అబ్బా.. ఆహా.. ఎంత బాగుందో! | KSR Comment: How ABN, Eenadu Twisted CBN Badhudu | Sakshi
Sakshi News home page

అబ్బా.. ఆహా.. ఎంత బాగుందో!

Jan 3 2026 10:40 AM | Updated on Jan 3 2026 10:50 AM

KSR Comment: How ABN, Eenadu Twisted CBN Badhudu

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎల్లో మీడియా పెను శాపమవుతోంది. కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న ఈ మీడియా ప్రజలపై వేల కోట్ల భారాన్ని కూడా నిస్సిగ్గుగా సమర్థించే స్థితికి చేరుకుంది. జర్నలిజం ప్రమాణాలకు ఎన్నడో తిలోదకాలు ఇచ్చిన ఈ మీడియాపై ప్రజలు మండిపడుతున్నారు. జగన్‌ సీఎంగా ఉండగా వదంతులతో, కల్పిత కథలతో విష ప్రచారం చేసిన మీడియా ధోరణి ఇప్పటికీ మారలేదు. ఆంధ్రజ్యోతి కొన్ని రోజులు క్రితం ‘‘బాదుడు కాదు.. బాగుకే’’ అన్న శీర్షికతో ప్రచురించిన కథనం దీనికో ఉదాహరణ. 

ఏపీలో వాహన కొనుగోలుదారులపై పది శాతం సెస్‌ వేయడాన్ని సమర్థించింది ఆంధ్రజ్యోతి తరఫున వచ్చిన ‘‘బాదుడు కాదు.. బాగుకే’’ అనే  కథనం. పైగా ఇందులోనే సెస్‌కు సంబంధించి ‘సాక్షి’ దినపత్రికలో ఇచ్చిన కథనంపై తన అక్కసునంతా వెళ్లగక్కింది.  సెస్‌ను ప్రభుత్వం సమర్థించుకుంటోందని రాసి ఉంటే అదో పద్ధతి అనుకునేవాళ్లు. కానీ.. పత్రిక స్వయంగా భుజానికెత్తుకోవడం సరైన నిర్ణయమంటూ రాసేయడంతోనే సమస్య. వాహనాల లైఫ్ టాక్స్‌పై మాత్రమే సెస్‌ అని, ఒక్కో వాహన కొనుగోలుదారుపై పడే భారం రూ.1200 అని ఈ కథనం చెబుతుంది. సాక్షి కూడా ఇదే కదా రాసింది. రాష్ట్రంలో సగటున నెలకు 73 వేల వాహనాలు అమ్ముడుపోతూంటే సెస్‌ వల్ల  ఏడాదికి రూ.270 కోట్ల భారం ప్రజలపైపడుతుందని సాక్షి రాసింది. కానీ ఎల్లోమీడియా దృష్టిలో ఇది పెద్ద భారమే కాదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో వారికి బాగా గిట్టుబాటు అవుతోంది మరి. 

ఇలాంటి అంశాల్లో మీడియా అనేది ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలి. అలా పన్నులు వేయడంలోని హేతుబద్దతను ప్రశ్నించాలి. అప్పులు తేకుండా, విద్యుత్ ఛార్జీలు పెంచకుండా పన్నుల బాదుడు లేకుండా ప్రభుత్వాన్ని నడిపి, సంపద సృష్టించి అన్ని హామీలను అమలు చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు ఎన్నికల సమయంలో పలికిన బీరాలను గుర్తు చేయాలి. అలా చేయకపోగా రోడ్లు బాగు చేయాలని, మద్యం తాగి నడిపే వారిని పట్టుకునేందుకు బ్రీత్ ఎనలైజర్లు, వేగం నియంత్రణకు స్పీడ్‌గన్లు ఏర్పాటు చేయాలని రాస్తోంది. ఇదే రకమైన బుద్ధో మరి? 

కూటమి ప్రభుత్వం రాగానే రోడ్లన్నీ బాగు చేసేశామని ఆ మధ్య ఎప్పుడో చెప్పారు కదా? అంతలోనే ఏమైంది?అవినీతి పుణ్యమా అని గోతులమయం అయ్యాయా? పైగా రహదారుల కోసం ఇప్పటికే సెస్‌లు ఉండగా అదనంగా ఎందుకు? పెట్రోల్, డీజిల్ ధరలపై ఇప్పుడున్న సెస్ ఎంత? ఆ మొత్తాన్ని రోడ్లకు వాడడం లేదు ఎందుకు? ఎన్నికలై 19 నెలలైనా ఇచ్చిన హామీ మేరకు పెట్రోలు, డీజిళ్ల ధరలు ఎందుకు తగ్గించలేదు? ఈ అంశాలపై ఎల్లో మీడియా ఎన్నడైనా వార్తలు ఇచ్చిందా?. 

జగన్ టైమ్‌లో చెత్త పన్ను కోట్లు వసూలు చేశారట. కాని ఎక్కడి చెత్త అక్కడ ఉందట. తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పారంటే రాజకీయం అనుకోవచ్చు కానీ.. ఆంధ్రజ్యోతి ఇంత పచ్చిగా అబద్దాలను ప్రచారం చేయడం ఎంత దుర్మార్గం? ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు స్థానిక సంస్థలలో నెలకు రూ.50 - 100 వసూలు చేసి పారిశుద్ధ్యం పనులు చేపట్టారు. వీటి ద్వారానే ప్రభుత్వానికి రూ.కోట్లు వచ్చాయట. ఇందులో ఇసుమంతైనా నిజం ఉందా? 

ప్రభుత్వం చెత్త పన్ను ఎత్తివేశామని చెప్పిన తర్వాత అనేక గ్రామాలు, పట్టణాలలో పరిస్థితి ఎంత అధ్వాన్నంగా మారిందో తెలియదా? ప్రస్తుతం  పిఠాపురం వంటి చోట్ల ఈ చెత్త పన్ను వసూలు చేస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. చెత్త పన్నుతో కోట్ల వచ్చాయట. ఇప్పుడేమో  లైఫ్ టైమ్ టాక్స్ పై పది శాతం సెస్ వేస్తే కాని రోడ్లు బాగు చేయలేరట.అది కోట్ల మొత్తం కాదని వీరు చెబుతున్నారా? వైసీపీ హయాంలో చెత్త పన్ను వేస్తున్నారని, చెత్త ప్రభుత్వం అని తప్పుడు ప్రచారం చేశారు. పెద్ద సంస్కరణవాదిని అంటూ గతంలో ఆస్పత్రులలో యూజర్ ఛార్జీలు వసూలు చేయించిన చంద్రబాబు అధికారంలో ఇంకో పార్టీ ఉంటే మాత్రం ఇలా చెబుతుంటారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడైనా రోడ్డు కావాలంటే స్థానికు ప్రజలు ఏభై శాతం భరించాలని ‘జన్మభూమి’ పథకం కింద నిబంధన పెట్టిన విషయంబ మరచిపోయారా?  ఆ తర్వాత కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాక ఆ షరతు తొలగించిన విషయం తెలిసిందే.  

రాష్ట్రంలో రోడ్లు బాగు చేయలేని ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి అమరావతి నిర్మాణం చేస్తుందట. ప్రైవేటు వ్యక్తులు చెత్త తొలగించడానికి ఏభయ్యో, వందో తీసుకుంటేనే తప్పు అని చెప్పిన చంద్రబాబు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా, వేల కోట్ల విలువైన ఆస్తులు కలిగిన  ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మాత్రం ప్రైవేటు వారికి అప్పనంగా ధారాదత్తం చేస్తారట. జగన్ చేస్తే బాదుడు ..చంద్రబాబు చేస్తే బాగుకే అని రాయడం అంటే పాఠకులను, ప్రజలను  మోసం చేయడం కాకుండా మరొకటి అవుతుందా?..  

గత నవంబర్ ఆఖరు వారంలో ఇదే పత్రిక ఒక కథనం ఇచ్చింది. సెస్సులు వేసి రోడ్లు వేయాలని రహదారుల శాఖ ప్రతిపాదన పెట్టింది. దాని ప్రకారం పెట్రోలు,  డీజిల్, గనులు,రిజిస్ట్రేషన్లపైన సెస్ వేసి స్టేట్ హైవేలను అభివృద్ది చేయాలని తలపెట్టారట. దీనిని ప్రజలపై భారం మోపడం అని అంగీకరించరా? ఈ భారం సుమారు రూ.30 వేల కోట్ల వరకు  ఉండవచ్చని ఇతర మీడియాలో కథనాలు వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం ఉంటే ఎంత బాదుడు బాదినా ఆహా,ఓహో అని పొగుడుతారా? అదే జగన్ ప్రభుత్వం ఉంటే అడ్డగోలుగా రాస్తారా?.. ఇప్పటికే కరెంటు చార్జీల సర్దుబాటు రూపంలో సుమారు రూ.17వేల కోట్లు మళ్లీ మరో రూ.15651 కోట్లకు ప్రతిపాదనలు ఇచ్చారా?లేదా? 

భూముల విలువలు పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో అదనంగా రూ.వెయ్యి కోట్లు ఆదాయం సమకూర్చుకుంటున్నారా? లేదా? గ్రామాలలో రక్షిత నీటి సరఫరాపై యూజర్ ఛార్జీలను వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందా? లేదా? ఒక వైపు  దాదాపు మూడు లక్షల కోట్ల అప్పుతో రికార్డు సృష్టించిన ప్రభుత్వం మళ్లీ అదనంగా ఈ బాదుడు ఏమిటి అని అడగవలసిన ఈ ఎల్లో మీడియా నిర్లజ్జగా బాజా కొడుతోంది.

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లు  తగ్గించినప్పుడు ఇదే ఎల్లో  మీడియా ఏమని  ప్రచారం చేసింది? జీఎస్టీ తగ్గించడంతో అన్ని రకాల వ్యాపారాలు పెరిగిపోయాయని, ప్రబుత్వానికి ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వస్తోందని కదా? ఇప్పుడేమో ప్రభుత్వం ఆదాయం తగ్గపోయిందని ఎందుకు సన్నాయిరాగం తీస్తున్నట్లు? మరో సంగతి చెప్పాలి. వైసీపీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లుల బకాయిలు ఇస్తోందట. అది తప్పట. పనులు చేయించుకున్న తర్వాత బిల్లులు చెల్లించవద్దని ఏ మీడియా అయినా రాయగలుగుతుందా? పనులలో ఏదైనా తేడా ఉంటే అది వేరే విషయం అసలు రాజకీయ కక్షలతో పాలన సాగించాలని ఒక మీడియా చెప్పడం ఉన్మాదం కాక మరేమవుతుంది. 

ఇక్కడ ఈనాడు మీడియా గురించి కూడా ఒక మాట చెప్పాలి. జగన్ టైమ్‌లో ఇండోసోల్ అనే కంపెనీకి ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సహకాలు ఇస్తే ఈ మీడియా అది జగన్ బినామీ కంపెనీ అని ప్రచారం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అదే కంపెనీకి సుమారు రూ.14 వేల కోట్ల విలువైన రాయితీలు కల్పిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిని ఎక్కడా తప్పుపట్టకుండా ఈనాడు మీడియా జాగ్రత్తపడింది.అంటే ఇప్పుడు చంద్రబాబు బినామీ కంపెనీ అయిందా? లేక ఇండోసోల్ తో ఏదైనా బేరం కుదిరిందా? అన్న విమర్శ చేస్తే ఆ మీడియా వద్ద సమాధానం ఉంటుందా? అందుకే ఈ ఎల్లో మీడియా ఏపీ ప్రజలపాలిట శాపంగా మారినట్లు  పలువురు భావిస్తున్నారు.

::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement