రెండు నగరాల జంట కథ.. ముఖ్యమంత్రుల వింత వ్యథ! | KSR Comments On Amaravati And Future City In Telangana | Sakshi
Sakshi News home page

రెండు నగరాల జంట కథ.. ముఖ్యమంత్రుల వింత వ్యథ!

Aug 22 2025 9:24 AM | Updated on Aug 22 2025 9:26 AM

KSR Comments On Amaravati And Future City In Telangana

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశలన్నీ ఇప్పుడు రెండు నగరాలపైనే ఉన్నాయి. ఫ్యూచర్‌ సిటీపై రేవంత్‌, అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు గంపెడు ఆశలతో ఉన్నారు. అయితే, ఈ రెండు కొత్త నగరాల ప్రతిపాదనలను పరిశీలిస్తే రేవంత్‌ రెడ్డి పరిస్థితే కొంత మేలు అనిపిస్తుంది.

ఇటీవల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో జరిగిన ఒక సమావేశంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ..‘కొంతమంది ఫ్యూచర్ సిటీని ఫోర్ బ్రదర్స్ సిటీ అని అంటున్నారు.. మీరంతా నాకు సోదరులే. మీ అందరి ప్రయోజనం కోసమే దాన్ని డిజైన్ చేస్తున్నాను. ఇతరుల వ్యాఖ్యలు పట్టించుకోను’ అని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు పుంజుకోవడానికి రేవంత్ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పడుతోందో అర్థం చేసుకోవచ్చు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కోసమే ఫ్యూచర్‌సిటీ అని రేవంత్‌ ధైర్యంగా చెప్పగలిగారు కానీ.. చంద్రబాబు మాత్రం ఇప్పటికీ రైతు ప్రయోజనాల కోసమే అమరావతి అన్న బిల్డప్‌ను కొనసాగిస్తున్నారు. కానీ అందరూ దాన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగానే పరిగణిస్తున్నారు.

వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి భూముల అమ్మకం ద్వారా ఆ రుణాలు తీరుస్తామన్న ప్రభుత్వం వ్యాఖ్యలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి అచ్చంగా సరిపోతుంది కూడా. అయితే చిన్న చినుకుకే చిత్తడై పోతూ.. చెరువులను తలపిస్తున్న అమరావతి ప్రాంతం సహజంగానే పలు రకాల సందేహాలకు తావిస్తుంది. ఈ విషయాలపై మాట్లాడిన వారిపై కేసులు పెట్టి అణగదొక్కేందుకు చేస్తున్న ప్రయత్నాలనూ అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఒక పక్క వరద లేదని ప్రభుత్వం చెబుతుంటే.. మరోపక్క  మంత్రి నారాయణ వరద ఏ రకంగా ఉందో చెప్పకనే చెప్పారు.

అమరావతి నగరం ఎప్పటికి పూర్తి అవుతుంది? అందుకోసం ఎన్ని లక్షల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది? రాష్ట్ర ప్రజలందరిపై పడే అప్పుల భారం ఎంత? అన్న చింత ఏపీలోని ఆలోచనాపరుల్లో కనిపిస్తోంది. అమరావతికి సంబంధించి ఊహా చిత్రాలు అంటూ గ్రాఫిక్స్ ప్రదర్శించి ప్రజలను తన అనుకూల మీడియా ద్వారా టీడీపీ మభ్యపెట్టాలని యత్నిస్తే, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ఊహా చిత్రాలను ప్రచారంలోకి తేవడం విశేషం. ఫ్యూచర్ సిటీ  నిర్మాణం కూడా అంత తేలిక కాకపోవచ్చు. ఎంత ఖర్చు అవుతుందన్న అంచనాలు తెలియాల్సి ఉంది. అయినా ఇక్కడి భూ స్వభావం, వరదల వంటి సమస్యలు లేకపోవడం, ఇప్పటికే అభివృద్ది చెందిన హైదరాబాద్ చెంతనే ఉండడం కలిసి రావచ్చు. దానికి తోడు ఫార్మా సిటీ కోసం గత కేసీఆర్‌ ప్రభుత్వం సమీకరించిన 14 వేల ఎకరాల భూమి అదనపు అడ్వాంటేజ్ కావచ్చు.

నిజానికి ఏ ప్రభుత్వం కూడా కొత్త నగరాలను నిర్మించదు. ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించి నగరాభివృద్దికి దోహదపడతాయి. ఈ క్రమంలో నగరాభివృద్ది సంస్థలు ఆయా చోట్ల భూములు సేకరించి, కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను తయారు చేస్తుంటాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో హెచ్‌ఎండీఏ ప్రభుత్వ భూములను కొన్నిటిని తీసుకుని, లేదా ప్రైవేటు భూములను సమీకరించి ప్లాట్లు వేసి వేలం నిర్వహిస్తుంటుంది. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న అనుభవమే. గత టర్మ్‌లో ఏపీలో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా ఆయా పట్టణాలు, నగరాలలో ప్రభుత్వపరంగా ఇలాంటి వెంచర్లు వేసి మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలలో స్థలాలను  సమకూర్చాలని ప్లాన్ చేసింది. అందుకోసం భూములు కూడా తీసుకున్నారు. ఇది ఒక  క్రమ పద్దతిలో జరిగితే స్కీములు సక్సెస్ అవుతాయి. లేదంటే విఫలమవుతాయి. పారిశ్రామిక అవసరాల కోసం ప్రత్యేకంగా వసతుల కల్పన సంస్థలు ఉన్నాయి.

అవి ఆయా చోట్ల, అంతగా పంటలు పండని భూములను సేకరించి రోడ్లు, విద్యుత్, నీరు తదితర వసతులు కల్పించి పరిశ్రమలకు అనువైన రీతిలో తయారు చేసి విక్రయిస్తుంటాయి. తెలంగాణ, ఏపీలలో పలుచోట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లు ఉన్నాయి. కొన్ని ఇతర చోట్ల కూడా పరిశ్రమలు భూములు కొనుగోలు చేసుకుని యూనిట్లను పెట్టుకుంటాయి. ఇదంతా నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. అయితే  ఏపీ విభజన తర్వాత చంద్రబాబు తానే కొత్త రాజధాని నగరం నిర్మిస్తానంటూ 33 వేల ఎకరాల భూమిని సమీకరించారు. మరో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ప్రభుత్వ భూమిలో తమకు అవసరమైన కార్యాలయాల భవనాలు నిర్మించడం కాకుండా, ఆయన వేల ఎకరాలను రైతుల నుంచి సమీకరించి వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రతిపాదించారు. ప్రభుత్వం అన్ని సదుపాయాలతో ప్లాట్లు ఇస్తే బాగా రేట్లు వస్తాయని ఆశపడ్డ రైతులు తమ భూములను  పూలింగ్ కింద ఇచ్చారు.

కానీ, ఇప్పటికీ పదేళ్లు అయినా వారికి ప్లాట్లు దక్కలేదు. వసతుల కల్పన జరగలేదు. పైగా మరో 44 వేల ఎకరాల భూమిని అదనంగా సమీకరిస్తామని ప్రభుత్వం చెప్పడంపై రైతులలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ లక్ష ఎకరాల భూమి ఎప్పటికి అభివృద్ది కావాలి? అక్కడకు ఏ తరహా పరిశ్రమలు ఎప్పటికి వస్తాయి? నవ నగరాల పేరుతో గతంలో చేసిన హడావుడి ఇప్పుడు కూడా చేస్తారా?. అమరావతిలో భూములు కొంటే కోట్ల రూపాయల లాభం వస్తుందని భావించి అనేకమంది పెట్టుబడి పెడితే రేట్లు పడిపోయి వారంతా అయోమయంలో చిక్కుకున్నారు. రైతులకు తమ ప్లాట్లు వస్తే అమ్ముకోవచ్చని అనుకుంటే దానికి పలు షరతులను అధికారులు పెడుతున్నారు. వెయ్యి గజాలు, రెండువేల గజాల ప్లాట్లు వచ్చిన రైతులు అవి కాగితం మీదే ఉన్నా, వాటిని విభజించుకోవడానికి లేదన్న కండిషన్ వారిని ఆందోళనకు గురి చేస్తోంది. పలువురు రైతులు తమకు ఈ కాగితాల ఆధారంగా అప్పులు పుట్టడం లేదని, భూములు అమ్ముదామన్నా అవి ఎక్కడ ఉన్నాయో చూపలేక పోతున్నామని వాపోతున్నారు.

ఇన్ని సమస్యలు ఒకవైపు ఉంటే, మరోవైపు ఓ మోస్తరు వర్షం కురిసినా ఆ ప్రాంతం అంతా నీటిమయం అవుతోంది. భూమి చిత్తడిగా మారుతోంది. ఈ భూమి భారీ నిర్మాణాలకు అనువు కాదని శివరామకృష్ణ కమిటీ, ప్రపంచ బ్యాంక్‌లు కూడా చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం మొండిగా ముందుకు వెళుతోంది. ఈ సమస్యలన్నీ సర్దుకుని నిర్మాణాలు సాగితే ఫర్వాలేదు కాని, లేకుంటే ప్రభుత్వం రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి రావచ్చు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పుంజుకోవడం కోసం ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోంది. అక్కడకు పలు సంస్థలు వచ్చేస్తున్నట్లు, ఏఐ వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీ, స్పోర్ట్స్ సిటీ, కొత్త విమానాశ్రయం ఏర్పాటు, వంటివి జరగబోతున్నట్లు హడావుడి చేస్తున్నారు. అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదార్లు.. అవన్నీ అయినప్పుడు చూద్దాంలే అన్నట్టు వేచి చూసే ధోరణిలోనే ఉంటున్నారు.

ఇక, ఫ్యూచర్ సిటీ విషయానికి వస్తే ఇక్కడ కూడా భూ సేకరణపై కొంత నిరసన వ్యక్తమవుతోంది. అధిక వాటా, అనాసక్తి వంటి కారణాలతో రైతులు కొంతమంది ప్రభుత్వానికి సహకరించడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల తరువాత హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం బాగా మందగించింది. ఇప్పటికీ పరిస్థితిలో మార్పులేదు. ఫ్యూచర్ సిటీ ప్రతిపాదన వల్ల ఆ ప్రాంతంలో భూముల రేట్లు కొంత పెరిగిన మాట నిజమే కాని, రకరకాల సందేహాల వల్ల ఇప్పుడు అంత ఊపు లేదు అంటున్నారు. దానిని పారదోలడానికి రేవంత్ సర్కార్ కష్టపడుతోంది. వదంతులు నమ్మవద్దని, ఫ్యూచర్ సిటీకిగాని, హైదరాబాద్‌కు కాని రియల్ ఎస్టేట్ తదితర రంగాలలో మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రభుత్వం అంటోంది. ఇప్పటికే స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసింది. ప్లాన్డ్‌గా అభివృద్ది ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు.

అయితే ఆయా గ్రామాల మధ్య శ్రీశైలం రోడ్డు, సాగర్ రోడ్డుల మధ్య ఈ సిటీ అభివృద్దికి ఎన్నో ఆటంకాలు కూడా రావచ్చన్న అనుమానం ఉంది. హైడ్రాను స్థాపించడం వల్ల రేవంత్ సర్కార్‌కు కొంత కీర్తి, మరికొంత అపకీర్తి వచ్చింది. చెరువుల శిఖం భూములనో, మరొకటనో, కొత్తగా నిర్మిస్తున్న పలు భవనాలు, అపార్టెమెంట్లు కూల్చడం వల్ల మధ్య తరగతి ప్రజలు కొంత నష్టపోయారు. వారు ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేయడానికి సందేహిస్తున్నారు. అయితే చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు వంటి వాటి వల్ల కొంత పేరు కూడా వచ్చింది. ఇందులో కూడా పక్షపాతంగా కొన్ని జరిగాయన్న విమర్శలూ ఉన్నాయి. ఇక ఓవరాల్ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని ఉండడం, ఐటీ రంగంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడడం, ఉద్యోగుల లేఆఫ్‌ల ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై కూడా ఉందని అంటున్నారు.

హైదరాబాద్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఏ అభివృద్ది లేని అమరావతిలో రియల్ ఎస్టేట్ పుంజుకోవడం అంత తేలిక కాదని అంచనా. తాజాగా హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో ఏడు ఎకరాల ప్లాటును గోద్రోజ్ కంపెనీ 547 కోట్లకు కొనుగోలు చేయడం రేవంత్ ప్రభుత్వానికి ఒక సానుకూల అంశం. చంద్రబాబు, రేవంత్‌లు అలవికాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక సతమతమవుతున్నారు. ఏపీ సర్కార్ రికార్డు స్థాయిలో అప్పులు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పుల ఊబిలో దిగుతోందన్న విమర్శలు  ఉన్నాయి. ఈ స్థితిలో రెండు కొత్త నగరాల నిర్మాణం వీరికి అవసరమా?. ఇతర ప్రజా సమస్యలను పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ కోసం ఇంత రిస్క్ అవసరమా? అని ఎవరైనా అడిగితే ఎవరి వ్యూహం వారిది అని తప్ప ఇంకేమీ చెప్పగలం.!

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement