ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోబుల్ పర్సన్ అట! కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఈ మేరకు ఆయనకు కితాబిచ్చినట్లు ఈమధ్యే ఈనాడు చాలా ప్రముఖంగా ప్రచురించింది. ఏపీ భవిష్యత్తు కోసం చంద్రబాబు తన జీవితాన్నే అంకితం చేశారని కూడా ఆయన అన్నట్టు.. వీళ్లు చెప్పుకున్నారు. రాజకీయ నేతలు ఒకరినొకరు ప్రశంసించుకోవడం మామూలే కానీ.. అవి కొంచెం అతిగా అనిపిస్తే మాత్రం మెచ్చుకున్న వ్యక్తిని కూడా శంకించాల్సి వస్తుంది. ఇంతకీ నోబుల్ అన్న పదానికి అర్థం తెలుసా?.. ఉత్తమమైన, ఆదర్శవంతమైన, విశిష్టమైన రీతి అని.
.. చంద్రబాబు నలభై ఎనిమిదేళ్ల రాజకీయ జీవితంలో పైన చెప్పుకున్నవి మచ్చుకైనా కనిపించాయా అన్నదే ప్రశ్న! అధికారం కోసం ఎంతకైనా దిగజారే అవకాశవాదం చంద్రబాబుదని ప్రత్యర్ధులు అభివర్ణిస్తారు. ముఖ్యమంత్రి పీఠమెక్కేందుకు పిల్లనిచ్చిన మామనే కూలదోసిన చరిత్ర బాబుది. ఏ ఎండకా గొడుగు అన్నట్టు ఎన్నికలొచ్చిన ప్రతిసారి బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తులు కలుపుకున్న వైనమూ అవకాశ వాద రాజకీయాన్ని ధ్రువీకరిస్తాయి. అంతెందుకు.. ప్రస్తుత ప్రధాని.. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని ఉగ్రవాదని ఆరోపించింది ఈయనే. ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెడితే అరెస్ట్ చేస్తామని హెచ్చరించిందీ బాబే. వ్యక్తిగత దూషణలు బహిరంగంగా చేసిందీ ఈయనే. కానీ.. 2024 ఎన్నికల సమయం రాగానే.. అవసరాన్నిబట్టి.. అన్నీ మరచిపోయి.. బీజేపీతో పొత్తుకు వెంపర్లాడింది కూడా ఈయనే. పోనీ అధికారంలోకి వచ్చిన తరువాతైనా ఈయన తీరు ఏమైనా మారిందా? ఊహూ లేదు. ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలకు ఎలాంటి పనులూ చేయవద్దని అధికారులను ఆదేశించడం ఏ రకమైన ఆదర్శమవుతుందో ఈనాడుకే తెలియాలి.
2019లో ఓడిపోయిన తరువాత చంద్రబాబు పీఏ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసి రూ.రెండు వేల కోట్ల అక్రమాలు కనుగొన్నట్లు సీబీటీడీనే ప్రకటించింది. ఆదాయపన్ను శాఖ మరో కేసులో ఆయనకు నోటీసు ఇచ్చింది. విచిత్రంగా.. కేంద్ర ప్రభుత్వం వాటి గురించి మళ్లీ అసలు ప్రస్తావించనే లేదు. నోబుల్ పర్సన్‌గా గుర్తించిందేమో మరి!. గడ్కరీ పొగిడిన వార్త వచ్చిన రోజునే వివిధ మీడియాలలో వచ్చిన కొన్ని వార్తలు గమనిస్తే ఇలా కూడా నోబుల్ కావచ్చా? అన్న సంశయం వస్తుంది.
చంద్రబాబుపై గత ప్రభుత్వ హయాంలో స్కిల్ స్కామ్ కేసు వచ్చింది.స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో జరిగిన కుంభకోణం ఇది. దీనిని తొలుత గుర్తించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన జీఎస్టీ, ఈడీ అధికారులే. కొంతమందిని ఈడి అరెస్టు కూడా చేసింది. వైసీపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించగా... చంద్రబాబు ఆదేశాల మేరకే బోగస్ కంపెనీకి రూ.300 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్లు తేలింది. షెల్ కంపెనీల ద్వారా కొన్ని నిధులు టీడీపీ బ్యాంక్ ఖాతాలలోకి కూడా వచ్చిందని సీఐడీ కోర్టుకు నివేదించింది. ఈ కేసులో ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు 53 రోజులపాటు జైలులో ఉన్నారు. ఆరోగ్య కారణాలతో హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. 2024లో అధికారంలోకి రావడంతో ఈ కేసును క్లోజ్ చేసే పనిలో కొందరు ప్రముఖ లాయర్లను నియమించారు. వారు ఇందుకు మార్గాలను అన్వేషించి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటూ కొత్త టెక్నిక్ ను ప్రయోగించి కేసు పెట్టిన సీఐడీ ద్వారానే ఉపసంహరించేలా చేశారు. ఈ స్కామ్‌పై ఫిర్యాదు చేసిన అప్పటి కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్ రెడ్డి పిటిషన్ కూడా కోర్టు అనుమతించలేదు.
చంద్రబాబు నిజంగానే నోబుల్ పర్సన్ అయిఉంటే ఆ కేసు విచారణను ఎదుర్కొని తన తప్పు ఏమీ లేదని రుజువు చేసుకుని ఉండవచ్చు!. దురదృష్టవశాత్తు అవినీతి కేసులను విచారణ చేయకుండా మూసివేతకు న్యాయ వ్యవస్థ కూడా అంగీకరించడం ఎంతవరకు మంచి సంప్రదాయం అవుతుందన్న ప్రశ్నను పలువురు న్యాయ నిపుణులు వేస్తున్నారు. మద్యం స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్‌లలోనూ చంద్రబాబు కేసులు లేకుండా చేసుకున్నారు. ఈ కేసులకు సంబంధించిన తీర్పు సర్టిఫైడ్ కాపీలను థర్డ్ పార్టీకి ఇవ్వడానికి కూడా కోర్టు అంగీకరించకపోవడంపై కూడా పలువురు అభ్యంతరం చెబుతున్నారు.. పారదర్శకంగా ఉండాల్సిన న్యాయ వ్యవస్థ ఇలా వ్యవహరించరాదన్నది న్యాయ నిపుణుల భావన. దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లారు. అది ఏమవుతుందో తెలియదు.
కొద్ది రోజుల క్రితమే సాంకేతిక కారణాలతో కొందరు అధికారులపై ఉన్న అవినీతి కేసులను రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టి తిరిగి విచారణకు ఆదేశించింది. అవినీతి కేసులను ఉపసంహరించే అధికారం కింది కోర్టులకు లేదని కూడా గతంలో పేర్కొంది. వీటితో సంబంధం లేకుండా చంద్రబాబు కేసుల నుంచి బయటపడడం విశేషం. ఇదంతా నోబుల్ పర్సన్ చంద్రబాబు చేయవచ్చని గడ్కరీ భావిస్తున్నారా?..
పవన్ కళ్యాణ్‌తో కలిసి ప్రకటించిన ఎన్నికల మానిఫెస్టో, అందులోని అంశాలు, వాటిని అమలు చేయలేకపోయినా, అన్నీ చేసేసినట్లు కలరింగ్ ఇవ్వడం, మత రాజకీయాలు చేయడానికి వెనుకాడకపోవడం, చివరికి తిరుమల ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని దారుణమైన ఆరోపణ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసినా, ఇంతవరకు దానిపై వివరణ ఇవ్వకపోవడం, తను చేసే తప్పులన్నిటిని ఎదుటివారిపై రుద్దడం, చివరికి ప్రజల ప్రాణాలకు హానికరమైన మద్యపానాన్ని ప్రమోట్ చేసేలా ఎన్నికలలో ప్రచారం చేయడం.. ఇలాంటి వాటన్నిటిని చేసినా నోబుల్ పర్సన్ అవుతారేమో తెలియదు! పోనీ ఇకనైనా అబద్దాలు చెప్పడం మాని చంద్రబాబు నోబుల్ పర్సన్ అనే పేరు తెచ్చుకోవడానికి కృషి చేస్తే సంతోషించవచ్చు.!

::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


