చంద్రబాబు ఘనమైన రికార్డే సాధించారు! | KSR Comments On Chandrababu Govt And Yellow Media | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఘనమైన రికార్డే సాధించారు!

Nov 13 2025 10:35 AM | Updated on Nov 13 2025 10:51 AM

KSR Comments On Chandrababu Govt And Yellow Media

సంపద సృష్టించి మరీ ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్‌ వన్‌ స్థానానికి తీసుకెళతానని టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుంటారు. కానీ గత ఏడాది జనసేన, బీజేపీలతో కలిసి అధికారంలోకి వచ్చిన తరువాత కానీ ఆయన గారి సంపద సృష్టి అసలు రహస్యం ప్రజలకు అర్థం కాలేదు. అప్పులు, రెవెన్యూ లోటుల్లో మాత్రం ఏడాదిన్నర కాలంలో రాష్ట్రాన్ని నెంబర్‌ వన్‌ చేసేశారు. ఒకప్పటి బీమారు రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర ప్రదేశ్‌ రుణాల విషయంలో బాగా మెరుగైన స్థితిలో ఉండటం గమనార్హం. ఇవన్నీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తాజా నివేదికలోని అంశాలు.

ఏపీలో చంద్రబాబు అండ్‌ కో.. పాలన, అభివృద్ధి వంటి విషయాలపై కాకుండా.. ప్రత్యర్థులపై, ప్రశ్నించే వారిపై కేసులో పెట్టడంలోనే బిజీ అయిపోతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదిక ఇచ్చిన కాగ్‌పై కూడా కేసు పెడతామని బెదిరిస్తారేమోనని ఓ సీనియర్‌ పాత్రికేయుడు, యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడు వ్యాఖ్యానించడంలో ఆశ్చర్యమేమీ లేదు. తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని మోసే ఎల్లో మీడియా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా ఉందంటూ ఒక కథనాన్ని ఇచ్చి అనవసర వ్యయాలను తగ్గించుకోవాలని సలహా ఇచ్చింది. ఇదేదో వ్యూహాత్మకంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తరపున కథనం రాశారేమో అన్న అనుమానం వస్తుంది. ఎందుకంటే ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర ఆర్థిక నిర్వహణ అధ్వాన్నంగానే ఉందన్న  సంగతి అందరికీ తెలుసు. అయినా ఆహో, ఓహో అంటూ డబ్బా కొట్టిన ఎల్లో మీడియా ఇప్పుడు కాస్త భిన్నమైన కథనం రాయడం ద్వారా ప్రజలకిచ్చిన హామీలు ఎగవేయడానికి రంగం సిద్దం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయా స్కీములు అమలు చేసినప్పుడు, అప్పులు తీసుకువచ్చినప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని టీడీపీ, జనసేనతో కలిసి ఎల్లో మీడియా నానా రచ్చ చేసేది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌, దగ్గుబాటి పురందేశ్వరి వంటివారు ఏపీ అప్పులు రూ.14 లక్షల కోట్లకు చేరాయని, అదంతా జగన్ ప్రభుత్వమే చేసిందేమో అన్న అనుమానం కలిగేలా ప్రచారం చేసేవారు. తీరా చూస్తే జగన్ ప్రభుత్వంలో తీసుకున్న అప్పు రూ.మూడున్నర లక్షల కోట్లేనని తేలింది. జగన్ టైమ్‌లో అప్పులు అంటూ గోలగోలగా చెప్పిన వారు తాము అధికారంలోకి వస్తే ఏడాదికి లక్షన్నర కోట్ల మేర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ప్రకటించారు. అది అసాధ్యమని జగన్ అంటే, చంద్రబాబుకు సంపద  సృష్టించడం తెలుసని, తద్వారా స్కీములు అమలు చేస్తామని ఆకాశమే హద్దుగా అబద్దాలు చెప్పారు. ఎల్లో మీడియా తాన తందానా అని పాట పాడేవి. ఇప్పుడేమో ప్రమాదంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, పోటెత్తిన లోటు అని కథనాలు  ఇస్తున్నారు. మరి అప్పుడు అన్ని చేసేస్తామని చెప్పారు కదా.. ఇప్పుడేమిటి ఇలా చేతులెత్తేస్తున్నారని వారు ప్రశ్నించరు. ఎవరైనా అడిగితే వారిపై తప్పుడు కేసులు ఎలా పెట్టాలా అన్నదానిపైనే ప్రభుత్వం దృష్టి ఉంటోంది.

