వయ్యారి గోదారిపై మనసాయెరా ! | Papi Kondalu Boat Trip | Sakshi
Sakshi News home page

వయ్యారి గోదారిపై మనసాయెరా !

Feb 2 2026 5:49 AM | Updated on Feb 2 2026 5:54 AM

Papi Kondalu Boat Trip

పాపికొండల విహారానికి పోదామా..

ప్రకృతి సోయగాలను చూద్దామా.. 

జీవితానికి సరిపడ ఆనందాలను ఆస్వాదిద్దామా.. 

ఇంకెందుకాలస్యం.. పదండి మరి

రంపచోడవరం / వీఆర్‌ పురం: పాపికొండలు విహార యాత్ర. ఎందరో పర్యాటకులు వారి డైరీల్లో ‘టు బీ విజిట్‌’ జాబితాలో రాసుకునే విహార స్థలం. కొండ కోనల మధ్య గోదారి నీటి అలల సవ్వడితో.. చెవుల్లో గాలి ఈలలు వేస్తుంటే.. నునుపైన దూరపు కొండలు దగ్గరయ్యే కొద్దీ చెట్లు చేమలతో.. పచ్చదనంతో కంటి ఇంపుగా కనిపిస్తుంటే.. అక్కడక్కడా లంకల్లో ఇసుకు తిన్నెలు మనసులోని కోరికలకు రెక్కలు విప్పుతుంటే.. మనసు గంతులేయదా మరి.. ఎప్పుడెప్పుడు చూస్తామా అని. పదండి మరి ఇదే సరైన తరుణం. ఈ విహార యాత్రకు అక్టోబర్‌ నుంచి మార్చి మధ్య కాలం అనుకూలం. కారణం వాతావరణం బాగుండడం.. నీటిమట్టం బాగుండడం.

పాపికొండల సౌందర్యం.. వాటి మధ్య నుంచి గాలిని.. నీటిని చీల్చుకుంటూ ముందుకు సాగిపోయే పడవ ప్రయాణం. మొదలైంది మొదలు చివరి వరకు సాగి తిరిగి మొదటికి వచ్చే వరకు లెక్కకు మించిన మధుర భావాలను మనసు మూటగట్టుకుంటుంది. ఎన్నో ఏళ్ల వరకు గోదారి అలలపై.. గోదారి గట్లపై ఆడిపాడిన ఆ సన్నివేశాలను కనులముందు తారాడుతూనే ఉంటాయి. ప్రయాణం మొదలైన కొద్ది సేపటికే బోటు నిర్వాహకులు పర్యాటకులకు ఎంతో వినోదాన్ని అందిస్తుంటారు. ఎన్నెన్నో పోటీలు పెడుతుంటారు. పడవ సాగే మార్గంలోని ప్రతి చిన్న స్థలానికీ ఉన్న చరిత్రను విజ్ఞానదాయకంగా వివరిస్తుంటారు.  

రెండు బోటింగ్‌ పాయింట్లు.. 
పాపికొండల అందాలను తిలకించేందుకు పోలవరం జిల్లాలో పర్యాటక శాఖ రెండు బోట్‌ పాయింట్లను ఏర్పాటు చేసింది. దేవీపట్నం మండలం పోశమ్మగండి వద్ద ఒకటి, వీఆర్‌ పురం మండలం పోచవరం వద్ద మరొకటి. ఈ ప్రాంతాల నుంచి బోట్ల నిర్వాహకులు పర్యాటకులను ఎక్కించుకుని పాపికొండల విహార యాత్రకు తీసుకువెళ్తుంటాయి. అలాగే పాపికొండలు సందర్శనకు రాజమహేంద్రవరం నుంచి సీతానగరం, పురుషోత్తపట్నం మీదుగా పోశమ్మ గండి బోటు పాయింట్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య బోటు సామర్థ్యాన్ని బట్టి పర్యాటకులను ఎక్కించుకుని బయలుదేరుతుంది.

పోశమ్మగండి బోటు పాయింట్‌కు చేరుకున్న పర్యాటకులు ముందుగా అక్కడి అమ్మవారిని దర్శించుకుని తమ విహారయాత్ర ప్రారంభిస్తారు. బోటు అలా కదులుతూ అనేక చిత్ర నిర్మాణాలకు వేదికైన పూడిపల్లి గ్రామాన్ని సందర్శిస్తారు. తరువాత పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌ కనిపిస్తాయి. దేవీపట్నం చేరుకున్న తరువాత అల్లూరి దాడి చేసిన పోలీస్‌స్టేషన్, పోలవరం ముంపుతో మిగిలిన దేవీపట్నం గ్రామాన్ని దాటుకుంటూ వారి ప్రయాణం సాగుతుంది. కొండమొదలు దాటిన తరువాత పాపికొండలు దర్శనమిస్తాయి. ఈ విహార యాత్ర ఏడు గంటల పాటు సాగుతుంది. చివరిగా బోటు పేరంటపల్లి చేరుకుంటుంది. అక్కడ పురాతన శివాలయంలో పర్యాటకులు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఆ ఆలయాన్ని స్థానిక గిరిజనులు నిర్వహిస్తున్నారు. ఆలయంలోకి ఎవరు వెళ్లి మౌనంగా ధ్యానం చేసుకుని తిరిగి బోటు వద్దకు చేరుకుంటారు. ఈ గ్రామంలో గిరిజనులు తయారు చేసిన వెదురు వస్తువులు పర్యాటకులను ఆకర్షిస్తాయి.  

గోదావరి అందాలను ఆస్వాదించేందుకు.. 
పాపికొండలు విహార యాత్రకు వెళ్లిన పర్యాటకులు కొరుటూరు వద్ద అటవీశాఖ నిర్వహిస్తున్న పర్యాటక అతిథి గృహాల్లో బస చేసే అవకాశం ఉంటుంది. బోటు పాయింట్‌ నుంచి బయలు దేరిన తరువాత తిరుగు ప్రయాణంలో వారిని కొరుటూరు వద్ద వదిలిపెడతారు. మరుసటి రోజులు పేరంటాలపల్లి వెళ్లి తిరిగి వచ్చే బోట్‌లో పోశమ్మగండి పాయింట్‌కు చేరుకుంటారు. సిరివాక వద్ద పర్యాటకులు రాత్రి బస చేసేందుకు ఏర్పాట్లు ఉన్నాయి.  

పోచవరం పాయింట్‌ వద్ద నుంచి..
ఉదయం 10 గంటలకు పోచవరం బోటు పాయింట్‌ నుంచి బయలుదేరిన లాంచీ సాయంత్రం 5 గంటలకు తిరిగి అదే స్థలానికి వస్తుంది. ఈ పాయింట్‌లో మొత్తంగా 20 లాంచీలు అందుబాటులో ఉంటాయి. పండగ రోజుల్లో ఈ లాంచీలు పర్యాటకులతో కిక్కిరిసిపోతాయి. శని, ఆదివారాల్లో ఐదు నుంచి ఆరు బోట్లలో 700 మంది పర్యటనకు వెళ్తారు. వారికి ఉదయం అల్పాహారంగా ఇడ్లీ, ఉప్మా, గారెలు, వడ వంటివి అందిస్తారు. మధ్యాహ్నం పేరంటాలపల్లి వెళ్లే సరికి శాకాహార భోజనం పెడతారు. నైట్‌ హాల్ట్‌ చేయాలనుకునే పర్యాటకులకు సిరివాక వద్ద ఏర్పా ట్లు ఉంటాయి. పేరంటాలపల్లి వద్ద కొండరెడ్ల వెదురు అల్లకాలతో తయారు చేసిన పలు రకాల బొమ్మలు అల్లికలు ఆకట్టుకుంటాయి.

ఈ మొత్తం ప్రయాణం బోటింగ్‌ పాయింట్‌ నుంచి తిరిగి అదే పాయింటుకు చేరే వరకు 80 కిలో మీటర్లు ఉంటుంది. మరో విశేషం ఏంటంటే ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని 2008వ సంవత్వరంలో జాతీయ ఉద్యాన వనంగా ప్రకటించింది. భద్రాచలం రాములవారి దర్శనం అనంతరం పాపికొండల పర్యాటనకు బయలు దేరుతారు. భద్రాచలంలో టికెట్‌ ధర పెద్దలకు రూ.వెయ్యి. చిన్న పిల్లలకు రూ.700, ఐదేళ్ల లోపు చిన్నారులకు ఉచితం. తిరిగి వారంతా పోచవరం బోటుపాయింట్‌కు వచ్చాక పర్యాటకులను లాంచీకి 50 మంది చొప్పున పంపిస్తారు. లాంచీ బయలు దేరే ముందు ఏపీ టూరిజం, రెవెన్యూ, నీటిపారుదల, పోలీసు శాఖలు అనుమతి ఇచ్చిన తర్వాత బోటును అనుమతి ఇస్తారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement