జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ ఊరటనిచ్చే అంశం. అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నికల్లో రేవంత్ అన్నీ తానై వ్యవహరించాడు. గెలుపు ద్వారా పార్టీలో తన పట్టు పెంచుకున్నాడు. రాష్ట్రంలో తనపై వ్యతిరేకత పెరుగుతోందన్న వదంతులు పుంజుకుంటున్న సమయంలో దాన్ని పూర్వపక్షం చేసేందుకు రేవంత్ ఈ ఉప ఎన్నికలను వినియోగించుకున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఘట్టం మొదలైనప్పుడు రాజకీయ వాతావరణం బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉందన్న ప్రచారం జరిగింది. ఇందుకు తగ్గట్టుగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌లు విస్తృత ప్రచారం చేశారు కూడా. కాంగ్రెస్ తరఫున తొలుత ముగ్గురు.. ఆ తరువాత మరింత మంది మంత్రులు, పాతిక మందికిపైగా ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌సహా ఇతర నేతలు ప్రచార బాధ్యతలు చేపట్టారు. అక్కడితో ఆగలేదు. రేవంత్ స్వయంగా పలు సభలు నిర్వహించారు. ఒక ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి స్థాయి నేత ఒకటి అర సభల్లో పాల్గొనడం కద్దు. కానీ రేవంత్ ఈ రిస్క్ తీసుకోలేదు. ఎప్పటికప్పుడు అన్ని మార్గాల ద్వారా సమాచారం సేకరించుకుని తన వ్యూహాలకు పదును పెట్టుకున్నారు.
టీడీపీకి మద్దతిచ్చే ఒక సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు ఎన్టీఆర్ ప్రస్తావన తేవడం అలాంటిదే. మైనార్టీ ఓటర్లను తనవైపునకు తిప్పుకునే ఉద్దేశంతో ప్రముఖ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజహరుద్దీన్‌ను మంత్రిని చేసేశారు. అంతేకాక ఆ వర్గం బాగా బలంగా ఉన్న చోట మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకు మనుగడ అన్న రీతిలో ప్రసంగాలు చేశారు. మజ్లిస్ మద్దతు కూడా కాంగ్రెస్‌కు లాభించింది. రాజీలేకుండా డబ్బులు ఖర్చు చేశారన్న అభిప్రాయమూ సర్వత్రా ఉంది. వీటన్నింటి ఫలితంగా అప్పటివరకూ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉందన్న మౌత్ టాక్ కాస్తా చివరి మూడు రోజుల్లో కాంగ్రెస్‌కు పాజిటివ్‌గా మారింది. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కూడా డబ్బు పంపిణీ చేసినా అది అధికార పక్షానికి సరితూగలేదని తెలుస్తోంది.
ఈ రోజుల్లో ఎలా గెలిచారన్నది ముఖ్యం కాకుండా పోతోంది. ఎలాగైనా గెలవాలన్న తాపత్రయం పెరిగిపోతోంది. గెలిచాక మాత్రం ప్రజల మద్దతుతో గెలిచామని చెప్పుకోవడం రివాజుగా మారింది. అన్ని పార్టీలదీ ఇదే పరిస్థితి. గతంలో బీఆర్‌ఎస్ పార్టీ కూడా దుబ్బాక, హుజూరాబాద్‌లలో తప్ప, మిగిలిన ఉప ఎన్నికలలో విజయం సాధించింది. మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేసింది. అప్పట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ప్రచారానికి వచ్చారు. అయినా బీఆర్‌ఎస్ గెలవగలిగింది. బీజేపీ జూబ్లి హిల్స్ ఉపఎన్నికను అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఎన్డీయే భాగస్వాములైన టీడీపీ, జనసేనలు ప్రచారంలో పాల్గొనలేదు. పైగా టీడీపీ ఏకంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది.
అయినా బీజేపీ నేతలు ప్రశ్నించలేకపోయారు. గత సాధారణ ఎన్నికలవరకు కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం బాగున్నట్లు కనిపించేది కాదు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేయడం, కేసీఆర్‌పై ఘాటైన విమర్శలు చేయడం,నాయకులందరిని ఏకం చేయడం తదితర వ్యూహాలతో అధికారంలోకి తేగలిగారు. ముఖ్యమంత్రి అయ్యారు. తదుపరి పాలనలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నా, పార్టీలో తనకు పోటీ లేకుండా చేసుకోగలిగారు.ఇప్పుడు ఈ ఉప ఎన్నిక విజయం ద్వారా అసమ్మతి ఆలోచన చేసే నేతలు కూడా కిమ్మనే పరిస్థితి ఉండదు. అధిష్టానం వీక్ గా ఉండడం, బీహారులో దారుణమైన పరాజయం చెందడం కూడా రేవంత్ కు కలిసి వచ్చే అంశమే.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ను ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ బీసీ వర్గాలను ఆకట్టుకునే యత్నం చేసిందనాలి. నవీన్‌పై కుటుంబపరంగా కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ స్థానికుడు, ప్రజలకు అందుబాటులో ఉంటారన్న ప్రచారం జరిగేలా చేసుకున్నారు. సిటింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో జరిగిన ఈ ఉప ఎన్నికకు సానుభూతి ఉపకరిస్తుందన్న ఆశతో బీఆర్‌ఎస్ ఆయన భార్య సునీతను ఎంపిక చేసుకుంది. అయినా అది ఫలించలేదు. కాకపోతే గత లోక్‌సభ ఎన్నికలలో మాదిరి మూడో స్థానంలోకి పడిపోకుండా గట్టిపోటీ ఇవ్వగలగడం, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయం అన్న నమ్మకాన్ని కేడర్‌లో కలిగించే విధంగా 74 వేల ఓట్లు సాధించగలిగింది. కాంగ్రెస్ కు 99 వేల ఓట్లు రావడం బీఆర్‌ఎస్‌కు కాస్త ఇబ్బందే అయినా, లోక్ సభ ఎన్నికలతో పోల్చితే బెటర్ పొజిషన్ లోనే ఉన్నాం కదా అన్న భావన కలుగుతుంది. అధతికార దుర్వినియోగంతో కాంగ్రెస్ గెలిచిందని బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు చెప్పినా పెద్ద ప్రయోజనం లేదు.
బీజేపీ పరిస్థితి మాత్రం కాస్త గడ్డుగా మారిందనే చెప్పాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహించే ఈ నియోజకవర్గంలో డిపాజిట్ కోల్పోవడం పరువు తక్కువే. బీహారులో ఎన్డీయే విజయ దుందుభి మోగించిన తరుణంలో జూబ్లిహిల్స్‌లో ఈ రిజల్ట్ రావడం మింగుడుపడని విషయమే. అయితే వచ్చే ఎన్నికలకు హిందూ ఓట్ల పోలరైజేషన్‌కు కృషి చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. అది ఏ రూపం దాల్చుతుందో అప్పుడే చెప్పలేం. కాగా ఒక ఉప ఎన్నిక గెలిచినంత మాత్రాన అంతా సజావుగా ఉందని కాంగ్రెస్ భావిస్తే అది తప్పే అవుతుంది. విజయం సాధించారు కనుక ఆ ఉత్సాహం ఉంటుంది.కాని దాని వెనుక ఎంత కష్టపడాల్సి వచ్చింది, ఖర్చు చేయాల్సి వచ్చింది వారికే తెలుసు.
ఏపీలో 2018 నాటి నంద్యాల ఉప ఎన్నికలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్ధి విజయం కోసం అన్ని వ్యూహాలు అమలు చేశారు. తద్వారా గెలవగలిగారు.కాని ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికలలో ఆ సీటు మళ్లీ వైసీపీ పరమైంది.అన్నిసార్లు అలా జరగాలని లేదు.కాని అలాంటి ఉదాహరణలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు అడుగుజాడలోనే నడిచి ఉప ఎన్నికలో గెలిచారన్న అభిప్రాయాన్ని కొట్టిపారేయలేం. ఉప ఎన్నికలో గెలిచినంతమాత్రాన ప్రభుత్వం చేస్తున్న అన్ని పనులకు, హైడ్రా యాక్టివిటి అంతటికి ప్రజామోదం లభించిందని కూడా అనుకోరాదు. ఏది ఏమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వల్ల రేవంత్ పరపతి పెరిగే మాట నిజం.


