పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు 'రేషన్ స్మగ్లర్లు' | Coalition gangs are stealing and selling subsidized rice | Sakshi
Sakshi News home page

పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు 'రేషన్ స్మగ్లర్లు'

Dec 22 2025 4:12 AM | Updated on Dec 22 2025 4:12 AM

Coalition gangs are stealing and selling subsidized rice

నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని సివిల్‌ సప్లైస్‌ గోదాములో రేషన్‌ బియ్యం స్వాహాను పరిశీలిస్తున్న అధికారులు(ఫైల్‌)

చౌక బియ్యం కాజేసి అమ్ముకుంటున్న కూటమి ముఠాలు 

బియ్యం పాలిషింగ్, రీ ప్యాకింగ్‌ చేసి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి

ఏడాది దందా రూ. వేల కోట్ల పైమాటే.. 

నియోజకవర్గాల వారీగా వాటాలేసుకుని మరీ పంచేసుకున్నారు 

బఫర్‌ గోడౌన్లు, ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి నేరుగా మిల్లులకు 

రాత్రిళ్లు పోర్టులకు సమీపంలోని మిల్లులకు తరలుతున్న బియ్యం 

విశాఖ, కాకినాడ పోర్టులతో పాటు తమిళనాడు, కర్ణాటకకు తరలింపు 

చంద్రబాబు బినామీ మంత్రి వియ్యంకుడి నేతృత్వంలో గోదావరి జిల్లాల్లో దందా 

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ నియోజకవర్గంలో పేట్రేగిపోతున్న జనసేన నేత 

ప్రజాపంపిణీ వ్యవస్థను భ్రష్టు పట్టించిన చంద్రబాబు సర్కార్‌.. నాణ్యమైన సార్టెక్స్‌ బియ్యం స్థానంలో నాసిరకం..

ఇంటింటికీ ఉచిత రేషన్‌ సరఫరా ఎత్తేసి.. అరకొరగా పంపిణీ.. నచ్చినవాళ్లకే రేషన్‌.. నచ్చనివాళ్ల కార్డులు కట్‌..  

పేదలు బియ్యం అడిగితే కార్డులు రద్దు చేస్తామని బెదిరిస్తున్న డీలర్లు 

ఇంటింటికీ ఈ–పాస్‌ మెషిన్లతో వెళ్లి బలవంతంగా వేలిముద్రలు 

పదోపరకో చేతిలోపెట్టి బియ్యం ఎగవేత  

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌కు కేరాఫ్‌గా మారింది. గొల్లప్రోలు మండల కేంద్రంగా జనసేన నేత ఏలేరు ప్రాజెక్టు వైస్‌ చైర్మన్‌ ఊటా నానిబాబు ఆధ్వర్యంలో యథేచ్ఛగా రేషన్‌ స్మగ్లింగ్‌ సాగుతోంది. పేదల బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి వివిధ బ్రాండ్ల పేరుతో 26 కేజీల బస్తాను రూ.1600కు విక్రయిస్తున్నారు. 

ఎక్కువ మొత్తం బియ్యం కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిస్తున్నారు. ఇటీవల  కొత్తపల్లి మండలం అమీనాబాద్‌లో బియ్యం కొంటున్న వ్యక్తిని జనసేన పార్టీకి చెందిన వ్యక్తి పట్టుకుని నిలదీస్తే.. అదే జనసేనకు చెందిన నేత ఊటా నానిబాబు నుంచి ఫోన్‌ చేయించి మన వాడే వదిలేయి అని చెప్పించిన సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

సాక్షి, అమరావతి: పేదల బియ్యాన్ని కూటమి పందికొక్కులు బొక్కేస్తున్నాయి. చౌక ధరల దుకా­ణా­లు కేంద్రంగా భారీగా బియ్యం స్మగ్లింగ్‌ దందా సా­గుతోంది. ఎక్కడా ఒక్క వాహనం పట్టుబడదు. ఒక­వేళ అధికారులు అడ్డగించినా.. ఉదయానికి అక్కడ వాహనం ఉండదు.. పట్టుకున్నా బియ్యం ఉండవు.  నాణ్యమైన సార్టెక్స్‌ బియ్యం సరఫరా నిలిపేశారు. నాసిరకం సరఫరా చేస్తున్నారు. అందులోనూ సగా­నికి పైగా బ్లాక్‌ చేసేస్తున్నారు. 

ఇంటింటికీ తిరిగి అందించే వ్యవస్థను నాశనం చేశారు. అరకొర పంపిణీ చేస్తూ అందులోనూ దోచుకుంటున్నారు. ఏడాదికి ఈ దందా రూ. వేల కోట్లకు పైమాటేనని క్షేత్ర­స్థాయిలో పరిశీలనను బట్టి అర్ధమౌతోంది. ప్రతి నెలా వచ్చిన బియ్యాన్ని వచ్చినట్టే పక్కదారి పట్టిస్తు­న్నారు. దీని కోసం రాత్రిళ్లు ప్రత్యేకంగా ‘గ్రీన్‌ చాన­ల్‌’ ఏర్పాటు చేసు­కుని బఫర్‌ గౌడౌన్లు, ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు, చౌక దుకాణాల నుంచి నేరు­గా బినా­మీల మిల్లులకు తరలిస్తున్నారు. 

అక్కడి నుంచి రీసై­క్లింగ్‌ చేసి ఎక్కువ రేటుకు మార్కెట్‌లోకి వదలడంతో పాటు రాచమార్గంలో విశాఖ, కాకి­నాడ, గంగవ­రం పోర్టుల ద్వారా విదేశాలకు ఎగు­మతులు చేస్తూ కోట్లు గడిస్తున్నారు. గోదావరి జిల్లాల రేషన్‌ దందాలో జనసేన నేతలే ముఖ్య­పాత్ర పోషిస్తున్నారు.

బియ్యం అడిగితే కార్డు రద్దు చేస్తాం!
రాష్ట్రంలో 29,793 రేషన్‌ దుకాణాల్లో 1.48 కోట్లు కార్డు­లున్నాయి. వీటి ద్వారా ఏటా 25లక్షల టన్ను­ల బియ్యాన్ని పేదలకు సరఫరా చేయాలి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా వైఎస్సార్‌ సీపీ హయాంలో సార్టెక్స్‌(నాణ్యమైన) బియ్యాన్ని అందించే విధానం తీసుకొచ్చారు. అంటే ఫైన్‌ వెరైటీ­లతో సమానంగా రేషన్‌ బియ్యం ఉంటాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో సార్టెక్స్‌ బియ్యం సరఫ­రాను అటకెక్కించేశారు. క్వాలిటీ పూర్తిగా పడిపో­యింది.  గట్టిగా నిలదీస్తే రేషన్‌ కార్డు రద్దు చేస్తా­మని పేదలను బెదిరిస్తున్నారు. 

ఈ క్రమంలోనే వేల మంది రేషన్‌ డీలర్లపై వైఎస్సార్‌ సీపీ ముద్ర వేసి అక్రమంగా తొలగించారు. వాటిని తమ అనుయా­యులకు కట్టబెట్టి బియ్యాన్ని బొక్కేస్తున్నారు. 29,793 రేషన్‌ దుకాణాల్లో దాదాపు 7వేలకుపైగా దుకాణాలు అసలు డీలర్ల కంటే ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. డీలర్లపై అ­క్రమంగా కేసులు బనాయించి వారిని రేషన్‌ సే­వల నుంచి తప్పించడమే దీనికిప్రధాన కారణం. 

ఈ–పాస్‌ మిషన్లతో ఇంటింటికీ..
బియ్యం పంపిణీలో పారదర్శకత లేదు. ఈ–పాస్‌ మిషన్‌కు, వెయింగ్‌ మిషన్‌కు అనుసంధానం ద్వారా మాత్రమే కచ్చితమైన తూకంతో బియ్యాన్ని ఇవ్వాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ అనుసంధానాన్ని గాలికొదిలేసింది. తూకంలో మోసాలతో లబ్ధిదారుల బియ్యాన్ని కొట్టేస్తున్న పరిస్థితి. దీనికి తోడు లబ్ధిదారులకు దుకాణాల్లో బియ్యం ఇవ్వట్లేదు. ఇంటింటికీ ఈ–పాస్‌ మిషన్లు పట్టుకుని వెళ్లి బలవంతంగా వేలి ముద్రలు తీసుకుని చేతిలో కిలోకు రూ.పదో పరకో పెట్టి వెళ్లిపోతున్నారు. 

ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచే దందా షురూ..
అక్రమ రేషన్‌ దందా ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచే మొదలవుతోంది. వాస్తవానికి లబ్ధిదారుల అవసరా­లకు తగ్గట్టుగా ఏనాడు బఫర్‌ గోడౌన్‌ నుంచి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు బియ్యం రావట్లేదు. వచ్చిన బియ్యం కాస్త ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో తరిగిపో­తోంది. చాలా చోట్ల డీలర్లకు ఇచ్చే ప్రతి బస్తాలో అరకేజీ నుంచి కేజీ వరకు తరుగు ఉంటోంది. దీనికి తోడు గోనె సంచి బరువునకు అరకేజీ అదనంగా ఇవ్వాల్సి ఉండగా పట్టించుకోవట్లేదు. ఈ మొత్తం బియ్యం దొడ్డిదారి పడుతోంది. 

నాయకులకు నెలవారీ కప్పం..
రేషన్‌ అక్రమ రవాణాలో కూటమి నాయకులు కలిసికట్టుగా పని చేస్తున్నారు. ఎక్కడికక్కడ వాటాలు, వంతులు వేసుకుని మరీ పోటాపోటీ దందా చేస్తున్నారు. నియోజకవర్గాల్లో కొందరు డీలర్లు సిండికేట్‌గా ఏర్పడి లబ్ధిదారులకు ఇచ్చే బియ్యాన్ని కాజేస్తూ దొడ్డిదారిన మిల్లులకు తరలిస్తున్నారు.  

బాబు బినామీ బంధువులదే రాజ్యం!
రేషన్‌ అక్రమ సామ్రాజ్యం చంద్రబాబు బినామీ అయిన ఓ మంత్రికి చెందిన బంధువు చక్రం తిప్పు­తున్నాడు. ఏపీ క్యాబినెట్‌లో అత్యంత కీలక పదవి­లో ఉన్న సదరు మంత్రికి చెందిన వియ్యంకుడికి కాకి­నాడ జిల్లాలో ఆగ్రోస్‌ కంపెనీ ఉంది. ఆ మంత్రి బంధువు సిండికేట్‌గా మారి రాష్ట్ర వ్యాప్తంగా అక్ర­మ రేషన్‌ను శాసిస్తున్నారు. విదేశాలకు ఈ బియ్యాన్ని పో­ర్టుల ద్వారా ఎగుమతి చేయించడం, రీసైక్లింగ్‌ ద్వా­­రా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టడం, మళ్లీ ఇదే బి­య్యా­న్ని తిరిగి పీడీఎస్‌లోకి జొప్పించడం.. ఇలా సా­గుతోంది. 

ఈ సిండికేట్‌ విదేశాల్లోని గోడౌన్లలో కోట్ల విలువైన రేషన్‌ బియ్యాన్ని నిల్వ చేసిందని మిల్లర్లు చెప్పుకుంటున్నారు. అక్కడ నిల్వ చేయ­డానికి చోటు­లేకపోవడం వల్ల ఇప్పుడు మిల్లుల్లో నిల్వ చేస్తున్నా­రని, విజిలెన్స్‌ అధికారులు కన్నెత్తి కూడా చూ­డట్లేదని మిల్లర్లు బహిరంగంగానే విమర్శిస్తు­న్నారు.

సీజ్‌ ద షిప్‌ ఓ కుట్ర!
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024–25 ఆర్థిక ఏడాదిలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి ఏకంగా రూ.23,363 కోట్ల విలువైన 59.78 లక్షల టన్నుల బియ్యం ఎగుమతులు జరిగాయి. ఈ ఆర్థిక సంవ­త్సరం తొలి ఆరునెలల్లో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) రూ.­8,500 కోట్ల విలువైన 25లక్షల టన్నుల నాన్‌­బాస్‌మతి బియ్యం విదేశాలకు చేరింది. ఇక్కడ విచి­త్రం ఏమంటే, ఈ దందా కాకినాడ పోర్టుతో పాటు విశాఖ పోర్టుకు పాకింది. ఈ బి­య్యం మొత్తాన్ని ఆఫ్రికా దేశాలకు తరలించేశారు. 

ఇందులో సెనెగల్, టోగో, బెనిన్, గినియా, ఐవరీ కోస్ట్, లైబీరి­యా­లతో పాటు బంగ్లాదేశ్, దక్షిణా­ఫ్రికా, జాంబియా, కా­మె­రూన్, వియత్నాం, అల్జీరి­యా, ఇండోనే­షియా, మడగా­స్కర్, మొరాకో వంటి దేశాలున్నా­యి. వాస్తవానికి బయట రాష్ట్రాల నుంచి ఏపీ ద్వారా విదేశాలకు ఎగుమతయ్యే బియ్యం కూడా ఉంటాయి. అయితే, అవి ఎక్కువగా సన్న రకాలు కావడంతో వాటికి ఆఫ్రికా దేశాల్లో రేటు ఎక్కువగా ఉంటుంది. ఇలా రేషన్‌ బియ్యాన్ని మాత్రమే తక్కువ రేటుకు అందించేందుకు వీలుంటుంది. 

వివిధ జిల్లాల్లో రేషన్‌ దందా ఇలా..
నెల్లూరు టు చెన్నై..
నెల్లూరు జిల్లాలో రేషన్‌ మాఫియా చెలరేగిపోతోంది. అధికార పార్టీ నేతలు నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్‌ కడప, గుంటూరు, తిరుపతి జిల్లాల నుంచి బియ్యం సేకరణ కోసం 16 టర్బో లారీలు కొ­నుగోలు చేశారు. ఇక్కడ పోలీస్, రెవెన్యూ, విజి­లెన్స్‌ అధికారులకు నెలవారీ రూ.లక్షల్లో మా­మూ­ళ్లు చేరిపోతున్నాయి. జిల్లాకు చెందిన దేవస్థానాల బాధ్యతలు చూసే ఓ మంత్రి ముఖ్య అనుచరుడిగా చెలామణి అవుతున్న అనంతసాగరం మండలం వెంగంపల్లికి చెందిన బెట్రెడ్డి మహేష్‌రెడ్డి ఈ రేషన్‌ మాఫియా డాన్‌గా వ్యవహరిస్తున్నాడు. 

ప్రతి నెలా నెల్లూరు జిల్లా నుంచి 9 వేల టన్నుల బియ్యం అక్రమ రవాణా సాగుతోంది. నెల్లూరులోని గుడి­పలి­్లపాడు, బుచ్చిరెడ్డిపాళెంలోని రైస్‌మిల్లులు లీజు­కు తీసుకొని సేకరించిన బియ్యాన్ని పాలిష్‌ పట్టి బ్రాండెడ్‌ బ్యాగుల్లో నింపి చెన్నై పోర్టు ద్వారా విదేశాలకు తరలిస్తున్నారు. ఇందులో బాపట్ల జిల్లా­కు చెందిన టీడీపీ నేత వణుకూరి సుధాకర్‌రెడ్డి, జనసేన నేత వక్కలగడ్డ సుధీర్‌ భాగస్వామ్యం ఉంది. 

ఇక్కడ మాస్టారు మంత్రి అవడంతో ఆయన అ­నుచరుడు పౌరసరఫరాల శాఖలో డైరెక్టర్‌గా చేరి దగ్గరుండి బియ్యం అక్రమ దందా సాగిస్తున్నారు. కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలను డీలర్లుగా పెట్టుకుని మిల్లులను లీజుకు తీసుకుని వెంకటేశ్వరనాయుడు, ప్రసాద్‌నాయుడును ముందు పెట్టి బియ్యం దందా సాగిస్తున్నారు.  

విశాఖ పోర్టు నుంచి తరలింపు...
విశాఖ పోర్టు నుంచి చైనా, ఎమన్, వియ­త్నాం దేశా­లకు ప్రతి నెలా 6వేల కంటైనర్ల బియ్యం ఎగుమతి జరుగుతుంది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత.. 2024–25 లో ఏకంగా 10 లక్షల టన్నుల వరకూ బియ్యం ఎగుమతి జరిగిందని తెలుస్తోంది. గంగవరంలోని అదానీ పోర్టు ద్వారా కూడా ఇటీవల కాలంలో బియ్యం ఎగుమతులు ఎక్కువగానే జరుగుతు­న్నట్లు తెలు­స్తోంది. 

టీడీపీ సానుభూతిపరుడు, సీఎం సామా­జికవర్గానికి చెందిన ఓ కార్గో వ్యాపారి వేర్‌హౌస్‌ల ద్వారా గంగ­వరం పోర్టుకు వెళ్తున్నట్లు సమాచారం. దందా న­డిపిస్తోంది మొత్తం టీడీపీ, జనసేనకు చెందిన నేతలే. విశాఖతో పాటు  భీమిలి, పద్మనా­భం, ఆ­నందపురం, పెందుర్తి మండలాలు  పరిధి­లో సేక­రించిన బియ్యం మొత్తం.. ఆనందపురం మండలంపెద్దిపాలెంలో ఉన్న రైస్‌ మిల్లులకే చేరుతున్నాయి. 

చిత్తూరు టు కర్ణాటక, తమిళనాడు..
చిత్తూరు జిల్లాలో కార్వేటినగరం, నగరి, ఎస్‌ఆర్‌­పురం, జీడీనెల్లూరు, చిత్తూరు, గుడిపాల, తవణంపల్లి, యాదమర్రి, బంగారుపాళ్యం, పలమ­నేరు, పుంగనూరు, చౌడేపల్లి మండలాల్లో అక్రమ రేషన్‌­దందా  నడుస్తోంది. తవణంపల్లి మండలం అర­గొండ ప్రాంతానికి చెందిన అధికార పార్టీకి చెందిన వ్యక్తి రేషన్‌ మాఫియాకు లీడర్‌గా వ్యవహ­రిస్తు­న్నాడు. 

జిల్లా నలుమూలల నుంచి అక్రమ బియ్యం తీసుకొచ్చి కర్ణాటకలోని బంగారుపేటకు తరలిస్తు­న్నారు. అక్కడ పాలిష్‌ చేసే యంత్రాలతో కొత్త బియ్యంగా మార్చి మార్కెట్లోకి విక్రయిస్తున్నారు. పాలసముద్రం, నగరి, గుడిపాల, జీడీనెల్లూరు, మీదుగా చెన్నై పోర్టుకు తరలిస్తున్నారు.

గుంటూరు ఎమ్మెల్యేల కనుసన్నల్లో..
గుంటూరు నగరంలో ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ అనుచరుడు సిద్ధిక్‌ రేషన్‌ మాఫియాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.. ఆర్టీసీ కాలనీలో ఉన్న మిల్లర్‌ నాగేశ్వరరావు ద్వారా రేషన్‌ బియ్యాన్ని రీపాలీష్‌ చేయించి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.  

తాడికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులే రేషన్‌ మాఫియాను ముందుకు నడిపిస్తున్నారు. గత కొంతకాలం వరకు ఫిరంగిపురం మండలానికి చెందిన యువనాయకుడు రేషన్‌ దందా చేస్తుండగా ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ స్థాయి మరో నేత దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. రేషన్‌ దందాలో ఓటీవీ చానల్‌ రిపోర్టర్‌ సోదరుడు భాగమై­నట్లు చెబుతున్నారు.  

తిరుపతి జిల్లాలో డీలర్లతో దందా..
తిరుపతి జిల్లాలో ఎమ్మెల్యేల అండదండలతో రేషన్‌ డీలర్లే వ్యాపారులుగా మారారు. కార్డుదారుల నుంచి 70శాతం బియ్యాన్ని డీలర్లు కొనుగోలు చేస్తున్నారు. వాటిని సన్నబియ్యంగా మార్చి కర్నాటక రాష్ట్రంలోని కేజీఎఫ్‌ ప్రాంతానికి తరలిస్తున్నారు. జిల్లాలో 80శాతం అక్రమ బియ్యాన్ని కర్నాటక రాష్ట్రానికి 15శాతం బియ్యాన్ని తమిళనాడులోని రెడ్‌హిల్స్‌ ప్రాంతానికి, 5 శాతం బియ్యాన్ని నెల్లూరుకు తరలిస్తున్నారు.

ఇంటివద్దకే అందించే వ్యవస్థపై విషం చిమ్మి...
గత ప్రభుత్వం అమలు చేసిన ప్రజారంజక వ్యవస్థలను చంద్రబాబు ప్రభు­త్వం నిలువునా ముంచేసింది. ఇంటి వద్దకే రేషన్‌ అందించే ఎండీయూ వ్యవ­స్థపై విషప్రచారం చేశారు. తమ అవినీతికి అడ్డుగా ఉన్న ఎండీయూ ఆపరేటర్లను తొలగించారు. గతంలో 9,260 ఎండీయూ వాహనాల్లో ఇంటి వద్దకే వెళ్లి, లబ్ధిదారులు కళ్ల ఎదుటే బ్యాగులు తెరచి, ఈ–పాస్, వెయింగ్‌ మిషన్‌ అనుసంధానంతో కచ్చితమైన తూకంతో బియ్యాన్ని అందించేవారు. 

చంద్రబాబు ప్రభుత్వం ఎండీయూ ఆపరేటర్ల ఉపాధిని ఊడగొట్టడంతోపా­టు పేదలను రేషన్‌ దుకాణాల ఎదుట నిలబెట్టింది. ఒకప్పుడు ఇంటి వద్దకే బియ్యం వస్తే..ఇప్పుడు పేదలు రేషన్‌ దుకాణాలకు వెళ్లినా బియ్యం దొరకట్లేదు.

ఉమ్మడి కృష్ణాలో నెలకు రూ.10 కోట్ల దందా..
ఉమ్మడి కృష్ణాజిల్లాలో పార్లమెంట్‌ ముఖ్యనేతకు, నియోజకవర్గ ప్రజా ప్రతి­నిధులకు ప్రతినెలా  భారీగా ముడు­పులు ముట్టజెప్పుతున్నట్టు సమాచారం. రేషన్‌ బియ్యాన్ని రైస్‌ మిల్లులో పాలిష్‌ చేయించి కిలో రూ.50 నుంచి రూ.60 కి కాకినాడ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇలా జిల్లాలో రేషన్‌ మాఫియా ప్రతి నెలా రూ.10­కోట్లకు పైగా సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. 

తిరువూరు, మైలవరం, విజయవాడ తూర్పు, పశ్చిమ నియోజక వర్గాల్లో రేషన్‌ దందా సాగుతోంది. అక్రమ బియ్యం రవాణా కోసం పెద్దిరెడ్డి రామచంద్రరావు అనే వ్యక్తి అన్ని మండలాల్లో అధికార పార్టీ నేతలతో అనుచరులను ఏర్పాటు చేసుకు­న్నారు. బియ్యాన్ని కాకినాడ పోర్టుకు రవాణా చేస్తున్నారు. 

జగ్గయ్యపేటలో నియోజక వర్గ ప్రజా ప్రతినిధి, నందిగామలో కంచికచర్లకు చెందిన టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ ప్రజాప్రతినిధి, అనుచ­రు­లు, పెనమలూరులో నియోజక వర్గ ప్రజా ప్రతినిధి అనుచరులు క్రాంతి కిరణ్, గుడివాడ­లో నియోజక వర్గ ప్రజాప్రతినిధి పేరుతో గిరి అనే వ్యక్తి, పామర్రులో ప్రజా ప్రతినిధి అండతో మాఫియా డాన్‌ గొట్టపు రమేష్‌లు ద్వారా బియ్యం దందా నడిపిస్తున్నారు.

రాష్ట్రంలో రేషన్‌ పంపిణీ..
చౌక దుకాణాల సంఖ్య 29,793
పంపిణీ చేయాల్సిన బియ్యం 25 లక్షల టన్నులు

దందా ఇలా..
కిలో బియ్యం అసలు విలువ    రూ.41
బియ్యానికి బదులు చేతిలో పెడుతున్నది  రూ.10–15 (కిలో)
విదేశాలకు ఎగుమతిచేస్తే   రూ.25–30 (కిలో)
పాలిష్‌ చేసి బ్రాండ్‌ బ్యాగుల్లో నింపితే   రూ.50–60(కిలో)
పక్కదారి పడుతున్న బియ్యం  50% పైనే
రేషన్‌ మాఫియా దందా విలువ   రూ.5వేల కోట్లుపైనే (ఏడాదికి)

రాజకీయ కక్షతోనే డిపో తొలగింపు
ఆనందపురం మండ­లం బంటుపల్లి వారి కళ్లాలు రేషన్‌ డిపోలో గత 28 ఏళ్లుగా పని­చేస్తున్నా. ఏవిధమైన రిమా­ర్కులూ లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అనుకూల వ్యక్తి ఫిర్యాదు ఇచ్చారని, నా డిపోని రద్దు చేశారు. ఇద్దరు లబ్ధిదారులకు చెందిన బియ్యం 50 కేజీలు మరుసటి రోజు ఉదయం తీసుకెళ్లేందుకు నా డిపోలో  ఒక మూలన ఉంచారు. 

లెప్రసీతో బాధపడు­తున్న వ్యక్తికి చెందినవి 30కిలోలు ఉన్నాయి. ఈ బియ్యం ఎక్కువ ఉన్నాయని 6ఏ కేసు నమోదు చేశారు. వారి వద్ద స్టేట్‌మెంట్‌ కూడా తీసుకోలేదు. వెఎస్సార్‌సీపీ సాను­భూతి­పరుడిననే డిపో రద్దు  చేశారు. – బి. సత్య సుమంగళి, బంటుపల్లి వారి కళ్లాలు, ఆనందపురం 

ఓర్వలేక రద్దు చేశారు 
పాతికేళ్లుగా పుల్లూరు పంచాయతీలో రేషన్‌ డీలర్‌గా ఉన్నాను.  కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేసి 6(ఏ) నోటీసులు ఇప్పించారు. నేను హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాను. స్థానిక వీఆర్వో ద్వారా రేషన్‌ షాప్‌ నడిపారు. తర్వాత వారికి అనుకూలమైన వడ్డీపల్లికి మార్చు­కున్నారు. – వేలు నాటారు, రేషన్‌ షాప్‌ డీలర్, పుల్లూరు, ఐరాల మండలం, చిత్తూరు జిల్లా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement