిపోయారు. ఏకాదశి రోజున కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దర్శనం కోసం వెళ్లిన భక్తులు తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు. దీన్ని ప్రైవేటు ఆలయం అని చెప్పి తప్పించుకోవడం సిగ్గుచేటు. శాంతిభద్రతల శాఖను నిర్వహించే చంద్రబాబు కనీస బాధ్యత తీసుకోలేదు. చేతకానివారు, అవినీతిపరులు, తప్పుడు ఆలోచనలు ఉన్నవారు అధికారంలో ఉంటే ప్రజలకు శాపాలుగా మారతాయని చెప్పడానికి ఈ వరుస దుర్ఘటనలే ఉదాహరణలు.
వైఎస్ జగన్ ఉద్దేశించి మాట్లాడుతున్న నారా లోకేశ్.. మోంథా తుపాన్‌తో రైతులు నష్టపోయి కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఆయన మాత్రం ముంబైలో కుటుంబంతో కలిసి క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్ చేశాడు. నేనే గెలిపించానని ప్రచారం చేసుకుంటున్నారు. రైతులు అల్లాడిపోతుంటే అమిత్‌షా కొడుకుతో ఫొటోలు తీసుకుని ప్రచారం చేసుకోవడం గొప్ప అనుకోవడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. ఈరోజు 8 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర స్ఫూర్తితోనే రాబోయే రోజుల్లో 2027 నుంచి మళ్లీ మరోసారి ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం అవుతుంది. మళ్లీ ప్రజలందర్నీ నేరుగా పలకరించి అక్కున చేర్చుకుంటారు.