తాజాగా కాగ్ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే ఆర్థిక నిర్వహణ ఏ రకంగా చూసినా జగన్ టైమ్‌లో మెరుగ్గా ఉన్నట్లు అర్థమవుతుంది. రెండేళ్లపాటు కరోనా సంక్షోభం ఉన్నా జగన్ ప్రభుత్వం సమర్థంగా ఆర్ధిక నిర్వహణ చేసినట్లు  వెల్లడవుతుంది. కూటమి ప్రభుత్వం 2025-26లో రెవెన్యూ లోటు రూ.33185 కోట్లు అంచనా వేస్తే ఆరు నెలలకే రూ.46652 కోట్లకు చేరిందని కాగ్ వెల్లడించింది. ఇది అధికారుల అంచనా తప్పా? లేక లక్ష్య సాధనలో వైఫల్యమా అన్నదానిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఆ పని ఎటూ చేయరనుకోండి. దాదాపు రూ.2.17 లక్షల కోట్ల రెవెన్యూను అంచనా వేస్తే రూ.74234 కోట్లు మాత్రమే వచ్చాయి. ఖర్చు మాత్రం రూ.120887 కోట్లుగా లెక్కగట్టారు. బడ్జెట్ రూపొందించిన సమయంలో అంచనా వేసిన ఆదాయంలో కేవలం 34 శాతం మాత్రమే ఇప్పటికి వచ్చిందట. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.32284 కోట్లు గ్రాంట్లుగా వస్తాయని భావిస్తే, ఈ ఆరు నెలల్లో రూ.4014 కోట్లే రావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏడాది మొత్తానికి తీసుకోవాలని తలపెట్టిన రూ.79926 కోట్ల రుణంలో ఆరు నెలల్లోనే 78 శాతం పైగా, అంటే రూ.63వేల కోట్ల రుణాన్ని తీసేసుకుంది. ఇది దేశంలోనే అత్యధికం.

2019లో చంద్రబాబు అధికారం కోల్పోయినప్పుడు కేవలం ఖజానాలో రూ.వంద కోట్లు మాత్రమే ఉంచి దిగిపోయారు. అదే 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు ట్రెజరీలో సుమారు రూ.ఏడు వేల కోట్లు ఉన్నాయి. అయినా జగన్ ఆర్థిక విధ్వంసం చేశారని కూటమి పెద్దలు, ఎల్లో మీడియా విష ప్రచారం చేసింది. ఒకప్పుడు ఆర్థిక నిర్వహణలో ఉత్తరప్రదేశ్ అట్టడగున ఉండేది. బీమారు రాష్ట్రాలలో ఒకటిగా చెప్పేవారు. చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో యూపీ, బీహారులు సరిగా పర్ఫార్మ్‌ చేయడం లేదని, దానివల్ల బాగా పనిచేసే ఏపీ వంటి రాష్ట్రాలకు నష్టం జరుగుతోందని, కేంద్రం నుంచి ఆ రాష్ట్రాలకు అధికంగా నిధులు వెళుతున్నాయని, నిధుల పంపిణీ ఫార్ములా మార్చాలని వాదించేవారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లుగా ఉంది. అప్పులు, ఆర్ధిక నిర్వహణలో యూపీ బాగా పనిచేస్తున్నట్లు అనుకోవాలి.

ఉత్తరప్రదేశ్ ఈ ఆరు నెలల్లో కేవలం రూ.9332 కోట్లు అప్పు మాత్రమే చేసింది. ఏపీ తర్వాత మధ్యప్రదేశ్ (రూ.49100 కోట్లు), తెలంగాణ(రూ.45139 కోట్లు) అధిక అప్పులు చేసిన రాష్ట్రాలలో ఉన్నాయి. మధ్యప్రదేశ్, తెలంగాణలతో పోల్చినా ఏపీ పరిస్థితి మరీ దారుణంగానే ఉన్నట్లు  కనిపిస్తుంది. జగన్ ప్రభుత్వం రెండేళ్లపాటు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంది. అప్పుడు ఆదాయం దాదాపుగా లేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో రుణాలు తీసుకోండని రాష్ట్రాలకు కేంద్రం సూచన చేసింది. ఆ ప్రకారం అప్పులు చేసినా, అదేదో జగన్ తప్పు పనిచేసినట్లు ఎల్లో మీడియా అభూత కల్పనలు సృష్టించింది. ఇప్పుడు అలాంటి సంక్షోభాలు ఏమీ లేకపోయినా చంద్రబాబు  ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలోనూ జగన్ ప్రభుత్వమే బాగా పని చేయగలిగిందని లెక్కలు చెబుతున్నాయి. ఏపీ విభజన నాటి రెవెన్యూ లోటు పదివేల కోట్లు కాని, పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్ల ఆర్ధిక సాయం కాని జగన్ సాధించారు. ఆ రోజుల్లో జనంలో డబ్బులు రొటేట్  అవడం వల్ల జీఎస్టీ వసూళ్లు కూడా గణనీయంగానే ఉండేవి. కాని ఇప్పుడు జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. ఇతర రాష్ట్రాలలో వృద్ధిరేటు  కనిపిస్తుంటే ఏపీ అందుకు భిన్నంగా  ఉంది.  

ఈ సందర్భంగా ఎల్లో మీడియా రాసిన  కొన్ని కథనాల విశ్లేషణ ఆసక్తికరంగా ఉంటుంది. తల్లికి వందనం పథకంతో జీఎస్టీ జోష్, ప్రజలలో కొనుగోలు శక్తి పెరిగిందని ఎల్లో మీడియా కొద్దికాలం క్రితం ప్రచారం చేసింది. ఆ తర్వాత  జీఎస్టీ తగ్గింపుతో జనంలో జోష్ అని, సూపర్ సేవింగ్స్ అంటూ కూడా  ప్రజలను మభ్యపెట్టింది. ఇప్పుడు అదే మీడియా జీఎస్టీ రాబడులు తగ్గాయని  రాస్తోంది. సేవింగ్స్‌కు సూపర్ మస్కా, రిటైల్ మాయలో జీఎస్టీ పొదుపు ఆవిరి అయిపోయిందని రాస్తోంది. మొదటేమో అద్భుతమని ప్రచారం చేయడం, ఒక్కో కుటుంబానికి రూ.25 వేల రూపాయల నుంచి నలభై వేలు సేవ్ అవుతున్నాయని  ప్రభుత్వానికి డబ్బా కొట్టడం, ఇప్పుడేమో సేవింగ్స్ కనిపించడం లేదని చెప్పడం.. ఇలా ఉంది ఎల్లో మీడియా తీరు.

ఈ 17 నెలల్లో రికార్డు స్థాయిలో రూ.249350 కోట్ల మేర అప్పులు చేసిందని మాజీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. తమ హయాంలో ఐదేళ్లలో రూ.332670 కోట్లు అప్పుచేస్తే శ్రీలంక అయిపోయిందని విష ప్రచారం చేసిన ఎల్లో మీడియాకు ఇప్పుడు ఏపీ అమెరికా అయినట్లు కనిపిస్తోందా అని బుగ్గన ప్రశ్నించారు. టీడీపీ, జనసేనలు చేసిన వాగ్దానాలలో అనేకం అమలు చేయకుండానే దాదాపు రూ.రెండున్నర లక్షల కోట్ల అప్పు చేస్తే, వచ్చే  సంవత్సరాలలో ఇంకెంత అప్పు చేస్తుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. వీటిపై సమాధానాలు ఇవ్వలేక, ఇప్పటికి జగన్ ప్రభుత్వం విధ్వంసం అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ కాలక్షేపం చేస్తే కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చేది ఉండదని గమనించాలి. సంపద సంగతేమోకాని, ఏపీని అప్పుల కుప్పగా చేసి ప్రజలను సంక్షోభంలోకి నెట్టకుండా ఉంటే అదే పదివేలు అని చెప్పాలి.

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement