ఈసీ విశ్వసనీయతకు పరీక్ష | KSR comments on Rahul Gandhi allegation against the Election Commission over vote chori | Sakshi
Sakshi News home page

ఈసీ విశ్వసనీయతకు పరీక్ష

Aug 11 2025 3:01 PM | Updated on Aug 11 2025 3:12 PM

KSR comments on Rahul Gandhi allegation against the Election Commission over vote chori

ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన విషయాలే వెల్లడించారు. ఎన్నికల సంఘం తీరుతెన్నులను ఎండగట్టారు. అనేక లోపాలను, ఎన్నికలలో జరిగిన అక్రమాలను వెలుగులోకి తీసుకు వచ్చారు. కానీ... ఎన్నికల సంఘం స్పందించిన తీరు వాటిపై అంత సంతృప్తిగా ఉన్నట్లు అనిపించదు. కాగా రాహుల్ వాదనను ఖండిస్తూ దేశ ప్రజలను ఆయన అవమానించారని బిజెపి సీనియర్ నేత, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  విమర్శించారు. రాహుల్ గాంధీ వ్యక్తం చేసిన, ఆధారాలు చూపిన అంశాలపై ఎన్నికల సంఘం నేరుగా స్పందించి ఉంటే బాగుండేది. అలాకాకుండా ప్రమాణం చేయాలంటూ ప్రకటన చేయడం అర్థవంతమనిపించదు.

గత సాధారణ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో సైతం ఇవే  తరహా అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులు పెద్ద ఎత్తున  వచ్చాయి. ముఖ్యంగా 49 లక్షల ఓట్లు అదనంగా పోల్ అయ్యాయన్న ఆరోపణపై ఇంతవరకు సరైన జవాబు రాలేదు. అసాధారణ రీతిలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి విజయం సాధించడంపై చాలామంది ఆశ్చర్యం చెందారు. మహారాష్ట్ర, కర్ణాటకలలో కొన్ని ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలలో పరిశోధన చేసి రాహుల్ తన  ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన ఏపీలో జరిగిన తంతుపై కూడా మాట్లాడి ఉంటే క్రెడిబిలిటి పెరిగి ఉండేదేమో. అలా కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబుతో ఉన్న సంబంధ బాంధవ్యాల రీత్యా ఆ ప్రస్తావన చేయలేదేమో అన్న అనుమానం వస్తుంది. లేదా కాంగ్రెస్‌కు ఏపీలో ఎలాంటి పట్టు లేనందున దాని జోలికి వెళ్లలేదేమో  తెలియదు.

ఐదు రకాలుగా ఓట్ల చోరి జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. డూప్లికేట్ ఓట్లు, ఫేక్ అడ్రస్‌లు, ఒకే చిరునామాలో భారీగా ఓట్లు, ఇన్ వాలిడ్ ఫొటోలు, ఫారం నెంబర్ 6 దుర్వినియోగం, సాయంత్రం పోలింగ్ ముగిసే టైమ్‌కు ఉన్న పోలింగ్ శాతానికి, ఆ తర్వాత రాత్రివరకు నమోదైన  పోలింగ్ శాతాలపై అనుమానాలు ఉండడం, సీసీటీవీ ఫుటేజి ఇవ్వడానికి ఎన్నికల సంఘం సిద్దం కాకపోవడం వంటి కారణాలను ఆయన వివరించారు. ఇక్కడ ఒక మాట అంగీకరించాలి. ఇలాంటి అవకతవకలలో కొన్ని ఎప్పటి నుంచో ఉన్నాయి.డూప్లికేట్ ఓట్లు సర్వసాధారణం అన్న భావన ఏర్పడింది. ఏపీలో నమోదైన ఓటర్లు పలువురు తెలంగాణలో నివసిస్తుంటారు. ఎన్నికల రోజున పెద్ద ఎత్తున వాహనాలలో ఏపీకి తరలి వెళుతుంటారు. వారిలో అనేక మందికి తెలంగాణలో కూడా ఓట్లు ఉంటున్నాయి. వీటిని ఏరివేయడానికి కొన్ని  ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి పూర్తిగా జరిగినట్లు  అనిపించదు.

బీజేపీ కోసం ఎన్నికల సంఘం అక్రమాలకు అవకాశం ఇస్తోందని రాహుల్ ఆరోపించారు. ఈసీ నేరుగా అవకతవకలకు పాల్పడకపోవచ్చు కాని జరుగుతున్న వాటిని అరికట్టకపోవడం వల్ల అభియోగాలకు గురవుతోందని చెప్పాలి. తద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఉపయోగపడుతోందని చెప్పాలి. ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయాలని ఆశిస్తున్నప్పటికీ, ఆచరణలో అలా జరగడం లేదన్నది వాస్తవమే.

ఉదాహరణకు ఏపీలో ఎన్నికల సమయంలో బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పలువురు  పోలీసు అధికారులను బదిలీ చేయాలని అంటూ ఒక జాబితా  ఇచ్చారు. ఈసి అంగీకరించడమే కాకుండా, బీజేపీ వారు సూచించిన  అధికారులనే నియమించారన్న ఆరోపణలు  అప్పట్లో వచ్చాయి. ఈ క్రమంలో నిష్పక్షపాతంగా ఉండే పోలీసు అధికారులను  తప్పించారన్న సందేహాలు వచ్చాయి. దానికి కారణం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడడమే అని అంతా భావించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో ఈసీ ద్వారా తమకు కావల్సిన పనులు చేయించుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

బెంగుళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ లో ఏకంగా 1,00,250  దొంగ ఓట్లు ఉన్నట్లు రాహుల్  సాధికారికంగా వెల్లడించారు. అవి ఏఏ రకాలుగా ఉన్నాయో కూడా తెలియచేశారు. వాటిలో నలభై వేల మంది ఓటర్లవి నకిలీ అడ్రస్‌లు  అని ఆయన తేల్చారు. ఓటర్ల నమోదు అంశంలో కూడా అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు అచ్చంగా నకిలీ ఓట్లను చేర్పిస్తున్నాయి. వాటిని ఏరివేసే టైమ్ కూడా అధికారులకు ఉండడం లేదు.

గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలోనే టీడీపీ ఇలా పెద్ద ఎత్తున బోగస్ ఓట్లను చేర్చిందంటూ ఆనాటి విపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక ర్యాలీ చేసి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న ఈ తంతును ఎన్నికల సంఘం అరికట్టలేకపోతోంది. ఇక ఎన్నికల రోజున సాయంత్రం వరకు జరిగే పోలింగ్ ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత పోలింగ్ మరో ఎత్తుగా ఉంటోంది. కొన్ని ఎంపిక చేసుకున్న బూత్ లలో సిబ్బందిని, పోలీసులను ఆకట్టుకుని ఈవీఎంల ద్వారా భారీగా దొంగ ఓట్లు వేస్తున్నారన్నది మరో అభియోగం. నిజంగానే  ప్రజలు సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా క్యూలైన్లలో ఉంటే ఎవరూ కాదనరు. అలా కాకుండా క్యూ లైన్లలో పెద్దగా లేకపోయినా, ఓటింగ్ శాతం పెరిగిందని చెబితేనే సమస్య వస్తుంది.

అందువల్లే పోలింగ్ నాటి ఓట్ల శాతం, కౌంటింగ్ నాటి ఓట్ల శాతానికి పెద్ద తేడా వస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ సంస్థలు ఇలాంటి వాటిపై అధ్యయనం చేసి, నివేదికలను సమర్పిస్తున్నాయి. ఏపీలో 12.5 శాతం ఓట్లు అంటే సుమారు 49 లక్షల ఓట్లు తేడా వచ్చాయని అవి తేల్చాయి. రాహుల్ గాంధీ కోరినట్లు సాయంత్రం ఆరుగంటల తర్వాత  జరిగినట్లు చెబుతున్న పోలింగ్ కు సంబంధించి క్యూలైన్ల సీసీటీవీ ఫుటేజీని అడిగిన వారికి ఈసీ అందించి ఉంటే అనుమానం కలిగేది కాదు. అలా ఇవ్వకపోగా, దానిని ధ్వంసం చేసేసినట్లు చెబుతున్నారు.

ఏపీ అనుభవాన్ని రాహుల్ గాంధీ ఉపయోగించుకుని ఉంటే ఆయన ప్రజెంటేషన్‌కు మరింత విశ్వసనీయత వచ్చేది. కొన్ని చోట్ల ఈవీఎంలలో పోలైన ఓట్లకు, కౌంటింగ్‌లో వచ్చిన ఓట్లకు తేడా ఉన్నట్లు కొందరు అభ్యర్థులు గమనించారు. అలాగే వీవీప్యాట్‌ స్లిప్‌లను, ఈవీఎంలలో నమోదైన  అంకెలతో పోల్చి చూపాలని ఇంకొందరు కోరారు. వీవీప్యాట్‌ స్లిప్‌లను నిర్ణీత రోజులు స్టోర్ చేయకుండా పది రోజుల్లోనే దగ్దం చేయించడం కూడా సంశయాలకు దారితీసింది. ఒంగోలు నుంచి వైసీపీ పక్షాన పోటీ చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దీనిపై దరఖాస్తు పెట్టుకున్నా, ఎన్నికల అధికారులు  అంగీకరించకుండా డ్రామా నడిపారు.  ఆయన కోర్టుకు వెళ్లినా పలితం  దక్కలేదు.

బాలినేని తదుపరి జనసేన పార్టీలో చేరి ఆ విషయాన్ని వదలివేశారు. కాగా బాలినేని పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు  మార్గదర్శకాలకు విరుద్దంగా ఉందని ప్రముఖ సర్వే నిపుణుడు ఆరా మస్తాన్ అంటున్నారు.  ఒకప్పుడు చంద్రబాబు నాయుడు వంటివారు ఈవీఎంలను ఎలా మానిప్యులేట్ చేయవచ్చో తమ వద్ద ఉన్న టెక్నికల్ వ్యక్తుల ద్వారా చూపించారు.ఆయన  ఈవీఎంలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. ఆ  సందర్భంలో వీవీప్యాట్‌ స్లిప్‌లను అభ్యర్ధులు కోరితే ఐదు శాతం బూత్‌లలో లెక్కించాలని ఆదేశించినా, అధికారులు అనుసరించడం లేదని మస్తాన్ చెప్పారు. దీనితో అందరిలో అనుమానాలు వస్తున్నాయి.

ఈవీఎంలను టాంపర్ చేయవచ్చని అమెరికా మంత్రి తులసి గబర్డ్ , టెస్లా అధినేత ఈలాన్‌ మస్క్‌లతోపాటు భారత్‌కు  చెందిన  పలువురు చెబుతున్నారు. పోలీసులు ఆయా కేసులలో నిందితుల నుంచి సెల్ ఫోన్, టాబ్, లాప్ టాప్ వంటివాటిని స్వాధీనం చేసుకుని అందులో ఉన్న వాటిని రిట్రీవ్ చేస్తున్నప్పుడు ఈవీఎంలను ట్యాంపర్‌ చేయడానికి అవకాశం ఉండదా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఈవీఎంల బాటరీ ఛార్జింగ్‌ పోలింగ్ నాటికన్నా, కౌంటింగ్ నాటికి పెరగడంపై విజయనగరం నుంచి లోక్‌సభకు పోటీచేసిన  బెల్లాన చంద్రశేఖర్ కోర్టుకు వెళ్లినా ఇంకా నిర్ణయం రాలేదు. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ పై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.

పీవీఎస్‌ శర్మ అనే ప్రముఖుడు ఏపీలో 48 లక్షల ఓట్లు పెరిగిన తీరు చూస్తే ఎన్నికలలో మానిప్యులేషన్ వల్లే జగన్ ప్రభుత్వం ఓడిపోయిందని అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. రేషన్ షాపులో ఐదు కిలోల బియ్యం ఇవ్వడానికి రేషన్ కార్డుతోపాటు వేలిముద్రను కూడా తీసుకుంటారని, అలాంటిది ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఎన్నికలలో మాత్రం దొంగ ఓట్లు పడకుండా అలాంటి వ్యవస్థలను తీసుకు రాలేరా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాగే బ్యాంకులలో లావాదేవీలను  చాలావరకు పకడ్బందిగా అమలు చేస్తున్నప్పుడు ఎన్నికల వ్యవస్థలో ఎందుకు  మార్పులు తీసుకురాలేకపోతున్నారన్న  ప్రశ్నకు జవాబు దొరకదు.

రాహుల్ గాంధీ ప్రధానంగా ఓటర్ల జాబితాకు సంబంధించిన అక్రమాలపై ప్రశ్నలు సంధించారు. దీనిపై  ఎన్నికల సంఘం ఆయన  ప్రమాణం చేయాలని, అఫిడవిట్ వేయాలని చెబుతోంది. రాహుల్ గాంధీ నిజంగానే  బాద్యత లేకుండా ఆరోపణలు చేసి ఉంటే, ఈసీ కూడా అదే తరహాలో బాద్యతారాహిత్యంగా బదులు ఇస్తోందనిపిస్తుంది. ఈసీ ఒక రాజకీయ పార్టీ కాదు అన్న అంశాన్ని  గుర్తుంచుకుని ప్రజల నుంచి వచ్చే సందేహాలను  నివృత్తి చేయవలసి ఉంటుంది. ఇప్పటికే  మన  ప్రభుత్వాల తీరుతెన్నుల మీద ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఎన్నికల సంఘం వంటి కీలక సంస్థ కూడా అభియోగాలకు గురయ్యే  పరిస్థితి ఉంటే  అది ప్రజాస్వామ్య వ్యవస్థకే చేటు తెస్తుంది.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement