ఎకరానికి ఏడాదికి రూ.వెయ్యి చొప్పున 33 ఏళ్లపాటు లీజు
ఇప్పటికే విలువైన భూములు ఆ పార్టీ ఆఫీసులకు ధారాదత్తం
పేదలకు ఇవ్వకుండా సొంత పార్టీకి ఇష్టారాజ్యంగా కేటాయింపులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోట్లాది రూపాయల విలువైన భూములను తమ పార్టీ కార్యాలయాల కోసం ఇష్టారాజ్యంగా కేటాయించుకుంటున్న సీఎం చంద్రబాబు.. తాజాగా బాపట్లలో రెండెకరాల భూమిని కేటాయించుకున్నారు. పశ్చిమ బాపట్ల గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 1341–ఎ లోని రెండెకరాలను 33 ఏళ్ల పాటు లీజుకు టీడీపీ ఆఫీసుకు కేటాయిస్తూ బుధవారం ప్రభుత్వం జీఓ జారీచేసింది. బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడి పేరుతో ఆ భూమిని కేటాయించి ఏడాదికి వెయ్యి రూపాయలు లీజు ధరగా నిర్ణయించారు. రెండు నెలల క్రితం తిరుపతి, మచిలీపట్నం నగరాల్లో కూడా అత్యంత విలువైన స్థలాలను ఆ పార్టీ కార్యాలయాల కోసం కేటాయించుకున్నారు.
⇒ కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో రూ.50 కోట్లకు పైగా విలువైన 1.60 ఎకరాలను సంవత్సరానికి రూ.1,000 చొప్పున 33 ఏళ్లకు లీజుకిచ్చారు. ఆ భూమిని గతంలో రవాణా శాఖకు ఇచ్చినా ఆ కేటాయింపును రద్దుచేసి మరీ టీడీపీ జిల్లా కార్యాలయానికి అప్పగించారు.
⇒ తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామంలో రూ.100 కోట్ల విలువైన రెండెకరాల ప్రభుత్వ భూమిని కూడా రూ.వెయ్యికి 33 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేశారు.
⇒ అలాగే, కడప నగరంలో రూ.50 కోట్ల విలువైన రెండెకరాల ఆర్ అండ్ బీ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి కేటాయించుకున్నారు. ఈ భూమికి సంబంధించి వివాదం కొనసాగుతున్నా, కోర్టు పరిధిలో ఉన్నా లెక్కచేయకుండా దాన్ని తన పార్టీ జిల్లా అధ్యక్షుడి పేరు మీద ఇచ్చేశారు.
విశాఖలో రాష్ట్ర సేవా సమితికి 18.57 ఎకరాలు
ఇదిలా ఉంటే.. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గుడిలోవ గ్రామంలో రాష్ట్ర సేవా సమితికి 18.57 ఎకరాల భూమిని కేటాయిస్తూ మరో ఉత్తర్వు ఇచ్చారు. ఈ భూమిని ఎకరాకు రూ.80 లక్షల చొప్పున మొత్తం రూ.14.85 కోట్లు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే, అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో వేదాంత లిమిటెడ్ కంపెనీ ఆన్‌షోర్ డ్రిల్లింగ్ పనుల కోసం గతంలో ఇచ్చిన 9.88 ఎకరాల భూమి లీజును మరో మూడేళ్లు పొడిగిస్తూ ఇంకో ఉత్తర్వు ఇచ్చారు. ఇక నూజివీడులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ ఏర్పాటుకు 9.96 ఎకరాల భూమిని 33 ఏళ్ల పాటు ఉచితంగా కేటాయించారు. ఆ భూమిని హార్టీకల్చర్, సెరికల్చర్ విభాగానికి బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులిచ్చారు.
పేదలకు ఇవ్వకుండా పార్టీకి కేటాయింపులు
తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు పట్టణాల్లో అయితే రెండు సెంట్లు, గ్రామాల్లో మూడుసెంట్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పటివరకూ ఆ హామీ గురించి పట్టించుకోలేదు. పైగా పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వకుండా తన పార్టీ ఆఫీసులకు మాత్రం వందల కోట్ల విలువైన స్థలాలను కేటాయించుకుంటున్నారు. అంతేకాక.. గతంలో లీజుకు తీసుకున్న భూములపై ఇంకా అధికారాలు పెంచుకునేలా పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూముల కేటాయింపు లీజు కాలాన్ని 33 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు పొడిగించారు.


