ఎల్లో మీడియాకు పెద్ద చిక్కే వచ్చింది. ఒకపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంకోపక్కేమో తమకు అత్యంత ప్రియుడైన తెలుగుదేశాధిపతి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు చంద్రబాబును చిక్కులే పడేసేలా వ్యాఖ్యానిస్తే.. సమర్థించుకోలేక, విమర్శించనూ లేక అల్లల్లాడిపోతోంది ఈ పచ్చమీడియా! తన విజ్ఞప్తితోనే చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశారని రేవంత్ చెప్పడం.. ఏపీలో తెలుగుదేశంతోపాటు, ఎల్లో మీడియాకు కూడా దిక్కుతోచటం లేదు.
రేవంత్ రెడ్డిని విమర్శించే ధైర్యం తెలుగుదేశం పార్టీ ఎటూ చేయదు. వంతపాడే జనసేన, బీజేపీలు కూడా కామ్‌గానే ఉన్నాయి. రహస్య విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చి మూడు రోజులు అవుతున్నా చంద్రబాబు కూడా రేవంత్ వ్యాఖ్యలను నేరుగా ఖండించలేకపోయారు. నష్టం కొంత తగ్గిద్దామనుకున్నాయేమో.. ఎల్లో పత్రికలు రేవంత్ వ్యాఖ్యలను కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం చేశాయి. చంద్రబాబుకు నష్టం జరిగే సమాచారాన్ని ఎడిట్ చేసి కనీ కనిపించకుండా వేసి ఏపీ పాఠకులను మోసం చేశాయి.
సాక్షి మీడియా మాత్రమే రేవంత్ ప్రకటనను యథాతథంగా ఇచ్చింది. విశ్లేషణలు అందించింది. సాక్షి, సోషల్‌మీడియా చురుకుగా ఉండటంతో చంద్రబాబు ఏపీ ప్రజలకు ముఖ్యంగా రాయలసీమకు ఎంత అన్యాయం చేసింది అర్థమైంది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఈ ఊబి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తన సహజ ధోరణిలో జగన్ వల్లే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఆగిందంటూ దిక్కుమాలిన వాదన తెరపైకి తెచ్చింది. ఈనాడు పత్రిక తెలంగాణ ఎడిషన్‌లో 'చచ్చినా, బతికినా తెలంగాణ కోసమే’ అన్న శీర్షికతో రేవంత్ వ్యాఖ్యలను ప్రచురించింది.
ఇందులో రాయలసీమ లిఫ్ట్‌ను తానే ఆపు చేయించానన్న అంశానికి ప్రాధాన్యమివ్వలేదు. లోపల పేజీలో మాత్రం కొద్దిగా రాసింది. అందులో కూడా జగన్ ప్రస్తావన తెచ్చింది. పంచభక్ష్య పరమాణ్ణాలు పెట్టి కేసీఆర్ భుజం తట్టి జగన్‌ను ప్రోత్సహిస్తే తాను చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి ఆపించానంటూ రేవంత్ చేసిన కామెంట్‌ను ముద్రించారు. తెలంగాణలో కనీసం లోపలి పేజీలోనైనా వేశారు.. ఈనాడు ఏపీ ఎడిషన్‌లో వేసినట్లు కనిపించలేదు. కాని మరుసటి రోజు మాత్రం మంత్రులు సవిత, రామానాయుడుల ప్రకటనలను మొదటి పేజీలో ప్రచురించారు.
కాగా తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో రేవంత్ అబద్దాలు చెప్పారని చేసిన వ్యాఖ్యకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈనాడు మీడియా చంద్రబాబు పట్ల స్వామిభక్తి చూపింది. రాయలసీమ లిఫ్ట్ ఆగడానికి కారణం జగనే అని ఏపీ మంత్రి సవిత ఆరోపించారు. ఎన్జీటీ ఆదేశాలతోనే 2020లో ఎత్తిపోత పనులు నిలిచిపోయాయని అన్నారు. చంద్రబాబును బూచిగా చూపుతూ తెలంగాణ నేతల రాజకీయ ఎత్తుగడలుగా ఈ ఉదంతాన్ని కొట్టిపారేశారు. అంతే తప్ప తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక్క మాట అనలేకపోయారు. దీనినిబట్టి టీడీపీ కాంగ్రెస్ మాచ్ ఫిక్సింగ్ చాలా స్పష్టంగా వెల్లడైంది.
ఈ పథకంపై ఎన్జీటీలో ఫిర్యాదు చేసింది తెలంగాణ టీడీపీ సహకారంతోనే అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎన్జీటీ వ్యతిరేక ఆదేశాలు ఇచ్చినా జగన్ వ్యూహాత్మకంగా పనులు కొనసాగించారు. దాంతో అటు కేసీఆర్ ప్రభుత్వం, ఇటు ఏపీలో జగన్ అంటే పడని శక్తులు ఎన్జీటీకి మళ్లీ మళ్లీ ఫిర్యాదులు చేశాయి. ఈలోగా కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పటికి 19 నెలలు అయినా ఈ స్కీమ్ అడుగు ముందుకు కదల్లేదు. ఎందుకిలా అన్నదానికి ఈ మంత్రులు సమాధానం ఇవ్వాలి కదా! ఆ ఊసే లేకుండా వారు స్టేట్ మెంట్ ఇచ్చారు.
కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుపుతున్నామని ఊదరగొట్టే ఈ నేతలు, కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు తెచ్చి ఉండాలి కదా!అవేమీ చేయలేదంటే ఈ పథకాన్ని ఆగినా, రాయలసీమకు నష్టం జరిగినా ఫర్వాలేదన్నట్లే కదా అన్న ప్రశ్నకు ఏమి జవాబు ఇస్తారు? రేవంత్ డిమాండ్ కు తలొగ్గినట్లే అవుతుంది కదా! ఒకవేళ జగన్ పై ఇలాంటి ఆరోపణ వచ్చి ఉంటే తెలుగుదేశంతోపాటు ఎల్లో మీడియా ఎంత రచ్చ చేసి ఉండేవో ఊహించుకోవచ్చు. ఇరిగేషన్ మంత్రి రామానాయుడు కూడా రాయలసీమకు జగన్ ద్రోహం చేశారంటూ ఒక తప్పుడు ఆరోపణ చేశారే తప్ప, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒక్క విమర్శ చేయలేదు. రేవంత్ చాలా స్పష్టంగా ఏకాంత సమావేశంలో చంద్రబాబును ఒప్పించానని వెల్లడించారు. తనపై గౌరవంతోనే చంద్రబాబు ఈ స్కీమ్ పనులు నిలిపివేశారని అన్నారు. కావాలంటే కమిటీగా వెళ్లి చూడవచ్చని తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించారు. అయినాసరే... టీడీపీ నేతలు, మంత్రులు మొక్కుబడిగా మాట్లాడి సరిపెట్టుకున్నారు.
రాయలసీమకు చెందిన చంద్రబాబు నాయుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణమా? కాదా? వైఎస్సార్ కాంగ్రెస్ కాని, ప్రజాసంఘాలు కాని చేస్తున్న విమర్శలకు కూటమి నేతలు నేరుగా జవాబు ఇవ్వలేకపోతున్నారు. 2024లో జగన్ ప్రభుత్వం ఉన్నంతవరకూ ఈ స్కీమ్ పనులు కొనసాగాయనేందుకు వైసీపీ నేత సతీష్ రెడ్డి రికార్డులు చూపించారు. వైసీపీ బృందం ఒకటి లిఫ్ట్ స్కీమ్ ప్రాంతానికి వెళ్లి జగన్ టైమ్‌లో జరిగిన పనులు ప్రజలకు తెలియచెప్పింది.

అలాగే నమస్తే తెలంగాణ పత్రిక గతంలో ఆ ప్రాంతానికి వెళ్లి జగన్ ఈ స్కీమ్ పనులు ఆపలేదని, ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిన నాటికి 14 శాతం పనులు జరిగితే, ఆ తర్వాత 85 శాతం జరిగాయని ఆ రోజుల్లో తెలిపింది. ఏపీ మంత్రులు ఈ విషయాలను కప్పిపుచ్చుతూ ప్రకటనలు చేస్తున్నారు. ఎల్లో మీడియా కూడా అప్పట్లో ఈ స్కీమ్‌ను ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఆపలేదంటూ కొన్ని వార్తలు ఇచ్చిన క్లిప్లింగ్‌లు వెలుగు చూస్తున్నాయి. దీంతో ఈ మీడియా కూడా జగన్‌పై ద్వేషంతో రాయలసీమకు నష్టం చేయడానికి వెనుకాడలేదన్నమాట.
ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో దీనిపై మీడియా సమావేశం పెట్టి వాస్తవాలు చెబుతారని లీక్ ఇచ్చారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక 'సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే అని పెద్ద హెడింగ్ పెట్టి తన పాఠకులను, ఏపీ ప్రజలను మోసం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేసింది. ఈ పత్రిక రేవంత్ చేసిన వ్యాఖ్యల సారాంశాన్ని ఒక్క ముక్క కూడా ఏపీ ఎడిషన్ లో ప్రస్తావించినట్లు కనిపించలేదు. ఆ తర్వాత రోజు మాత్రం తాటికాయంత శీర్షిక పెట్టి జగన్ పై బురద చల్లేందుకు యత్నం చేసింది. రేవంత్ ప్రకటనతో ఏపీలో చంద్రబాబుకు తీరని నష్టం జరిగిందని గమనించిన ఈ ఎల్లో మీడియా మొత్తం ఇష్యూని జగన్ పై నెట్టేసి టీడీపీని రక్షించాలని విఫల యత్నం చేసింది.
అనుమతులు లేవు.. డీపీఆర్ లేదు.. అయినా జగన్ 2020లో ఈ ప్రాజెక్టును చేపట్టారని ఈ పత్రిక రాసింది. పర్యావరణ అనుమతులు వచ్చాకే నిర్మించాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయంటూ రాశారు. ఈ వివాదంలో చంద్రబాబుపై బురద చల్లి రాజకీయ లబ్దిపొందేందుకు వైసీపీ ఎత్తు అని ఎల్లో మీడియా ఆరోపించింది. అయినా వాస్తవాలు వెల్లడవడంతో ఆ ఎత్తు చిత్తయిందని ఈ పత్రిక అభిప్రాయపడింది. అది నిజమే అయితే ఇంతగా కంగారు పడుతూ జగన్‌కు వ్యతిరేకంగా కథనాలు ఇవ్వవలసిన అవసరం ఏముంది. అసలు ఈ వివాదానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి కదా! ఆయనను ఎందుకు ఒక్క మాట అనలేదు?
జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ స్కీమ్ పనులను చెడగొట్టడానికి ఎల్లో మీడియా ఎన్ని ఎత్తులు వేసింది తెలియచేస్తూ సోషల్ మీడియాలో విశ్లేషణలు వస్తున్నాయి. అటు రేవంత్ తోను, ఇటు చంద్రబాబుతోను ఈనాడు యజమాని కిరణ్ కు, ఆంద్రజ్యోతి యజమాని రాధాకృష్ణకు ఉన్న సంబంధాలు అందరికి తెలిసినవే. వారి వ్యాపార ప్రయోజనాల కోసం జర్నలిజాన్ని తాకట్టు పెట్టారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం ఎల్లో మీడియాకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అవడంతో దానిని కవర్ చేయడానికి జగన్ పై తోసేయాలని కుట్ర చేస్తున్నారు.
ఇదే టైమ్ లో ఇంకో సంగతి చెప్పాలి. చంద్రబాబు నాయుడు పోలవరం నుంచి బనకచర్లకు లిఫ్ట్ స్కీమ్ అంటూ విపరీతంగా ప్రచారం చేసి, సడన్‌గా దానిని ఆపేసి పోలవరం-నల్లమల సాగర్ స్కీమ్ అంటూ కొత్త గాత్రం ఎందుకు ఎత్తుకున్నారో ఎల్లో మీడియా చెప్పగలదా! ఓటుకు నోటు కేసు తర్వాత రేవంత్ తో ఏర్పడిన సంబంధ బాంధవ్యాల రీత్యా చంద్రబాబు ఆయన మాట కాదనలేని పరిస్థితి ఏర్పడిందన్నది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.ఆ కేసు వల్లే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను వదలుకుని చంద్రబాబు ఏపీకి వెళ్లిపోతే, ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టి ఏకంగా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ నే నీరుకార్చుతున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. అంటే గురువును శిష్యుడే శాసిస్తున్నారా!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


