సాక్షి, తిరుమల: ఏఐ టెక్నాలజీతో శ్రీవారి దర్శనాలు సాధ్యం కాదన్నారు మాజీ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. బీఆర్ నాయుడుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ అని ఎద్దేవా చేశారు. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు దారుణంగా విఫలమయ్యారు. తిరుమలలో బ్లాక్ టికెట్ల దండా నడుస్తోందని భూమన ఆరోపించారు.
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్ నాయుడు నేతృత్వంలో తిరుమల కొండపై అనేక అరాచకాలు జరుగుతున్నాయి. ఆయన భక్తులకు అందించిన ప్రత్యేక సేవలు ఏంటి?. రెండు గంటల్లో శ్రీవారి దర్శనం అవుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ నాయుడు తన కార్యాలయంలోనే సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. టీటీడీ చైర్మన్‌గా ఆయన దారుణంగా విఫలమయ్యారు. వీసీ సదాశివమూర్తిని తిరుమల కొండపై బీఆర్ నాయుడు బండ బూతులు తిట్టారు. బీఆర్ నాయుడుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ. తప్పులు ఎత్తి చూపడం నా బాధ్యత.. తప్పులు సరిచేసుకోవడం ఆయన బాధ్యత. వైఎస్సార్‌సీపీ హయాంలో అనేక ఆలయాలను నిర్మించాం అని చెప్పుకొచ్చారు.
చేతలకు చెల్లుచీటి, కోతలకు ధనుష్కోటి..
బీఆర్ నాయుడు ఏడాది పాలన.. అసమర్థుని జీవన యాత్ర లాగా అమోఘంగా ఉంది. చేతలకు చెల్లుచీటి, కోతలకు ధనుష్కోటి, కన్యాశుల్కం గిరీశంకు తలదన్నే విధంగా కోతలు కోస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందే పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు. టీటీడీపై కనీస పరిజ్ఞానం లేదు, ఏ అధికారి మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఈ అసహనాన్ని వైఎస్సార్ కాంగ్రెస్‌పై దాడి చేస్తూనే ఉన్నారు.. ఉసిగొల్పుతున్నారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయారు, 54 మంది గాయపడ్డారు. శ్రీవాణి ట్రస్టును రద్దు చేసేస్తాం అని చెప్పారు, ఆ తర్వాత మీకు జ్ఞానోదయం అయ్యింది. మా పాలనలో 918 కోట్లు వచ్చాయని చెప్పుకున్నారు, అందులో 500 కోట్లు శ్రీవాణి నిధులే. అధికారులను బెదిరిస్తున్నారు. భగవంతుడు ఇచ్చే కానుకలు మీ గొప్పతనంగా చెప్పుకోవడం మీ అసమర్థతకు నిదర్శనం. మీ పాలనలో భక్తులకు ఒరిగిందేమీ లేదు. అన్నదానంలో వడ చేర్చి డీజే సౌండ్‌కు మించి ప్రచారం చేశారు.
తిరుమలలో బ్లాక్ టికెట్స్ దందా..
వేల కోట్లు విలువైన టీటీడీ స్థలం ప్రైవేట్ ముంతాజ్ హోటల్‌కు కట్టబెట్టారు. టీటీడీ స్థలం ఏదైనా పవిత్రమైన స్థలమే. మీ పాలనలో మద్యం మత్తులో తిరుగుతున్నారు. మీ పాలనలో కాళ్లకు చెప్పులు వేసుకుని మహా ద్వారం వరకు వచ్చారు. పది రోజులు పాటు వైకుంఠ ఏకాదశి దర్శనం రద్దు చేయాలని కుట్రలు చేశారు. వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తొలగించే అధికారం పాలకమండలికి లేదు. భక్తులకు మీరు చేసిన సేవ ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10వేల ఆలయాలు నిర్మాణం చేస్తున్నాం అంటున్నారు. మేం చేసిన అభివృద్ధి మీరు కొనసాగిస్తున్నారు. తిరుమలలో బ్లాక్ టికెట్స్ దందా కొనసాగుతోంది. తిరుమలలో విజిలెన్స్ అధికారులు దందా కొనసాగిస్తున్నారు. బ్రాహ్మణ ద్వేషిగా మిమ్మల్ని ప్రజలు చూస్తున్నారు.
భక్తులకు ఒరిగిందేమీ లేదు..
టీటీడీలో డిప్యూటీ ఈవోలు బదిలీలు అని చెప్పి ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారు. స్వామి వారి ప్రథమ సేవకుడిగా ఉంటూ మాపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. మీరు చైర్మన్‌గా ఉండటం వల్ల భక్తులకు ఒరిగిందేమీ లేదు. స్విమ్స్ పూర్తిగా నిర్వీర్యం జరిగింది. టీటీడీలో ఏసీబీ అధికారులు విచారణకు ఆదేశించడం అంటే టీటీడీ విజిలెన్స్ అధికారులపై నమ్మకం లేకపోవడమే అవుతుంది. ఐపీఎస్ స్థాయి, గెజిటెడ్ స్థాయి అధికారులను అవమానించడమే అవుతుందని అన్నారు.


