ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్రస్టేషన్ పతాకస్థాయికి చేరుకున్నట్టుంది. వయసు కూడా మరచిపోయి వైఎస్సార్‌సీపీ నేతలపై అధ్వాన్నపు దూషణలకు దిగుతున్నారు. సందర్భమేదైనా సరే ఒకటే అజెండా. జగన్‌ను, ఆయన పార్టీని తిట్టడం. ఈ వైఖరితో ప్రజల దృష్టిలో పలుచనవుతున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికల హామీలు నెరవేర్చలేకపోవడం, పాలన గాడి తప్పి అస్తవ్యస్తంగా మారడం.. వీటన్నింటిపై ప్రజల్లో చర్చోపచర్చలు జరుగుతున్న నేపథ్యంలో... వారి దృష్టి మరల్చేందుకు ఈ టెక్నిక్‌ను వాడుతున్నారేమో మరి! ఏడాదిన్నరగా రెడ్‌బుక్ పేరుతో సాగిన అరాచకాలు, కొన్ని గ్రామాల్లో దళతల కుటుంబాల బహిష్కరణ, తాజాగా సంక్రాంతి పేరుతో జూదం, అశ్లీల నృత్యాలు వంటివన్నీ ఆంధ్రప్రదేశ్ పరువును ఎప్పుడో బజారున పడేశాయి. దీన్ని కవర్ చేయడానికా అన్నట్ట జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతిని వాడుకునే ప్రయత్నం జరిగింది కానీ.. ఆ సభలోనూ ఎన్టీఆర్ గురించి నాలుగు మంచిముక్కలు మాట్లాడటం కంటే వైఎస్సార్‌సీపీని దూషించేందుకే ప్రాధాన్యమిచ్చారు. షరా మామూలన్నట్టు ఎల్లోమీడియా ఈ వాగుడుకే తానా తందానా అని మురిసిపోయింది.
చంద్రబాబు ప్రభుత్వమిప్పుడు క్రెడిబిలిటీ సమస్యను ఎదుర్కొంటోంది. ఐదేళ్ల పాలనలో భూముల రీసర్వేతోపాటు జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను కొనసాగించలేకపోవడం ఒక కారణమైతే.. 2019-2024 మధ్యకాలంలో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలను తన ఖాతాలో వేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడం రెండో కారణం. వీటిపై ఎప్పటికప్పుడు సాక్షి, సోషల్ మీడియాల్లో ఆధారసహితంగా కథనాలు వస్తూండటంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి గురవుతున్నట్టు ఉంది. భూమి, ఇసుక, మద్యం, గనులు, గంజాయి, డ్రగ్ మాఫియాలేవైఎస్సార్‌సీపీ క్రెడిట్ అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు ఈనాడు పెద్దక్షరాలతో ప్రచురించింది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలవుతున్నా ఇప్పటికీ మునుపటి ప్రభుత్వంపై ఏడుపే కొనసాగుతోందన్నమాట. పైగా అన్నీ అబద్ధాలు.
జగన్ టైమ్‌లో జరిగాయని చెబుతున్న ఎన్ని భూ దందాలను కూటమి ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది? ఎన్నింటిని రుజువు చేశారు? కూటమి పాలనలో అనంతపురంలో జరిగిన భూ కబ్జా ఆరోపణ మాటేమిటి? ఊరు, పేరు లేని కంపెనీలకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు 99 పైసలకే ప్రభుత్వ భూములు ఇచ్చేయడాన్ని ఏమనాలి? ఇసుక మాఫియా చెలరేగిపోతున్నది ఎందుకు? జగన్ హయాంలో ప్రభుత్వమే ఇసుక విక్రయించి ఏడాదికి రూ.700 కోట్ల ఆదాయం సమకూరిస్తే మాఫియా అన్నారు మరి.. ప్రస్తుతం ఉచిత ఇసుకపై టీడీపీ నేతలు చేస్తున్న దందాలేమిటి? కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారే? వీరిని అదుపు చేయలేక చంద్రబాబువైఎస్సార్‌సీపీపై విమర్శలు చేస్తున్నట్టుగా ఉంది వ్యవహారం.
