సాక్షి, తాడేపల్లి: పేదల పట్ల చంద్రబాబు విధానం మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు, లోకేష్ ఏ మాత్రం సిగ్గు, ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. వైద్యరంగాన్ని వ్యాపారస్తుల చేతితో పెడితే వ్యాపారమే చేస్తారు అని మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రజల మనిషి.. చంద్రబాబు కార్పొరేట్ వ్యక్తుల మనిషి అని చెప్పుకొచ్చారు.
మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. పీపీపీ వల్ల ప్రజలకు లాభమేంటో చంద్రబాబు చెప్పాలి. పీపీపీ, పీ-4 విధానాలతో బాగుపడిన వారు ఎవరైనా ఉన్నారా?. నాలుగో పీ అంటే పబ్లిక్ ప్రాపర్టీ ప్రైవేటు పరం. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించకుండానే ఎలా ప్రైవేటీకరిస్తారు?. వైద్యంపై ఇప్పుడు చెబుతున్న మాటలు ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు. చంద్రబాబు, లోకేష్ ఏ మాత్రం సిగ్గు, ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు.
ఆసుపత్రుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి మందికిపైగా సంతకాలు చేశారు. మీ టీడీపీ, జనసేన నేతలు కూడా సంతకాలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చి దిద్దుతామని చెప్పి ఇదా మీరు చేసేది?. వైద్యరంగాన్ని వ్యాపారస్తుల చేతితో పెడితే వ్యాపారమే చేస్తారు. పేదల పట్ల చంద్రబాబు విధానం మారడం లేదు. ఆరోగ్యాన్ని, చదువును జగన్ బాధ్యతగా తీసుకున్నారు. వైద్య రంగాన్ని ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు వెంపర్లాడుతున్నారు. ఆసుపత్రుల ప్రైవేటీకరణతో ఎవరికి దోచిపెడతారు?. బాబూ.. నీ వాళ్లకు దోచిపెట్టాలి అనుకుంటే పీపీపీ కింద కొత్త కాలేజీలు పెట్టు. 17 మెడికల్ కాలేజీలు ఆరు కోట్ల ఏపీ ప్రజల ఆస్తి. 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి వైఎస్ జగన్ నిర్మాణం చేపట్టారు. 17 కాలేజీల్లో నాలుగు కాలేజీలను వైఎస్ జగన్ పూర్తి చేశారు.
ఆరోగ్యశ్రీని చంద్రబాబు నాశనం చేశారు. ప్రజల హక్కుగా పొందాల్సిన వైద్యాన్ని దిగజార్చుతున్నారు. అన్నీ ప్రైవేటీకరిస్తే సీఎం పదవి ఎందుకు?. వైఎస్ జగన్ ప్రజల మనిషి.. చంద్రబాబు కార్పొరేట్ వ్యక్తుల మనిషి. ప్రశ్నిస్తానని ఓట్లు అడుక్కున్న పవన్ కల్యాణ్.. ఇంకా జగన్‌నే ప్రశ్నిస్తున్నారు. మెడికల్ కాలేజీలను తీసుకుని ఆ పాపం మోయకూడదు అనుకునే ఎవరూ తీసుకోవడం లేదు. మెడికల్ కాలేజీలకు టెండర్లు పిలిస్తే ఒక్కరు కూడా తీసుకుంటామని ముందుకు రావడం లేదు. ఆదోని మెడికల్ కాలేజీని కిమ్స్ తీసుకుంటుందని తప్పుడు ప్రచారం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రకటనను కిమ్స్ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలపై సిట్ వేస్తారు.
అమరావతిలో వచ్చిన ప్రతీ టెండర్‌లో చంద్రబాబుకు నాలుగు శాతం కమీషన్ ఇస్తున్నారు. ప్రజల సొమ్మును హల్వా తింటున్నట్టు బాబు అండ్ కో తినేస్తున్నారు. అమరావతిలో చంద్రబాబు మాస్ దోపిడీ చేస్తున్నారు. అమరావతి అవినీతి సొమ్ముతో కడుపు నిండటం లేదా బాబూ?. దేశంలో ఎక్కడైనా 99 పైసలకు భూములు ఇస్తున్నారా?.. లేక తీసుకుంటున్నారా?. చంద్రబాబు తానా అనగానే ఎల్లో మీడియా తానా తందానా అంటుంది. తన ఆవేదన చెబుతూ అమరావతి రైతు రామారావు చనిపోయారు.
అమరావతి రైతుని ఈడ్చుకు వెళ్లమని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అనలేదా?. రాజధానికి భూములు ఇచ్చిన రైతులంటే ఎందుకు అంత చిన్నచూపు?. కూటమి పార్టీల కార్యకర్తల అరాచకాలు రాష్ట్రంలో పెరిగి పోయాయి. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికార మందంతో విర్ర వీగుతున్నారు. రాజధాని రైతులపై పోలీసులను ఉసి గొల్పుతున్నారు. డబ్బు పిచ్చితో రాష్ట్రాన్ని చంద్రబాబు నాశనం చేస్తున్నారు. అమరావతి రైతులను రోడ్డు పాల్జేయవద్దు. కనకదుర్గమ్మ గుడికి బిల్ కట్టలేదని కరెంటు కట్ చేస్తారా?. బాలకృష్ణ అల్లుడి విద్యాసంస్థకు వందల కోట్ల బిల్ పెండింగ్ ఉన్నా కరెంటు ఎందుకు కట్ చేయలేదు?. కనకదుర్గమ్మ గుడికి కరెంటు బిల్ మాఫీ చేస్తే వచ్చే నష్టం ఏంటి?. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మెప్పు కోసం రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. పవన్ ఆటలో అరటిపండు లాంటి వాడు. అలాంటి వ్యక్తి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు.



