కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అమిత్ షా ప్రశ్న
అహ్మదాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు కావాల్సింది ఇవ్వలేనప్పుడు ఓట్లెలా వేస్తారని రాహుల్‌ను ప్రశ్నించారు. ఇంత చిన్న లాజిక్‌ను రాహుల్‌కు అర్థమయ్యేలా చెప్పడం తనవల్ల కానిపని అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలే ఆయనకు ఈ విషయం చెప్పలేకపోతున్నారంటూ వ్యాఖ్యానించారు.
మంత్రి అమిత్ షా ఆదివారం అహ్మదాబాద్ నగర సమీపంలోని ఓ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల లోక్‌సభలో చర్చ సందర్భంగా ఓ విషయం నన్నడిగారు..ఎన్నికల్లో ప్రతిసారీ కాంగ్రెసే ఎందుకు ఓటమిపాలవు తోంది అని. ప్రజలను అడగటానికి బదులుగా రాహుల్ ఈ ప్రశ్న నన్నడిగారు. రాహుల్ బాబా..! నేను ఇక్కడ ప్రారంభించిన ఈ రెండు కార్యక్రమాలను అర్థం చేసుకుంటే, నీకు సమాధానం దొరుకుతుంది’అని అమిత్ షా అన్నారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లలోనే కాదు, 2029 లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమిపాలవుతుంది. మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధిస్తుందని రాహుల్ తెలుసుకుంటారని ఆయన అన్నారు. ‘మా సిద్ధాంతాలతో ప్రజలు మమేకమ య్యారు. ‘అయోధ్యలో ఆలయాన్ని, ఉగ్రవాదు లపై సర్జికల్ స్ట్రయిక్స్‌ను, ఆర్టికల్ 370 రద్దును, ట్రిపుల్ తలాక్ చట్టాన్ని, బంగ్లాదేశీ అక్రమ వలసదారులను వెళ్లగొట్టడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఇలా ప్రజలు కోరుకునే వాటిని వ్యతిరేకిస్తూ పోతే ఆ పార్టీకి ప్రజలు ఓట్లెలా వేస్తారు’అని అమిత్ షా పేర్కొన్నారు.


