
సత్యం, అసత్యాలతో నిమిత్తం లేదు.. వినేవారు ఏమనుకుంటారో అన్న సందేహం అస్సలు రాదు. తనను తానే పొగిడేసుకుంటారు. చెప్పే దాంట్లో నిజం ఉందన్న భ్రాంతి కలిగిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరికి మచ్చు తునకలివి. మాటల మార్చేందుకు ఏమాత్రం తటపటాయించరు కూడా. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న చంద్రబాబు ఎక్కడ ఏ ఉపన్యాసం చేసినా చిత్ర, విచిత్రాలు కనిపిస్తాయి.
పాడేరులో ఆదివాసి దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఇటీవల ఆయన ప్రసంగం చూడండి. ఇక్కడ తనకంటే మేధావి ఎవరైనా ఉన్నారా అని అడగటమూ.. లేరని ఆయనే తేల్చయడం కూడా జరిగిపోయిందట. తనది ముందు చూపని.. సూపర్ సిక్స్ ప్రకటించాం.. సూపర్ హిట్ చేశాం అని కూడా ఆయనంతకు ఆయన ప్రకటించుకున్నారు. ఈ మాటలిప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అంతేకాదు.. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను దృష్టిలో ఉంచుకుని మళ్లీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావించి తనకు తోచిన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో రింగ్ రోడ్డుతో సహా పలు కార్యక్రమాలు తనవే అన్నట్లుగా ఆయన మాట్లాడుతుంటారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హెలికాఫ్టర్‌లో పర్యటిస్తుంటే గిరిజన ప్రాంతంలో ఉన్న కొండలు చూసి ఆయన ముగ్దులయ్యారట. వచ్చే జన్మలో గిరిజనుడిగా పుట్టాలని, ఇక్కడే ఉండాలని అనిపించిందని అన్నారు.
ఒకప్పుడు ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని వ్యాఖ్యానించి విమర్శలకు గురైన చంద్రబాబు ఇప్పుడు గిరిజనులలో పుట్టాలని అనుకుంటున్నానని చెప్పడం స్వాగతించవలసిన విషయమే. కాకపోతే, ఇక్కడే ఉండాలని అనిపించిందని అన్న మాటలో చిత్తశుద్ది ఉందా అన్న సంశయం రావచ్చు. ఆయనకు నిజంగానే ఈ కోరిక ఉంటే, ఈ జన్మలోనే ఉంటానని చెప్పవచ్చు. తను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత గిరిజన ప్రాంతంలోనే ఉంటానని ప్రకటించి ఉంటే ఆయన కోరిక తీరేది కదా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గిరిజన ప్రాంతాలలో డోలీలు లేకుండా చేసేశామని ఆయన అన్నారట. అందులో వాస్తవం లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. అసలు సరైన రోడ్లు లేక గిరిజనులు పడేపాట్లు ఇన్నీ అన్నీ కావు. ఈ మధ్యనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతంలో పర్యటించి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినా, అవి ముందుకు సాగడం లేదని గిరిజనులు గుర్రాలపై తిరుగుతూ నిరసన తెలిపారు.
పీ-4 కోసం బయట నుంచి మార్గదర్శులను తెచ్చి గిరిజనులకు సహాయ పడతామని ఆయన అన్నారు. అంటే దీని అర్ధం ఇంతవరకు ఈ ప్రాంత పేదలను దత్తత తీసుకోవడానికి ఎవరూ పెద్దగా ముందుకు రాలేదని చెప్పకనే చెప్పినట్ల అయ్యింది. కాగా చంద్రబాబుకు పీ-4 పిచ్చి పట్టిందా అంటూ ఆయనకు మద్దతు ఇచ్చే ఒక మీడియా రాసిన వ్యాసం చూసిన తర్వాతైనా అందులో ఉన్న డొల్లతనం అర్థమై ఉండాలి. గిరిజనులకు మానిఫెస్టోలో ఇచ్చిన హామీలేమిటి? వాటిని ఏ మేరకు అమలు చేశామో చెప్పకుండా, అది తెచ్చా! ఇది తెచ్చా! అని ప్రచారం చేసుకుంటే ఏమి ప్రయోజనం? గిరిజనుల కోసం స్పెషల్ డీఎస్సీ వేస్తామని చెప్పిన హామీ ఎందుకు నెరవేర్చలేకపోయారో వివరించి ఉండాలి కదా! పాడేరు మెడికల్ కాలేజీని త్వరలో పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. బాగానే ఉంది. కానీ, ఏడాది కాలంలో ఎందుకు ముందుకు తీసుకువెళ్లలేదు?.
వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు పూనుకుని భవనాల నిర్మాణాలు కూడా చేపడితే, మెడికల్ సీట్లు అక్కర్లేదని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం ఏ రకంగా రాష్ట్రానికి, గిరిజన ప్రాంతానికి మేలు చేసినట్లు?. గిరిజన ప్రాంతాన్ని తానే అభివృద్ది చేశానని, ఉద్యోగాలు ఇచ్చానని ఆయన చెప్పుకున్నా, వాస్తవ పరిస్థితి అలా కనిపించదు. గిరిజనుల ఇళ్ల వద్దకే సేవలందించే వలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఫలితంగా ఇప్పుడు గిరిజనులు రేషన్ కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది.
