ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక రాజ్యం (జంగిల్ రాజ్) నడుస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఏడాదిన్నర కూటమి పాలనపై జగన్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్య అన్ని విధాలుగా తగినదే. రాజకీయాల్లో తన అనుభవం చాలా పెద్దదని తరచూ చెప్పుకుంటూ తిరిగే చంద్రబాబు నాయుడు పాలన ఇంత అధ్వాన్నంగా, నాసిరకంగా చేయగలరని బహుశా ఆయన అభిమానులు కూడా ఊహించి ఉండకపోవచ్చు.
ప్రజాస్వామ్య విలువలకు కూటమి పాలనలో నిత్యం తిలోదకాలే. ప్రతిపక్ష పార్టీ నేతలపై కక్షసాధింపులు నిత్యకృత్యమవుతున్నాయి. ఈ కారణంతోనే ఒకప్పుడు టీడీపీకి మద్దతుగా నిలిచిన ఓ మిత్రుడు కూడా ‘‘అబ్బే ఇదేం పాలనండి.. చాలా ఘోరంగా ఉంది. మళ్లీ వచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే’’ అని చెప్పగలుగుతున్నారు. పల్నాడు ప్రాంతానికి వెళ్లి వచ్చిన తరువాత ఆయనీ వ్యాఖ్య చేయడం గమనార్హం. అసలక్కడ ప్రభుత్వమనేది ఒకటుందా? పనిచేస్తుందా? అన్న అనుమానం వచ్చిందని, ఎటు చూసినా అధికార పార్టీ కార్యకర్తల అరాచకాలే దర్శనమిస్తున్నాయని వివరించారు. ఈ అంచనా ఈయన ఒక్కరిదే కాదు.
రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో అక్కడి అరాచకాలను ప్రత్యక్షంగా చూసిన చాలామంది ఇదే మాట అంటున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీపై సాగుతోన్న అణచివేత ధోరణి, అక్రమ కేసులు, అరెస్టులపై ప్రజల్లోనూ తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేకపోగా.. అన్నీ చేసేశామని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నిత్యం బొంకుతూండటం, మంత్రి లోకేశ్ అహంభావ పూరిత ప్రకటనలు, జనసేన అధినేత, ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని ఊదరగొట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిమ్మకు నీరెత్తినట్లు ఉంటూండటం ప్రజల నైరాశ్యానికి కారణమన్న విశ్లేషణ వినిపిస్తోంది.
హంగు, ఆర్భాటాలు, వసతులు కల్పించి విధేయుడిగా మార్చుకోవడం ద్వారా పవన్ ప్రశ్నించలేని స్థితికి చేర్చారని అంచనా. కానీ చంద్రబాబుకు తన కుమారుడిని నియంత్రించే శక్తి లేకుండా పోయిందన్నది టీడీపీలో ఒక వర్గం అభిప్రాయం. లోకేశ్, ఆయన అనుచరుల పెత్తనాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. తనకు సంబంధం లేని హోం శాఖపై లోకేశ్ పెత్తనం చేస్తున్న తీరు, ఆయా శాఖలన్నిటిని పర్యవేక్షిస్తున్నారన్న భావన, టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు చంద్రబాబును కాకుండా లోకేశ్‌ను పొగడడానికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయం ప్రజలలో వ్యక్తం అవుతోంది.
ఈ స్థితిలో ఏపీలో జంగిల్ రాజ్ ఏర్పడిందన్న జగన్ వ్యాఖ్యను చాలామంది సమర్థిస్తున్నారు. ఈ మధ్యకాలంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడడం, ఇసుక, మద్యం, మైనింగ్‌లలో దందాలు చేస్తూ ఇష్టారాజ్యంగా సంపాదిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పోలీసు వ్యవస్థ అచేతనంగా ఉంటోంది. కోడిని కోశారంటూ వైపీసీ కార్యకర్తలపై కేసులు పెట్టి కొందరిని అరెస్టు చేసి రోడ్డుమీద నడిపించిన వైనం ఆటవిక పాలనకు దర్పణంగా నిలబడుతోందన్నది ఆ పార్టీ విమర్శ. అదే సమయంలో సంక్రాంతి సందర్భంగా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, నేతలు బీభత్సంగా కోడిపందాలు ఆడించి, వందల కోట్ల రూపాయల మేర పందాలు నడిపించినా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు.
ముఖ్యమైన పదవులలో ఉన్న కొందరు దగ్గరుండి కత్తులు కట్టించి కోడి పందాలు జరపడం, అక్కడ అన్ని రకాల జూదాలు నిర్వహించడం, పలు చోట్ల పోలీసులు కూడా వారిలో భాగస్వాములయ్యారన్న విమర్శలు రావడం వంటివి కళ్లెదుటే కనిపిస్తాయి. భారీ ఎత్తున బరులు తయారు చేసి, వేలాది మంది అక్కడ జమ కూడుతున్నా పోలీసులు అసలు పట్టించుకోలేదంటేనే ఇది ఎంత అధ్వాన్న పాలన అన్నది విదితమవుతోందని ప్రజలు చెప్పుకుంటున్నారు. విశేషం ఏమిటంటే హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి అనేక మంది, కొంతమంది మహిళలు సైతం భారీ ఎత్తున డబ్బు సంచులతో అక్కడకు వెళ్లి పందాలు కాసినా, పోలీసు వ్యవస్థ కాని, ఈడి వంటి సంస్థలు కాని అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇలా చేస్తున్న వారెవ్వరిని పట్టుకుని రోడ్డుమీద నడిపించలేదు. రికార్డింగ్ డాన్స్‌ల పేరుతో అశ్లీల నృత్యాలు చేస్తున్నా పోలీసులు ఆపలేదు.పైగా ఒక అధికారి ఎలా పాటపాడాలో, డాన్స్ చేయాలో చేసి చూపించారట. మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆ రికార్డు డాన్స్‌లో భాగస్వామి అవడంపై లోకేశ్ ఆగ్రహించారట. చివరికి పులివెందులలో కూడా టీడీపీ నేత మూడు కోట్లు వసూలు చేసి కోడి పందాలు నిర్వహించారని జగన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబు ప్రభుత్వానికి జంగిల్ సర్కార్ అని పేరు పెట్టారు.
ఇక ఎమ్మెల్యేలు కొందరు మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న తీరును కూడా జగన్ ప్రస్తావించారు. కూన రవికుమార్, నజీర్, ఆదిమూలం తదితర ఎమ్మెల్యేలపై వచ్చిన అభియోగాలను ప్రస్తావించారు. ఇటీవలే రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళను ఏడాదిన్నరగా వేధించిన వైనం, వివాహం చేసుకుంటానని మోసం చేసిన తీరు కూడా వివరించి అసలు వీళ్లు మనుషులేనా అని జగన్ ప్రశ్నించారు.ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, డీజీపీలతో సహా పలువురు అధికారులకు బాధితురాలు మొరపెట్టుకున్నా, ఎవరూ స్పందించలేదట. దాంతో ఆమె బహిరంగంగానే తన ఆవేదనను తెలియ చేసింది. ఫలితంగా కూటమి పరువు మొత్తం పోయింది.
మహిళల గౌరవానికి భంగం రానివ్వమని బోలెడన్న కబుర్లు చెప్పిన చంద్రబాబు, పవన్, లోకేష్.. ఈ ముగ్గురు నేతలు ఇన్ని ఘోరాలు జరుగుతున్నా నోరు విప్పడం లేదు. జనసేన ఎమ్మెల్యే పై వచ్చిన ఆరోపణల గురించి మీడియా ప్రశ్నించబోగా పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి తప్పించుకుని వెళ్లిపోవడం విమర్శలకు దారి తీసింది. దాంతో గతంలో ఆయన మహిళల రక్షణకు సంబంధించిన వీడియోలను చూపుతూ ఇలా పలాయనం చిత్తగించడం తగునా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఒక మంత్రిగారి పీఏపై ఆరోపణలు చేసిన మహిళను జైలుకు పంపడం, మంత్రి కుమారుడు స్వయంగా జూదం ఆడుతూ దొరికిపోవడం, మరో ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్స్‌తో పట్టుబడడం.. ఒక టీడీపీ ఎమ్మెల్యే జనసేన మహిళా నేత ప్రైవేటు వీడియోలను తీయించారన్న అభియోగాలు రావడం, వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై ఏకంగా ఒక మహిళా ఎమ్మెల్యే నేతృత్వంలో దాడి చేయడం, విధ్వంసం సృష్టించడం వంటివి ఈ ప్రభుత్వం జంగిల్ రాజ్ గా మారిన విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని అంటున్నారు.
ఈ మధ్యనే పల్నాడులో సాల్మన్ అనే వైసీపీ కార్యకర్తను టీడీపీ గూండాలు హత్య చేశారు. పిన్నెల్లి గ్రామానికి చెందిన సుమారు వంద కుటుంబాలను గ్రామంలోకి రానివ్వకుండా తరిమేశారట. ఇలా ఒకటి కాదు.అనేక అరాచకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఇవన్ని వింటుంటే ఏపీలో పరిస్థితి ఎవరికైనా ఆందోళన కలిగిస్తుంది. ప్రజలు అసహ్యించుకుంటున్నారు. జంగిల్ రాజ్ అన్న పేరు అతికినట్టు సరిపోతుందన్నమాట!

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


