 
															సినీ కార్మికుల సన్మాన కార్యక్రమంలో సీఎం రేవంత్‌తో ఆర్ నారాయణమూర్తి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహాభారతంలోని కర్ణుడి పాత్ర చాలా ఇష్టమట. చేతికి ఎముక లేనట్టుగా దానం చేసే లక్షణం కర్ణుడిది. మిత్రధర్మం కోసం ప్రాణత్యాగమూ చేసి ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్య యుగంలో కర్ణుడి పాత్ర అంత వాస్తవికమైంది కాదనే చెప్పాలి. పైగా రేవంత్ ఏ రాజకీయ ధుర్యోధనుడితో ప్రస్తుతం మిత్ర సంబంధం ఉందన్న చర్చకు ఆస్కారం ఇచ్చారు. రాజకీయ నేతలు తమని తాము కర్ణుడిలా ఊహించుకుంటారేమో తెలియదు కానీ ఆయన మాదిరిగా మాటమీద నిలబడే వారు చాలా అరుదు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా సినీ కార్మికులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. సమ్మె సందర్భంగా సీఎం చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి సహకరించినందుకు సినీ కార్మికులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో మరీ ముఖ్యంగా కృష్ణానగర్ ప్రాంతంలో సినీ జూనియర్ ఆర్టిస్టులు వేలమంది నివసిస్తూంటారు. వారి ఓట్లు దక్కించుకునేందుకు రేవంత్ ఈ మాట అన్నారేమో మరి!. ఎందుకంటే కార్మికుల సమ్మె ఎప్పుడో పరిష్కారమైతే ఇప్పుడు సన్మాన సభ ఏమిటో?..
అయితే ఈ సందర్భంగా రేవంత్ ఇంకో హామీ ఇచ్చారు. సినీ కార్మికులకు ఆదాయంలో ఇరవై శాతం చెల్లిస్తేనే సినిమా టిక్కెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతిస్తుందని ప్రకటించారు. ధరల పెంపు నిర్మాతలు, హీరోలకు ఆదాయం తెస్తుందని, కార్మికులకు దక్కేది ఏమీ ఉండదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల చెవులకు ఈ హామీ వినసొంపుగా ఉండొచ్చు. కానీ అది ఆచరణ సాధ్యమా?..
ఎందుకంటే... ప్రతి సినిమాకూ ఓ సంక్షేమ నిధి అంటూ ఏదీ ఉండదు. అందరికీ కలిపి ఒకదాన్ని ఏర్పాటు చేస్తే ఎవరికి ఎంతివ్వాలన్నది అర్థం కాని పరిస్థితి ఏర్పడొచ్చు. రేవంత్ మాట్లాడుతూ.. నిజమే కానీ టిక్కెట్ ధరలు అన్ని సినిమాలకూ పెరగవు. టిక్కెట్ ధరలు పెంచిన తరువాత కూడా నష్టాలొస్తే ఏం చేయాలి? లాభ నష్టాలతో సంబంధం లేకుండా టిక్కెట్ రేట్ పెంచిన వెంటనే అందులో 20 శాతం వేరుచేసి కార్మికులకు కేటాయించాలని ప్రభుత్వం ఏమైనా చెప్పగలుగుతుందా?అందుకు నిర్మాతల సంఘాలు ఒప్పుకుంటాయా? ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని తన ఆలోచనపై నిర్మాతలతో చర్చించి ఆ తరువాత ఒక ప్రకటన చేసి ఉంటే బాగుండేది.
కొంతకాలం క్రితం పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సినిమా హాల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం, ఒక బాలుడు గాయపడి, ఇప్పటికీ కోలుకోలేకపోవడం తెలిసిన సంగతే. హీరో అల్లు అర్జున్ జైలు పాలయ్యారు కూడా. తొక్కిసలాట ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం రేవంత్ తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని అసెంబ్లీలోనే ప్రకటించారు. కానీ ఆ తరువాత షరా మామూలే. యధావిధిగా బెనిఫిట్ షోలకు అనుమతులు వచ్చేస్తున్నాయి. బీజేపీ కూటమి భాగస్వామి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా సినిమా బెనిఫిట్ షోతోపాటు టిక్కెట్ రేట్ల పెంపునకూ ఓకే అన్నారు. గురువు.. టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారేమో మరి!.
రేవంత్‌కు కర్ణుడి పాత్ర నిజంగానే అంత ఇష్టమైతే ఇలా మాట తప్పవచ్చా అని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. ఇంకో సంగతి చెప్పాలి. దానగుణంలో గొప్పవాడైన కర్ణుడు కౌరవుల పక్షాన ఉన్న సంగతి మర్చిపోరాదు. కౌరవాగ్రజుడు దుర్యోధనుడికి అనుయాయిగా కర్ణుడు కూడా అపకీర్తిని ఎదుర్కోవాల్సి వచ్చింది మరి.
సినీ కార్మికుల పిల్లల కోసం స్కూల్ పెడతానని అన్నారు.ఆలోచన బాగానే ఉంది కాని అందుకు అవసరమైన మూడు నాలుగెకరాల స్థలం ఈ మహానగరంలో ఎక్కడి నుంచి తెస్తారు? దాన్ని ప్రభుత్వ అధికారులు చూడగలుగుతారు. కాని,కార్మిక సంఘాలు ఎలా వెదుకుతాయో చెప్పలేము. హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తీసుకు వచ్చే బాధ్యత తమదని, ప్రపంచ సినిమా వేదికగా హైదరాబాద్ కావాలన్న ఆకాంక్ష కూడా మెచ్చుకోతగ్గదే. అయితే..
చంద్రబాబుతోపాటు రేవంత్ రెడ్డితోనూ సత్సంబంధాలు నెరుపుతున్న మీడియా సంస్థకు సొంతంగా ఒక స్టూడియో ఇప్పటికే ఉంది. దీనికి పోటీగా మరిన్ని వస్తాయంటే వారు ఊరకుంటారా? అయితే రామోజీ ఫిలిం సిటీకే హాలీవుడ్‌ను రప్పిద్దామని ఆయన అనడం ద్వారా వారిని సంతృప్తిపరిచారని అనుకోవచ్చు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ లో సినీ పరిశ్రమకు చోటు ఇస్తామని చెప్పడం బాగానే ఉంది. అందులో పరిశ్రమ అభివృద్దికి వ్యూహారచన ఉండవచ్చు. కాగా ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కిపోనని రేవంత్ గంభీరంగా ప్రకటించినా, ఇంతకుముందు అలా మాటకు కట్టుబడి ఉండలేకపోయారని అనుభవం చెబుతోంది. పైగా..
గతంలో రాజకీయ నేతలు ఎందుకు ఎలాంటి హామీలు ఇస్తారు?ప్రజలను ఏ విధంగా మాయ చేస్తారో తన అభిప్రాయాలను చెప్పిన వీడియోలు ఇప్పటికీ కనిపిస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీ పక్షాన గత ఎన్నికలలో ఆయన ఇచ్చిన హామీలు,వాటి అమలు తీరు మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకుంటే జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రేవంత్ ఈ ప్రసంగం చేశారా అన్న భావన కలుగుతుంది. కొసమెరుపు ఏమిటంటే సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డితో సంబంధం లేకుండా ఈ సభ జరగడం!.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
