2029లో కూటమి అధికారంలోకి రాదు
గుంటూరు ఎడ్యుకేషన్/పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరులోని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు విజయలక్ష్మి, మౌనిక, మనోజ్ఞలను శనివారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర, వైఎస్సార్ సీపీ యువజన విభాగం వర్కింగ్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్ధ్‌రెడ్డిలు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
● వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీలో బలమైన నాయకుల ఇళ్లపై భౌతికదాడులకు తెగబడుతున్న కూటమి 2029లో అధికారం కోల్పోనుందని అన్నారు. 1988లో వంగవీటి మోహనరంగా హత్యానంతరం టీడీపీ అధికారానికి దూరమైందని, 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత 2016లో ముద్రగడ పద్మనాభంను చిత్రహింసలకు గురి చేసిన ఫలితమే 2019లో అధికారం కోల్పోయిందని అన్నారు. తాజాగా కాపు నాయకుడైన అంబటి రాంబాబుపై దాడికి పాల్పడిన ఫలితాన్ని టీడీపీ, జనసేన, మౌనంగా ఉన్న బీజేపీ అనుభవిస్తాయని అన్నారు. ప్రధానంగా 2029లో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగలనుందని స్పష్టం చేశారు.
● కాపులందరూ డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంట ఉన్నారనుకోవడం భ్రమ అని, పవన్ కల్యాణ్‌కి కూటమిలో గుర్తింపు లేదన్నారు. పవన్ కల్యాణ్‌కి కనీస ఫ్రొటోకాల్ ఇవ్వడం లేదనీ, రాజధాని నిర్మాణ వ్యవహారాలతోపాటు వైజాగ్‌లో జరిగిన సమ్మిట్‌లోనూ ఆయనను ఆహ్వానించలేదన్నారు. పవన్ కల్యాణ్‌తో ఉన్న అనేక మంది కాపులు వాస్తవాలు గ్రహించి వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని చెప్పారు.
● అంబటి నివాసంపై గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆమె భర్త గళ్లా రామచంద్రరావు దగ్గర ఉండి దాడులు చేయించారని, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కమ్మని కుట్ర చేశారని అన్నారు. వారి ప్రోద్బలంతోనే కాపు నేత అంబటి రాంబాబుపై హత్యాయత్నం జరిగిందని, మా కాపుల ఓట్లతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. పార్టీలకతీతంగా కాపులకు అండగా ఉంటామన్నారు. 40 ఏళ్లుగా టీడీపీ అధికారం కోసమే కాపులను వాడుకుంటోందని, కాపు సమాజం తీవ్రమైన ఆవేదనతో ఉందన్నారు.
● వైఎస్సార్ సీపీ యువజన విభాగం వర్కింగ్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయిందన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై 2వేల మంది దాడి చేస్తే.. అందులో బాధితుడు అయిన ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటే.. నిందితులు స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారని తెలిపారు. ఒక మాజీ మంత్రిపై ఇంత కక్ష సాధింపు ఉంటే, సామాన్యుడికి భద్రత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. అంబటి అంటే గాలిలో ఒక సారి గెలిచిన ఎమ్మెల్యే కాదని, చిత్తశుద్ధితో పార్టీ కోసం పాటుపడే వ్యక్తి అని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, అంబటి రాంబాబు కుమార్తె మౌనిక పాల్గొన్నారు.
టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారీ కాపు నేతలపై దాడులు
రాష్ట్రంలో వంగవీటి రంగా హత్య
మొదలు ఇదే జరుగుతోంది
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర
గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబానికి పరామర్శ