కేంద్ర స్కీములను కూడా తన ఖాతాలో వేసుకుని మాట్లాడారు. ఫలానా పనిలో తన వాటా ఇంత అని చెప్పుకుంటే ఫర్వాలేదు. కానీ, మొత్తం తానే చేశానని చెప్పడం ద్వారా నగుబాటుకు గురవుతున్న విషయాన్ని ఆయన పట్టించుకోరు. ఔటర్ రింగ్ రోడ్డు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వచ్చిందన్న విషయం ప్రజలకు తెలియదా?. పోనీ హైదరాబాద్‌లో అన్ని చేశానని చెప్పుకునే చంద్రబాబు విశాఖ, విజయవాడ తదితర ముఖ్యమైన నగరాలకు ఫలానా పని చేశానని ఎందుకు చెప్పలేకపోతున్నారు?. సూపర్ సిక్స్ హామీల అమలు.. సూపర్ హిట్ అని ప్రచారంలో పెట్టడం ఆయన మేధావితనానికి నిదర్శనం అనుకోవాలి. జనం కూడా అన్ని హామీలు నెరవేర్చేశారని భావించాలన్నమాట. నిజమే! అక్కడ ఉన్న ఆ సమావేశంలో ఆయనంత మేధావి లేకపోవడం వల్ల ఆ హామీల గురించి ఎవరూ ప్రశ్నించి ఉండకపోవచ్చు. లేదా పోలీసులతో ఎక్కడ కేసులు పెట్టిస్తారో అన్న భయంతో ఆ విషయాలు అడిగి ఉండకపోవచ్చు.
చివరికి వైఎస్సార్‌సీపీ గిరిజన ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును సభ వద్దకు అనుమతించకపోవడంతో ప్రశ్నించే వారే లేకుండాపోయారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామన్న హామీ నెరవేరిందా?. నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారా?. తల్లికి వందనం సహా రైతు భరోసా, తదితర స్కీములు ఒక ఏడాది ఎగవేసి, ఈ ఏడాది అరకొరగా అమలు చేస్తే అవి సూపర్ హిట్ అయినట్లా? మహిళలకు ఉచిత బస్ ప్రయాణం గురించి ఇచ్చిన హామీ ఏమిటి? ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదు. ఇప్పుడు అమలు చేయాలని సంకల్పించినా, అన్ని రకాల బస్సుల్లో ఆ సదుపాయం కల్పించకుండా షరతులు పెట్టడం ప్రజలను మోసం చేయడం అవుతుందా? కాదా?. ఎన్నికల మేనిఫెస్టోలోని మిగిలిన 145 హామీల సంగతేమిటి?. అవి అమలు చేయకపోయినా ఫర్వాలేదని అనుకుంటున్నారా?. వాటి ఊసే ఎత్తడం లేదే!. అయినా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పగలిగిన ధైర్యం అనండి.. నేర్పరితనం అనండి ఆయన సొంతమే అని అనుకోవాలి!.
ఇక గిరిజన ప్రాంతంలో సభకు వెళ్లి అక్కడ కూడా వివేకా హత్య కేసు ప్రస్తావన తేవడంలోని దురుద్దేశం అర్దం కావడం లేదా?. పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో దాని గురించి ఈ ప్రచారం చేయడం అవసరమా?. పులివెందుల ప్రజలకు అక్కడ ఏం జరిగిందో తెలియకుండా ఉంటుందా?. ఒకపక్క టీడీపీకి చెందిన వారు రౌడీయిజం చేస్తుంటే, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై అంత దారుణంగా దాడి చేసినా, అలాంటి ఘోరాలను అరికట్టకపోగా, వైఎస్సార్‌సీపీ వారిని ఉద్దేశించి ఏవేవో మాట్లాడితే నమ్మడానికి జనం పిచ్చివాళ్లని అనుకుంటున్నారా?. రౌడీయిజం, అబద్దాలు రాజకీయాలకు అవసరమా? అని చంద్రబాబు ప్రశ్నించడం విడ్డూరమే అనుకోవాలి. అబద్దాలు చెప్పడంలో దేశంలోనే ఆయనను మించిన నేత లేరని ప్రత్యర్ధి పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. వారు చేసే విమర్శలలో ఒక్కదానికి కూడా ఆయన నేరుగా ఎప్పుడూ జవాబుఇవ్వలేదు. కళ్లార్పకుండా అబద్దాలు ఆడగల సత్తా చంద్రబాబుకు ఉందని దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో పలుమార్లు అన్నారు.
ఆ సమయంలో చంద్రబాబు లేచి తాను ఆడిన అబద్దమేమిటో చెప్పాలని ఎప్పుడూ సవాల్ చేసినట్లు కనిపించలేదు. రౌడీయిజం గురించి మాట్లాడాలంటే ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ గూండాలు చేస్తున్న రౌడీయిజం గురించి ముందుగా ఆయన బదులు ఇస్తే బాగుంటుంది. ఏమైందో కానీ, టీడీపీకి చెందిన ఒక మీడియానే ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలపై, రౌడీయిజంపై విమర్శలు చేసింది. దానికి చంద్రబాబు జవాబు ఇచ్చే పరిస్థితి లేదనే చెప్పాలి. ఒకటి మాత్రం వాస్తం. ఆయనకు ముందుచూపు ఉన్నమాట కొంతవరకు ఒప్పుకోవాలి. కాంగ్రెస్, బీజేపీలను ఆయన దూషించినంతగా మరెవరూ దూషించి ఉండరు. కానీ, ఆ రెండు పార్టీలతో మళ్లీ జతకట్టగలరు. 2024 ఎన్నికల సమయంలో ఎంత ముందు చూపులేకపోతే బీజేపీని బ్రతిమిలాడి మరీ పొత్తు ఎలా పెట్టుకుంటారు?. దాని ద్వారా టీడీపీ ఎన్నో రకాల మాయోపాయాలను ప్రదర్శించగలిగింది కదా!.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.