వ్యాపార ప్రయోజనాల కోసం ఏనాడో ప్రజాహితాన్ని వదిలేసిన ఈనాడుకు అకస్మాత్తుగా ఎక్కడలేని భక్తి పుట్టుకొచ్చింది. అయితే ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి వారి మీదా? లేక తెలుగుదేశం అధినేత చంద్రబాబు మీదా? అన్నది తేలాలి. ఈ అనుమానం వచ్చింది కూడా ఈనాడు రాసిన ఓ దిక్కుమాలిన సంపాదకీయం తరువాతే. ‘‘వైకాపాసురుల మహాపచారాలు’’ అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తనకున్న అక్కసంతా వెళ్లగక్కుకుంది ఆ పచ్చమీడియా సంస్థ. కానీ.. ఆ క్రమంలోనే హిందూ మతానికి తీరని ద్రోహం చేస్తోందన్న సంగతి మరచిపోయింది.
పవిత్రమైన తిరుమల లడ్డూ గురించి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు చేసిన వివాదాస్పద అభియోగం ఏమిటి? ఆ తర్వాత ఈ అంశంపై విచారణ జరుగుతున్న తీరు ఏమిటి? లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందని చంద్రబాబు అధికారికంగా ప్రకటించిన విషయాన్ని ఈనాడు మీడియా ఇప్పుడు ఎందుకు కప్పిపెడుతోంది? అసలు మొదలు ప్రశ్నించాల్సిన విషయాన్ని డైవర్ట్ చేయడం ఈనాడు మీడియా నీచ జర్నలిజానికి నిదర్శనం. చిత్తుశుద్ధి ఉంటే సంపాదకీయం ద్వారా ప్రశ్నించాల్సింది రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రిని కదా? కల్తీకి ఆధారాలు ఏమిటి నిలదీయాలి కదా? దానికి సంబంధించిన విచారణ కాకుండా ఏదేదో కల్తీ అంటూ కొత్త కథలు సృష్టిస్తూ విచారణనున ఇష్టారీతిన నడిపిస్తే అది స్వామి వారిపట్ల అపచారమే అవుతుంది.
ఈనాడుకు అంత భక్తే ఉంటే, విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి గోదాములో లక్షల కిలోల గోమాంసం పట్టుబడిన సంగతిని ఎందుకు ప్రస్తావించడం లేదు. తప్పు పట్టలేదు? ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు? అలాగే పిఠాపురం వద్ద జరుగుతున్న దారుణ నెయ్యి కల్తీపై నోరు మెదపదు ఎందుకు? జంతుకొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేసిన లడ్డూలు అయోధ్యకూ పంపించారని ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఎందుకు తప్పు పట్టలేదు? ఈ ఆరోపణలో నిజం లేదని ఇదే ఈనాడు ఇటీవల కథనం ఒకటి ప్రచురించింది కదా? పవన్ చేసిన పాపం గురించి ఎందుకు ప్రస్తావించలేదు? ఇవన్నీ హిందూ మతానికి అపచారం చేసినట్లు కాదన్నది ఈనాడు నమ్మకమా? ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలను ఏమారుస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వాన్ని కాపాడేందుకు వికృత రాతలు రాయడాన్ని ప్రజలు కనిపెట్టలేరని అనుకుంటోందా? బాబుపై ప్రీతితో ఆఖరికి ఈ మీడియా సంస్థ నకిలీ మద్యం తయారీదారుల కొమ్ముకాస్తోంది.
