
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డి గురుశిష్యులని ప్రతీతి. అప్పుడప్పుడూ ఈ ప్రచారాన్ని రేవంత్ తోసిపుచ్చుతున్నట్లు కనిపించినా.. కొన్ని సందర్భాల్లో అది నిజమే అన్నట్టుగానూ ఉంటుంది. విభజన సమస్యలు, ఆస్తుల పంపిణీ, విద్యుత్తు బకాయిల వంటి ముఖ్యమైన అంశాలపై కాకుండా.. బనకచర్ల ప్రాజెక్టు ఏదో పెద్ద విపత్తు అయినట్లు ఇరువురూ ఢిల్లీలో సమావేశం కావడం ఈ విషయాన్ని రూఢి చేస్తోంది.
కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగిన తీరు, ఆ తరువాత వచ్చిన వార్తలు, నేతలు చేసిన వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే.. రేవంత్ ఏదో మొహమాటానికి ఢిల్లీ వెళితే.. శిష్యుడిని మేనేజ్ చేద్దామనుకున్న చంద్రబాబు భంగపడ్డట్టుగా కనిపిస్తుంది. ఈ సమావేశంలో బనకచర్ల ప్రస్తావనే రాలేదని రేవంత్ రెడ్డి ఒకటికి రెండుసార్లు స్పష్టం చేసినా చంద్రబాబు దీనికి బదులేదీ ఇచ్చినట్టు లేదు. పైగా.. ఏదో కమిటికి ఈ వ్యవహారాన్ని అప్పగించినట్లు చంద్రబాబు తన కేబినెట్ మంత్రి రామానాయుడితో చెప్పించడం రేవంత్‌ను ఇబ్బందిపెట్టే విషయం అయిపోయింది. బదులుగా రేవంత్ మరోసారి తన వాదన వినిపించి ఆత్మరక్షణలో పడితే.. చంద్రబాబు ఢిల్లీ నుంచి నేరుగా రాయలసీమలో ఒక నీటి విడుదల కార్యక్రమానికి వెళ్లి కూడా బనకచర్ల ప్రస్తావన చేయకపోవడం ద్వారా డిఫెన్స్‌లో పడినట్లు విశ్లేషించుకోవాలి. తద్వారా చంద్రబాబు బనకచర్ల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శించే ఆస్కారం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుల గురించి చంద్రబాబు కొన్ని నెలలుగా విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలోని వివిధ రాజకీయ పక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోటాపోటీ విమర్శలు చేసుకున్నాయి. నిజానికి బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ చాలా కష్టమని అంతా భావిస్తున్నారు. అందులోను పోలవరం ప్రాజెక్టు ఎత్తును 150 అడుగుల నుంచి 135 అడుగులకు తగ్గించడానికి చంద్రబాబు సర్కార్ అంగీకరించిందన్న వార్తల నేపథ్యంలో ఆ సందేహం మరింతగా బలపడుతోంది. దీనివల్ల ఏపీకి తీరని నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశం నుంచి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా బనకచర్ల డ్రామాకు తెరతీయగా, రేవంత్ పరోక్షంగా సహకరించారన్న విమర్శలు వస్తున్నాయి. సీఎంల భేటీలో బనకచర్ల ప్రాజెక్టు అజెండాపై తాము అంగీకరించడం లేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. అనుమతే లేని ప్రాజెక్టుపై చర్చ అసమంజసమని కూడా అభిప్రాయపడింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. దీంతో బనకచర్ల అజెండాలో ఉంటే రేవంత్ వెళతారా? లేదా? అన్న ప్రశ్న వచ్చింది. ఒకవేళ వెళ్లినా బనచర్ల అజెండా అయితే రేవంత్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి బృందం బాయ్ కాట్ చేస్తుందని కూడా లీక్ ఇచ్చారు.
ఎలాగైతేనేం కేంద్ర మంత్రి సి.ఆర్.పాటిల్ సమక్షంలో ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల సీఎంలు పరస్పరం సత్కరించుకున్నారు. కేంద్ర మంత్రిని సన్మానించారు. బాగానే ఉంది. కాని బయటకు వచ్చి సమావేశం వివరాలను చెప్పిన తీరు మాత్రం ఆశ్చర్యం కలిగించింది. రేవంత్ రెడ్డి బనకచర్ల ప్రస్తావన రాలేదని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టును చేపడతామని ఏపీ చెబితే కదా.. తాము ఆపాలని చెప్పాల్సింది అని ఆయన అన్నారు. పైగా ఇదసలు అనధికార సమావేశమని అనడం ఆసక్తికరంగా ఉంది. కేంద్రం ఇలా అనధికార సమావేశాలు పెడుతుందా? కేంద్ర మంత్రి అంత పని లేకుండా ఉంటారా? ఈ మాత్రం దానికి హైదరాబాద్‌లోనో, అమరావతిలోనో భేటీ జరుపుకున్నా సరిపోతుంది కదా? అన్న వ్యాఖ్యలు వచ్చాయి. అయితే రెండు రాష్ట్రాల నీటి సమస్యలపై కేంద్రం కమిటీ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. సీఎంలు పరిష్కరించుకోలేని సమస్యలను అధికారులు తీర్చగలుగుతారా! అనే సందేహం వస్తుంది. అది వేరే విషయం.
రేవంత్ వ్యాఖ్యలకు భిన్నంగా ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు చెప్పారు. బనకచర్లకు సంబంధించి సాంకేతిక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకుని కమిటీ వేయాలని నిర్ణయించినట్లు అన్నారు. అది నిజమా? కాదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. రేవంత్ చెప్పినదాని ప్రకారం అసలు బనకచర్ల ప్రస్తావనే రాలేదు. కేంద్ర జల్ శక్తి శాఖ పీఐబీ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో కూడా బనకచర్ల గురించి ఏమీ తెలపలేదు. దాంతో చంద్రబాబు బృందం ఇన్నాళ్లు చేసిన హడావుడంతా ఒట్టిదేనా అన్న విమర్శలు వస్తున్నాయి. అదే టైమ్‌లో రేవంత్ చెప్పిన దానిలో ఎంతవరకు వాస్తవం ఉందన్న ప్రశ్నను బీఆర్‌ఎస్ వేస్తోంది. సీఎంల భేటీ అజెండాలో బనకచర్ల అంశం ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. అటువంటప్పుడు అజెండాలోని అంశంపై ఎవరూ మాట్లాడలేదా?,
తెలుగుదేశం మీడియా ఏపీ ఎడిషన్లలో చంద్రబాబు బనకచర్ల గురించి మాట్లాడారని, తెలంగాణ ఎడిషన్లలో ఆ ఊసే లేదన్నట్లుగా కథనాలు వచ్చాయి. ఒకవేళ చర్చ జరిగి ఉంటే, రేవంత్ తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించినట్లవుతుంది. మాట్లాడకుండా ఉండి ఉంటే చంద్రబాబు ఏపీ ప్రజలను మోసం చేసినట్లు అవుతుంది. మరి వీరిద్దరిలో ఎవరు నిజం చెప్పినట్లు? రేవంత్ ప్రకటనపై చంద్రబాబు వివరణ ఇవ్వాలి. అలాగే ఏపీ మంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ స్పందించాలి.
రేవంత్ రెండో రోజు కూడా దీనిపై కొంత స్పష్టత ఇచ్చినా, చంద్రబాబు నోరు మెదపలేదు. తనకు అనుకూలంగా ఉంటే చంద్రబాబు ఈపాటికి ప్రచారంతో హోరెత్తించే వారు. కాని ఆయన అలా చేయకపోవడం, రాయలసీమ టూర్లో కూడా ప్రస్తావించకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది.
ఏపీలో టీడీపీ ప్రభుత్వానికి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య మాచ్ ఫిక్సింగ్ ఉందన్న అభిప్రాయం వ్యాప్తిలో ఉంది. దానికి ఇప్పుడు బీజేపీ కూడా తోడైనట్లు అనిపిస్తుంది. కేంద్రమైనా వాస్తవం ఏమిటో వెల్లడిస్తుందా? లేదా? రేవంత్, నిమ్మలతోపాటు కేంద్రం కూడా ఒకే తరహా ప్రకటన చేసి ఉంటే ఈ గందరగోళానికి అవకాశం ఉండేది కాదు. అలా కాకుండా ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు స్టేట్మెంట్లు ఇవ్వడంతో వారికే తలనొప్పిగా మారిందని చెప్పాలి. ఇక ఇద్దరు సీఎంలు కూర్చుని అంగీకరించినట్లు చెబుతున్న టెలిమెట్రీ ఏర్పాటు, హైదరాబాద్‌లో గోదావరి బోర్డు, విజయవాడలో కృష్ణా బోర్డు ఉండాలన్న నిర్ణయం, శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మతులకు ఏపీ అంగీకారం వంటివే ప్రధాన చర్చాంశాలై ఉంటే మాత్రం ఇది కాలక్షేపపు సమావేశమే అవుతుందని కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే అవి ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నవే.
కాగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్లు ఉండాలని, కాని చంద్రబాబు ప్రభుత్వం 41.15 మీటర్లకు తగ్గించేందుకు అంగీకరించిందని అంటున్నారు. ఈ నీటి మట్టానికి పరిమితమైతే బనకచర్ల ప్రాజెక్టుకు నీరు ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు. దీనికి కూడా చంద్రబాబు ప్రభుత్వం జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. కాని అన్నిటికి దబాయించడమే పద్దతిగా పెట్టుకున్న చంద్రబాబు టీమ్ వీటిపై ఎంతవరకు వాస్తవాలు వెల్లడిస్తుందన్నది సందేహమే. ఏతావాతా చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను పణంగా పెట్టి మళ్లీ రెండు కళ్ల సిద్దాంతం ఆలపించినట్లు టీడీపీ మీడియాలో రాయించుకున్నారా? అన్న భావన కలుగుతోంది.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.