‘‘అప్పు చేసి పప్పు కూడు’’ అని ఒక సామెత. ‘‘నాడా దొరికింది.. గుర్రాన్ని కొందాం’’ అనేది ఇంకో నానుడి. ఇలాంటివన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కారుకు బాగా వర్తిస్తాయి. రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం చేస్తున్న అప్పులు చూస్తే గుండె గుభిల్లుమంటుంది. ఇప్పటికే రూ.26 వేల కోట్ల రుణం మంజూరు కాగా.. తాజాగా ఇంకో రూ.32500 కోట్లు తీసుకుంటోంది. ప్రభుత్వ అవసరాల కోసం చేసిన రూ.1.60 లక్షల కోట్లు, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రూ.55 వేల కోట్లు దీనికి అదనం. అమరావతిలో రూ.91639 కోట్లతో 112 పనులు చేపడుతూంటే అందులో సుమారు రూ.53,338 కోట్ల వ్యయమయ్యే 87 నిర్మాణాలు చేపట్టడానికి టెండర్లు పిలిచారు. వీటిలో ప్రధాన మౌలిక వసతుల కల్పన, రైతులకు కేటాయించిన స్థలాల లే-అవుట్ల అభివృద్ధి, పరిపాలన నగరంలో హైకోర్టు, సచివాలయ టవర్లు, శాసనసభ భవనం వంటి ఐకానిక్ టవర్లు, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, అధికారుల నివాస గృహాలు వంటి పనులు చేపడతారట.
ఇవేవీ ప్రభుత్వానికి కొత్తగా ఆదాయం తెచ్చేవి కావు. అవసరమైన నిర్మాణాలకు ఓకేగానీ.. భూమి సేకరించాం కనుక, అనవసరమైన నిర్మాణాలు చేపట్టడం ఎంత వరకూ ఉపయోగకరం? ఇప్పటికే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి వాటికి వందల కోట్లు వ్యయం చేశారు. ఇప్పుడు మళ్లీ అప్పు చేసి కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. మూడువేల మంది సిబ్బంది కూడా ఉండని సచివాలయం కోసం ఏభై అంతస్తుల టవర్లు నిర్మించబోతున్నారట. అంతకుముందు 2014 టర్మ్‌లో ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో సుమారు రూ.పది వేల కోట్లు వెచ్చించింది. అప్పులు చేసి ఇలా దుబారా చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.పది వేలు, కొన్ని చోట్ల రహదారుల నిర్మాణానికి కిలోమీటరుకు ఏకంగా రూ.75 కోట్ల నుంచి రూ. 174 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమవడం చూస్తుంటే ఎవరికైనా దిమ్మదిరగాల్సిందే. హైదరాబాద్‌లో ప్రైవేట్ సంస్థలు నిర్మిస్తున్న భవనాల్లో చదరపు అడుగు ఖర్చు నాలుగైదు వేలకు మించడం లేదు. కానీ అమరావతిలో భూమి ఖర్చు లేనప్పటికీ చదరపు అడుగుకు రూ.పది వేలు ఖర్చు పెడుతున్నారు. ఒక్క రాజ్ భవన్ నిర్మాణానికే రూ.212 కోట్లు వెచ్చించబోతున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నది కుడి గట్టుకు 1.71 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.303 కోట్లు వెచ్చించబోతున్నారు. గత ప్రభుత్వం రూ.474 కోట్లతో 5.66 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మించింది. అంటే కిలోమీటర్‌కు రూ.84 కోట్లు. చంద్రబాబు ప్రభుత్వం కిలోమీటర్‌కు రూ.177.5 కోట్లు పెడుతోందన్న మాట.
ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు చాలాసార్లు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం రాదని చెబుతుండేవారు. సేకరించిన భూముల్లో వాడుకోగా మిగిలిన భూముల అమ్మకంతో నిధులు సమకూరతాయని నమ్మబలికేవారు. కానీ.. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అమరావతి పేరుతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, హడ్కో తదితర సంస్థల ద్వారా రూ.అరవై వేల కోట్ల అప్పు చేసేశారు. ఇంకెన్ని వేల కోట్ల అప్పు తీసుకుంటారో తెలియదు. ఇదేదో కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తోందని అనుకుంటే ఓకే కానీ.. అంతా ఏపీ ప్రజలపై రుణభారం పెంచే వ్యవహారమే. కేవలం 29 గ్రామాల పరిధిలో చేసే ఖర్చు బరువును అన్ని ప్రాంతాల వారూ భరించాల్సిందే కదా?
అమరావతిలో ఇప్పటికి సేకరించిన 33 వేల ఎకరాల భూమి, అందుబాటులో ఉన్న 20 వేల ఎకరాలు సరిపోదని, మరింత సేకరించకపోతే అది మున్సిపాల్టీగానే మిగిలిపోతుందని ముఖ్యమంత్రి రైతులను బెదిరిస్తున్నారు. మరో 44వేల ఎకరాల భూమిని తీసుకు తీరతామనే సంకేతాలు ఇస్తున్నారు. అంతేకాక తొలిదశలో భూములు ఇవ్వని సుమారు 1800 ఎకరాలకు చెందిన రైతుల నుంచి బలవంతపు భూ సేకరణకు రెడీ అవుతున్నారు. ఏదో తమకు కాస్త ఆదాయం వస్తుందిలే అని ఆశించిన రైతులకు ఈ పరిణామాలేవీ మింగుడు పడడం లేదు. కొత్తగా భూమి సమీకరణ జరిగితే ఆ ప్రాంతం అభివృద్దికి మరో లక్షన్నర కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఈ మొత్తానఇన కూడా అప్పుగా పరిగణిస్తే వడ్డీలతో కలిపి ఏపీపై రుణభారం రకంగానే అప్పులు చేసుకుంటూ పోతే, అప్పులు, వడ్డీలు కలిసి ఐదు లక్షల కోట్లు మించినా ఆశ్చర్యం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అమరావతిలో రూ.24790 కోట్లతో 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం తలపెట్టారు. సీడ్ యాక్సిస్ రోడ్డును జాతీయ రహదారి 16కి అనుసంధానించడానికి కిలోమీటర్‌కు రూ.174.4 కోట్లు అంచనా వేశారు. ఇప్పటికే నిర్మించిన సీఆర్డీయే భవనానికి రూ.338 కోట్లు వ్యయం చేశారు. చదరపు అడుగుకు రూ.11 వేలు పడిందని వైసీపీ సీనియర్ నేత మల్లాది విష్ణు చెప్పారు. ముంబైలో స్టార్ హోటల్ నిర్మాణానికి చ.అ. రూ.4500 మాత్రమే అవుతోందని ఆయన వివరించారు. 2016లో వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం, నిర్మాణానికి రూ.1150 కోట్లు వెచ్చించగా, ఇప్పుడు శాశ్వత సచివాలయం, హెచ్ఓడిల కోసం రూ.4688 కోట్లతో భారీ టవర్లను నిర్మిస్తోంది. ఒక వైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఐదారు వేల కోట్ల రూపాయలు లేవని చెబుతున్న ప్రభుత్వం ఈ రకంగా వేల కోట్ల ప్రజాధనాన్ని ధారాళంగా ఖర్చు చేయవచ్చా?
చత్తీస్‌ఘడ్ తాజాగా ఆవిష్కరించిన కొత్త అసెంబ్లీ భవనం వ్యయం కేవలం రూ.325 కోట్లు. ఏపీలో మాత్రం సోకులకు పోతూ భారీ ఎత్తున వ్యయం చేయబోతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే సీఆర్డీయే అధికారులు రైతుల సమావేశం ఏర్పాటు చేసి రాజధానిలో చేపట్టే ఇళ్లకు ప్రహరీ గోడలు కట్టకూడదని, విదేశాలలో ఉన్నట్లుగా ఇళ్లను నిర్మించుకోవడంతో పాటు గ్రీనరీకి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారట. అలాగే నిర్దిష్ట ప్లాట్ల సైజు ప్రకారమే కాలనీలు ఉండాలని.. ఇలా రకరకాల సూచనలు చేస్తే రైతులకు ఇదేమిటా అని తలపట్టుకోవాల్సి వచ్చిందట.రైతులు వ్యక్తం చేసిన అనుమానాలను మాత్రం నివృత్తి చేయలేకపోయారట. అసలు ప్లాట్లే ఇవ్వకుండా, ఎక్కడ ఉన్నాయో చెప్పకుండా గ్రీనరీ, నిబంధనలు అని ఆదేశాలు ఇవ్వడమేమిటో అని రైతులు ప్రశ్నించారట.ఈ ప్రాజెక్టు ఒక వైపు 2034 కు పూర్తి అవుతుందని ప్రపంచ బ్యాంక్ కు చెబుతూ తొలిదశ మూడేళ్లలో అవుతుందని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. వీటిలో దేనిని నమ్మాలి?
నిజానికి గుంటూరు-విజయవాడ మధ్య రెండు, మూడు వేల ఎకరాలలో అసెంబ్లీ, సచివాలయం, ఇతర కార్యాలయాలు, హైకోర్టు, న్యాయమూర్తుల, మంత్రుల, అధికారుల నివాస గృహాలు ఏర్పాటు చేసుకుంటే రూ.పది వేల కోట్లతో రాజధాని నిర్మాణం జరిగిపోయేదని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో రాజధాని కార్యాలయాల కోసం వాడుతున్న భూమి వెయ్యి ఎకరాలకు మించదని అంటున్నారు. ఇలాకాకుండా.. రైతుల నుంచి వేల ఎకరాలు తీసుకుని, వారికి అభివృద్ది చేసిన ప్లాట్లు ఇవ్వడం రియల్ ఎస్టేట్ మోడల్ తప్ప మరొకటి కాదు. దానివల్ల ప్రభుత్వానికి కలసివచ్చేది పెద్దగా ఉండదు. కాని చంద్రబాబు తాను ఒక నగరాన్ని నిర్మించానని చెప్పుకోవడం కోసం ఏపీ ప్రజల నెత్తి మీద అప్పుల భారం మోపడం ఎంతవరకు కరెక్టు?

కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


