మొండివాడు రాజుకంటే బలవంతుడని సామెత. రాజు అంటే పరిపాలకుడు మొండివాడుగా ఉండొద్దు అన్న అర్థమూ ఉంది దీంట్లో. పట్టు విడుపుల్లేని రాజకీయం, ప్రజాస్వామ్యంలో విజ్ఞత, విచక్షణల అవసరమని గతానుభావాలు చెబుతున్నాయి. ఏ ప్రభుత్వానికైనా ప్రజాక్షేమమే పరమావధి కావాలి మినహా వ్యక్తిగత పట్టింపులు కాదు. ఈ విషయాలను విస్మరిస్తే ప్రజల నుంచి ఛీత్కారం తప్పదు. అచ్చం... ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో జరుగుతున్నది ఇదే. ఎవరు కాదన్నా.. వద్దంటున్నా ప్రైవేటీకరణకు మంకుపట్టు పట్టుకున్న చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడుతోంది. ఈ అహేతుక నిర్ణయం ప్రజా వ్యతిరేకంగా కనిపిస్తోంది. ప్రజల అభిమతానికి భిన్నంగా నడుచుకుంటే రాజకీయ పార్టీలకు ఇక్కట్లు తప్పవన్న సంగతి ఇప్పటికే పలుమార్లు నిరూపితమైంది.
తెలుగువారంతా కలిసి ఉండాలనుకున్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీనటుడు ఎన్టీఆర్ అందుకు తగ్గట్టుగా ‘‘తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది. ప్రాంతాలు వేరైనా మనమంతా ఒక్కటే’’ అన్న సందేశాత్మక పాటలను తన సినిమాల్లో పెట్టుకున్నారు. అల్లుడు చంద్రబాబు కూడా ఎన్టీఆర్ నుంచి పార్టీని అక్రమంగా లాగేసుకున్న తరువాత చాలాకాలం అదే విధానాన్ని కొనసాగించారు. 2004 ఎన్నికల ఓటమి తరువాత జరిగిన మహానాడులోనూ టీడీపీ ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. కానీ 2009 వచ్చేసరికి ప్రత్యేకవాదంపై ఉద్యమం చేస్తున్న టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం కోసం చంద్రబాబు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించారు. టీడీపీకి చెందిన కోస్తా, రాయలసీమ నేతలు వ్యతిరేకించినా తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖలు ఇచ్చారు. అది ఆంధ్రుల సెంటిమెంట్ కు వ్యతిరేకంగా మారింది. దాంతో 2009లోనూ ఓటమిపాలైంది.
1999లో విపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని పాదయాత్ర లో ప్రకటించారు. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవల్సిందేనని ఎద్దేవ చేశారు. 2004 ఎన్నికలలో టీడీపీ అధికారం కోల్పోవడానికి ఇది ఒక కారణమైంది. వైఎస్ అధికారంలోకి వచ్చాక ఉచిత విద్యుత్ ను అమలు చేసి చూపారు. దాంతో చంద్రబాబు కూడా తన వైఖరి మార్చుకుని గత టర్మ్‌లో అధికారంలోకి వచ్చినప్పుడు ఉచిత విద్యుత్ ను కొనసాగించారు. విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇచ్చే హామీలు, తదుపరి మాటలు మార్చడం గురించి ఇక్కడ చర్చ కాదు. నేదురుమల్లి జనార్ధన రెడ్డి ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ సరస్వతిని అమ్ముతారా అంటూ తీవ్ర విమర్శలు చేసింది. అంతేకాదు. అతకు ముందు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
ప్రస్తుతం అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వపరంగా గత ముఖ్యమంత్రి జగన్ కష్టపడి సాధించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటువారికి కట్టబెట్టడానికి ఎక్కడలేని కృషి చేస్తోంది. దీనిపై వైసీపీ అధినేత జగన్ కోటి సంతకాల ఉద్యమం చేపట్టారు. దానికి ప్రజలు స్వచ్చందంగా మద్దతు పలికి ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటువారికి అప్పగించరాదని సంతకాలు చేశారు. జగన్ వారి పక్షాన గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. చంద్రబాబు చేస్తున్నందంతా ఒక స్కామ్ అని, ఇందులో ప్రైవేటు సంస్థలు భాగస్వాములైతే భవిష్యత్తులో తమ ప్రభుత్వం వచ్చాక కేసులు ఎదుర్కోవలసి ఉంటుందని, తిరిగి కాలేజీలను స్వాధీనం చేసుకుంటామని జగన్ విస్పష్టంగా తెలిపారు. బహుశా ప్రజా వ్యతిరేకత, జగన్ హెచ్చరికలను గమనంలోకి తీసుకున్నాయో, ఏమో కాని, ప్రైవేటు సంస్థలు కాలేజీలకు టెండర్లు వేయలేదు.
నాలుగు కాలేజీలకు గాను ఆదోని కాలేజీకే ఒక ప్రైవేటు వైద్య సంస్థ కిమ్స్ మాత్రం బిడ్ వేసిందని ప్రభుత్వం చెప్పింది. అయితే తాము బిడ్ వేయలేదని కిమ్స్ ప్రకటించడంతో ప్రభుత్వం పరువు పోయింది. కిమ్స్‌లో పనిచేసే ఒక డాక్టర్ ఈ టెండర్ వేశారని, కమ్యునికేషన్ గ్యాప్ వల్ల తప్పు జరిగిందని, ఇది చిన్న విషయమని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు. ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా పని చేస్తోందో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం ఉండకపోవచ్చు. అయినా చంద్రబాబు మళ్లీ సమీక్ష చేసి మొండిగా ముందుకువెళ్లాలని నిర్ణయించారు. పైగా ఆయా ప్రైవేటు సంస్థలకు ఆర్థిక, ఇతర రాయితీలు కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. ఇక్కడే ఆశ్చర్యంగా ఉంటుంది. జగన్ ప్రభుత్వం ఆ కాలేజీలకోసం వందల కోట్ల రూపాయల విలువైన భూములను కేటాయించింది. కొన్ని కాలేజీలకు భవన నిర్మాణాలు దాదాపు పూర్తి అయ్యాయి.
పులివెందుల మెడికల్ కాలేజీకి అవసరమైన పరికరాలు కూడా సమకూర్చారు. ఇలాంటి వాటన్నిటిని ప్రైవేటు వారికి అప్పగించడం ఏమి హేతుబద్దత? ఈ ఆస్తులను కట్టబెట్టడమే కాకుండా, రెండేళ్లపాటు సిబ్బందికి జీతాలూ ఇస్తారట. అయినా ప్రైవేటు సంస్థలు ముందుకు రాలేదు. దీంతో ఆయా ప్రైవేటు సంస్థలకు వయబిలిటి గ్యాప్ ఫండ్ కూడా ఇస్తామని చంద్రబాబు తాజాగా ప్రకటించారు. జగన్ కోటి సంతకాల ఉద్యమం సందర్భంగా చేసిన హెచ్చరిక పని చేసిందన్నది ప్రజాభిప్రాయంగా ఉంది. ప్రభుత్వ వర్గాలు కూడా అలాగే భావిస్తున్నాయి. అదే టైమ్‌లో ఈ కాలేజీలు తీసుకున్నా, ఎంత ప్రభుత్వం ఆస్తులు ఇచ్చిన నష్టం రావచ్చునని ప్రైవేటు సంస్థలు అనుమానించాయా? లేక చంద్రబాబు బలహీనతను క్యాష్ చేసుకొన్ని మరిన్ని రాయితీలు పొందాలని అనుకుని ఉండవచ్చు. మొత్తం ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు ఎల్లో మీడియా ద్వారా కేంద్రం పీపీపీ విధానాన్ని అమలు చేయాలని తెలిపిందని, ఇందుకు కేంద్రం నుంచి నిధులు వస్తాయని కొత్త ప్రచారం ఆరంభించారు. ఇందులో నిజం ఎంతవరకు ఉందన్నది అనుమానమే. కేంద్ర మంత్రి నడ్డా నిజంగానే అలా లేఖ రాసి ఉంటే దానిని బహిర్గతం చేసి ఉండేవారు కదా!
ప్రజాధనం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం చంద్రబాబుకు కొత్తకాదు. 1995-2004 మధ్యకాలంలో 54 ప్రబుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించారు. ఆ ప్రైవేటు సంస్థలకు మంచి విలువైన భూములు కట్టబెట్టగా, అవి ఆ తర్వాత కాలంలో వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకున్నాయని చెబుతారు. గత టర్మ్‌లో విజయవాడకు, కడప వంటి విమానాశ్రయాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి విమానాలు నడపడం ఆర్థికంగా లాభతరం కాదని చెప్పిన విమానయాన సంస్థలకు ఖాళీగా ఉండే సీట్ల టిక్కెట్ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని ప్రజాధనాన్ని వెచ్చించారు. దీనినే వయబిలిటి గ్యాప్ ఫండ్ అంటారు. ఇదే సూత్రాన్ని మెడికల్ కాలేజీలకు వర్తిస్తారట.
అత్యవసర సమయాలలో ఇలా చేస్తే ఫర్వా లేదు కాని, లేని డిమాండ్ క్రియేట్ చేయడం కోసం ప్రభుత్వం ఇలా వృథా వ్యయం చేయవచ్చా? ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ టర్మ్‌లో అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమరావతి రాజధాని పేరుతో ఇప్పటికి సుమారు రూ.47 వేల కోట్ల రుణం తీసుకు వస్తున్నారు. కాని వైద్య కాలేజీలకు ఐదువేల కోట్ల డబ్బు లేదని చెబుతున్నారు. అమరావతి ఆవకాయ పేరుతో ఐదు కోట్ల రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. వెయ్యి రూపాయలు అదనంగా ఫించన్ పెంచి దానిని ఇవ్వడానికి లక్షల రూపాయలు వృధా వ్యయం చేస్తున్నారు. విశాఖలో వందల కోట్ల రూపాయల విలువైన భూమిని 99 పైసలకే ఇచ్చేస్తున్నారు. కాని మెడికల్ కాలేజీలను నడపలేమని చెబుతున్నారు.
జగన్ ప్రభుత్వం విద్య,వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యత ఇచ్చింది. స్కూళ్లతోపాటు ప్రభుత్వ ఆస్పత్రులను బాగు చేసింది. గుంటూరు, విజయవాడ తదితర ముఖ్యమైన ఆస్పత్రులు కార్పొరేట్ తరహాలోనే పనిచేసే స్థితి వచ్చింది. అయినా చంద్రబాబు మాత్రం కార్పొరేట్ ఆస్పత్రులే గొప్ప అన్నట్లు మాట్లాడుతూ తన ప్రభుత్వం చేతకానిదన్న సంకేతం ఇస్తున్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అంటూ కొత్త రాగం ఆలపించారు. పేదలకు నాణ్యమైన వైద్యం కోసం ప్రైవేటు వారికి కాలేజీలు ఇస్తారట.ఇప్పటికే కార్పొరేట్ ఆస్పత్రులు ఏ స్థాయిలో ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాయో అందరికి తెలుసు. పోనీ ప్రైవేటు కాలేజీలు సొంతంగా భూమి సమకూర్చుని, నిర్మాణాలు చేసుకుని, సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ఆస్పత్రులు పెట్టుకుంటే అదో పద్దతి అనుకోవచ్చు.
ప్రభుత్వమే అన్ని సమకూర్చి,అప్పనంగా కాలేజీలను ప్రైవేటువారికి ఇవ్వడం ద్వారా పేదలకు ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుందో అర్ధం కాదు.కేంద్రం జగన్ టైమ్ లో ప్రభుత్వరంగంలో పనిచేసేలానే ఈ 17 కాలేజీలను మంజూరు చేసిందన్న సంగతిని దాచేయాలని యత్నిస్తున్నారు.కేంద్రం కూడా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేట్లయితే మంగళగిరిలో ఎయిమ్స్ ను ప్రభుత్వపరంగా ఎలా నిర్మించిందన్నదానికి జవాబు దొరకదు. ప్రజల ఆస్తులుగా ఉన్న ఈ కాలేజీలను చంద్రబాబు తనకు కావల్సినవారికి సంపదగా మార్చుతున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు.ప్రజల సెంటిమెంట్ కు వ్యతిరేకంగా చంద్రబాబు తీసుకున్న ఈ మొండి నిర్ణయం కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తులో ఒక చేదు ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది.

కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


