ఎన్టీఆర్‌తో రేవంత్‌ రాజకీయం.. ప్లాన్‌ ఫలించేనా? | KSR Comments On Revanth Reddy And NTR Statue In Ameerpet | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌తో రేవంత్‌ రాజకీయం.. ప్లాన్‌ ఫలించేనా?

Nov 7 2025 12:17 PM | Updated on Nov 7 2025 1:07 PM

KSR Comments On Revanth Reddy And NTR Statue In Ameerpet

హైదరాబాద్‌లోని అమీర్‌పేట సెంటర్‌లో భారీ ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్య సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని అమీర్‌పేటలోనూ.. కాంగ్రెస్‌ నేత పి.జనార్ధన్‌ రెడ్డి విగ్రహాన్ని బోరబండలోనూ ఏర్పాటు చేస్తామని రేవంత్‌ ప్రకటించారు.

అంతేకాదు.. హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ అంటే ఇష్టపడని తెలుగువారు ఉండరని, ఆయన విగ్రహం ఏర్పాటును ఎవరైనా వ్యతిరేకిస్తే మూసీలో పడేసి తొక్కుతామని కొన్ని అభ్యంతరకరమై వ్యాఖ్యలు ఆయన చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు బోలెడన్ని హామీలివ్వడం కొత్త కాదు కానీ.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడి విగ్రహానికి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఏపీలో కాంగ్రెస్‌ను ఓడించి దేశంలోనే సంచలనం సృష్టించిన పార్టీ తెలుగుదేశం. కాంగ్రెస్‌ నేతలను కుక్కమూతి పిందెలుగా, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టిన వారంటూ ఎన్టీఆర్‌ పెద్ద ఎత్తున విమర్శించడం ఇప్పటికీ చాలామందికి గుర్తే. హైదరాబాద్‌ విమానాశ్రయంలో అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్యను ప్రధాని హోదాలో రాజీవ్‌ గాంధీ అవమానించారన్న ప్రచారాన్ని అందిపుచ్చుకున్న ఎన్టీఆర్‌ ఈ ఆత్మగౌరవ నినాదాన్ని తలకెత్తుకున్నారు. తరువాతి కాలంలో అంటే 1989లో కాంగ్రెస్‌.. టీడీపీని ఓడించగా 1994లో మళ్లీ గెలిచింది. 1984లో టీడీపీ మంత్రి నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ సహకారంతో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విఫలయత్నం చేశారు. కానీ, 1995లో ఎన్టీఆర్‌ అల్లుడు చంద్రబాబు నాయుడుతో, ఇతర కుటుంబ సభ్యుల చేతిలో పరాభవానికి గురై  ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నారు. కొత్త పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగాలని ఎన్టీఆర్‌ అనుకున్నప్పటికీ 1996 జనవరిలో ఆయన మరణంతో సాధ్యం కాలేదు. అయితే చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ ఎన్టీఆర్‌ చరిష్మాను వాడుకోవడం ఇప్పటికీ వదల్లేదు.

2001లో కేసీఆర్‌ నేతృత్వంలో మొదలైన తెలంగాణ ఉద్యమంలో కొన్నిసార్లు ఆంధ్ర ప్రాంత నేతల విగ్రహాలు కూడా టార్గెట్ అయ్యాయి. 1987 ప్రాంతంలో ఎన్టీఆర్‌ ప్రభుత్వం ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన విగ్రహాలలో ఆంధ్ర ప్రముఖులవి కొందరు ఉద్యమకారులు 2012 ప్రాంతంలో ధ్వంసం చేశారు. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని పునరుద్దరించింది. ఇలా తెలంగాణలో నాయకుల విగ్రహాలకు కొంత చరిత్ర ఉంది. ఎన్టీఆర్‌ మరణించిన తర్వాత నెక్లెస్ రోడ్డులో అంత్యక్రియలు జరిగాయి. నగరం నడిబొడ్డున ఎలా చేస్తారని వ్యతిరేకించిన వారిలో కాంగ్రెస్ ప్రముఖులు కూడా కొందరు లేకపోలేదు. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్‌ ఘాట్‌ను ఏర్పాటు చేసి, అధికారికంగా జయంతి, వర్ధంతులు జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది.

2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొంతకాలం ఆ జీవోని అమలు చేశారు. అప్పట్లో మంత్రిగా ఉన్న  షబ్బీర్ అలీ ప్రభుత్వం తరపున పుష్పగుచ్చం పెట్టి నివాళి అర్పించేవారు. తదుపరి కాలంలో  టీడీపీ నేతలు, ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు, కొంతమంది అభిమానులు మాత్రమే  అక్కడకు వెళుతుండేవారు. ఇంతలో 2009లో తెలంగాణ ఉద్యమం రావడం, రాజకీయాలు కొత్త రూపుదాల్చడం తదితర కారణాలతో ఎన్టీఆర్‌ ప్రస్తావన తగ్గిపోయింది. తెలంగాణ  ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రెండూ ఎన్టీఆర్‌ ఘాట్‌ను సందర్శించలేదనే చెప్పాలి. 2018లో చంద్రబాబు తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పార్టీ మూల సిద్ధాంతానికే  విరుద్దంగా ప్రవర్తించారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్, టీడీపీల కూటమి ఓటమి పాలైంది.

2023 ఎన్నికల్లో ఒకప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించడం ఏకంగా ముఖ్యమంత్రి కావడం విశేషం. చంద్రబాబుకు, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి మధ్య సంబంధాలు మెరుగయ్యేందుకు రేవంత్‌ కారణమయ్యాడన్న ఒక ప్రచారం కూడా ఉంది. అయినప్పటికీ అధికారంలోకి వచ్చింది మొదలు ఇప్పటివరకూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్టీఆర్‌ గురించి మాట్లాడింది లేదు. కానీ, ఇప్పుడు అకస్మాత్తుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఆ ప్రస్తావన తెచ్చారు. తద్వారా టీడీపీ అభిమానుల, కమ్మ సామాజికవర్గం ఆదరణ పొందే ప్రయత్నం చేశారని అర్థమవుతోంది.

అభిమానులు కోరుకుంటున్నట్లు విగ్రహాన్ని నెలకొల్పుతామని, దుర్మార్గులు ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే మూసీలో తొక్కుతామని రేవంత్‌ వ్యాఖ్య అంత భావ్యంగా అనిపించదు. సినీ నటుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌పై తెలుగు వారిలో అభిమానం ఉండవచ్చు. అంతమాత్రాన విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించరాదని ఎలా అంటారు?. బీఆర్‌ఎస్‌ నేతలు ఎవరైనా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే రాజకీయంగా వాడుకునేందుకు మాత్రమే రేవంత్‌ ఇలా మాట్లాడారు అనిపిస్తోంది. అయితే, బీఆర్‌ఎస్‌ ఈ విగ్రహం ఊసే ఎత్తడం లేదు. ఎన్టీఆర్‌ను ఒక కుల ప్రతినిధిగా మాత్రమే చూడటం రాజకీయ పార్టీలకు అమర్యాదే అవుతుంది. విగ్రహాలను చూసి ఓట్లు వేసే రోజులా ఇవి? అలా అయితే హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహంతో పాటు ట్యాంక్‌ బండ్‌పై పలువురు తెలుగు ప్రముఖుల విగ్రహాలు స్థాపించిన ఎన్టీఆర్‌ ప్రభుత్వం 1989లో ఓటమిపాలైంది. ఎన్టీఆర్‌ స్వయంగా తెలంగాణ నుంచి పోటీ చేసి పరాజయం చెందారు. కేసీఆర్‌ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అంతమాత్రాన విజయం సాధించిందా?.

విగ్రహాలకు, రాజకీయాలకు ముడిపెట్టడం, సెంటిమెంట్‌ను వాడుకోవాలని ప్రయత్నించడం రాజకీయ నేతలకు కొత్త కాకపోవచ్చు. తెలుగుతల్లి  విగ్రహం బదులు బీఆర్‌ఎస్‌  తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం ఈ కోవలోనిదే. కొత్త రూపుతో రేవంత్ ప్రభుత్వం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. సచివాలయం వెలుపల రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య  విగ్రహం ‘లక్డీకాపుల్‌’ వద్ద ఏర్పాటైంది. విగ్రహాల ఏర్పాటు దేశ, రాష్ట్ర సంస్కృతిలో భాగంగా ఉంటాయి. గొప్ప నేతల నుంచి ప్రేరణ పొందడానికి నెలకొల్పుతారు. అదేమీ కొత్తకాదు. తప్పుకాదు. కాకపోతే ఉప ఎన్నిక సమయంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడంతో దీని పూర్వాపరాలు తెలుసుకోవడం ఆసక్తిగా ఉంటుంది. విశేషం ఏమిటంటే ఉప ఎన్నిక ప్రచారంలో రేవంత్ రెడ్డి కొన్నిసార్లు ఏదో విధంగా చంద్రబాబు నాయుడు పేరు కూడా ప్రస్తావించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. తద్వారా టీడీపీ లేదా, ఒక సామాజికవర్గాన్ని ఆకట్టుకోవడానికి కృషి చేస్తున్నారు.

ఇక్కడ మరో సంగతి చెప్పాలి. చంద్రబాబు ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఇదే తరహాలో కాంగ్రెస్ జాతీయ నేతలకు గౌరవం ఇవ్వడం లేదు. ప్రధాని మోదీ బాటలోనే ఆయన  కూడా జవహర్ లాల్  నెహ్రూను విమర్శించారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం కల్పించిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను దుండగులు ధ్వంసం చేసినా పట్టించుకోలేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖరరెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన స్కీముల పేర్లను మార్చివేశారు. పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాసాగర్ అని పెట్టిన పేరును టీడీపీ ప్రభుత్వం తీసివేసింది.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రేవంత్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించడం గమనించదగిన  విషయమే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ ముందంజలో ఉందని కొన్ని సర్వేలు రావడం కాంగ్రెస్‌కు ఆందోళన కలిగించింది. అవి ఫేక్ సర్వేలు అని రేవంత్ కొట్టి పారేశారు. ఒకట్రెండు సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా కూడా వచ్చాయి. రేవంత్ రెడ్డి చేస్తున్న ఉపన్యాసాలు ఎన్టీఆర్‌, పీజేఆర్‌ విగ్రహాల స్థాపనపై ప్రకటనలు,  స్కీముల కొనసాగింపుపై చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాంగ్రెస్ ఆత్మరక్షణలో ఉందేమోనన్న అభిప్రాయానికి తావిస్తున్నాయని చెప్పక తప్పదు.

-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement