తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనకు తానే రాజకీయ బురద జల్లుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వం లేదంటే మంత్రులపై పట్టు పెంచుకునే క్రమంలో ఆయన చేస్తున్న విన్యాసాలు కొన్నిసార్లు బెడిసికొడుతున్నట్లుగా ఉంది. దీనికి తోడు అనవసర వ్యాఖ్యలు చేస్తూ ప్రజలలో తన విశ్వసనీయతను తానే దెబ్బ తీసుకుంటున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదాలకు ఆజ్యం పోస్తున్నారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి.
ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చే ఆంధ్రజ్యోతి మీడియా అధిపతి రాధాకృష్ణను కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ అధికంగా నమ్ముకుంటున్నారన్న భావన కలుగుతోంది. దానివల్ల తెలంగాణ రాజకీయాలపై ఆ పత్రికలో ఏ కథనం వచ్చినా అది ఎంత వివాదాస్పదమైనా, చెత్త పలుకైనా అదంతా రేవంత్ భ్రీఫింగ్ వల్లేనని రాజకీయ వర్గాలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. మీడియాను ప్రమాణాలతో నిమిత్తం లేకుండా నీచమైన రాతలు రాసేవారిని నమ్ముకుంటే.. అది ఎప్పటికైనా భస్మాసుర హస్తం అయ్యే ప్రమాదం ఉంటుంది.
తెలంగాణలో ఇటీవల జరిగిన పరిణామాల సారాంశంగా దీనిని తీసుకోవచ్చు. ఎన్టీవీ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన ఒక కథనం మహిళా ఐఏఎస్‌లను కించ పరిచేదిగా ఉందన్నది అభియోగం. దీనిని ఎవరూ సమర్థించరు. ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి తన ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అసోసియేషన్లు ఖండన ఇవ్వడం, దానిపై ఆ టీవీ ఛానల్ క్షమాపణలు చెప్పింది. అయినా తప్పు చేశారని అనుకుంటే కేసు పెట్టవచ్చు. చర్య తీసుకోవచ్చు. కాని ఈ కేసు విచారణకు ప్రత్యేక అధికారుల బృందాన్ని నియమించారు. ఆ పోలీసులు విచారణ పేరుతో చట్టబద్దమైన నిబంధనలు పాటించకుండా ఆ టీవీ ఛానల్‌లో సోదాలు చేయడం, ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టింది. ఆ కేసులో ఫిర్యాదుదారు ఎవరు? బాధితులు ఎవరని కోర్టు ప్రశ్నించడంతో నీళ్లు నమలడం పోలీసుల వంతైంది. అంతటితో ఆ ఉదంతానికి ఫుల్‌స్టాప్ పడినట్లయింది.
పోలీసులు ఈ వ్యవహారంలో అతిగా చేశారన్న విమర్శలు వచ్చాయి. అది వేరే కథ. ఇంతలో ఏమి జరిగిందో కాని సడన్‌గా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన వ్యాసంలో ఆ గాయాలను మళ్లీ కెలికారు. వ్యాపార ప్రయోజనం కోసమో, లేక ముఖ్యమంత్రి రేవంత్‌కు ఉపయోగపడుతందని అనుకున్నారో తెలియదు కాని ఓ కథ వండి జనం మీదకు వదిలారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఈ వివాదంలోకి లాగారు. ఎన్టీవీ యజమానికి సంబంధించిన కంపెనీకి బొగ్గు టెండర్ రావడానికి మల్లు భట్టి రూల్స్ మార్చారని ఆరోపించారు. పోనీ ఈ స్కామ్ వరకు రాసి ఉంటే అది వేరే విషయం అయ్యేది. అలా కాకుండా మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడి కంపెనీకి ఆ టెండర్ దక్కకుండా ఉండడం కోసం ఎన్టీవీ ఆయనపై అనుచితమైన స్టోరీ ప్రసారం చేసిందని ఆరోపించారు. ఆ క్రమంలో ఆయనకు మహిళలపట్ల ఎంతో గౌరవం ఉన్నట్లు నటించారు. పనిలో పనిగా, ఆవు కథ మాదిరి వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో మీడియాకు స్వేచ్చ లేదంటూ ఒక పచ్చి అబద్దాన్ని కూడా జోడించారు.
రాధాకృష్ణకు నిజంగా మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై ఆవేదన ఉంటే, సంక్రాంతి సందర్భంగా ఏపీలో జరిగిన దారుణమైన అశ్లీల నృత్యాలపై ఎక్కడైనా సరైన రీతిలో స్పందించారా? ఎల్లోమీడియాలో వైసీపీ మహిళా నేతలపై కక్ష కట్టినట్లు ఎన్ని తప్పుడు కథనాలు వచ్చేవో కూడా తెలిసిందే. ఈ మధ్యనే మాజీ సీఎం జగన్‌పై నీచమైన శీర్షికలతో కథనాలు లో ప్రసారం చేశారో కూడా చూశాం. ఈయన ఒక వైపు నీచమైన రాతలు రాస్తూ, ఎదుటివారికి నీతులు చెబుతుంటారు. తన వ్యాసంలో మల్లు భట్టిపై ఆరోపణలు చేయడంతోపాటు రేవంత్ ను అమాయకుడన్నట్లు చిత్రీకరించే యత్నం చేశారు. సిట్ వేసిన సంగతి రేవంత్‌కు తెలియదని అందులో రాశారు. దీనివల్ల రేవంత్‌కు నష్టం జరిగింది. అయితే..
రేవంత్ భ్రీఫింగ్‌తోనే రాధాకృష్ణ ఈ వ్యాసం రాశారా అన్న సందేహాన్ని వివిధ రాజకీయ పక్షాలు కాని, చివరికి కాంగ్రెస్ లో కొన్ని వర్గాలు కాని అనుమానించాయి. దానికి తోడు టీవీ కథనం వచ్చిన రోజున కాని, కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన రోజున కాని రేవంత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం, రాధాకృష్ణ వ్యాసం రాసిన తర్వాత స్పందించడం చర్చనీయాంశం అయ్యాయి. మీడియా సంస్థలు ఆంబోతుల మాదిరి తన్నుకుని తమను అందులోకి లాగవద్దని ఆయన అనడం విడ్డూరంగా అనిపించింది. ఒక వేళ నిజంగానే రాదాకృష్ణ తప్పుడు వ్యాసం రాసి ఉంటే ఆయనపై కూడా చర్య తీసుకుంటామని చెప్పి ఉండవచ్చు! కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలతోనే ఈ గొడవలన్ని బయటకు వచ్చాయన్న భావన ప్రజలలో ఏర్పడింది. దాంతో ఆ బురదను కడుక్కోవడానికి రేవంత్ స్టేట్ మెంట్ ఇచ్చి మంత్రులను బద్నాం చేయవద్దని కోరారు అంతేకాక తమ ప్రభుత్వంలో అవినీతి లేదని చెప్పుకోవాల్సి వచ్చింది. మరో వైపు మల్లు భట్టి ఆ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, రాధాకృష్ణ కథనం వెనుక ఎవరు ఉన్నారో తర్వాత చెబుతానని అన్నారు. పైగా తెలంగాణ వనరులు, సంపదను దోచుకోవడానికి వ్యవస్థీకృత నేరస్తులు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
రేవంత్ మరో మాట కూడా చెప్పారు. బీఆర్‌ఎస్‌కు లబ్ది జరిగేలా కథనాలు ఉండవద్దని అన్నారు. తనకు డామేజీ అవుతోందని అర్థం చేసుకుని ఈ వ్యాఖ్య చేసి ఉండాలి. నిజంగానే బీఆర్‌ఎస్ ఈ ఎపిసోడ్‌ను తనకు అనుకూలంగా మలచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. సింగరేణి టెండర్ల విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేయడం, ప్రభుత్వంలో ముఖ్యమైన పదవులలో ఉన్న ముగ్గురి మధ్య కాంట్రాక్ట్ కోసం పోటీ జరిగిందని, మంత్రివర్గంలో పలువురు మంత్రులు దోచుకునే పనిలో ఉన్నారని ఆరోపించారు.
రేవంత్ మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఖతం చేసిన బీఆర్‌ఎస్‌ను బొంద పెట్టాలని ఆయన అన్నారు. అదే ఎన్టీఆర్‌కు నివాళి అని కొత్త సూత్రీకకరణ చేశారు. అదేదైనా అయితే చంద్రబాబుకు కానుక అవుతుంది కాని, ఎన్టీఆర్‌కు ఎలా శ్రద్దాంజలి అవుతుందో తెలియదు.హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీకి ఉన్న కాస్తో, కూస్తో బలాన్ని, ఆ పార్టీకి ప్రధానంగా మద్దతు ఇచ్చే సామాజిక వర్గం ఓట్లను దృష్టిలో ఉంచుకుని రేవంత్ మాట్లాడినట్లు అనిపిస్తుంది. పైగా తెలంగాణలో టీడీపీ ఖతం అవడానికి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, రేవంత్‌ల పాత్ర కారణమన్నది బహిరంగ రహస్యమే కదా! ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన రేవంత్ అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవికి ఎగబాకారు. అయినా పాత వాసన వదులుకోలేక పోతున్నట్లు ఉంది.
కాంగ్రెస్‌ను అంతం చేయడానికి టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌ను రేవంత్ పొగడడంపై ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఎంతవరకు సంతోషిస్తారో చెప్పలేం.ఏది ఏమైనా ఈ మద్యకాలంలో పలు ప్రకటనలు ఒకదానికి ఒకటి పొంతన లేకుండా చేస్తూ రేవంత్ రెడ్డి ఎదుటివారిపై బురద చల్లబోయి.. తనపై కూడా వేసుకుంటున్నట్లు ఉంది. హార్వర్డ్ యూనివర్శిటీలో నాయకత్వ కోర్సులో చేరిన రేవంత్ బీఆర్‌ఎస్ గద్దెలు గ్రామాలలో లేకుండా చేయాలని అనడం ఏ పాటి నాయకత్వ ప్రమాణం అవుతుందో!.

::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


