సాక్షి, యాదాద్రి భువనగిరి: తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. రాజకీయంగా తాను ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెబుతాను అంటూ క్లారిటీ ఇచ్చారు. పార్టీ మార్పు అంటూ తప్పుడు ప్రచారాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం, చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని చెరువులను పరిశీలించి గంగ పూజను నిర్వహించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని చెరువు నిండినప్పుడు కాలనీలు జలమయం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం, రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..‘చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధికి 500 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపుదిద్దబోతున్నాం. చౌటుప్పల్ చెరువుకు ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తుగా ప్రణాళికలు వేసి దండు మల్కాపురం, లక్కారం వద్ద వరద నీటిని డైవర్ట్ చేయడంతో మున్సిపాలిటీ ప్రజలకు వరద ముప్పు తప్పిందని తెలిపారు.
పార్టీ మార్పుపై..
పార్టీ మారుతున్నానని సొంత పార్టీ వాళ్లు, బయట పార్టీ వాళ్లు నాపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు దుష్ప్రచారాలను ఎవరు నమ్మవద్దు. నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రకటిస్తాను. నేను ప్రస్తుతం సిన్సియారిటీ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తను, ఎమ్మెల్యేను.. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే పని చేస్తాను. క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కార్యకర్తగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉంటా. నా ముందు మునుగోడు అభివృద్ది తప్ప, మరో ఆలోచన లేదు. నాపై సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాలను నమ్మవద్దు అంటూ కామెంట్స్ చేశారు.


