
ఎంతటి అవినీతి చేసినప్పటికీ బీజేపీలో చేరితే అన్నీ వాషింగ్ మెషీన్‌లో వేసినట్టు అన్నీ మాయమైపోతున్నాయన్నది ఈ మధ్యకాలంలో దేశం మొత్తమ్మీద వినిపిస్తున్న మాట. ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా(JP Nadda) విశాఖపట్నంలో చేసిన ఒక ప్రసంగం ఈ మాటలు నిజమే అన్నట్టుగా ఉన్నాయి!. బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నిర్వహించిన ‘సారథ్య యాత్ర’ ముగింపు సభలో నడ్డా మాట్లాడుతూ వైసీపీ హయాంలో అవినీతి జరిగిందని, అసమర్థ, అరాచక పాలన సాగిందని ఆరోపించారు. రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని, అభివృద్ధి అడుగంటిందని కూడా వ్యాఖ్యానించారు. సహజంగానే ఈ మాటలు ఎల్లో మీడియా చెవికి ఇంపుగా తోచాయి. సంబరంగా కథనాలు రాసుకున్నాయి. కానీ..
వీరందరూ గతం మరచిపోయినట్టు ఉన్నారు. 2019కి మొదలు ఇదే జేపీ నడ్డాసహా బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షాలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని ఘోరంగా విమర్శించిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్ ఏటీఎం మాదిరిగా తమ అక్రమాలకు వాడుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) బహిరంగంగానే విమర్శించిన విషయం గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు అయితే మోదీని టెర్రరిస్టులతో పోల్చడం సంచలనం. మోదీ ప్రభుత్వ అవినీతి వల్ల దేశం పరువు పోతోందని, ముస్లింలను బతకనివ్వడం లేదని...ఇలా అనేక ఆరోపణలు గుప్పించారు. అప్పట్లో ఏపీ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు నీరు-చెట్టు కింద ఏపీలో రూ.13 వేల కోట్ల అవినీతి జరిగిందని, స్వచ్ఛ భారత్ లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దుర్వినియోగం అయ్యాయని చంద్రబాబు సర్కార్ పై ధ్వజమెత్తేవారు.
అవసరార్థం.. బహుకృత వేషం అన్నట్టు 2024 ఎన్నికల్లో ఎలాగోలా చేతులు కలిపిన టీడీపీ, బీజేపీలు ఇప్పుడు పరస్పర ప్రశంసలతో మురిసిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెడుతోందని నడ్డా వ్యాఖ్యానించారు. కానీ.. అందుకు తగిన కారణాలు, వాస్తవాలను మాత్రం దాచేశారు. జగన్ ముఖ్యమంత్రిగా(YS Jagan As CM) ఉన్న ఐదేళ్లలో ఏనాడూ ఏ రకమైన ఆరోపణలూ చేయని బీజేపీ ఇప్పుడు ఇలా మాట్లాడటం ఆత్మవంచనకు పరాకాష్ట అని చెప్పాలి. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మొదటి ర్యాంకు ఇచ్చిన విషయం నడ్డాకు గుర్తు రాలేదనుకోవాలి. చంద్రబాబుతో మళ్లీ జతకట్టాక బీజేపీ కొత్త పాటను ఎత్తుకుంటున్నట్లు ఉంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం పలు రంగాల్లో విఫలమైంది. యూరియా కోసం అల్లాడుతున్న రైతులు ఇందుకు ఒక తార్కాణం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ కనిపించని చెప్పుల క్యూలు, యూరియా కోసం రైతుల గొడవలు కూటమి పాలనలోనే కనిపిస్తున్నాయి. మామిడి, పొగాకు, టమోటా, ఉల్లి రైతులు ధరలు గిట్టుబాటు కాక ఆందోళనల బాట పట్టడం, నిరాశ, నిస్పృహల్లో తమ ఉత్పత్తిని రోడ్ల పాలు చేయడమూ చూశాం. ఏ సందర్భంలోనూ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు సకాలంలో చర్య తీసుకున్న పాపాన పోలేదు.
జగన్ టైమ్‌లో సజావుగా నడుస్తున్న విద్యా, వైద్య రంగాలలో ఇప్పుడు అస్తవ్యస్థ పరిస్థితి నెలకొంది. జగన్ ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయ సంకల్పిస్తే వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారు. దీనిపై ప్రజలలో తీవ్ర నిరసన వస్తోంది. పాలనను గాడిలో పెట్టడం అంటే ఇదేనా?.. మద్యం విచ్చలవిడిగా అమ్మడం, వైన్ షాపులు, పక్కన పర్మిట్ రూమ్‌లు, తదుపరి గ్రామాలలో బెల్ట్ షాపులు నడపడమే ప్రభుత్వ విజయమా?.. శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. మహిళల మీద పెద్ద సంఖ్యలో అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. రాజకీయ కక్షతో రెడ్ బుక్ పాలన చేయడమేనా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమంటే?. జర్నలిస్టులను, వాస్తవాలు రాసే మీడియాను, సోషల్ మీడియాను అణచి వేయడమేనా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం అంటే?. కార్పొరేట్ సంస్థలకు 99 పైసలకే ఎకరా భూమి కట్టబెట్టడమే మంచి పాలన అవుతుందా? సూపర్ సిక్స్ హామీలు అని, భారీ ఎన్నికల ప్రణాళిక అని ఎన్నికలకు ముందు ఊదరగొట్టి, ఇప్పుడు అరకొర చేసి మిగిలిన వాటికి దాదాపు చేతులు ఎత్తివేయడమే సమర్థతా? తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని అసత్యాన్ని ప్రచారం చేసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను గాయపరచడం గొప్ప సంగతా?? హిందూ మతానికి పేటెంట్ అని చెప్పుకునే బీజేపీ కూడా ఈ విషయంలో నోరు మెదపలేదు. ఇక్కడే తెలుస్తోంది వీరి ద్వంద్వ ప్రమాణాలు.
ఎట్టి పరిస్థితిలోను విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వమని ప్రచారం చేసి, ఇప్పుడు విభాగాల వారీగా ప్రైవేటువారికి ధారాదత్తం చేయడం మంచి పనిగా ప్రచారం చేసుకుంటారా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. జగన్ ప్రభుత్వం పలు వ్యవస్థలను తెచ్చి పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడితే వాటిని ధ్వంసం చేయడం పాలనను గాడిన పెట్టినట్లు అవుతుందా? లేక నాశనం చేసినట్లు అవుతుందా? తన మొత్తం స్పీచ్‌లో ఎక్కువ భాగం ప్రధాని మోడీ పాలన, కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయడానికే కేటాయించినా, ఏపీకి సంబంధించిన కొన్ని విషయాలను ప్రస్తావించారు. ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని పొగిడిన విషయాలకే ఎల్లో మీడియా ప్రాధాన్యత ఇచ్చింది. టీడీపీతో కూటమిలో ఉండబట్టి మొహమాటానికి పొగిడారా? లేక చిత్తశుద్దితోనే మాట్లాడారా అన్న డౌట్లు కూడా లేకపోలేదు.
2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓడిపోయింది. కేంద్రంలో మాత్రం బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. తదుపరి చంద్రబాబు పీఎస్ ఇంట్లో ఆదాయపన్ను శాఖ జరిపిన సోదాలలో రూ.2,000 మేరకు అక్రమాలు కనుగొన్నట్లు సీబీటీడీ ప్రకటించింది. ఆదాయపన్ను శాఖ చంద్రబాబుకు ఒక నోటీసు కూడా ఇచ్చింది. ఆ తర్వాత అవన్ని ఏమయ్యాయో తెలియదు కాని, చంద్రబాబు బీజేపీని ప్రసన్నం చేసుకునే వ్యూహాంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ప్రయోగించారు. తన పార్టీ ఎంపీలు నలుగురిని బీజేపీలోకి పంపించారు. చివరికి 2024 నాటికి బీజేపీని బతిమలాడి పొత్తు పెట్టుకోగలిగారు. మరి అంతకుముందు బీజేపీ, టీడీపీలు చేసుకున్న విమర్శల మాటేమిటి? అనే ప్రశ్న సామాన్యులకు రావొచ్చు. కానీ..
రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి టీడీపీ బీజేపీ నేతలు మాత్రం ఏమీ ఫీల్ కాలేదు. ఇంత అవకాశవాదపు పొత్తులు కూడా ఉంటాయా? అని అంతా నివ్వెరపోయారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటులో టీఎంసీ సభ్యుడు ఒకరు ప్రసంగిస్తూ చంద్రబాబుపై గతంలో కేంద్రం చేసిన అవినీతి ఆరోపణలు ఆయన తిరిగి బీజేపీతో కలవగానే ఏమైపోయాయని ప్రశ్నించారు. వాషింగ్ పౌడర్‌తో క్లీన్ చేసేశారా? అని ఎద్దేవ చేశారు. ఈ సంగతులేవీ అటు బీజేపీ, ఇటు టీడీపీ కాని ప్రస్తావించవు. పొత్తు తర్వాత మోదీని ఆకాశానికి ఎత్తుతూ ప్రపంచంలోనే గొప్ప నేతగా చంద్రబాబు అభివర్ణిస్తే, చంద్రబాబు అనుభవజ్ఞుడని, తాను సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు పాలన ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నానని పొగిడారు. ఎలాగైతేనేం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ, జనసేనలు కలిసి ప్రకటించిన ఎన్నికల ప్రణాళికతో తమకు సంబంధం లేదన్నట్లుగా బీజేపీ అప్పట్లో వ్యవహరించింది. అయినా ప్రభుత్వంలో మాత్రం భాగస్వామి అయింది. ఇప్పుడు ఆ హామీలను అరకొరగా అమలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. పైగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ ప్రభుత్వం వచ్చాక ఫలానా అభివృద్ది జరిగిందని గట్టిగా చెప్పుకునే పరిస్థితి ఉంటే ఆ విషయాన్ని నడ్డా చెప్పి ఉండాలి కదా! అవేమీ లేకుండా జనరల్ గా మాట్లాడితే ఏమి ప్రయోజనం? చిత్రం ఏమిటంటే నడ్డా ఈ సభలో కూడా అవినీతి, వారసత్వ రాజకీయాల గురించి ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై బీజేపీ చేసిన అవినీతి ఆరోపణలు నిజమా? కాదా?అన్నదాని గురించి మాత్రం చెప్పలేదు. అలాగే వారసత్య రాజకీయాలకు వ్యతిరేకం అని ఊదరగొట్టే బిజెపి నేతలు ఎపిలో ఇప్పుడు టిడిపిలో ఉన్నది వారసత్వ రాజకీయమా? కాదా? అప్పట్లో మరి లోకేశ్ రాజకీయ వారసత్వాన్ని మోడీ ఎద్దేవ చేయగా, ఇప్పుడు ఆయనే పిలిచి మరీ ఎందుకు విందులు ఇస్తున్నారో ప్రజలకు వివరణ ఇస్తారా? ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ లు గత పదిహేనేళ్లలో జరిపిన అవకాశవాద రాజకీయాలు నడ్డాకు గుర్తు లేకపోవచ్చు కాని, ఏపీ ప్రజలు మర్చిపోతారా?..
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.