
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి ఒక గుణపాఠం నేర్పి ఉండాలి. వైఎస్సార్‌సీపీ పార్టీకి కూడా ఇదో అనుభవం అని చెప్పాలి. పోలీసుల వ్యవస్థ రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తే ప్రజల్లో వచ్చే తిరుగుబాటు ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు నెల్లూరు జిల్లా తెలియజేసినంది. ఒక నాయకుడి పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు (రోడ్లు) ధ్వంసం చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు కూడా.
ప్రజాస్వామ్యాన్ని ఇంతగా పరిహాసం చేసిన సందర్భం కూడా ఇంకోటి ఉండదు. వైఎస్ జగన్ తన మీడియా సమావేశంలో వ్యక్తిగత విమర్శలకు తక్కువ ప్రాముఖ్యత ఇచ్చి, తను ఏ సందర్భంలో టూర్‌కు వచ్చిందీ, పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు, టీడీపీ కార్యకర్తల విధ్వంస కార్యక్రమాలు వాటి విపరిణామాలపై ఎక్కువ మాట్లాడారు. ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన జమ్మలమడుగు పర్యటనలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ.. అసలు మినహా మిగిలిన సోదంతా వెళ్లబోసుకున్నారు.
👉జైల్లో ఉన్న మాజీ మంత్రి, కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించేందుకు, మరో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిని టీడీపీ మూకలు ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆయన్ను కూడా పలుకరించే ఉద్దేశంతో జగన్ నెల్లూరులో పర్యటనకు సంకల్పించారు. గత నెల మొదటిలోనే ఈ పర్యటన ఖరారైనా హెలిప్యాడ్ కోసం పోలీసులు ఒక అటవీ ప్రాంతాన్ని చూపించడంతో వాయిదా పడింది. ఆ ప్రదేశంలోనే ఒక చిన్న రోడ్డు ఏర్పాటు చేసుకుని టూర్ తేదీలు నిర్ధారించుకున్నారు. అంతే! ఇక అప్పటి నుంచి ఏపీ ప్రభుత్వం ఆయన ప్రోగ్రాంను విఫలం చేయడానికి చాలా శ్రమ పడింది.
చంద్రబాబు, లోకేశ్‌లకు వీర విధేయులైన పోలీసు అధికారులను ప్రయోగించి ప్రజలను భయపెట్టే యత్నం చేశారు. జగన్ టూర్లో పాల్గొనడానికి వీల్లేదని శాసించే రీతిలో పోలీసులు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు, నాయకులకు నోటీసులు ఇచ్చారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా పోలీసులే కొన్ని ప్రకటనలు కూడా ఇచ్చారు. జగన్ టూర్లో పాల్గొంటే ఏదో జరిగిపోతుందని, కేసులు పెడతారని ప్రచారం చేశారు. టూర్ జరిగే రోజున ప్రజలు, అభిమానులు ఎవరూ రాకుండా ఉండడం కోసం పోలీసులు జేసీబీలతో రోడ్లపై గోతులు తవ్వారు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ఎక్కడకక్కడ ఇనుప కంచెలు వేయడం, నెల్లూరు సందులలో నుంచి కూడా జనం రాకుండా చేయాలని యత్నించడం వల్ల ప్రజలు నానాపాట్లు పడ్డారు. చివరికి అంత్యక్రియల కోసం రేవుకు వెళ్లడం కూడా కష్టమైందని నెల్లూరు వాసి ఒకరు తెలిపారు. ఇన్ని నిర్బంధాల మధ్య ప్రజలు జగన్ టూర్‌కు రారేమో అని అందరకూ అనుకున్నారు. కానీ.. వేల మంది జనం పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపడుతూ రోడ్లపైకి వచ్చి విజయవంతం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఈ అనుభవంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు పెట్టుకోవచ్చు.
👉ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థి పార్టీని అణగదొక్కాలని అనుకుంటే అది అన్నిసార్లు అయ్యే పని కాదని నెల్లూరు ప్రజలు తెల్చి చెప్పారు. ఈ ఏడాది కాలంలోనే చంద్రబాబు సర్కార్ విపరీతమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కుంటోందన్న విషయం మరోసారి స్పష్టమైంది. జగన్ ఏ పట్టణానికి వెళ్లినా ఇలా జనం తండోపతండాలుగా ఎందుకు వస్తున్నారో అర్థం కాక కూటమి నేతలు తల పట్టుకుంటున్నారు. ఒక పక్క జనం వస్తున్న విషయాన్ని పరోక్షంగా అంగీకరిస్తూనే ప్రజలు రాలేదని, సాక్షి టీవీలో బంగారు పాళ్యం ప్రోగ్రాం వీడియోలోని సన్నివేశాలు ప్రసారం చేశారని ఒక అసత్య ప్రచారం పెట్టారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి అలా మాట్లాడారంటే జగన్ టూర్‌పై వారు ఎంతగా కలవరపడుతున్నది అర్థం చేసుకోవచ్చు. బంగారుపాళ్యంలో జనం విశేషంగా వచ్చారని వారే స్వయంగా ఒప్పుకున్నట్ల అయ్యిందన్న వ్యాఖ్యలు వచ్చాయి.
ప్రభుత్వం దీనిని పరాభవంగా భావించి మరింత కక్షకు దిగకుండా ఇకనైనా ప్రజస్వామ్య పద్దతిలో జగన్ టూర్లకు సహకరించడం మంచిది. పోలీసులు ఎవరైనా ముఖ్యనేత వస్తుంటే ఆయనకు భద్రతకు కల్పించడం, జనం అధికంగా వస్తున్నారనుకుంటే దానికి తగ్గట్లు సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకోవాలి తప్ప, జనం ఆ ప్రోగ్రాంకు రాకుండా అడ్డుకోవడమే విధిగా పెట్టుకోరాదని ఈ ఘటన రుజువు చేసింది.
👉బంతిని ఎంత గట్టిగా కొడితే అది అంతగా పైకి లేస్తుందన్న విషయం రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. జగన్, చంద్రబాబుల వ్యాఖ్యలను పరిశీలిద్దాం. పాలనలో విఫలం అయినందునే చంద్రబాబు భయంతో తనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని జగన్ విమర్శించారు. తన పార్టీ నేతలను కలవడానికి వస్తే ఇన్ని ఆంక్షలా అని ప్రశ్నించారు. కాకాణి పై ఉన్న పలు అక్రమ కేసుల గురించి ప్రస్తావించి సోషల్ మీడియాలో పోస్టులు ఫార్వర్డ్ చేసినందుకు, మీడియా సమావేశం వీడియోను పోస్టు చేసినందుకు కూడా కేసులు పెట్టారని వివరించారు. నిజంగానే ఇది చాలా శోచనీయం. రాజకీయ నేతలకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అన్నది ఆలోచించాలి.
చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అవి అమలుకాని వైనం, రైతుల కష్టాలు, ప్రభుత్వంలో అవినీతి, శాంతిభద్రతల వైఫల్యం రెడ్ బుక్ రాజ్యాంగం, నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ మొదలైన అంశాలను జగన్ ప్రస్తావించారు. చంద్రబాబు వేసిన రెడ్ బుక్ విత్తు పెరిగి చెట్టు అవుతుందని, భవిష్యత్తులో అది వారికే ప్రమాదం అని హెచ్చరించారు.తమ ప్రభుత్వం వచ్చి తీరుతుందని,ఆ విషయం పోలీసులు గుర్తుంచుకోవాలని కూడా జగన్ పేర్కొన్నారు. జగన్ చేసిన విమర్శలకు చంద్రబాబు ఎక్కడా నేరుగా బదులు ఇచ్చినట్లు కనిపించలేదు. రాజకీయ ముసుగులో కొందరు అరాచకాలు సృష్టించే యత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.తాను ప్రతిపక్షంలో ఉన్నపుడు మాత్రం ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో కావాలన్నది ఆయన భావన. తన కుమారుడు రెడ్ బుక్ పేరుతో అధికారులను నానా మాటలు అన్నప్పటికీ, ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి అన్నప్పుడు కాని అవేవి అరాచకంగా ఆయనకు కనిపించలేదు.
స్వయంగా చంద్రబాబే పలుమార్లు పోలీసులను ధిక్కరించి హెచ్చరికలు చేయడం, టూర్‌లు సాగించిన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోయి జగన్ టూర్‌ను అరాచకంగా వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ కోసం జనం వస్తే తట్టుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. వివేకా హత్య కేసు గురించి మాట్లాడడం అసందర్భంగా అనిపిస్తుంది. రాజకీయ పాలన చేస్తానని చెప్పడం ద్వారా టీడీపీలో అరాచకాన్ని ఎంకరేజ్ చేస్తున్న విషయాన్ని విస్మరిస్తున్నారు. మళ్లీ వస్తా.. అంతు తేలుస్తా అని జగన్ చెబుతున్న మాటలను ఎవరూ నమ్మడం లేదని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు దానిని విశ్వసిస్తుంటే జగన్ టూర్ లకు ఎందుకిన్ని ఆంక్షలు పెట్టడం అన్నదానికి మాత్రం జవాబు ఇవ్వరు. ఎంతో సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పటికైనా తన కుమారుడు, మంత్రి లోకేశ్ అనుభవ రాహిత్యంతో అమలు చేస్తున్న రెడ్ బుక్ వ్యవహారాలకు ఫుల్ స్టాప్ పెట్టడం అవసరం. నెల్లూరు అనుభవాన్ని గుణపాఠంగా తీసుకుని ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తిస్తే చంద్రబాబు ప్రభుత్వానికే మంచిది.లేకుంటే ప్రజలలో ఆయన ప్రభుత్వమే మరింత పలచన అవుతుంది.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
