
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మళ్లీ చిక్కొచ్చిపడింది. ఒకపక్క ఓటుకు నోటు కేసు నిందితుడు మత్తయ్య కేసు మొత్తం చంద్రబాబు ప్రోద్బలంతోనే జరిగిందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. ఇంకోపక్క ఇంకోపక్క మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఒక సర్కిల్ ఇన్స్‌పెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఈ రెండు సంఘటనలూ సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేవే. తెలుగుదేశం పార్టీ నేతలకూ ఇబ్బందికరమైనవే. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నందున అందరి నోళ్లు నొక్కేయవచ్చు. దబాయింపులతో నష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు. ఓటుకు నోటు కేసు మొత్తాన్ని మళ్లీ దర్యాప్తు చేయాలని మత్తయ్య సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాస్తారన్నది ఎవరూ ఊహించి ఉండరు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్న ఈ కేసులో మత్తయ్యపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సీఎం నిందితుడిగా ఉన్నా అప్పీలుకు వచ్చిన కారణంగా న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించింది కూడా. ఈ నేపథ్యంలో మత్తయ్య తీవ్రంగా స్పందిస్తూ సీజేఐకి లేఖ రాశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్ధికి ఓటు వేయించడానికి మత్తయ్య ద్వారా టీఆర్‌ఎస్ నామినెటేడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్‌తో రాయబారం చేయించారు. ఓటుకు గాను రూ.ఐదు కోట్లు ఇచ్చేందుకు చంద్రబాబు, రేవంత్‌లు ఒప్పుకున్నారన్నది అభియోగం. ఈ క్రమంలో రేవంత్ ఏభై లక్షల నగదుతో స్టీఫెన్సన్ ఇంటికి వెళ్లడం, ముందస్తు సమాచారంతో తెలంగాణ ఏసీబీ ఆయనను అరెస్టు చేయడం తెలిసిన సంగతే. ఇదంతా కుట్ర అని రేవంత్ వాదిస్తుంటారు. కాగా ఇదే కేసులో స్టీవెన్సన్‌తో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి, ‘‘మనవాళ్లు బ్రీఫ్డ్ మీ..అంతా నేను చూసుకుంటా..’’ అంటూ భరోసా ఇచ్చిన ఆడియో అప్పట్లో పెను సంచలనం. అయితే కేంద్రంలోని బీజేపీ పెద్దల ద్వారా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రాజీ చేసుకున్నారని చాలామంది చెబుతారు. అదే టైమ్‌లో కేసీఆర్‌పై ఏపీలో ఫోన్ టాపింగ్ కేసు పెట్టి హడావుడి చేశారు. ఈ కేసు ఛార్జ్‌షీట్‌లో చంద్రబాబు పేరు ముప్పై సార్లకు పైగా ఉన్నా, ఆయనను నిందితుడిగా చేర్చలేదు. ఇప్పుడు మత్తయ్య చంద్రబాబుపై ప్రత్యక్షంగా ఆరోపణలు చేయడం గమనార్హం.
ఈ కేసులో చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని కేసీఆర్ అన్నప్పటికీ ఆ తరువాత ఏం జరిగిందో కానీ ఆయనను నిందితుడిగానూ చేర్చలేకపోయారు. మత్తయ్య చెబుతున్న దాని ప్రకారం ఈ వ్యవహారంలో చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేశ్, అతని సన్నిహితులు కొందరు, ఆనాటి ఇంటెలిజెన్స్ డిజి వెంకటేశ్వర రావుల పాత్ర ఉంది. మత్తయ్య తెలంగాణ పోలీసులకు చిక్కకుండా ఏపీకి తరలించారట. ప్రలోభాలకు గురి చేస్తూ.. ఇంకోపక్క బెదిరిస్తూ తాము అనుకున్న విధంగా కేసీఆర్‌పై ఫోన్ టాపింగ్ కేసు పెట్టించడం, 164 సెక్షన్ కింద సాక్ష్యం చెప్పడం వంటివి చేయించారని మత్తయ్య అంటున్నారు. మత్తయ్యకు, చంద్రబాబు బృందానికి మధ్య ఎక్కడ చెడిందో కాని, తదుపరి కాలంలో మత్తయ్య ఎదురు తిరిగినట్లు కనిపిస్తుంది. తాజాగా ఆయన చేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు ఏ రకంగా చూస్తుందో చెప్పలేం. ఏపీ, తెలంగాణలలో చంద్రబాబు, రేవంత్‌లు ముఖ్యమంత్రులుగా ఉన్నందున ఈ కేసు విచారణ సజావుగా జరగదని మత్తయ్య ఆరోపిస్తున్నారు.
అధికారంలో ఉన్న పార్టీపై, ముఖ్యనేతలపై అదే రాష్ట్రంలో దర్యాప్తు అంత తేలికకాదు. కేసు నీరుకార్చేందుకు ప్రయత్నాలు జరుగుతూంటాయి. చంద్రబాబుపై వచ్చిన స్కిల్ స్కామ్, మద్యం కేసు, ఇతర కేసులపై విచారణ దాదాపు నిలిచిపోయిన సంగతి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఓటుకు కోట్లు కేసులో అరెస్టు అయి కొన్నాళ్లపాటు జైలులో ఉన్న రేవంత్ స్వయంగా సీఎంగా ఉన్నారు.ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరు కూడా పదవులలో ఉన్నారు. అందువల్ల ఈ కేసు ఎంతవరకు ముందుకు వెళుతుందన్నది అనుమానమే. గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసులను కర్ణాటకకు బదిలీ చేసిన రీతిలో వేరే రాష్ట్ర కోర్టుకు బదిలీ చేయడమో, లేక సీబీఐకి అప్పగించడమో చేస్తే తప్ప ఓటుకు కోట్లు కేసు ముందుకు వెళ్లదని ఒక న్యాయ నిపుణుడు అభిప్రాయపడ్డారు.ఇప్పటికైతే అలా జరిగే సూచనలు ఏమీ లేవు..సుప్రీంకోర్టులో మత్తయ్య అఫిడవిట్ వేస్తే, అది సీజే ముందుకు వస్తే, దేశ వ్యాప్తంగా ఇది ఒక పెద్ద కథనం అవుతుంది. భవిష్యత్తులో అధికారంలో ఉన్న నేతలపై కేసులు ఎలా డీల్ చేయాలన్న దానిపై ఒక సూచన రావచ్చేమో చూడాలి.
ఇక వివేకా హత్య కేసుకు సంబంధించి చంద్రబాబు కాని, ఇతర కూటమి నేతలు కాని అధారం ఉన్నా, లేకపోయినా పలు ఆరోపణలు గుప్పిస్తుంటారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టార్గెట్‌గా విమర్శలు చేస్తుంటారు.అందులో భాగంగానే సీఐ శంకరయ్యపైన కూడా చంద్రబాబు అసెంబ్లీలో ఆరోపణలు చేశారు. తానేదో హత్యకేసులో ఆధారాలు తుడిచివేయడానికి సహకరించినట్లు సి.ఎమ్. చెప్పడం అన్యాయమని, సీబీఐ కూడా తనపై అలాంటి ఆరోపణలు చేయలేదని, తను సాక్షిగానే పరిగణించిందని, ఆయన అన్నారు. తనకు డీఎస్పీ ప్రమోషన్ వచ్చిందని చంద్రబాబు చెప్పడాన్ని తప్పుపట్టారు.
తాను ఇంకా సీఐగానే ఉన్నానని అన్నారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఒక సీఐపై ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోలేదంటే, ఏ అసత్యం చెప్పినా,తనను ఎవరూ ఏమీ చేయరులే అన్న ధీమా కావచ్చు.కాని సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందన్నట్లుగా ఆ సీఐ ఏకంగా లీగల్ నోటీసు ఇచ్చి చంద్రబాబును ఇరకాటంలో పడేశారు. నిజంగానే పెద్ద పదవిలో ఉన్నవారు ఏ ఆరోపణ చేసినా ప్రభుత్వంలో ఉద్యోగంలో ఉన్నవారు భరించాలా? ఇలా నోటీసు ఇచ్చి ఎదుర్కోవచ్చా అన్నదానికి ఈ నోటీసు ఒక సమాధానం ఇవ్వవచ్చు. అయితే ఏదో రకంగా ఆ సీఐపై ఇప్పుడు ప్రభుత్వం చర్య తీసుకుని వేధించే అవకాశం కూడా ఉంది. ఇప్పిటికే సీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తనకే లీగల్ నోటీసు ఇస్తారా అని మండిపడ్డారు.
మళ్లీ పాత ఆరోపణలనే చేయడానికి ఆయన వెనుకాడలేదు. అయితే శంకరయ్య చేసిన ఆరోపణలకు నేరుగా మాత్రం జవాబు ఇవ్వలేదు. శంకరయ్యపై తీవ్రంగా మాట్లాడిన చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుకు సంబందించి, మత్తయ్య చేసిన ఆరోపణలపైన ఎందుకు స్పందించలేకపోయారో అర్థం చేసుకోవడం కష్టం కాదు. ఆయన వద్ద దానికి సమాధానం లేదనే అనుకోవాలి. ఆయనే ఉపన్యసించినట్లు, ఈ ఉదంతం రాజకీయం ముసుగులో నేరం చేసినట్లు అవుతుందా? కాదా? అన్నది స్పష్టం చేస్తే ప్రజలకు విశదమవుతుంది కదా!.ఏది ఏమైనా ఈ రెండు కేసులలో చంద్రబాబుకు ఇబ్బంది కలుగుతుందో లేదో తెలియదు కాని, పరువు మాత్రం దెబ్బతిన్నట్లే భావించిల్సి ఉంటుందేమో!
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత