
అభిప్రాయం
‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసింది!’ కోట్లాది హిందు వుల మనోభావాలను గాయపరుస్తూ ఏపీ ముఖ్యమంత్రి అయిన కొద్ది కాలానికే చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణ ఇది. ఆ వెంటనే దానిని అందుకుని సనాతని వేషం కట్టారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.
‘ప్రకాశం బ్యారేజీని బోట్లతో ధ్వంసం చేయడానికి యత్నించారు’... ఇది కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో బ్యారేజీ వద్దకు కొట్టుకు వచ్చిన బోట్ల గురించి చంద్రబాబు చేసిన మరో విమర్శ. ఇలా అనేక అభియోగాలను చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చేశారు. వాటన్నిటిలో అత్యధిక భాగం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆపాదించి చేశారు.
అలాగైతే ఎన్ని కేసులు పెట్టొచ్చు?
అధికారంలోకి వచ్చాకే కాదు, అంతకు ముందు విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ నేతలు జగన్‌పై పలు తీవ్రమైన అభియో గాలు గుప్పించారు. ‘జగన్ ఏపీలో ప్రజల భూములన్నీ కొట్టేయడా నికి యత్నిస్తున్నారు; జగన్ పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు’ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇక పవన్ కల్యాణ్ అయితే 30 వేల మంది అమ్మాయిలు ఏపీలో తప్పిపోయారంటూ వలంటీర్లపై నిందలు వేశారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రామాణికంగా తీసుకుంటే అప్పట్లో వారిపై ఎన్ని కేసులు పెట్టి ఉండవచ్చో! అలాంటి అబద్ధపు ఆరోపణలను ప్రచారం చేసిన ఎల్లో మీడియాపై ఎన్ని కేసులు పెట్టాలో! కానీ జగన్ టైమ్‌లో అలా చేయలేదు. వాటిని రాజకీయంగానే చూసి వదలివేశారు. ఇటీవలి కాలంలో ఏపీని పోలీసు రాజ్యంగా మార్చి, విపక్ష వైసీపీ వారిపైనే కాకుండా, తనకు గిట్టని ‘సాక్షి’ మీడియాపైనా చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి, వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ సంగతులు గుర్తు చేయవలసి వచ్చింది.
కేసులతో కొత్త రికార్డులు
రాజకీయ నేతల ప్రెస్ కాన్ఫరెన్స్‌ల ఆధారంగా మీడియాపై కేసులు పెడుతూ చంద్రబాబు ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవల వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ అమరావతి వరద ముంపు గురించి మీడియాకు ఒక విషయం చెప్పారు. ఆ వరద నీటి మళ్లింపు వల్ల గుంటూరు చానల్‌కు గండి పడిందనీ, తత్ఫలితంగా పొన్నూరు ప్రాంతంలో సుమారు 70 వేల ఎకరాల పంట పొలాలు మునిగాయనీ ఆరోపించారు. ఆయన చెప్పిన విషయాలను ‘సాక్షి’ ప్రచురించింది.
సాధారణంగా ప్రభుత్వ పక్షాన ఎవరైనా ఏమి చేయాలి? అది వాస్తవమా, కాదా? అన్నదానిని పరిశీలించి మీడియాకు వివరణ ఇచ్చి, వార్తను ప్రజలకు తెలియచేయాలని కోరవచ్చు. అలాకాకుండా సంబంధిత అధికారి ఒకరితో ‘సాక్షి’పై ఏకంగా కేసు పెట్టించారు. తాడేపల్లి పోలీసులు ‘సాక్షి’ ఎడిటర్ ఆర్. ధనంజయ రెడ్డికి నోటీసు ఇచ్చి తమ ముందు విచారణకు హాజరు కావాలని కోరారు. విశేషం ఏమిటంటే, ఇదే సమయంలో టీడీపీ మీడియా ఒక కథనాన్ని ఇస్తూ, అమరావతిలో వరద ముప్పు నివారణ కోసం ప్రభుత్వం ఆరు వేల కోట్లతో మరో రెండు ప్రాజెక్టులను చేపడుతోందని తెలిపింది.
కేసులు అక్రమమని తెలిసినా, పోలీసులు ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు లొంగక తప్పడం లేదు. ఆ మాట కొందరు పోలీసు అధికారులు జర్నలిస్టులకు వ్యక్తిగతంగా చెబుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇదంతా రెడ్ బుక్ ఎఫెక్ట్ అనీ, ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికీ, ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికీ ఇలాంటి అసంబద్ధ చర్యలకు దిగుతోందని తెలుస్తోంది. ‘సాక్షి’ గొంతు నొక్కివేస్తే తమను ప్రశ్నించేవారు ఉండ రని పెద్దలు భావిస్తున్నారేమో తెలియదు.
మరో వార్త చూడండి. అవినీతి కారణంగానే పోలీసు అధికా రుల ప్రమోషన్లను జాప్యం చేస్తున్నారని ‘సాక్షి’ స్టోరీ ఇచ్చింది. దానికి పోలీస్ పెద్దలకు కోపం వచ్చిందట. అది నిజం కాకపోతే వారు ఖండించవచ్చు. కానీ, పోలీసు ఉద్యోగుల సంఘం నేతతో కేసు పెట్టించేశారు. గతంలో ఈ తరహా వార్తలు మీడియాలో వస్తే సదరు సంఘం నేతలు వివరణ ఇచ్చేవారు. పాపం... ఇప్పుడు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కానీ, మరికొందరు టీడీపీ నేతలు, జనసేన క్యాడర్‌గానీ కొంతమంది పోలీసుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినా ఈ సంఘం నేతలు నోరు మెదపలేకపోతున్నారు.
కానీ ‘సాక్షి’ మీద సంఘం అధ్యక్షుడు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడం, అర్ధరాత్రి వేళ ‘సాక్షి’ ఆఫీస్‌కు పోలీసులు వచ్చి హడావిడి చేయడం జరిగింది. ఈ కేసులో కూడా విచా రణకు నోటీసులు ఇచ్చారు. ఆ విచారణకు ఎడిటర్ ధనంజయ రెడ్డితో పాటు సీనియర్ పాత్రికేయులు హాజర య్యారు. ఆ సందర్భంలో ఏ పోలీసు అధికారులు ఆ సమాచారం ఇచ్చారో చెప్పాలని కోరారట! జర్నలిజం సూత్రాల ప్రకారం సోర్స్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ రహస్యంగా ఉంచాలి.
అయినా ఆ వివరాలు కోరారు. ఆ పోలీసు అధికారులకు కూడా తమ శాఖలో జరుగుతున్న పరిణామాలు తెలిసే ఉండాలి. ఏ అధికారులు ప్రమోషన్లు పొందలేక పోయారో, దానికి కారణాలు ఏమిటో వారికి తెలిసి ఉండాలి. కానీ పై స్థాయి నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారని అర్థం అవుతుంది.
ద్వంద్వ ప్రమాణాలు
ఇంకో ఉదంతం చూద్దాం. రాయలసీమకు చెందిన ఒక పోలీసు అధికారి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుపై ‘సాక్షి’ ఒక వార్తను ఇచ్చింది. ఆ అధికారి పేరు రాయలేదు. తమకు వచ్చిన సమాచారంలో నిజం ఉందని నమ్మితే, కొన్ని జాగ్రత్తలు తీసుకుని కథనాలు ఇస్తుంటారు. ఈ స్టోరీపై సీనియర్ అధికారికి ఆగ్రహం వచ్చింది. వేరే అధికారిని పిలిచి కేసు పెట్టించారు.
ఆ అధికారి తను ఏ తప్పు చేయకపోతే, ఆ కథనం తనను ఉద్దేశించి రాశారన్న అభిప్రాయం కలిగితే ధైర్యంగా మీడియా సమావేశం పెట్టి తన వాదనను వినిపించి ఉండవచ్చు. తన పరువుకు భంగం కలిగించారని నోటీసు ఇచ్చి ఉండవచ్చు. అలా చేయకుండా మరొకరితో కేసు పెట్టించడంలోనే డొల్లతనం ఉందనిపిస్తుంది.
ఏపీ పోలీసుల ప్రవర్తనకు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగిన వైనమే పెద్ద శాంపుల్. తమ ఓట్లు తమను వేయనివ్వాలని కొందరు ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకున్నారంటే అది పోలీస్ వ్యవస్థకు ఎంత అప్రతిష్ఠో ఊహించుకోవచ్చు. కోర్టులలో బెయిల్ రాకుండా ఉండటం కోసం సంబంధం ఉన్నా, లేకపోయినా తోచిన సెక్షన్లు పెట్టి రిమాండ్ ఉత్తర్వులు వచ్చేలా చేయడంలో ఏపీ పోలీసులు స్పెషలైజేషన్ సంపాదించారన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ వారిపై వీలైనన్ని కేసులు పెట్టడం... అదే టీడీపీ, జనసేన కార్యకర్తలు తమ సమక్షంలోనే గూండాయిజానికి పాల్పడినా నిస్సహాయంగా ఉండిపోవడం సమాజానికే ప్రమాదకరమని చెప్పక తప్పదు.
రెండు రోజుల క్రితం మచిలీపట్నంలో జనసేన కార్యకర్తలు చేసిన గూండాయిజం తెలిసిందే! ‘సాక్షి’ టీవీ చర్చలో అభ్యంతర పదం వాడారని అంటూ కూటమి నేతలే కొంతమందిని పురిగొల్పి కృత్రిమ ఆందోళనలు చేయించారు. రాజకీయాలు ఎలా ఉన్నా, పోలీసు వ్యవస్థ ధర్మంగా, నిష్పక్షపాతంగా లేకపోతే అది సమాజానికి హానికరం. పోలీసులకు ప్రామాణికం రెడ్ బుక్ కాదనీ, రాజ్యాంగమనీ ఎప్పటికి గుర్తిస్తారో!
కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్