సాక్షి, అమరావతి: క్రీడాకారులలో ఉన్న ప్రతిభను చంద్రబాబు ప్రభుత్వం గుర్తించలేదు. భారతదేశ సత్తాను చాటిచెప్పిన మహిళా క్రీడాకరిణిపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. వివిధ రాష్ట్రాలు.. క్రీడాకారులకు ప్రోత్సాహకాలతో గౌరవిస్తున్నాయి. ప్రపంచ కప్‌లో 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసిన ఏపీకి చెందిన క్రీడాకారిణి శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం తరుపున ప్రోత్సాహం కరువైంది.
క్రీడాకారిణి రేణుక సింగ్ ఠాకూర్‌కి కోటి రూపాయలు ప్రోత్సాహకం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మధ్యప్రదేశ్‌కి చెందిన క్రాంతిగౌడ్‌కి కోటి రూపాయలు ప్రోత్సాహకాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ తరపున శ్రీచరణి ప్రతిభను గుర్తించకపోవడం పట్ల క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత మహిళా కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్, ఆల్ రౌండర్ అమన్‌జోత్ కౌర్‌లకు రూ.11 లక్షలు రూపాయలు చొప్పున పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రోత్సాహకం ప్రకటించింది.
శ్రీచరణిని ఎందుకు అభినందించడం లేదు?: సతీష్‌రెడ్డి
శ్రీచరణిని ఎందుకు అభినందించడం లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీశ్ కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘ముంబైలో మహిళల క్రికెట్ వరల్డ్ కప్ చూడ్డానికి నారా లోకేశ్ వెళ్లివచ్చాడు. వారితో గతంలో నారా లోకేశ్ మాట్లాడిన ఫొటోలు, వీడియోలు ముందుపెట్టి ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే వరల్డ్ కప్ గెలిచారని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. ఇదే నిజమైతే కడప బిడ్డ నల్లపురెడ్డి శ్రీచరణి రెడ్డికి ఎందుకు ప్రోత్సాహకాలు ప్రకటించలేదు?’’ అని సతీష్‌రెడ్డి నిలదీశారు.
‘‘గతంలో క్రీడల్లో ప్రతిభ కనబరిచిన పీవీ సింధు, హారిక, పుల్లెల గోపీచంద్ వంటి వారికి ఇళ్ల స్థలాలు, నగదు ప్రోత్సాహాలతో సత్కరించిన చంద్రబాబు, ఇప్పుడు శ్రీచరణిని ఎందుకు అభినందించలేకపోతున్నారో చెప్పాలి. వారందరికీ ఒక న్యాయం, శ్రీచరణికి ఒక న్యాయమా? దేశంలోని ఇతర రాష్ట్రాలు తమ క్రీడాకారులను సత్కరిస్తుంటే శ్రీచరణిని కనీసం అభినందించడానికి చంద్రబాబుకి మాత్రం మనసు కలగడం లేదు’’ అని సతీష్‌రెడ్డి మండిపడ్డారు.


