
మాజీ ముఖ్యమంత్రి, వైయస్‌ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం టూర్ అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతల వెన్నులో వణుకు పుట్టించినట్లు అనిపిస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారన్న వార్తలు చూసిన తర్వాత.. కచ్చితంగా జగన్ అంటే వీరు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుంది. నాలుగేళ్ల తర్వాత జరిగే ఎన్నికల గురించి ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నట్లుంది.
బంగారుపాళ్యంలో మామిడి రైతుల సమస్య ఏమిటి? కూటమి ప్రభుత్వం శ్రద్ద దేనిమీద ఉంది? ఎంతసేపు జగన్ మామిడి మార్కెట్ యార్డ్‌కు వెళుతున్నారే! ఈ సమస్య ప్రజలలోకి బాగా వెళ్లిపోతుందే! అన్న గొడవ తప్ప, రైతులను ఆదుకోవడం ద్వారా వారికి మేలు చేయాలన్న ఉద్దేశం ఎందుకు కనిపించలేదు!. పైగా జగన్ టూర్‌ను ఎలా విఫలం చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు ప్రభుత్వం మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకుంది. జగన్ మామిడి రైతుల పరామర్శకు వెళ్ళడం వల్ల ప్రభుత్వం కొంతైనా కదిలి వారికి రూ.260 కోట్లు ఇస్తామని ప్రకటించక తప్పలేదు. ఇది జగన్ వల్లే అయిందని రైతులు అనుకునే పరిస్థితిని కూటమి నేతలే స్వయంగా సృష్టించుకున్నారు.
తోతాపురి మామిడి కొనుగోళ్లు సరిగా లేక, ధరలు దారుణంగా పడిపోయి రెండు నెలలుగా రైతులు నానా బాధలు పడుతున్నారు. మామిడి పండ్లతో రైతులు రోజుల కొద్దీ ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాస్తున్న విషయం చిత్తూరు జిల్లా కూటమి నేతలు ఎవరూ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లలేదా!. ఇంటిలెజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదా? ఒకవేళ సమాచారమిచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదా?. కిలో మామిడి ధర చివరికి రెండు రూపాయలకు పడిపోయి కూలీ, రవాణా ఖర్చులు సైతం గిట్టుబాటు కాక, పలువురు రైతులు మామిడి పళ్లను రోడ్ల పక్కన పారబోసింది నిజం కాదా?అదేదో జగన్ టూర్లో కావాలని పోసినట్లు మంత్రులు, తెలుగుదేశం మీడియా గగ్గోలు పెడుతోంది.
టీడీపీ మీడియా అయితే మరీ నీచంగా దండుపాళెం బ్యాచ్ అని, జగన్నాటకం అంటూ శీర్షికలు పెట్టి రైతులను అవమానిస్తూ, తమ అక్కసు తీర్చుకున్నాయి. జగన్‌కు మద్దతుగా కాని, తమ బాధలు చెప్పుకోవడానికి గాని రైతులు వస్తే ఇలా తప్పుడు కథనాలు రాయడం ఘోరం. టమోటాలు, ఇతర ఉత్పత్తులకు సరిగా ధర లేకపోతే రైతులు పలు సందర్భాల్లో కింద పారబోసి నిరసనలు తెలిపిన ఘటనలు ఎన్ని జరగలేదు? అసలు జగన్ టూర్ ప్రకటన వచ్చినప్పటి నుంచి పోలీసుల ద్వారా ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రభుత్వం తలపెట్టింది! ఎన్ని ఆంక్షలు పెట్టింది!..
ఎక్కడైనా ఇంతమందే రావాలని చెబుతారా? ఒకవేళ స్థలాభావం ఉంటే దానిని దృష్టిలో ఉంచుకుని వైసీపీ నేతలతో మాట్లాడి తగు ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. అలా కాకుండా 500 మంది మాత్రమే రావాలని, ఐదుగురితోనే మాట్లాడాలని, రైతులను ఆటోలలో ఎక్కించుకోకూడదని, మోటార్ బైక్‌లకు పెట్రోల్ పోయరాదని.. ఇలాంటి పిచ్చి ఆంక్షలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ టూర్ పై క్యూరియాసిటీ పెంచారు. జగన్ బంగారుపాళ్యం వచ్చిన రోజున మూడు జిల్లాల ఎస్పీలు, పెద్ద సంఖ్యలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు.. సుమారు రెండువేల మందిని నియమించారట. వీరు జనాన్ని రెగ్యులేట్ చేయడానికి కాకుండా, ప్రజలు అటువైపు రాకుండా చేయడం కోసం నానా పాట్లు పడ్డారట. బంగారుపాళ్యం చుట్టూరా పాతిక చెక్ పోస్టులు పెట్టారట.

జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు టూర్లలో ఇలా ఎప్పుడైనా చేశారా? అనపర్తి వద్ద భద్రతాకారణాల రీత్యా చంద్రబాబును అడ్డుకోకపోతే, మద్దతు దారులను వెంట బెట్టుకుని నడుచుకుంటూ వెళ్లారే? అప్పుడు పోలీసులు ఆయనకు సెక్యూరిటీ ఇచ్చారే తప్ప ఆపలేదే! చంద్రబాబు అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించినా పోలీసులు ఇలా అడ్డంకులు సృష్టించలేదు. చివరికి కందుకూరు వద్ద ఇరుకు రోడ్డులో సభ పెట్టిన ఫలితంగా తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించినా చంద్రబాబుపై పోలీసులు కేసు పెట్టలేదు.
అదే.. జగన్ సత్తెనపల్లి సమీపంలోని రెంటపాళ్లకు వెళుతున్నప్పుడు ఒక వ్యక్తికి కారు తగిలి గాయపడి మరణిస్తే, డ్రైవరుతోపాటు జగన్, ఇతర ప్రయాణీకులపై కేసులు పెట్టి సరికొత్త ట్రెండ్ సృష్టించిన ఘనత కూటమి సర్కార్ పొందింది. ఎక్కడ సభ పెట్టినా చంద్రబాబు ఈ ఘటనను ప్రస్తావించి జగన్‌కు మానవత్వం లేదని, ప్రమాదం జరిగినా కారు ఆపలేదని అన్యాయంగా ఆరోపణ చేస్తున్నారు. అదే తను పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే ఏమన్నారో మర్చిపోయారు. ప్రమాదాలు జరగవా! జగన్నాధ రథోత్సవంలో రోడ్డు యాక్సిడెంట్లు జరగడం లేదా? అంటూ మాట్లాడిన విషయం మాత్రం మానవత్వంతో కూడినదని జనం అనుకోవాలా? ఇలా ప్రతిదానిలో డబుల్ టాక్ చేయడం వల్ల అంత సీనియర్ నేత అయిన చంద్రబాబుకు ఏమి విలువ పెరుగుతుందో తెలియదు.

బంగారుపాళ్యం వద్ద కొన్ని చోట్ల అవసరం లేకపోయినా పోలీసులు లాఠీలు ఝళిపించడంతో కొందరు గాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఒకరి తలకు గాయమైంది. అతనిని పరామర్శకు కూడా జగన్ కారు దిగడానికి పోలీసులు అనుమతించలేదు. కర్ణాటకలో కిలో రూ.16లకు కేంద్రం మామిడి పంటను కొనుగోలు చేస్తుంటే, ఏపీలో ఎందుకు చేయడం లేదో కూటమి నేతలు ప్రశ్నించాలి కదా? అలా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న కిలోకు రూ.నాలుగు సబ్సిడీని కేంద్రం భరించాలని అడిగారట. చంద్రబాబు సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన ప్రాంతాల రైతుల గురించి వేరే చెప్పాలా? జగన్ గుంటూరు మార్కెట్ యార్డుకు వెళ్లి మిర్చి రైతులను పరామర్శిస్తే తప్ప, వారికి సాయం చేయాలని కూటమి సర్కార్ కేంద్రాన్ని కోరడానికి అంతగా చొరవ తీసుకోలేదు. పొదిలి వద్ద పొగాకు రైతుల కష్టాలను తెలుసుకోవడానికి జగన్ వెళ్లుతున్నారు అన్నప్పుడుగాని వారికి సాయం చేయడానికి ముందుకు రాలేదు. అంటే ఏమిటి దీని అర్థం? ప్రతిపక్షంగా ఉన్న పార్టీ నేత యాక్టివ్‌గా ఉంటే అది ప్రజలకు మేలు చేస్తుందనే కదా! ఇదే కదా ప్రజాస్వామ్యం.
ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో లేకపోయినా, తన వెంట జనం ఉన్నారని జగన్ పదే, పదే రుజువు చేస్తున్న తీరు సహజంగానే చంద్రబాబు బృందానికి కలవరం కలిగిస్తుంది. అందుకే జగన్ వద్దకు జనం రాకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం యత్నించింది. కాని ప్రజాస్వామ్యంలో అణచివేత విధానాల వల్ల ఉపయోగం ఉండదని అనుభవ పూర్వకంగా తెలియ చేసినట్లయింది. బంతిని ఎంత వేగంగా నేలకేసి కొడితే, అంతే వేగంగా అది పైకి లేస్తుందన్న సంగతి మరోసారి స్పష్టమైంది.
పోలీసులు మెయిన్ రోడ్డుపై ప్రజలను అడ్డుకోవడానికి యత్నిస్తుంటే అనేక మంది కొండలు, గుట్టలు దాటుకుంటూ, అడవుల గుండా కూడా తరలిరావడం కనిపించింది. కొందరు యువకులు మోటార్ సైకిళ్తపై చిన్న, చిన్న డొంకల ద్వారా తరలివచ్చిన తీరుకు సంబంధించిన వీడియోలు అందరిని ఆకర్షించాయి. జగన్ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా అదే తీరుగా ఉంది. ఇంత జనాభిమానం ఉన్న నేత గత ఎన్నికలలో ఎలా ఓడిపోయారో అర్థం కావడం లేదన్నది పలువురి భావన. అందుకే కూటమి సూపర్ సిక్స్‌తో పాటు ఈవీఎంలు, ఓట్ల మాయాజలం వంటి అనుమానాలు వ్యాప్తిలోకి వచ్చాయి.
ఏది ఏమైనా ప్రభుత్వంలో కదలిక తీసుకు రావడానికి జగన్ యాత్రలు ఉపయోగపడుతుండడం హర్షించవలసిందే. ఆయన ప్రభావంతో ఆయా వర్గాల ప్రజలకు ముఖ్యంగా రైతులకు కొంతైనా మేలు జరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. వైయస్సార్‌సీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి థాంక్స్ చెప్పాలి. జగన్‌కు టూర్లకు ఏదో విధంగా అంతరాయం కల్పించి ఆయనకు జనంలో ఉన్న క్రేజ్ అందరికి తెలిసేలా చేస్తున్నందుకు, ఆ ప్రజాకర్షణను ప్రభుత్వమే రోజురోజుకు మరింతగా పెంచుతున్నందుకు!.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.