
ప్రజా సమస్యలపై చట్టసభల్లో గొంతెత్తేందుకు ప్రతిపక్ష నేతకు తగినన్ని అవకాశాలు కల్పించడం ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ విషయాలపై పెద్దగా నమ్మకం లేనివారి మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే.. తమ గొంతు వినిపించేందుకు తగినంత సమయం ఇస్తే అసెంబ్లీకి వస్తామన్న ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటలపై వీరు అస్సలు నోరు మెదపడం లేదు. పైగా.. ప్రతిపక్షానికి సమయం ఇవ్వడం వల్ల అధికార పక్షానికీ మేలు జరుగుతుంది. వారి విమర్శలను తిప్పికొట్టేందుకు, లోటుపాట్లను సరిదిద్దుకునేందుకూ అవకాశం వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు ఈ అవకాశాలన్నింటినీ తోసిపుచ్చుతున్నారు.
2024 ఎన్నికల తరువాత 11 మంది ఎమ్మెల్యేలున్న వైఎస్సార్సీపీ అసెంబ్లీకి హాజరు కాని విషయం ప్రజలందరికీ తెలిసిందే. తమ గొంతులు నొక్కేస్తూ, అవమానిస్తున్న కారణంగా అసెంబ్లీకి రామని ఆ పార్టీ అధినేత జగన్ తేల్చి చెప్పారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు అధికార పార్టీ స్వోత్కర్షలతో నిస్సారంగా సాగుతున్నాయి. ప్రతిపక్షానికి సంఖ్యాబలం ఆధారంగా కాకుండా... చర్చనీయ అంశం ఆధారంగా తగిన సమయమిస్తామని స్పీకర్ లేదంటే సీఎం భరోసా ఇచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. అప్పుడు బాధ్యత వైసీపీది అయ్యేది. టీడీపీ ఆ పని చేయలేదు. మరోవైపు..
ప్రతిపక్ష హోదాపై వైసీపీ(YSRCP Opposition Status Demand) లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఇచ్చిన నోటీసుకూ స్పీకర్ ఇప్పటివరకూ స్పందించలేదు. సభలో పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి మాట్లాడే అవకాశం ఉంటుందని చెబుతున్న మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు గతాన్ని మరచిపోయారు. 1972లో సీపీఐకి కేవలం ఏడుగురే సభ్యులుంటే సీపీఎంకు ఒకే ఒక్క సభ్యుడు ఉండే వారు. అయినా ఆయా పార్టీల నేతలు మాట్లాడేందుకు తగిన సమయం లభించేది. 1994లో కాంగ్రెస్ పార్టీకి 26 మందే సభ్యులతో ప్రతిపక్ష హోదా రాలేదు. కాంగ్రెస్ నేత పీజేఆర్ తదితరులు సమయం కోసం పోరాడాల్సి వచ్చేది. దాంతో వారు కోరినట్లు ఆనాటి స్పీకర్ యనమలకు కొంత టైమ్ కేటాయించక తప్పేది కాదు.
2004లో సీపీఐ (ఎంఎల్) తరఫున గుమ్మడి నరసయ్య ఒక్కరే అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయినా ఆయన గౌరవానికి ఏమాత్రం విఘాతం కలగకుండా చర్చల్లో పాల్గొనేందుకు తగినంత సమయం కేటాయించేవారు. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పూర్తిగా కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోంది. ప్రతిపక్షం విమర్శలను భరించే స్థితిలో లేదు. దీంతో వైసీపీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది.
ప్రతిపక్ష హోదా(Opposition Status) ఇవ్వడానికి పదిశాతం సభ్యులు ఉండాలన్నది ఒక సంప్రదాయం మాత్రమే. కాబట్టి వైసీపీకి ఆ హోదా ఇచ్చి ఉంటే హుందాగా ఉంటుంది. ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్నా 70 స్థానాలున్న అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మీడియా సమావేశాల ద్వారా జగన్ తన గళాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నప్పటికీ అసెంబ్లీలోనూ తగిన అవకాశాలిస్తామని స్పీకర్ చెప్పలేకపోతున్నారు. ఎక్కడ ప్రభుత్వ వైఫల్యాలలు మరింత స్పష్టమవుతాయో అన్న భయం కాబోలు!.
1994లో అఖండ మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు(NT Rama Rao) ప్రభుత్వాన్ని 1995లో ఆయన అల్లుడైన చంద్రబాబు కూల్చివేశారు. ఆ టైమ్‌లో ఎన్టీఆర్ తన వెంట ఉన్న 35 మంది సభ్యులతో విశ్వాసపరీక్ష కోసం అసెంబ్లీకి వచ్చారు. చంద్రబాబు వెన్నుపోటుపై మాట్లాడేందుకు శతథా ప్రయత్నించారు. కానీ అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడే మాట మాటకూ మైక్ కట్ చేసిన అందరికీ తెలుసు. దాంతో ఎన్టీఆర్ తీవ్ర ఆవేదనతో సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇదే ఎన్టీఆర్ కారణంగానే తనకు స్పీకర్ పదవి దక్కిందన్న విషయమూ యనమల మరచిపోయారు. సొంత మామ, టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌తోనే ఇలా వ్యవహరించిన చంద్రబాబు ఇప్పుడు జగన్ అవకాశం ఇస్తారన్నది వట్టిమాటే. అందుకే మాట్లాడేందుకు తగినంత సమయం ఇస్తే అసెంబ్లీకి అంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదు.
ఇక సభ్యుల గైర్హాజరి కూడా కొత్తగా జరుగుతున్నది కాదు. 1989-94 మధ్య ఆనాటి ప్రతిపక్ష నేత ఎన్టీ రామారావు దాదాపు రెండేళ్లు సభలోకి రాలేదు. ఒక సందర్భంలో తనను ఇతర సభ్యులతో కలిసి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 2019-2024 టర్మ్‌లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా భార్య భువనేశ్వరిపై ఎవరో అనుచితంగా మాట్లాడారంటూ లేని ఆరోపణలు చేసి సుమారు రెండేళ్లు సభకు గైర్హాజరయ్యారు. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు 23 యంది వైసీపీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడమే కాకుండా నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినందుకు, వారిపై ఫిరాయింపు చట్టం అమలు చేయనందుకు నిరసనగా జగన్ కూడా తన ఎమ్మెల్యేలతో కలిసి సభను సుమారు రెండేళ్లు బహిష్కరించారు.
ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే చంద్రబాబు సభలో వైసీపీ సభ్యులు హాజరు కాకపోవడాన్ని ప్రస్తావించి, వారి ఖర్మ అని అనడం. ఆయన బహిష్కరించిన్పుడు కూడా ఇదే వ్యాఖ్య వర్తిస్తుంది కదా! జీఎస్టీ లాంటి బ్రహ్మాండమైన సంస్కరణలు వస్తుంటే వైసీపీ అసెంబ్లికి రాలేదని ఆయన అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలకు ఇవి అర్థం కావని అనడం చిత్రం. జగన్ మీడియా సమావేశంలో(Jagan Press Meet) అడిగే ప్రశ్నలకే జవాబు చెప్పలేక నీళ్లు నములుతున్న చంద్రబాబు, అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి నిలదీస్తే మాత్రం స్పందిస్తారా? ఏదో రకంగా జగన్‌ను, వైసీపీని దూషించి అవమానించాలన్నదే వారి లక్ష్యంగా కనిపిస్తోంది.
వైసీపీ సభకు రాకపోవడాన్ని తప్పు పట్టే చంద్రబాబు తాను, అంతకుముందు ఎన్టీఆర్ కూడా అలాగే చేశారు కదా అనే దాని గురించి మాట్లాడరు. అప్పుడు వారిపై ఆనాటి స్పీకర్లు అనర్హత వేటు వేయలేదు. ఇప్పుడు మాత్రం అనర్హత వేటు అంటూ బెదిరించే యత్నం చేస్తున్నట్లుగా ఉంది. జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీని ఈ సభలో చంద్రబాబు తెగ పొగిడారు. మరి ఇదే సభలో మోడీని గతంలో చంద్రబాబు నానా మాటలు అన్నారు కదా! దాని గురించి ఏమి చెబుతారు? సభలోకి వచ్చి వైసీపీ సభ్యులు ప్రశ్నిస్తే అది చంద్రబాబుకు, టీడీపీకి ఇరకాటంగా ఉంటుంది.
శాసనమండలిలో వైసీపీకి మెజార్టీ ఉన్నందున అక్కడ గట్టిగానే నిలదీస్తున్నారు. వారు అడిగే ప్రశ్నలకు మంత్రులు బదులు చెప్పలేక తంటాలు పడుతున్నారు. అదే ప్రకారం ప్రశ్నిస్తారన్న భయంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు సభలోకి రాకుండా ఉంటేనే బెటర్ అన్న భావన కూటమిలో ఉందనిపిస్తుంది. సభలోకి వైసీపీ సభ్యులు వెళ్లినా మాట్లాడడానికి తగు అవకాశం ఇవ్వడానికి సిద్దంగా లేరు. ప్రజాస్వామ్య స్పూర్తి లేని చంద్రబాబు నాయకత్వంలో ఇంతకన్నా ఏమి ఆశించగలం!.

::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
ఇదీ చదవండి: హిట్టా.. ఫట్టా.. ప్రజలకు తెలుసులే బాబూ!