గనుల విషయానికి వద్దాం.. టీడీపీ నేతలు కుప్పంలోనే అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు వచ్చిన వార్తల మాటేమిటి? నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు గనులు కబ్జా చేసి కప్పం చెల్లించమని డిమాండ్ చేసిన మాటేమిటి? మద్యం మాఫియా అంట! తన హయాంలో మద్యం వ్యాపారం మొత్తాన్ని ప్రభుత్వ పరం చేశారు జగన్. విక్రయాలకు నిర్ణీత వేళలు నిర్ణయించారు. బెల్ట్ షాపులు లేకుండా చేశారు. మరి.. కూటమి ప్రభుత్వం ఏమి చేస్తోంది? ప్రైవేటు వారికి, ప్రత్యేకించి టీడీపీ ఎమ్మెల్యేలు, వారి అనుయాయిలకు షాపులు కేటాయించి, వేల సంఖ్యలో బెల్ట్ షాపులు పెట్టించి, ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముకుంటోంది. ఇది కదా మాఫియా అంటే? అవి చాలవన్నట్లు టీడీపీ నేతలే నడుపుతున్న నకిలీ మద్యం ప్లాంట్ ఇటీవలే పట్టు బడింది కదా! సర్వే రాళ్ళపై నవరత్నాల బొమ్మతోపాటు జగన్ చిత్రపటం వాడడం వల్ల రూ.700 కోట్లు వృథా అయ్యాయని అబద్దపు ప్రచారం చేస్తున్నారు.
సర్వే రాళ్లు ఎందుకు వృథా అవుతాయి.ప్రభుత్వానికి చాతకాకపోతే తప్ప. మరో వైపు ప్రభుత్వ ఆఫీసులు, ఇతరత్రా, చివరికి రోడ్డు డివైడర్లపై టీడీపీ పచ్చ రంగు, జనసేన రంగులు వేయడాన్ని ఎలా సమర్థిఃచుకుంటారు. రీసర్వే మీద జగన్‌పై తప్పుడు ఆరోపణలు చేయలేదని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు గుండె మీద చేయి వేసుకుని చెప్పగలరా! మళ్లీ దానిని ఎలా కొనసాగిస్తున్నారు. క్రెడిట్ చోరీ అంటే మాత్రం కోపం వస్తుంది. గంజాయి,డ్రగ్స్ గురించి జగన్ టైమ్‌లో ఉన్నవి, లేనివి కల్పించి ఎన్ని ప్రచారం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక అవి ఏ స్థాయిలో వ్యాప్తి చెందింది కనబడుతూనే ఉంది కదా! విశాఖ,గుంటూరు,తదితర చోట్ల పోలీసులకు గంజాయి పట్టుబడిన మాటేమిటి?జగన్ సొంతగా పెట్టుకుని కష్టపడి ఈ స్థాయిలో ఉన్నవైఎస్సార్‌సీపీని ఫేక్ అని చంద్రబాబు అంటున్నారంటే ప్రజాస్వామ్యం అంటే ఆయనకు ఎంత భయమో అర్థం చేసుకోవచ్చు.
తన అల్లుడు చంద్రబాబు తెలుగుదేశం పార్టీని కబ్జా చేశారని, మానవత్వం లేదని, తనకు ద్రోహం చేశారని, వెన్నుపోటు పొడిచారని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు స్వయంగా చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పటికీ ప్రముఖంగానే కనిపిస్తుంది కదా! నేర రాజకీయాలు చేస్తున్నారంటూ మరో తప్పుడు ఆరోపణ. పల్నాడులోవైఎస్సార్‌సీపీ కార్యకర్త సాల్మన్‌ను ను టీడీపీ గూండాలు హత్య చేస్తే, అలాంటి వాటిని నిరోధించడంలో విఫలం అవడమే కాకుండా,వైఎస్సార్‌సీపీ వారు రెచ్చగొడుతున్నారని అనడం సీఎం స్థాయికి తగునా!ఒకప్పుడు పల్నాడు ఫ్యాక్షన్ హత్య జరిగితే పాడె మోసి రాజకీయ రంగు పులిమిన చంద్రబాబు ప్రస్తుతంవైఎస్సార్‌సీపీ వారిపై ఆరోపణ చేస్తున్నారు. టీడీపీ వారు వందల కుటుంబాలను గ్రామాలలోకి రానివ్వకుండా బహిష్కరణ చేస్తున్న ఘటనలను అదుపు చేయకుండా అలాంటివాటిని ప్రోత్సహించేలా ప్రభుత్వ నేతలు ఉపన్యాసాలు ఇవ్వడం కన్నా సిగ్గు చేటైన విషయం ఉంటుందా?


