మీరు పద్ధతిగా మాట్లాడితే మేమూ పద్ధతిగానే మాట్లాడతాం
హరీశ్‌రావుకు భువనగిరి ఎంపీ చామల కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ప్రజల చేతిలో ఓడిపోయిన రెండేళ్ల తర్వాత బయటకు వచ్చి తోలు తీస్తామని అంటుంటే తాము చూస్తూ ఊరుకోవాలా అని భువ నగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం స్థాయి వ్యక్తిని తోలు తీస్తామని మాజీ సీఎం అంటుంటే ఇంకా మర్యాదగా మాట్లాడాలా అని నిలదీశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావుకు కౌంటర్ ఇచ్చారు. ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్టు హరీశ్‌రావు వ్యవహారశైలి ఉంది. నీతులు మాకు కాదు ఎదుటి వారికి మాత్రమే అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు.
ఒకసారి వాళ్ల మామ మాట్లాడిన పురాణం, బూతులు వింటే తెలుస్తుంది. బూతులు మాట్లాడే పేటెంట్ కేసీఆర్‌కు మాత్రమే ఉంది. ఆయన తిట్ల పురాణం మొదలుపెట్టారు కాబట్టే సీఎం రేవంత్ కూడా మాట్లాడారు. ఆయన రాజకీయం గురించి మాట్లాడితే రేవంత్‌రెడ్డి కూడా అదే మాట్లాడి ఉండేవారేమో? మీరు పద్ధతిగా మాట్లాడితే మేమూ పద్ధతిగానే మాట్లాడుతాం’ అని వ్యాఖ్యానించారు.
హరీశ్‌రావు తన పాండిత్యంతో వేదాంతాలు చెబుతున్నారని, ఆయన నీతులు కేసీఆర్, కేటీఆర్‌లకు చెప్పాలని హితవు పలికారు. ఇకనైనా వ్యక్తిగత విమర్శలు మానుకుని ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. సీఎం, మాజీ సీఎం పరస్పరం గౌరవించుకోవాలని చెబుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ సూక్తులను బీఆర్‌ఎస్ దద్దమ్మలకు చెప్పాలని ఎంపీ చామల కోరారు.