టీడీపీ ప్రభుత్వం వచ్చాక జరిగిన తొక్కిసలాట మరణాలు, మాంసాహారం భుజించడం, మద్యం సీసాలు దొరకడం వంటి అపచారాలు, ఈనాడు మీడియాకు పవిత్ర కార్యక్రమాలుగా కనబడుతున్నాయోమే తెలియదు. జంతు కొవ్వు కలిసిందంటూ అసత్య ప్రచారం చేసి స్వామి వారి లడ్డూ ప్రసాదం పవిత్రతకు భంగం కలిగించవద్దని జగన్ అప్పట్లో చెబితే వక్రీకరించి జగన్ అబద్దాలు చెప్పారని రాసి ఈనాడు అల్పబుద్దిని ప్రదర్శించింది. రామోజీరావుకు దైవ భక్తి పెద్దగా లేదు. కాని ఆయన కుమారుడు కిరణ్ మాత్రం భక్తి విశేషంగా ఉన్నట్లు ప్రవర్తిస్తారు. కోట్లాది హిందువుల మనో భావాలను దెబ్బతీసేలా లడ్డూ ప్రసాదంపై అసత్య కథనాలతో పాటు, ఏకపక్షంగా సంపాదకీయం రాసి తాను నమ్మే స్వామి వారికి కిరణ్ కూడా తీరని అపచారం చేశారు!
తిరుమల లడ్డూపై ప్రత్యేక దర్యాప్తు బృందం చేస్తున్న విచారణకు హాజరైన టీటీడీ మాజీ కార్యనిర్వాహణాధికారి ధర్మారెడ్డి చెప్పిందేమిటి? ఈ మీడియా రాసిందేమిటి?పైగా ఆ మీడియా సేకరించిన సమాచారం అంతా సత్యమన్నట్లు సంపాదకీయం కూడా రాసేసి తెలుగుదేశం పార్టీపై, కూటమి ప్రభుత్వంపై ఎనలేని భక్తిప్రపత్తులు చాటుకుంది. లవలేశమైనా నిజాయితీ ఉన్నా తొలుత తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందన్న ఆరోపణలో వాస్తవం ఏమిటన్నది రాయాలి కదా? ఆ పని ఎందుకు చేయలేదు? దానిపై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రభుత్వాన్ని, సిట్‌ను ప్రశ్నించాలి కదా! దర్యాప్తు అంతటిని ఎలాగొలా టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారరెడ్డికి చుట్టేందుకు ఒకవైపు ప్రభుత్వం, మరో వైపు ఈనాడు, ఎల్లో మీడియా పాట్లు పడుతోంది. ఎవరో ఒకరిని పట్టుకోవడం, వారితోటే ఆ రోజుల్లో అక్రమాలు జరిగాయని వాంగ్మూలం ఇప్పించుకోవడం,తదుపరి తాము అనుకున్న వైఎస్సార్‌సీపీ నేతను టార్గెట్ చేయడం పనిగా పెట్టుకుంది.
నెయ్యి తక్కువ ధరకు కొన్నందున అందులో కల్తీ ఉందనే అభిప్రాయానికి వస్తే, 2014-19లో అంతకంటే తక్కువ ధరకు చేశారు కదా? అప్పుడు కూడా ఇలాగే జరిగిందా? టీడీపీ, వైఎస్సార్‌సీపీ రెండింటి హయాంలో పలుమార్లు నాణ్యతా ప్రమాణాలు లేని నెయ్యి టాంకర్లను వెనక్కి పంపించారు కదా? ఆ కోణంలో ఎందుకు ఆలోచించడం లేదు. టీటీడీకి సంబంధించిన లేబొరేటరీలు ఎప్పుడైనా కల్తీ అంశాన్ని కనిపెట్టాయా? ఆ మేరకు ఉన్నతాధికారులకు రిపోర్టు చేశాయా? అయినా చర్య తీసుకోలేదా? అన్నదానికి జవాబు దొరకదు. రెండేళ్ల క్రితం పంపిణీ చేసిన లడ్డూ కల్తీ నెయ్యితో చేసిందని చెప్పడానికి మెటిరీయల్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా? తిరుమలకు వచ్చిన నెయ్యిలో వెజిటబుల్ ఫాట్ అంటే డాల్డా వంటివి కలిసి ఉండవచ్చన్న అనుమానం వచ్చే కొన్ని టాంకర్లను వెనక్కి పంపించారు కదా? అలాంటిది రసాయనాలతో తయారు చేసినవాటిని పట్టుకోలేరా? ఏకంగా 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి వచ్చిందట. దీనికి ఆధారం చెప్పకుండా ఏమిటో ఈ అర్ధం లేని రాతలు! పైగా సంపాదకీయమట.
ధర్మారెడ్డి సిట్ అధికారులను ఎదురు అనేక ప్రశ్నలు వేశారు. అయినా ఆయన టీటీడీ ఛైర్మన్ ఒత్తిడి తెచ్చారని, అందువల్లే నెయ్యి కొన్నామని చెప్పినట్లు ఎల్లో మీడియా రాసుకుంది.ఈ అంశాన్ని సిట్ అధికారులు అధికారికంగా ఏమైనా వారికి వెల్లడించారా? ధర్మారెడ్డి ఏదో చెప్పారంటూ అది నిజమో కాదో, నిర్దారించుకోకుండా అడ్డగోలుగా ఈనాడు సంపాదకీయం రాసుకున్నట్లు అనిపించడం లేదా? ధర్మారెడ్డి ఒకవైపు తన వాంగ్మూలం గురించి ఒక వర్గం మీడియా అవాస్తవాలు రాస్తోందని చెబతే దానిని పట్టించుకోరా? తాను విచారణలో చెప్పింది ఒకటైతే ఎల్లో మీడియా ప్రచారం చేసింది మరొకటని ఆయన స్పష్టం చేశారు. కల్తీ జరగకుండానే ఏదేదో జరిగిపోయిందని అసత్య ప్రచారం చేశారని ధర్మారెడ్డి సిట్ అధికారులకు కూడా స్పష్టం చేశారని చెబుతున్నారు కదా! తక్కువ ధరకు కోట్ చేసేవారికే నెయ్యి టెండర్ ఇవ్వడం ఎప్పటి నుంచో ఉన్న విధానమని ఆయన తెలిపారు.
టీడీపీ హయాంలో కేవలం రూ.276లకే కిలో నెయ్యి కొనుగోలు చేశారన్న వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో పర్చేజ్ కమిటీలో ప్రస్తుత మంత్రి కె.పార్థసారథి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కూడా ఉన్నారు. మరి వారికి కూడా దీనితో సంబంధం ఉండాలి కదా! ఇంతవరకు వారిని ఎందుకు విచారించలేదు? అంతా అయిన తర్వాత ప్రభుత్వం వారికి కావల్సిన రీతిలో సాక్ష్యం ఇప్పించుకోవడానికి ఇలా చేస్తున్నారా? కల్తీ జరిగినా మీరు ఎందుకు చర్య తీసుకోలేదని సిట్ అధికారులు లీడింగ్ ప్రశ్న వేసినప్పుడు ధర్మారెడ్డి సూటిగా సమాధానం ఇస్తూ, అసలు కల్తీ జరగకుండానే యాక్షన్ ఎలా తీసుకుంటామని అని ఎదురు ప్రశ్నించారు. టీటీడీ రికార్డులు చూసుకుంటే అన్ని సందేహాలు నివృత్తి అవుతాయని కూడా స్పష్టం చేశారట.
తొలుత జంతు కొవ్వు అన్నారు.. తదుపరి కల్తీ నెయ్యి అని చెప్పారు.. ఆ తర్వాత రసాయనాలు కలిశాయని అంటున్నారు. తాజాగా ఆయా కంపెనీల టర్నోవర్‌ను పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు. కల్పిత మద్యం కేసులో కూడా ఇలాగే ఇద్దరు సాక్ష్యులు చెప్పని అంశాలను ప్రస్తావించి కోర్టుకు సమర్పించారట.దాంతో ఆ సాక్ష్యులు ఎదురు తిరిగి హైకోర్టులో ఆ మేరకు పిటిషన్ వేశారు. ఇలా పోలీసు వ్యవస్థను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్ధులను ఇబ్బంది పెట్టడానికి యత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఏపీలో అసలు అంశాలను పక్కదారి పట్టించడానికి ఇంకెన్ని కథలు పుట్టుకువస్తాయో చూడాలి.
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


