చంద్రబాబు మంచి చేయకపోగా.. చెడు చేస్తున్నారు: వైఎస్‌ జగన్‌ | YS Jagan Key Comments With Students Over CBN Govt Issues | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మంచి చేయకపోగా.. చెడు చేస్తున్నారు: వైఎస్‌ జగన్‌

Nov 6 2025 1:58 PM | Updated on Nov 6 2025 3:21 PM

YS Jagan Key Comments With Students Over CBN Govt Issues

సాక్షి, తాడేపల్లి: గూగుల్‌ విషయంలో చంద్రబాబు క్రెడిట్‌ చోరీ చేశాడని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. మెడికల్‌ కాలేజీల విషయంలో చంద్రబాబు మంచి చేయకపోగా.. చెడు చేస్తున్నారని అన్నారు. అలాగే, సమాజంలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని గుర్తు చేశారు. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలని సూచించారు.

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ గురు­వారం పార్టీ విద్యార్థి విభా­గం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ ని­యో­జకవర్గాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలపై వైఎస్‌ జగన్‌ చర్చించారు. అనంతరం వారితో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..‘కల్మషం లేని రాజకీయ వ్యవస్థ మీ దగ్గర నుంచే ప్రారంభం అవుతుంది. మంచి రాజకీయాలకు బీజం విద్యార్థి దశలోనే పడుతుంది. మీరంతా జెన్‌ -Z తరంలో ఉన్నారు. భావి తరానికి మీరంతా దిక్సూచీ. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలి. పలానా వాడు మన రాజకీయ నాయకుడు అని కాలర్‌ ఎగరేసేకునేలా మనం ఉండాలి. మనలో ఆ గుణాలను, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి. ఈ రాష్ట్రం మనది కాబట్టి.. ఈ రాష్ట్రం బాగుండాలని మనమంతా కోరుకుంటున్నాం. ఉద్యోగాలు సంపాదించుకునే పరిస్థితిలోకి ప్రతి విద్యార్థీ వెళ్లాల్సిన అవసరం ఉంది.
కాని, ఆ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా?.

ప్రపంచంతో పోటీ పడాలి.. 
ఒక్క రాత్రిలోనే ఇవన్నీ జరగవు. ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలి. ఒక నాయకుడు తన విజన్‌లో భాగంగా ఒక అడుగు వేస్తే, అవి ఫలితాలు ఇవ్వడానికి 10-15 సంవత్సరాలు పడుతుంది. అలాంటి ఆలోచనలు మనం చేయాలి. అది రియాల్టీలోకి వచ్చినప్పుడు భవిష్యత్తు తరాలు మారుతాయి. సమాజంలో విద్యార్థులుగా మీ పాత్ర అత్యంత కీలకం. మన ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థలో గొప్ప మార్పులు తీసుకు వచ్చాం.
కేజీ నుంచి పీజీ వరకూ మంచి చదువులు ఉండాలని భావించాం. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించేలా మన ప్రభుత్వంలో ఆలోచనలు చేశాం.
స్కూలుకు వెళ్లే పిల్లలకు ఓట్లు లేవని, ఏ రాజకీయ పార్టీ కూడా వారి గురించి పట్టించుకోదు. కాని, రేపు భవిష్యత్తును నిర్దేశించేది వాళ్లే. అందుకని స్కూళ్ల నుంచే మనం విప్లవాత్మక చర్యలు తీసుకు వచ్చాం. ప్రైవేటు స్కూల్స్‌తో పోటీపడేలా ప్రభుత్వ స్కూల్‌లను తీర్చిదిద్దాం. సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం ప్రారంభించాం. ఆ స్థాయి విద్యను మన పిల్లలకు మనం ఇవ్వాలి.

YSRCP విద్యార్ధి విభాగం లీడర్లతో వైఎస్ జగన్ సమావేశం

6,200 కోట్లు బకాయిలు.. 
మనకు పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు, మన పోటీ ప్రపంచంతోనే. ఎడెక్స్‌తో ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సులు ఇప్పించాం. ప్రపంచంలో అత్యుత్తమ యూనివర్శిటీలకు చెందిన కోర్సులు అందుబాటులోకి ఇచ్చాం. ఆయా యూనివర్శిటీలు సర్టిఫికెట్లు ఇచ్చేలా చేశాం. డిగ్రీల్లో కొత్త కోర్సులు తీసుకు వచ్చాం. మనం రాక ముందు 257 కాలేజీలకు మాత్రమే నాక్‌ రిజిస్ట్రేషన్‌ ఉంటే 2024 నాటికి 432కి పెరిగాయి. పూర్తి ఫీజు రియింబర్స్‌మెంట్‌ తీసుకు వచ్చాంది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. కేవలం విద్యాదీవెన అనే ఒకే ఒక పథకం కింద రూ.12,609 కోట్లు ఇచ్చాం. వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.20వేలు ఇచ్చాం. చదువుల కోసం అప్పులు పాలు కాకుండా చూశాం. కాని, ఇవాళ అన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు. పిల్లలు చదవకూడదు అనే ఉద్దేశంతో చంద్రబాబు పనిచేస్తున్నారు. ఏడు త్రైమాసికాల నుంచి ఫీజు రియింబర్స్‌మెంట్‌ పెండింగ్‌లో పెట్టారు. ఫీజు రియిబంర్స్‌మెంట్‌లో రూ.4,200 కోట్లు పెండింగ్‌ ఉంది. వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు పెండింగ్‌. మొత్తంగా రూ.6,200 కోట్లు బకాయి పెట్టారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాయకత్వం తీసుకోవాలి.

1.2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.. 
మన ప్రభుత్వ హయాంలో అక్షరాల ప్రభుత్వ రంగంలోనే 6.3 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. 52 వేల మందిని ఆర్టీసీలో రెగ్యులరైజ్‌ చేశాం. హెల్త్‌ అండ్‌ మెడికల్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో కూడా భారీగా ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు ఉద్యోగాలను కోత కోస్తున్నారు. ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో 4.7లక్షల యూనిట్ల ద్వారా 33లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తోడుగా ఉందనే భావన ఎంఎస్‌ఎంఈలకు ఉండేది. క్రమం తప్పకుండా వారికి ప్రోత్సాహకాలు అందేవి. అందుకనే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయి.

చంద్రబాబు చేసిందేంటి?. 
గూగుల్‌ విషయంలో చంద్రబాబు క్రెడిట్‌ చోరీ చేశాడు. అసలు చంద్రబాబు చేసింది ఏముంది?. సింగపూర్‌ నుంచి కేబుల్‌ తీసుకురావడానికి అంకురార్పణ చేసింది వైఎస్సార్‌సీపీ. అదానీ-గూగుల్‌కు 2022లో నోయిడా డేటా సెంటర్‌ అగ్రిమెంట్‌ ఉంది. మనం ఇక్కడ కూడా భూములు ఇచ్చాం, అన్ని ఏర్పాట్లూ జరిగాయి. ఆరోజు అడుగులు వేశాం కాబట్టి ఇప్పుడు గూగుల్‌ వస్తోంది. మూలపేట ప్రారంభించి మనం కట్టుకుంటూ వెళ్లాం కాబట్టి ఇప్పుడు మూలపేట పోర్టు జరుగుతోంది. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చి మనం శరవేగంగా నిర్మాణాలు చేశాం.

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ చంద్రబాబు చేస్తున్న అత్యంత దరిద్రపు పని. మంచి చేయకపోగా, చెడు చేస్తున్నాడు. 2019 వరకూ ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు 12. అప్పటికి చంద్రబాబు ఒక్కటి కూడా తేలేదు. ఐదేళ్లలో కోవిడ్‌ రెండేళ్లు తీసేస్తే, మూడేళ్లలో 17 మెడికల్‌ కాలేజీలు తీసుకు వచ్చాం. ప్రతి జిల్లాకో గవర్నమెంటు మెడికల్‌ కాలేజీ తీసుకు వచ్చాం. 17 కొత్త మెడికల్‌ కాలేజీల వల్ల 2,550 సీట్లు అందుబాటులోకి వస్తాయి. సగం సీట్లు ఉచితం, మిగిలిన సీట్లు తక్కువ రేటుకే అందుబాటులోకి వస్తాయి. మన పిల్లలు ఇక్కడే డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది. మెడికల్‌ కాలేజీలు సీట్లు ప్రారంభం అయ్యాయి. పాడేరు కూడా ఎన్నికల తర్వాత ప్రారంభం అయ్యింది. 800 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

సీట్లు వద్దని లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబు.. 
పులివెందుల కాలేజీకి 50 సీట్లు కేంద్రం ఇస్తే.. వద్దంటూ చంద్రబాబు లెటర్‌ రాశాడు. మిగిలిన 10 కాలేజీలకు రూ.5వేల కోట్లు పెడితే చాలు. ఏడాదికి రూ.వేయి కోట్లు పెట్టినా చాలు. కాని, చంద్రబాబుకు మనసు రాదు. ఆయన పెట్టకపోయినా పర్వాలేదు, అలా వదిలేస్తే మేం వచ్చాక కట్టుకుంటాం. స్కాములు చేస్తూ అమ్మేస్తున్నాడు. ఇలాంటి వాటిపై ప్రశ్నలు వేసి, నిలదీసే బాధ్యత మీది. రాష్ట్రంలో కోటి సంతకాల కార్యక్రమం జరుగుతోంది. మీరంతా చురుగ్గా పాల్గొనాలి. గ్రామస్థాయిలో కూడా విద్యార్థి విభాగం, యూత్‌ విభాగం రావాలి. మీ చేతుల్లోనే భవిష్యత్తు ఉంది. మీరు ఎవర్ని డిసైడ్‌ చేస్తే.. ఆ ప్రభుత్వం వస్తుంది. విద్యార్థి, యువకులకు ఉన్న శక్తి అది. తటస్థులను, భావసారూప్యత ఉన్న వ్యక్తులను కూడా కలుపుకోవాలి. అసెంబ్లీ కేంద్రాల్లో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలు 11 నుంచి 12వ తేదీకి మార్పు జరిగింది. డిసెంబర్‌లో ఫీజు రియింబర్స్‌మెంట్‌పై ఆందోళనలు ఉంటాయి. అంతవరకూ చంద్రబాబుకు సమయం ఇద్దాం అని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement