ఈనాడు దుష్ప్రచారంలో మరో విషపు కథనం
కేసులే తప్పుడు కేసులు.. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై పెట్టిన కేసులు
అలాంటి కేసుల్లో విచారణ జాప్యం జరగాలని ఎవరైనా కోరుకుంటారా?
నిజానికి జాప్యం జరగాలని కోరుకుంటున్నది ఎల్లోమీడియానే
వేగంగా విచారణ పూర్తయితే తప్పుడు కేసులని తేలిపోతాయి.. దానిని అడ్డుకోవడానికే ఎల్లో మీడియా కుయుక్తులు
సాక్షిలో పెట్టుబడులు సక్రమమేనని తేల్చిన ఐటీ, ఈడీ ట్రిబ్యునళ్లు
అన్ని కేసులకూ అదేగతి పడుతుందని ‘ఈనాడు’ భయం
అందుకే తప్పుడు కథనాలతో తైతక్కలు
రామోజీరావు బతికి ఉన్నన్నాళ్లూ మార్గదర్శి కేసులో తప్పు జరగలేదన్నారు..
మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసులో రామోజీ ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని తేల్చిన ఆర్బీఐ
రామోజీ చనిపోయిన తర్వాత ఆ కేసులకు సంబంధంలేదని వాదించిన ఆయన కుటుంబం
వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడం, కోర్టులను తప్పుదోవ పట్టించడం రామోజీకే చెల్లు
సాక్షి, అమరావతి: వాస్తవాలను వక్రీకరిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విషం చిమ్మడంలో తనకు తానే సాటి అని ‘ఈనాడు’ మరో మారు చాటుకుంది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అంశాన్నీ వక్రీకరిస్తూ మళ్లీ మొదటికొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసులు అంటూ తప్పుడు కథనాన్ని అచ్చేసింది.. నిజానికి జగన్‌పై కేసులు వేసింది ఎవరు? కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై రాజకీయ కక్షతో జగన్‌ను రాజకీయంగా అణచివేసేందుకు వేసిన అక్రమ కేసులు. వాటిలో వాస్తవాలు లేవన్నది అందరికీ తెలిసిన విషయమే.
సాక్షి పెట్టుబడులు సక్రమమేనని ఐటీ ట్రిబ్యునల్, ఈడీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులు చూసినా జగన్‌పై ఆరోపణలలో పసలేదని, కేసులు వీగిపోవడం ఖాయమని తెలుస్తుంది. ఎలా చూసినా ఈ కేసులు త్వరగా పూర్తయితే జగన్‌కే లాభం.. ఈ విషయాన్ని చిన్నపిల్లాడినడిగినా చెబుతాడు. 13 ఏళ్లుగా ఎదుర్కొంటున్న వ్యక్తిత్వ హననం నుంచి, దుర్మార్గ పూరితంగా చేస్తున్న దుష్ప్రచారాల నుంచి బైటపడాలని జగన్ కోరుకుంటారా లేక ఇది ఇలా కొనసాగాలని కోరుకుంటారా? కోర్టులో విచారణ త్వరగా పూర్తయి తన నిర్దోషిత్వం లోకానికి వెల్లడి కావాలని, కడిగిన ముత్యంలా కనిపించాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరైనా భావిస్తారు.
అలా జరిగిపోతే తాము కొనసాగిస్తున్న విషప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టాల్సి వస్తుందన్న దుగ్దతోనే ఈనాడు ఈ విషపు కథనాన్ని వండింది. జాప్యం వల్ల జగన్‌కు నష్టం జరుగుతుంటే.. జగన్‌కి ఏదో లాభం జరుగుతున్నట్లు ఈనాడు కథనం. ఈనాడు దొంగ ఏడుపుల గురించి అర్థం చేసుకోలేనంత అమయాకులేం కాదు పాఠకులు.. నిజానికి ఆర్థిక నేరాలకు పాల్పడటం, మోసాలు చేయడం ‘ఈనాడు’ రామోజీరావుకూ ఆయన కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్ల వ్యవహారమే అందుకు తార్కాణం.
ఈనాడును అడ్డం పెట్టుకుని వ్యవస్థలను మేనేజ్ చేయడం, న్యాయవ్యవస్థనూ పక్కదారి పట్టించడం రామోజీరావుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో.. రామోజీరావు బతికి ఉన్నన్నాళ్లూ మార్గదర్శి కేసులో తప్పు జరగలేదన్నారు. ఆయన మరణించాక.. ఆయన కుటుంబ సభ్యులు ప్లేటు ఫిరాయించి.. ఆయన మరణించారని.. ఆయన చేసిన తప్పులకు తమకు సంబంధం లేదంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను మేనేజ్ చేసుకుని ఆ కేసును కొట్టేయించుకోవడం కళ్లారా చూశాం.
12 లక్షల సర్క్యులేషన్‌తో, అధునాతన ప్రింటింగ్ టెక్నాలజీతో అత్యధిక ఎడిషన్లతో వెలువడిన సాక్షి షేర్ రూ. 350 ఉండడం కుంభకోణం అంటూ రాగాలు తీసిన రామోజీరావు.. అదే ఈనాడు రూ. 100 విలువైన షేర్‌ను రూ.5.28లక్షలు చేసి అమ్ముకోవడం మాత్రం సక్రమమేనట. నిజానికి ఆ సమయంలో ఈనాడు రూ.1,800 కోట్ల నష్టాలలో ఉంది. ఇలా గురివింద రామోజీరావు ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కథనాలతో విషం వెదజల్లడం ఐదు దశాబ్దాల ఈనాడు చరిత్ర చూసినవారికెవరికైనా తెలుస్తుంది.
అక్రమకేసులు.. వ్యక్తిత్వ హననం..
సీబీఐ కోర్టు జడ్జి బదిలీ కావడం జగన్‌కు ఏం సంబంధం? దీనిని సాకుగా చేసుకుని వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఈనాడు బురదజల్లింది.. జడ్జి బదిలీ వల్ల వైఎస్ జగన్‌కు ప్రయోజనం చేకూరుతుందనే కోణంలో వాస్తవాలను అడ్డగోలుగా వక్రీకరిస్తూ విషం చిమ్మింది.. విచారణ జరిగితే.. కేసులు వీగిపోతాయని.. వైఎస్ జగన్ నిర్దోషిగా బయటపడతారని, దాంతో.. ఇన్నాళ్లూ తాము చేసిందంతా దుష్ప్రచారమేనన్నది బట్టబయలు అవుతుందన్నది చంద్రబాబుకు, ఎల్లో మీడియా భయం.
అప్పుడిక వైఎస్ జగన్ పై దుష్ప్రచారం చేసేందుకు అ్రస్తాలే ఉండవన్నది ఆ దుష్టచతుష్టయం భయం. అందుకే వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వైఎస్ జగన్‌పై నమోదైన అక్రమకేసుల విచారణను ప్రభావితం చేస్తున్నారనే దుర్మార్గపు కథనాలను అల్లుతున్నారు. మహానేత వైఎస్ అకాల మరణాన్ని తట్టుకోలేక వందలాది మంది గుండె పగిలి అసువులు బాశారు.
గుండె పగిలి మరణించిన వారి కుటుంబ సభ్యులను వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఓదార్చుతానని నల్లకాలువలో నిర్వహించిన సంస్మరణ సభ సాక్షిగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ హూంకరించినా ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్ ఓదార్పుయాత్ర చేపట్టారు. ప్రజలు చూపించిన అభిమానం చూసి సోనియా, చంద్రబాబు తట్టుకోలేకపోయారు. పార్టీని వీడిన తర్వాత జగన్‌పై అక్రమ కేసులు మోపారు. 13 ఏళ్లుగా వాటిని చూపుతూ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు.
తప్పుడు కేసులేనని ఒప్పుకున్న శంకర్‌రావు..
కాంగ్రెస్, టీడీపీ కుట్రలో భాగంగానే అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్‌రావుతో హైకోర్టులో కేసు వేయించారు. అవే ఆరోపణలతో ఎర్రన్నాయుడు, అశోకగజపతిరాజు ద్వారా చంద్రబాబు కేసు వేయించారు. వాటిపై సీబీఐ దర్యాప్తునకు కోర్టు ఆదేశించింది. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై పెట్టిన కేసుల్లో దర్యాప్తు కోసమని ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్ జగన్‌ను 2012, మే 27న సీబీఐ పిలిచి.. ఆ తర్వాత అరెస్టు చేసింది.
16 నెలలపాటు జైల్లో అక్రమంగా నిర్భందించింది. సీబీఐ దర్యాప్తు జరుగుతున్న సమయంలో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు వక్రీకరిస్తూ వైఎస్ జగన్‌పై ఎల్లో మీడియా విషం చిమ్మింది. వైఎస్ జగన్‌పై కేసు తాను వేయలేదని.. కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ఏవో కాగితాలను పంపిందని.. కనీసం వాటిని చదవకుండానే వాటిపై సంతకం చేశానని... అంతకు మించి తనకేమీ తెలియదంటూ హైకోర్టులో ఆ కేసు వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్‌రావు అనేకమార్లు స్పష్టంచేశారు.
వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఉంటే కేసులు ఉండేవి కావని, ముఖ్యమంత్రి అయ్యేవారని గులాం నబీ ఆజాద్ వంటి వాళ్లు తరచూ అనేవారు... వీటిని బట్టి చూస్తే వైఎస్ జగన్‌పై పెట్టిన కేసులు రాజకీయ ప్రేరేపితమైనవనే అంశం సుస్పష్టమవుతుంది.


