బనకచర్ల.. గురు శిష్యుల డ్రామా? | KSR Comment On CBN Revanth Banakacherla Drama | Sakshi
Sakshi News home page

బనకచర్ల.. గురు శిష్యుల డ్రామా?

Jul 10 2025 9:39 AM | Updated on Jul 10 2025 11:54 AM

KSR Comment On CBN Revanth Banakacherla Drama

రాజకీయాల్లో కొందరు గాల్లో కత్తులు తిప్పుతూంటారు. అదే యుద్ధమని జనాన్ని నమ్మించే ప్రయత్నమూ జరుగుతూంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల్లో హడావుడి జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంతి​ గత ఏడాది అధికారంలోకి వచ్చింది మొదలు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూనే ఉన్నారు. సుమారు రూ.85 వేల కోట్లతో గోదావరి నీటిని రాయలసీమకు తరలిస్తామని ప్రతిపాదించారు. కేంద్రం కూడా నిధుల రూపంలో సాయం చేయాలని కోరారు. అయితే.. 

పలు లిఫ్ట్‌లు, రిజర్వాయర్లు, సొరంగాలతో కూడిన బనకచర్ల ప్రాజెక్టు అంత తేలికగా అయ్యేది కాదన్నది అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వమేమో సాయం సంగతి దేవుడెరుగు... పంపిన ప్రతిపాదననే తిప్పి పంపింది. జలసంఘం ఆమోదం తరువాత పర్యావరణ అనుమతులు కూడా తీసుకుని మాట్లాడమని సూచించింది. ఇదంతా ఒక పార్శ్వమైతే.. ఇదే ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలో ఇంకో రకమైన రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఈ అంవాన్ని పెద్ద వివాదంలా మార్చి వాదోపవాదాలు సాగిస్తున్నాయి. రెండు పార్టీలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూండటం గమనార్హం. కానీ... ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంతున్నారు. 

తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రాజెక్టులను అంగీకరించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డిలు స్పష్టం చేస్తూనే కేసీఆర్‌ హయాంలోనే తెలంగాణకు నష్టం జరిగిందని విమర్శిస్తున్నారు. వీరు ఒక ప్రజెంటేషన్ ఇస్తే, దీనికి పోటీగా బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి టి.హరీష్ రావు మరో ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేస్తోందని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు గురు శిష్యులని, అందుకే బనకచర్ల ప్రాజెక్టుకు సహకరిస్తున్నారని హరీష్‌ అంటున్నారు. 

చంద్రబాబు, రేవంత్‌లు హైదరాబాద్‌లో భేటీ అయినప్పుడే బనకచర్ల ప్రాజెక్టుకు ఓకే చేశారని హరీష్‌రావు ఆరోపిస్తున్నారు. ఆ తరువాత ఉత్తం కుమార్ రెడ్డి విజయవాడ వెళ్లి చంద్రబాబు వద్ద బజ్జీలు తిని మరీ ఈ ప్రాజెక్టుకు ఓకే చేసి వచ్చారని అన్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలోనే తెలంగాణ నీటి వాటాలలో నష్టం జరిగిందని, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమైనప్పుడు ఇందుకు బీజం పడిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కేసీఆర్‌, జగన్‌లు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఒక భేటీ జరిగిన మాట నిజమే. 

గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి జూరాలకు తరలించడానికి కేసీఆర్‌ ప్రతిపాదించగా, దానిని పరిశీలించడానికి జగన్ ఒప్పుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు వల్ల ఏపీకి ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం  ఏర్పడడంతో అది ముందుకు సాగలేదు. కేసీఆర్‌, జగన్‌లు అయినా, చంద్రబాబు, రేవంత్ అయినా సమావేశమైతే ఉభయ రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ప్రయత్నించవచ్చు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీ పక్షాన ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. తదుపరి చంద్రబాబుకు చెప్పే కాంగ్రెస్‌లో చేరారు. తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండి, పిమ్మట పీసీసీ అధ్యక్షుడై, ఎన్నికలలో గెలవడంతో ముఖ్యమంత్రి అయ్యారు.అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పరోక్షంగా తెలంగాణ టీడీపీ కూడా సహకరించడం బహిరంగ రహస్యమే.

చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, కాంగ్రెస్‌తో కూడా స్నేహం చేస్తున్నారన్నది రాజకీయ వర్గాలలో ఉన్న మాట. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రేవంత్‌లు కలిసి కూర్చుని విభజన సమస్యలను చర్చించి పరిష్కారం కనుక్కుని ఉంటే బాగుండేది. తెలంగాణ నుంచి ఏపీకి సుమారు రూ.ఏడువేల కోట్ల  విద్యుత్ బకాయిలు రావల్సి ఉంది. హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి ఆస్తుల్లో వాటా తెచ్చుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించి ఉండాల్సింది. తనను చంద్రబాబు శిష్యుడని చెప్పడాన్ని రేవంత్ అంత ఇష్టపడక పోయినట్లు  కనిపిస్తుంటారు. అయినా వారిద్దరి మధ్య సంబంధ, బాంధవ్యాలు  బాగానే ఉన్నాయని అంటారు. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రేవంత్ ఉదాసీనంగా ఉన్నారని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. 

గోదావరి జలాలలో 1500 టీఎంసీల నీటిని కేటాయించిన తర్వాత ఏపీ ప్రాజెక్టును చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం వాదనగా ఉంది. అయితే తాము వరద జలాలను మాత్రమే వాడుకోదలిచామని, తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడడం లేదని చంద్రబాబు చెబుతున్నారు. నిజానికి తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం, ఏపీ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులపై గతంలో ఏపీ కేంద్రానికి ఫిర్యాదు చేస్తే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై పలు ఆరోపణలు చేస్తూ తెలంగాణ అడ్డుపడింది. ఇప్పుడు బనకచర్ల విషయంలో కూడా తెలంగాణ గట్టిగా అడ్డుపడుతున్నట్లు కనిపిస్తుంది. బీజేపీ కోణంలో చూస్తే వారికి తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న  నేపథ్యంలో కేంద్రం ఏపీకి ఎంతవరకు సహకరిస్తుందన్నది సందేహమే. 

ఇక్కడ విశేషం ఏమిటంటే బనకచర్ల ప్రాజెక్టు చేపట్టడం వల్ల ఏపీకి వచ్చే లాభం ఏమీ లేదని, తెలుగుదేశానికి మద్దతుదారుగా పేరొందిన మాజీ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుతో సహా మరికొందరు ప్రత్యేకంగా సమావేశం పెట్టి ప్రకటన చేశారు. అంతేకాక 18.5 కిలోమీటర్ల వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల తవ్వకాలు రెండున్నర దశాబ్దాలుగా సాగుతూనే ఉన్నాయని, అయినా అవి ఒక కొలిక్కి రాలేదని, అలాంటిది ఇప్పుడు ఏకంగా నల్లమల అడవులలో, కొండల్లో 26.5 కీలోమీటర్ల మేర సొరంగం తవ్వకం ఆరంభిస్తే అది ఎప్పటికి పూర్తి అవుతుందని వారు ప్రశ్నించారు. చంద్రబాబుకు ఒక లక్షణం ఉంది. తాను ఏమైనా ప్రతిపాదిస్తే, ఎవరూ దాన్ని వ్యతిరేకించరాదని భావిస్తారు. భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తే అభివృద్ది వ్యతిరేకులంటూ వారిపై తట్టెడు బురద వేసి ప్రజల మైండ్ ఖరాబు చేస్తుంటారు. ఇందుకు తనకు మద్దతు ఇచ్చే మీడియాను పూర్తిగా వాడుకుంటారు. అందువల్ల ఏపీలో  తెలుగుదేశం మినహా ఇతర రాజకీయ పార్టీలేవి ఈ ప్రాజెక్టుపై పెద్దగా స్పందించడం లేదు. ఇదంతా ఏపీలోని కూటమి ప్రభుత్వం, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ఆడుతున్న డ్రామా అని ఆయా రాజకీయ నేతలు భావిస్తున్నారు. సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కావాలని ఎవరు అడిగారని ప్రశ్నించారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురుశిష్యులు చంద్రబాబు, రేవంత్‌ కలిసి ఈ డ్రామా నడుపుతున్నారని, చంద్రబాబుకు  ఈ ప్రాజెక్టు పూర్తిచేసే ఉద్దేశం లేదని అభిప్రాయపడ్డారు. 

గతంలో వైఎస్సార్‌సీపీ కూడా ఇదే తరహా ప్రాజెక్టుకు డీపీఆర్‌ పంపించింది. ప్రభుత్వం మారడంతో బనకచర్ల ప్రాజెక్టు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తోంది. బనకచర్ల ప్రాజెక్టు చేపట్టడం అంత తేలిక కాదన్న సంగతి అందరికి తెలుసు. ఎందుకంటే  ఏకంగా రూ.85 వేల కోట్ల వ్యయం అవుతుంది. అది అక్కడితో ఆగుతుందన్న నమ్మకం కూడా లేదు. కేంద్రం దీనికి నిధులు కేటాయించితే పెద్ద విశేషమే. 

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వలేదు. అయినా కేసీఆర్‌ రుణాలు తెచ్చి ఆ ప్రాజెక్టును నిర్మించారు. కాని అందులో ఒక భాగం దెబ్బతినడం కేసీఆర్‌ ప్రభుత్వానికి ఇరకాటమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల వాయిదాలు సరిగా చెల్లించలేక పోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునే యత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో బనకచర్లకు రుణాలు వచ్చే అవకాశం ఎంతన్నది చెప్పలేం. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టినా, తెలంగాణకు వచ్చే నష్టం పెద్దగా ఉండకపోవచ్చు. అయినా  రాజకీయ పక్షాలు పరస్పర విమర్శలు సాగిస్తూ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే  యత్నం చేస్తున్నాయి. మరో వైపు ఏపీ ప్రభుత్వం తామేదో  పెద్ద ప్రాజెక్టును చేపడితే ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పి జనాన్ని మభ్యపెట్టే యత్నం చేస్తున్నట్లు  అనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును కేంద్రం  తగ్గించిన అంశాన్ని పక్కన బెట్టి డైవర్షన్ రాజకీయాలలో భాగంగా చంద్రబాబు ఈ వ్యూహం అమలు చేస్తున్నట్లు  కనిపిస్తుంది. 

చంద్రబాబు నాయుడుకు ఒకప్పుడు భారీ  ప్రాజెక్టులపై అంత విశ్వాసం ఉండేది కాదు. కాని వైఎస్ రాజశేఖరరెడ్డి భారీ ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న విషయాన్ని గుర్తించి, ఇప్పుడు ఆయన  కూడా ఆ రాగం ఆలపిస్తున్నారు. అయితే ఆ పాట పాడుతున్నది చిత్తశుద్దితోనా, రాజకీయం కోసమా అన్నదానిపై ఎవరికి కావల్సిన  విశ్లేషణ వారు చేసుకోవచ్చు.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement